కరీబియన్ కింగ్స్! | Editorial on world cup t20 winner west indies | Sakshi
Sakshi News home page

కరీబియన్ కింగ్స్!

Published Tue, Apr 5 2016 1:10 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

Editorial on world cup t20 winner west indies

 టి20 ప్రపంచకప్‌కు అద్భుతమైన క్లైమాక్స్. చివరి ఓవర్లో వెస్టిండీస్ విజయానికి 19 పరుగులు అవసరమైన దశలో నాలుగు బంతుల్లో నాలుగు సిక్సర్లతో బ్రాత్‌వైట్ గెలిపిస్తాడని ఎవరూ కనీసం ఊహించి కూడా ఉండరు. అంచనాలకు అందని సంచలనాలకు టి20 ఫార్మాట్ పెట్టింది పేరు. ఈసారి కూడా ఇదే రుజువయింది. ఫైనల్ ఆరంభానికి ముందు ఇంగ్లండ్‌తో పోలిస్తే వెస్టిండీస్ కచ్చితమైన ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. దీనికి తోడు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో 90 శాతం ప్రేక్షకులు ఆ జట్టుకు మద్దతుగా నిలిచారు. భారత్‌ను సెమీఫైనల్లో ఓడించిన జట్టుకు ఇంత మద్దతు లభించడం కూడా చెప్పుకోదగ్గ విషయం. వెస్టిండీస్ క్రికెటర్లు మన అభిమానులకు ఎంత దగ్గరయ్యారో చెప్పడానికి ఇదే ఉదాహరణ. అందుకే పదేపదే కరీబియన్ క్రికెటర్లు భారత జపం చేస్తున్నారు. ఐపీఎల్ ద్వారా ఇక్కడ లభించే భారీ మొత్తమే కాదు... ఇక్కడి అభిమానుల ఆదరణ వల్ల కూడా వారికిది సొంతగడ్డలా మారిపోయింది.

 ఫైనల్లో ఇంగ్లండ్ అసాధారణంగా పోరాడింది. ఐదు ఓవర్లలోపే ముగ్గురు భారీ హిట్టర్లు పెవిలియన్‌లో కూర్చోవడం, భీకరమైన ఫామ్‌లో ఉన్న జేసన్ రాయ్ తొలి ఓవర్లో రెండో బంతికే అవుటవడంతో ఇక ఇంగ్లండ్ పనైపోయిందనే చాలామంది భావించారు. కానీ మూడు ఫార్మాట్లలోనూ అత్యంత నిలకడగా ఆడే జో రూట్ మరోసారి ఇంగ్లండ్ పాలిట ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడు. ఓ గొప్ప ఇన్నింగ్స్ ఆడి, పోరాడటానికి కావలసిన స్కోరును సాధించాడు. ఇక  బౌలింగ్‌లోనూ ఇంగ్లండ్ చేసిన ‘హోమ్‌వర్క్’ స్పష్టంగా కనపడింది. గతంలో వెస్టిండీస్ కోచ్‌గా వ్యవహరించిన ఒటిస్ గిబ్సన్ ప్రస్తుతం ఇంగ్లండ్ బౌలింగ్ కోచ్‌గా పని చేస్తున్నాడు. గేల్ లాంటి హిట్టర్‌ను నిలువరించడానికి రూట్‌తో బౌలింగ్ చేయించాలనే వ్యూహం ఫలించింది. దాంతో వెస్టిండీస్ కూడా కేవలం 11 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఇంగ్లండ్ ఫేవరెట్‌గా మారిపోయింది.

భారత్‌తో సెమీఫైనల్లో రెండుసార్లు అవుటైనా నోబాల్స్ కారణంగా బతికిపోయి అసాధారణ ఇన్నింగ్స్‌తో జట్టును ఫైనల్‌కు చేర్చిన సిమన్స్ తరహాలో ఫైనల్లో శామ్యూల్స్‌ను అదృష్టం వరించింది. ఇంగ్లండ్ కీపర్ జోస్ బట్లర్ క్యాచ్ అందుకున్నా బంతి నేలకు తాకడంతో అంపైర్లు శామ్యూల్స్‌ను వెనక్కు పిలిచారు. రసెల్, స్యామీలాంటి భారీ హిట్టర్లు ఇలా వచ్చి అలా వెళ్లడంతో ఇక విండీస్ విజయంపై ఎవరికీ పెద్దగా ఆశలు లేకుండా పోయాయి. బ్రాత్‌వైట్ గతంలో ఒకటి రెండు సందర్భాల్లో పెద్ద షాట్లు ఆడినా... ఒకే ఓవర్లో 19 పరుగులు చేయగల స్థాయి ఉన్న ఆటగాడని క్రికెట్ ప్రపంచానికి తెలియదు. అందుకే 19వ ఓవర్ చివరి బంతికి సింగిల్ రాకపోవడంతో శామ్యూల్స్ తీవ్ర అసహనానికి లోనయ్యాడు.

 ఇంగ్లండ్ బౌలర్ స్టోక్స్ ఈ ప్రపంచ కప్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా చివర్లో అతను రెండు ఓవర్లు మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించేలా ప్రతి మ్యాచ్‌లోనూ ప్రభావం చూపాడు. కానీ బ్రాత్‌వైట్ కొట్టిన సిక్సర్లతో ఇక జీవితంలో మళ్లీ కోలుకోలేనంతగా షాక్ తిన్నాడు. మొత్తానికి యోధుల్లా పోరాడి టి20 ప్రపంచకప్ ఫైనల్‌ను రక్తికట్టించి కరీబియన్లు తాము టి20 కింగ్స్ అని మరోసారి నిరూపించుకున్నారు. వెస్టిండీస్ మహిళల జట్టు కూడా ఈ టోర్నీలో అనామక జట్టుగా బరిలోకి దిగి అనూహ్యంగా చాంపియన్‌గా అవతరించింది. ఈ టోర్నీ ఆరంభానికి ముందు వెస్టిండీస్ క్రికెట్ చాలా దారుణమైన స్థితిలో ఉంది. బోర్డు పెద్దలకు, ఆటగాళ్లకు పడకపోవడం... సరైన చెల్లింపులు లేకపోవడంతో ఆటగాళ్లు ప్రపంచకప్‌కు వెళ్లబోమని భీష్మించుకున్నారు. ఆఖరి క్షణం వరకూ జరిగిన చర్చలు విఫలమైనా... టి20 ప్రపంచకప్‌లో ఆడాల్సిన అవసరాన్ని గుర్తించి కరీబియన్ జట్లు వచ్చాయి.

తమ విజయం ద్వారా బోర్డు కళ్లు తెరిపించాలనే లక్ష్యంతో ‘మిషన్ టి20’ ప్రారంభించాయి. ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌లో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లోనూ వెస్టిండీస్ జట్టే టైటిల్ గెలిచింది. తమ కుర్రాళ్లను స్ఫూర్తిగా తీసుకున్న సీనియర్ జట్లు కూడా సంచలన విజయాలతో చరిత్ర సృష్టించాయి. ఒకేసారి మూడు రకాల ఐసీసీ ఈవెంట్లలో ఒకే దేశం విజేతగా ఉండటం ఇదే తొలిసారి. మొత్తానికి తమ లక్ష్యాన్ని సాధించిన వెస్టిండీస్ క్రికెటర్లను అభినందించాల్సిందే.
 
2007లో తొలి టి20 ప్రపంచకప్‌లో భారత్ గెలవడం ద్వారా క్రికెట్‌లో చాలా మార్పులు వచ్చాయి. అయితే ఐదు ప్రపంచకప్‌లు ముగిసిన తర్వాతగానీ భారత్‌కు ఆతిథ్య అవకాశం రాలేదు. టోర్నీ ఆరంభానికి ముందు ధర్మశాలలో పాకిస్తాన్ జట్టుకు భద్రత కల్పించలేమంటూ హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడంతో హైడ్రామా సాగింది. అలాగే ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లాలో మ్యాచ్‌లు కూడా జరిగేది అనుమానంగా మారింది. అలాంటి సమయంలో బీసీసీఐ చకచకా పావులు కదిపింది. చాలా సమస్యలను పరిష్కరించుకుంది. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లతో కలిపి మొత్తం 34 రోజుల పాటు జరిగిన టి20 ప్రపంచకప్‌ను భారత్ సంతృప్తికరంగా నిర్వహించింది.
 
మైదానంలో భారత క్రికెటర్ల ఆటతీరు ఆశించిన స్థాయిలో లేకపోయినా విరాట్ కోహ్లి ఒంటరి పోరాటంతో మనం సెమీఫైనల్ వరకూ వచ్చాం. ఫేవరెట్‌గా బరిలోకి దిగినా పాకిస్తాన్, ఆస్ట్రేలియాలపై మినహా మిగిలిన మ్యాచ్‌ల్లో మనవాళ్లు స్థాయికి తగ్గట్లుగా ఆడలేదు. వ్యక్తి మీద ఆధారపడిన జట్టు కంటే సమష్టిగా ఆడే జట్టుకే విజయావకాశాలు ఉంటాయని ఈసారి భారత్, వెస్టిండీస్‌లను చూస్తే తెలుస్తుంది. లీగ్ దశలో అద్భుతంగా ఆడి సెమీస్‌లో బోల్తా పడ్డ న్యూజిలాండ్‌కు, ఎప్పటిలాగే దక్షిణాఫ్రికాకు మరోసారి ప్రపంచకప్ అందని ద్రాక్షగా మిగిలింది.

ఇక పాకిస్తాన్ రిక్తహస్తాలతో ఇంటికి చేరితే... డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక ఘోరంగా విఫలమైంది. బంగ్లాదేశ్ జట్టు గెలవాల్సిన మ్యాచ్‌లో అనుభవం సరిపోక భారత్ చేతిలో ఓడిపోతే... అఫ్ఘానిస్తాన్ జట్టు వెస్టిండీస్‌పై గెలిచింది. ఈ టోర్నీలో చాంపియన్లపై గెలిచిన ఒకే ఒక్క జట్టు అఫ్ఘాన్. ఇక క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడటం ద్వారా మరో ఆరు జట్లు కూడా విశ్వవేదికపై తమ విన్యాసాలను ప్రదర్శించాయి. భారత్‌లో పిచ్‌ల స్వభావం దృష్ట్యా భారీ స్కోర్లు వస్తాయని భావించిన టోర్నీలో అనూహ్యంగా బంతికి, బ్యాట్‌కు పోరు రసవత్తరంగా సాగింది. చాలా మ్యాచ్‌లు నరాలు తెగే ఉత్కంఠతో జరిగాయి. తొలిసారి భారత్‌లో నిర్వహించిన ఈ టోర్నీ అభిమానులకు సంతృప్తినే మిగిల్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement