పరస్పర సమన్వయంతో, సుహృద్భావ వాతావరణంలో పూర్తిచేయాల్సిన ఎంసెట్ ప్రవేశాల ప్రక్రియ అస్తవ్యస్థంగా మారి లక్షలాదిమంది విద్యార్థులకు చుక్కలు చూపింది. గత కొన్నేళ్లుగా ఇదే తంతు నడుస్తున్నా ఈసారి రాష్ట్ర విభజన, ఆ వెనకే వారసత్వంగా వచ్చిన వైషమ్యాలు, కళాశాలల గుర్తింపు సమస్య దాన్ని మరింత జటిలంగా మార్చాయి. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి అవకాశం లభించని 174 పైచిలుకు కళాశాలలకు మలి విడత కౌన్సెలింగ్‌కు వీలుకల్పిస్తూ బుధవారం సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. దీనివల్ల తెలంగాణ ప్రాంతం వరకూ రెండో విడత కౌన్సెలింగ్‌కు మార్గం సుగమమైంది. అయితే, స్లైడింగ్ అవకాశం లభించకపోవడంతో నచ్చిన కళాశాలనూ, నచ్చిన కోర్సునూ అనంతరకాలంలో ఎంపిక చేసుకోవచ్చుననుకున్న ఆంధ్రప్రదేశ్‌లోని వేలాదిమంది విద్యార్థులు ఇష్టంలేనిచోట, ఇష్టంలేని కోర్సుల్లో కొనసాగవలసిన స్థితి ఏర్పడింది. తెలంగాణ ప్రాంతంలో కూడా తొలి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొని అడ్మిషన్లు తీసుకున్నవారు మలి విడతలో పాల్గొనడానికి అనర్హులే. ఎన్నెన్నో మలుపులు తిరిగి లక్షలాదిమంది విద్యార్థులనూ, వారి తల్లిదండ్రులనూ ఎంతో ఉత్కంఠకూ, ఆందోళనకూ గురిచేసిన కౌన్సెలింగ్ ప్రక్రియ ఇలా అక్టోబర్ నెలాఖరుకుగానీ ఒక కొలిక్కి రాలేదు.
ఈ ఏడాది రెండు రాష్ట్రాల్లోనూ 2 లక్షలమందికిపైగా విద్యార్థులు ఎంసెట్ పరీక్షలో అర్హత సాధించి నెలల తరబడి అడ్మిషన్ల కోసం పడిగాపులుపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంటు మొదలుకొని ప్రతీదీ సమస్యగా మారడంతో పలువురు విద్యార్థులు పొరుగు రాష్ట్రాల దారిబట్టారు. ఆర్థికంగా కాస్త స్థితిమంతులైనవారు ఇలా చేస్తే పేదవర్గాల పిల్లలు మాత్రం నిస్సహాయంగా ఉత్కంఠతో ఎదురుచూశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి అనుగుణంగా అడ్మిషన్లు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించాకైనా అంతా సజావుగా సాగిపోయి ఉంటే బాగుండేది. కానీ, ఏపీ ఉన్నత విద్యామండలి ముందు చూపు కొరవడిన వైఖరివల్ల రెండో విడత కౌన్సెలింగ్ లేకుండా పోయింది. ఆగస్టు 31 గడువులోగా కౌన్సెలింగ్ పూర్తిచేస్తామని హామీ ఇచ్చిన ప్పుడే అవసరం పడితే రెండో కౌన్సెలింగ్‌కు కూడా వెళ్తామని అనుమతి తీసుకుని ఉంటే సరిపోయేదానికి అప్పటికల్లా అంతా పూర్తయిపోతుందని భరోసాతో ఉండిపోయింది. అందువల్లే గత నెలలో రెండో కౌన్సెలింగ్‌కు అనుమతినివ్వమంటూ మండలి కోరినప్పుడు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసి ససేమిరా అన్నది. ఇప్పుడు తొలి విడత కౌన్సెలింగ్‌లో తమకు అవకాశం ఇవ్వకపోవడంవల్ల అన్యాయం జరిగిందంటూ కొన్ని కళాశాలలు కోర్టుకెక్కిన సందర్భంలో ఈ రెండో విడత కౌన్సెలింగ్ సమస్య తెలంగాణ ప్రాంతంవరకూ పరిష్కారమైంది.
ఒకపక్క కౌన్సెలింగ్ ప్రక్రియ ఇలా ఇబ్బందుల్లో పడితే దాదాపు 174 ఇంజనీరింగ్ కళాశాలలను అనుమతించకూడదన్న జేఎన్‌టీయూ-హెచ్ నిర్ణయం దాన్ని ఇంకాస్త జటిలం చేసింది. ప్రమాణాలు పాటించని కళాశాలల విషయంలో కఠినంగా వ్యవహరించడంలో తప్పేమీ లేదు. ఆ పనిచేయాల్సిందే. కానీ, ఆ కళాశాలల యాజమాన్యాలు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాక, న్యాయమూర్తులు ఆ విషయంలో తగిన ఆదేశాలిచ్చాక అవి ఎందుకు అమలుకాలేదో ఆశ్చర్యం కలుగుతుంది. యాజమాన్యాలు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తప్ప సమస్య పరిష్కారానికి మార్గం సుగమం కాలేదు. ఈ కళాశాలలిచ్చే కాగితాలు చూసి ఏఐసీటీఈ అనుమతులు మంజూరుచేస్తుంటే, తగిన ప్రమాణాలున్నాయో లేదో చూడాల్సింది తామేనని యూనివర్సిటీ తరఫు న్యాయవాది చెప్పడమే కాక...మూడు నాలుగేళ్లుగా కళాశాలల యాజమాన్యాలు హామీ ఇస్తూ ప్రమాణాలను ఉల్లంఘిస్తున్నాయని ఫిర్యాదుచేశారు. మరి అలాంటి సందర్భాల్లో యూనివర్సిటీ ఎందుకు మిన్నకుండిపోయిందో, కౌన్సెలింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకున్న సమయానికి తప్ప ఎందుకు కదల్లేకపోయిందో అనూహ్యం. స్లైడింగ్ అవకాశం లభించకపోవడంవల్ల ఏపీలో తొలి విడత కౌన్సెలింగ్‌లో లభించిన అవకాశంతోనే వేలాదిమంది విద్యార్థులు సంతృప్తిపడాల్సిన స్థితి ఏర్పడింది. తొలి కౌన్సెలింగ్‌లో సీట్ల కేటాయింపు జరిగినా చేరని విద్యార్థులూ, మరో అవకాశం వస్తుంది కదా అని ధీమాగా ఉండిపోయిన విద్యార్థులూ ఇప్పుడు ఇబ్బందుల్లో పడినట్టయింది.
పాలకులు జవాబుదారీతనంతో, బాధ్యతగా ఆలోచించకపోవడంవల్ల ఎంసెట్ అడ్మిషన్ల ప్రక్రియ ఇంత అస్తవ్యవస్తంగా మారింది. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో జరిగే రెండో కౌన్సెలింగ్‌లో పాల్గొనే ఇంజనీరింగ్ కళాశాలలు వచ్చే నెల 15 కల్లా తరగతులు ప్రారంభించి జనవరి 30నాటికి తొలి సెమిస్టర్ తరగతుల బోధనను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ 76 రోజుల వ్యవధిలో ఆదివారాలు, ఇతర పండుగ సెలవులు పోను మిగిలే రోజుల్లో అధ్యాపకులు ఏం చెబుతారో... విద్యార్థులు ఎంతవరకూ అవగాహన చేసుకోగలుగుతారు...చివరకు పరీక్షలెలా రాయగలుగుతారో అనూహ్యం. ఎంసెట్ వ్యవహారమే ఇంత కంగాళీగా మారితే ఇంటర్ పరీక్షలు కూడా ఇదే బాణీలో సాగేలా ఉన్నాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ వ్యవహరిస్తున్న తీరువల్ల పరీక్షల నిర్వహణ ప్రక్రియ చిక్కుల్లోపడి వాటిని వాయిదా వేయాల్సివస్తుందని ఇంటర్ బోర్డు హెచ్చరించిందంటే పరిస్థితి ఎలా మారిందో సులభంగానే అర్థమవుతుంది. మరో మూడు నెలల్లో పరీక్షల పర్వం ప్రారంభం కానుండగా ఇరు ప్రభుత్వాలూ బాధ్యతారహితంగా వ్యవహరించడం ఆందోళనకరం. దీనివల్ల 17 లక్షలమంది విద్యార్థులు జాతీయస్థాయి ప్రవేశాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతున్నది. ఎంసెట్ ప్రవేశాల విషయంలో తమ నిర్వాకం వల్ల ఎలాంటి స్థితి ఏర్పడిందో తెలుసుకున్నాకైనా సజావుగా మెలగవలసిన పాలకులు ఇంటర్ పరీక్షల విషయంలోనూ దాన్ని కొనసాగించడం క్షంతవ్యం కాదు. ఈ ధోరణిని వెంటనే విడనాడాలి.
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం
Published Wed, Oct 29 2014 11:56 PM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement