కళ్ల నిండా ఆశలతో... హృదయం నిండా ఉద్వేగంతో...ఎన్నో ఊహలతో, మరెన్నో భయాలతో, సందేహాలతో ఉన్నత విద్యా సంస్థల్లోకి అడుగుపెడుతున్న పిల్లలకు ఆదిలోనే ర్యాగింగ్ భూతం తారసపడుతోంది. ఆ క్షణంనుంచీ వారికి నరకం చూపిస్తూ వెంటాడుతోంది. ఒక రాష్ట్రమని లేదు...ఒక జిల్లా అని లేదు. మారుమూల ప్రాంతాల్లోని విద్యా సంస్థలైనా, నగరంలో ఉండే విద్యా సంస్థలైనా ఇందుకు మినహాయింపు కాదు. ఒకపక్క ఇలాంటి ఉదంతాలపై ఆందోళన వ్యక్తమవుతుండగానే మంగళవారం మరో విద్యార్థి ఆ మహమ్మారికి బలైపోయాడు.
రంగారెడ్డి జిల్లా మేడ్చల్ సమీపంలోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్న సాయినాథ్ హఠాత్తుగా వరంగల్ జిల్లా వడ్డేపల్లి దగ్గర్లో రైలు పట్టాలపై విగతజీవుడై కనబడ్డాడు. ర్యాగింగ్‌ను ఆపమని కోరుతూ రాసిన లేఖ మృతదేహం వద్ద లభించింది. కళాశాలలో చేరి నిండా నెలరోజులైనా కాకుండానే ఓ పద్దెనిమిదేళ్ల పసివాడు ఇబ్బందుల్లో చిక్కుకోవడం...అందుకు చావు తప్ప గత్యంతరం లేదనుకోవడం ఎంత విషాదకరం! తన చుట్టూ ఉన్న సమాజం తానెదుర్కొంటున్న సమస్యను పరిష్కరించలేదని, ఈ ప్రపంచంలో తాను ఒంటరినని భావించినప్పుడే ఎవరైనా ఇలాంటి చర్యకు ఒడిగడతారు. చదువుల తల్లి ఒడిలో మరణిస్తున్నవారందరూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేదలు... దళిత, బీసీ కులాలకు చెందినవారూ కావడం యాదృచ్ఛికం కాదు.
ర్యాగింగ్ ఘటన చోటు చేసుకున్నప్పుడు హడావుడి చేయడం...ఏవో చర్యలు తీసుకున్నట్టు కనబడటం, మళ్లీ మరొకటి జరిగేవరకూ అంతా సవ్యంగా ఉన్నదనుకోవడం తప్ప... పాలకులు సమస్య లోతుల్లోకి వెళ్లి దృష్టి సారిస్తున్నట్టు లేదు. అందువల్లనే ర్యాగింగ్ ఉదంతాలకు ఫుల్‌స్టాప్ పడటం లేదు. ఏపీలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి విషాద మరణంపై ఎంతో ఆందోళన జరిగింది. ఇక అలాంటివి జరగ కుండా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయినా తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోనూ, మరో ఒకటి రెండుచోట్లా ర్యాగింగ్ జరిగినట్టు వార్తలొచ్చాయి.
నారాయణ కళాశాల శాఖల్లో 12మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇందులో కొన్ని మరణాలపై అనుమానాలున్నాయి. ఇటు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలోనూ ర్యాగింగ్ ఘటన జరిగింది. మళ్లీ ఇప్పుడు సాయినాథ్ బలైపోయాడు. ర్యాగింగ్ గురించిన వార్తలు విస్తృతంగా మీడియాలో వస్తున్నాయి. అలాంటి ఉదంతాల్లో అరెస్టులు జరుగుతున్నాయి. అయినా ఆ ఉన్మత్త క్రీడ సమసిపోయిన దాఖలాలు కనిపించడంలేదు. అడపా దడపా ఏదో ఒక మూల అలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక హాస్టల్ ప్రాంగణాల్లో, కాలేజీ క్యాంపస్‌లలో సమాధి అయిపోతున్న ఉదంతాలు ఎన్ని ఉంటున్నాయో బయటి ప్రపంచానికి తెలియదు.
ర్యాగింగ్ ఉదంతం చోటుచేసుకున్నదని తెలిసిన వెంటనే కళాశాల యాజమాన్యాలు, ప్రభుత్వ యంత్రాంగం, ప్రత్యేకించి పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తారన్న సందేశం వెళ్తే పరిస్థితి ఇంతగా దిగజారదు. కానీ మీడియాలో విస్తృత ప్రచారం జరిగిన ఉదంతాల విషయంలోనే ఇది సరిగా కనబడటంలేదు. రిషితేశ్వరి ఘటననే తీసుకుంటే...ఆమె బలికావడానికి ప్రధాన కారకులని ఆరోపణలొచ్చిన విద్యార్థుల ముఠాకు అండదండలిచ్చిన అప్పటి ప్రిన్సిపాల్‌పై ఇంతవరకూ కేసు లేదు. ఆ ఉదంతంపై నియమించిన బాల సుబ్రహ్మణ్యం కమిటీ ఇచ్చిన నివేదికలోని సిఫార్సులేమిటో, అందులో ఎన్నిటిపై తాము చర్య తీసుకున్నారో ఇంతవరకూ బాబు ప్రభుత్వం వెల్లడించలేదు. చిత్రమేమంటే రిషితేశ్వరికి, ఆమెలాంటి ఆడపిల్లలకూ బతుకును దుర్భరం చేస్తున్న వాతావరణానికి కారకులైనవారిపై చర్యలు లేవుగానీ అంతక్రితం ఆ విశ్వ విద్యాలయంలో పరిస్థితుల్ని మెరుగుపర్చడానికి ప్రయత్నించిన దళిత అధ్యాపకుడి ఉద్యోగం మాత్రం పోయింది. విశ్వవిద్యాలయాల్లో ద్వంద్వ ప్రమా ణాలు రాజ్యమేలుతున్నాయనడానికి ఇదే రుజువు.
ర్యాగింగ్‌పై 2007లో సీబీఐ మాజీ డెరైక్టర్ ఆర్‌కే రాఘవన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ దాన్ని ఒక సామాజిక రుగ్మతగా అభివర్ణించింది. ఎన్నో విలువైన సూచనలు చేసింది. యథాప్రకారం చాలా ప్రభుత్వాలు ఆ సిఫార్సుల్ని పట్టించుకోలేదు. పర్యవసానంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ర్యాగింగ్‌ను ప్రోత్సహించే మానసిక, సామాజిక కారణాలను అధ్యయనం చేయడానికి మానసిక ఆరోగ్య నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయమని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అలాగే ప్రతి కళాశాలలోనూ విధిగా మానసిక ఆరోగ్యనిపుణులొకరు ఉండాలని చెప్పింది. విద్యా సంస్థల్లో మానసిక ఆరోగ్య చర్యలు అమలు చేయాలన్నది. వీటన్నిటినీ ఆచరించేలా చూస్తామంటూ లిఖితపూర్వకంగా ఇవ్వ మని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. సుప్రీంకోర్టు సూచనల పర్యవసానంగా యూజీసీ సైతం కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్‌లు, క్విక్ రెస్పాన్స్ వ్యవస్థ, కౌన్సెలింగ్, తల్లిదండ్రులనుంచి అండర్‌టేకింగ్ వగైరాలున్నాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం ముందు ఇవన్నీ బలాదూర్ అవుతున్నాయి. ముఖ్యంగా పార్టీల్లోనూ, ప్రభుత్వాల్లోనూ 'విద్యా మాఫియా' పలుకుబడి పెరిగాక, అందుకు సంబంధించినవారు మంత్రులవుతున్నాక విద్యాసంస్థల్లో ఏం జరుగుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు.
ఈ నరమేథాన్ని ఆపడం పాలకులుగా మాత్రమే కాదు...మనుషులుగా కూడా తమ బాధ్యతని ప్రభుత్వాధినేతలు గుర్తించాలి. ర్యాగింగ్‌పై ఫిర్యాదులొచ్చే వరకూ వేచి చూడకుండా నిర్ణీత కాలవ్యవధిలో కళాశాలల్లో తనిఖీలు నిర్వహిస్తుండటం... ఒక్క నిబంధన పాటించలేదని తేలినా భారీ మొత్తంలో జరిమానాలు విధించడం, ర్యాగింగ్ ఘటన జరిగిన సందర్భంలో వెనువెంటనే సంబంధిత కళాశాల గుర్తింపును రద్దు చేసేలా చర్యలు తీసుకోవడం అత్యవసరం. ర్యాగింగ్‌కు పాల్పడుతున్నవారిని మానసిక రోగులుగా గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇప్పించడం, కేసులు పెట్టడంవంటివి చేయాలి. అలాగే పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో మానవీయ విలువల్ని పెంపొందించే పాఠ్యాంశాలుండాలి. భవిష్యత్తులో మరెవరికీ ర్యాగింగ్ కారణంగా కడుపుకోత ఉండకూడదనుకుంటే ప్రభుత్వాలు తమ కర్తవ్యాన్ని గుర్తెరగాలి.