చదువుల యజ్ఞంలో సమిధలు | Editorial on Teachers Harassment on Students | Sakshi
Sakshi News home page

చదువుల యజ్ఞంలో సమిధలు

Published Wed, Jan 11 2017 12:26 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

చదువుల యజ్ఞంలో సమిధలు - Sakshi

చదువుల యజ్ఞంలో సమిధలు

ఈమధ్య వరసబెట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలు, హాస్టళ్లలో చోటు చేసుకున్న ఉదంతాలు అందరికీ ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యాబుద్ధులు నేర్పి, విజ్ఞానవంతుల్ని చేస్తారని ఆశించి పిల్లలను పాఠశాలలకూ, కళాశాలలకూ పంపిస్తే అక్కడున్న గురువులు వారితో అమానుషంగా ప్రవర్తించి ప్రాణాలు తీయడం, వారు తనువు చాలించడానికి కారకులు కావడం వీటన్నిటా కనిపిస్తుంది. ఇందులో చాలా ఉదంతాలు కార్పొరేట్‌ స్కూళ్లు, కళాశాలల్లోనివే. గుంటూరు నగరం సమీపం లోని ఒక కార్పొరేట్‌ విద్యా సంస్థ హాస్టల్‌లో యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి కార ణంగా తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక విద్యార్ధి తీవ్ర జ్వరంతో కన్నుమూశాడు. బాబు మరణాన్ని తట్టుకోలేని అతడి తల్లిదండ్రులు ఇటీవల ఆత్మహత్య చేసుకు న్నారు. పలుకుబడి ఉన్నవారి విషయంలో మినహాయిస్తే చాలా ఉదంతాల్లో పోలీ సులు కేసులు పెట్టడం, కారకుల్ని అరెస్టు చేయడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. కానీ మొత్తంగా వీటికి దారితీస్తున్న ధోరణులను సరిచేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఫలితంగా చదువుల పేరిట మారణహోమం నిరాటంకంగా సాగుతోంది.

టీచర్‌ కొట్టడం వల్ల ఒంటిపై గాయాలయ్యాయనో, కళ్లు దెబ్బతిన్నాయనో, తలకు దెబ్బ తగిలిందనో వార్తలు రావడం ఇటీవలికాలంలో బాగా పెరిగింది. వీటి గురించి వివిధ మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నా, అలా చేయడం చట్టరీత్యా నేరమవుతుందని చెబుతున్నా అవి పదే పదే పునరావృతమవుతున్నాయి. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ తెలిపిన వివరాల ప్రకారం నిరుడు కేవలం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోనే విద్యాసంస్థల్లో పిల్లలను దండించిన ఘటనలు 385 నమోదయ్యాయి. ఇందులో 28 ఆత్మహత్య ఉదంతాలకు కూడా దారితీశాయి. ఇక మారుమూల ప్రాంతాల్లో ఎలాంటి ఏం జరుగుతున్నదో సులభంగానే ఊహిం చుకోవచ్చు. టీచర్లకూ, విద్యా సంస్థల యాజమాన్యాలకూ పిల్లలతో వ్యవహరించే తీరుతెన్నులపైనా, వారిని దండిస్తే ఉండే పర్యవసానాలపైనా సరైన అవగాహన కలిగించక పోవడంవల్లే ఈ దుస్థితి ఏర్పడుతోంది. బోధనా రంగంపై పాలకులకు ఉన్న నిర్లక్ష్యమే ఇందుకు కారణం. కార్పొరేట్‌ స్కూళ్లనూ, కళాశాలలనూ ఆదా యాన్ని ఆర్జించి పెట్టే సంస్థలుగా మాత్రమే పాలకులు పరిగణిస్తున్నారు. ఈ సంస్థల నిర్వహణపై చట్టాల్లో అనేక నిబంధనలున్నా అవన్నీ కింది స్థాయి అధికారులకు అదనపు ఆదాయాన్ని సంపాదించుకునే మార్గాలుగా మిగిలిపోతున్నాయి. ఇక టీచర్లు వృత్తిపరంగా ఏ స్థాయిలో ఉన్నారో, పిల్లలతో ఎలా మెలగుతున్నారో తెలు సుకునే విధానాలు లేవు.

ఈ విషయంలో ప్రభుత్వ బడులు కొద్దో గొప్పో నయం. అక్కడ ఉపాధ్యాయ శిక్షణలో ఉత్తీర్ణులైనవారుంటారు. జిల్లా మొదలుకొని మండల, గ్రామ స్థాయి వరకూ ఏదో ఒకమేర ఎవరో ఒకరి అజమాయిషీ ఉంటుంది. శ్రద్ధగల కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నచోట కనీసం బోధన ఎలా జరుగుతున్నదన్న సమీక్ష ఉంటుంది. ఉపాధ్యాయ సంఘాల వంటివి తమ కార్యక్రమాల ద్వారా, తాము వెలువరించే పత్రికల ద్వారా ఉపాధ్యాయులను చైతన్యపరుస్తుంటాయి. వీటన్నిటికీ అతీతంగా ఉంటూ ఏదీ పట్టనట్టు ఉండేవారు, ఇతరేతర వ్యాపారాలపై దృష్టి పెట్టేవారు అక్కడా తారసపడతారు. కానీ వీరి శాతం తక్కువ. ఇష్టాను సారంగా ఉంటూ, ఎవరినీ లెక్క చేయకుండా, దేన్నీ లక్ష్యపెట్టకుండా కాసులు పోగేసు కోవడమే ధ్యేయంగా పనిచేసేవి కార్పొరేట్‌ విద్యా సంస్థలే. చదువుకొనడాని కొచ్చిన పిల్లలను వినియోగదారులుగా, తాము ఉద్ధరించాల్సిన సరుకుగా పరిగణించి... చదువు పేరిట బట్టీ పట్టించడం, ఎప్పటికప్పుడు పరీక్షలు పెడుతూ ఆశించని ఫలితాలు రానప్పుడు వారిని హింసించడం, దూషించడం పరిపాటిగా మారింది. తోటి విద్యార్థుల ముందు లెక్చెరర్‌ తనను అవమానించాడని నొచ్చుకుని హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్‌ కళాశాలలో చదువుతున్న విద్యార్థి నిరుడు నవంబర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది జరిగిన కొన్నాళ్లకే మరో కార్పొరేట్‌ కళాశాలలో ఒక విద్యార్థిని లెక్చెరర్‌ దారుణంగా కొట్టడానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమైంది. దీనిపై రేగిన దుమారం సద్దుమణగక ముందే మెదక్‌ జిల్లా సిద్దిపేటలో మరో కాలేజీ ప్రిన్సిపాల్‌ ఒక బాలికపై దొంగతనం నేరం అంటగట్టడమేకాక... ఆ ‘నేరానికి’ ఆమెను తోటి విద్యార్థుల ముందే కొట్టాడు. ఆ అవమాన భారంతో ఆ చిట్టితల్లి కళాశాల భవనం పైనుంచి దూకి తనువు చాలించింది.


గురువులకు ఏకాగ్రత, సృజనాత్మకత, ఓపిక చాలా అవసరం. వీటన్నిటికీ మించి తాము నిత్యం వ్యవహరించాల్సి ఉన్న పిల్లలపైనా, తమ వృత్తిపైనా వారికి ఎంతో మమకారం ఉండాలి. తనకు తెలిసి ఉన్న జ్ఞానాన్ని పిల్లలకు పంచడంలో, ఆ క్రమంలో వారికేర్పడే సందేహాలను, సమస్యలను తీర్చడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనది. టీచర్‌ చెప్పేదానిలో తమకు బోధపడనిదేమిటో నిర్దిష్టంగా వెల్లడించడం అందరికీ సాధ్యపడదు. అందుకవసరమైన తార్కిక శక్తి అందరిలోనూ ఒకలా ఉండదు. ఇలాంటి భిన్న మనస్తత్వాలున్నవారిని తీర్చిదిద్దడమే టీచర్‌ ముందుండే సవాలు. దీన్ని ఎదుర్కొనలేనివారే దండనపై ఆధారపడతారు. తమ వైఫల్యాన్ని పిల్లలకు అంటగట్టి వారిలో అపరాధ భావన పెంచుతారు. ఇందువల్ల ఆ పిల్లల్లో అంతర్లీనంగా ఉండే శక్తియుక్తులు అడుగంటుతాయి. టీచర్‌ చేతిలో దండ నకు గురైనవారే కాదు... దాన్ని చూసినవారు సైతం మొద్దుబారతారు. ఇక కీచక పాత్ర పోషించే టీచర్లు సరేసరి. బోధనా రంగంలో చాలా తరచుగా కనిపిస్తున్న ఇలాంటి క్షీణ విలువలను సకాలంలో అదుపు చేయకపోతే అది ప్రమాదకర పర్యవసానాలకు దారితీస్తుంది. ఉపాధ్యాయ శిక్షణ కోసం ఇప్పుడు అమలు చేస్తున్న కోర్సులు మొదలుకొని బోధన తీరుతెన్నులపైనా, విద్యను అమ్మకపు సరుకుగా మారుస్తున్న వర్తమాన ధోరణులపైనా సమగ్ర సమీక్ష జరిపి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించడం తక్షణావసరం. ఆ పని చేసేవరకూ ఈ మారణహోమానికి ముగింపు ఉండదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement