సందర్భం
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన రెండేళ్ల కాలంలో ఏ మాత్రం జంకూ గొంకూ లేకుండా శిష్ట వర్గాల పండితులకు వారి సాహిత్యానికి, కళలకే ప్రభుత్వం, ప్రభుత్వ సలహాదారులు అంకితం కావడం జుగుప్స కలిగిస్తోంది. రెండో రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన 62 మందికి తెలంగాణ ప్రభుత్వం లక్షా నూట పదహార్లతో ఈరోజు సన్మానించను న్నది. ఇది సంతోషించ తగిన విషయమే.
కానీ ప్రత్యేక రాష్ట్రం సాధనలో రెండు దశాబ్దాలుగా సాహిత్యం, కళలు మహోన్నత పాత్ర పోషించాయి. బతుకమ్మలు రోడ్డెక్కాయి. జానపద కళాకారులు తమ వాద్యాలను, ఆహార్యాలతో పాటుగా ఉద్యమంలో భాగం చేశారు. దళిత వర్గాలకు చెందిన ఎంతోమంది కవులు, కళాకారులు అక్షరాన్ని, శబ్దాన్ని ఆయుధం చేశారు. 2013లో తిరుపతిలో జరిగిన ప్రపంచ మహాసభలో అవమానాల పాలైన తెలంగాణ జానపద కళాకారులు ఒక్కటై, వేలాదిమందిగా నిరసన ధ్వని వినిపించారు. ప్రత్యేక తెలంగాణలో మాత్రమే మాకు న్యాయం జరుగుతుందని బలంగా నమ్మి ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఎంతోమంది శిష్ట పురస్కార గ్రహీతలు, కవులు, కళాకారులు సమైక్యత ముసుగులు ధరించిన వేళ దళిత జానపద నిమ్నవర్గాల వారు నినాదాలయ్యారు. ఊరేగింపులను నిరంతరం ధ్వనింపజేశారు.
ప్రజల భాష, సాహిత్యాలు, కళలు రాబోయే కాలంలో వెల్లివిరుస్తాయని ఆశించారు. కానీ ఈ రంగాలలో జరిగిన ప్రస్తుత ఎంపిక చూసి నిరుత్తరులయ్యారు. సాహిత్య రంగంలో ఒక్క దళిత రచయిత పేరు లేదు. జానపద నృత్యం విభాగం కింద వృత్తి కళాకారుడిని కాకుండా ఉద్యమ గాయకుడిని ఎంపిక చేసి జానపదులను అవమానించారు. ‘జానపద సంగీతం’ విభాగం కింద కూడా వృత్తి కళాకారులను కాకుండా జానపదేతరులను ఎంపిక చేశారు. వేల ఏళ్లుగా జానపద కళా సంగీత ప్రదర్శనలనే నమ్ముకున్న వారిని నట్టేట ముంచారు. అలాంటి ఒక్క జానపద వృత్తి కళాకారునికి ఈసారి చోటు దక్కక పోవడం శోచనీయం. రాష్ట్రావతరణ వేడుకలలో అత్యధిక భాగమైన కళా ప్రపంచం లేకుండా ఉత్సవాలు జరుపుకోవడం సరైనదేనా. రాష్ట్ర స్థాయిలో అలాంటి కళాకారులు లేరని ప్రభుత్వం భావించిందా? లేదా వేడుకలలో వారిని ప్రేక్షకులుగానే ఉండాలని తీర్మానించిందా? వారు ఊరేగింపులోని తలలుగానే లెక్కించాలనుకుందా?
జానపద కళల గురించి ఒక మాట ఉంది. ఎక్కడైతే (ఫోక్‌లోర్) చచ్చిపోతుందో అక్కడ ఫేక్‌లోర్ తోక ఊపుతుంది. నిజానికి దక్షిణాది రాష్ట్రాలలో తెలంగాణలోనే వైవిధ్యభరితమైన గొప్ప విశిష్ట జానపద కళాకారులు ఉన్నారు. గతంలో ఇలాంటి వాతావరణం ఉండబట్టే ఆ కళలు అంతరించిపోవడానికి దగ్గరయ్యాయి. వాటిని కాపాడవలసిన వేళ వాటి ఊసులేకుండా చేయడం ‘పాపం’ కిందే లెక్క. కళాకా రులని కాపాడకుండా, వారిని గౌరవించకుండా ‘కళ’ని కాపాడలేం. ఎన్నో జానపద విలక్షణ కళలను జాతీయ స్థాయిలో గుర్తింపు తేవలసిన ప్రభుత్వం ఒక్క కళని ఆశీర్వదించలేదు, అసలు ఒక్క జానపద కళాకారుడిని గుర్తించక పోవడం ఎందువల్ల జరిగింది?
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన రెండేళ్ల కాలంలో బహిరంగంగా ఏ మాత్రం జంకూ గొంకూ లేకుండా శిష్ట వర్గాల పండితులకు వారి సాహిత్యానికి, వారి కళలకే ప్రభుత్వం, ప్రభుత్వ సలహాదారులు అంకితం కావడం చాలామందికి జుగుప్స కలిగిస్తోంది. ప్రజా సాహిత్యం, జానపద, గిరిజన సాహిత్యం, కళలపట్ల వీరికి, ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేకపోవడం దివాలాకోరుతనం. జానపద గిరిజన కళలపై డాక్యుమెంటరీలు తీయడానికి మాత్రం ప్రభుత్వం లక్షలాది రూపాయలు విచ్చలవిడిగా ఖర్చు చేయడం ఆర్థిక దుర్వినియోగం అవుతుందని కళాకారులు వాపోతున్నారు.
నోరులేని జానపద కళాకారుల గురించి నాయకులు ఎవరూ పట్టించుకోవడం లేదు. తమకు తెలిసిన చోటామోటా రచయితలకు, కళాకారులకు అవార్డులు ఇప్పించడానికి రాష్ట్ర , జిల్లా స్థాయిలో కలెక్టర్లకి వచ్చిన లేఖల కట్టలు చూస్తే తెలుస్తోంది. అంతా పైరవీలే. తెలంగాణ ప్రజలు దీనిని ఊహించలేదు. కళాకారుడి మొర వినలేదు. వారికి ఫించన్ల సంఖ్య కూడా పెంచలేదు. ఈ జానపద కళాకారులు బీడీలు తాగి, సట్నాలు తిని, కట్టిన పన్నులను జానపదేతర కవులు, కళాకారులకు పురస్కారాలుగా ఇవ్వడం తెలంగాణ ప్రజల సొమ్ము దుర్వినియోగం జరిగిందని ప్రజలు అనుకుంటే తప్పెలా అవుతుంది?
ఆశ్రితులనే ముఖ్యమంత్రిగారు కమిటీ సభ్యులుగా వేయడం వల్ల వారు వాళ్ల ఆశ్రితులనే ఎంపిక చేస్తారు. ఈ వరస, ఇలాంటి సంఘటనలు రెండేళ్లలో కోకొల్లలు. తెలంగాణలో సాంస్కృతిక రంగం భ్రష్టు పట్టించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. తప్పుడు సలహాలు ఇస్తున్నారు. వారిపట్ల జాగ్రత్త అవసరం. పురస్కారాల ఎంపికలో తమ వారికే ఇప్పించుకోవాలనే దుగ్ధకి అంతంలేదు. ఇది ఇలాగే కొనసాగడంవల్ల ప్రభుత్వానికి చాలా చెడ్డపేరు వస్తుంది. అందుకే జూన్ రెండో తేదీన జరిగే సన్మాన కార్యక్రమంలో తప్పకుండా దళిత రచయితలను, జానపద కళాకారులను కొందరిని ఎంపిక చేసి వారికి కూడా గౌరవంగా సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. తెలంగాణ భాషా సాంస్కృతిక జానపద గిరిజన కళారంగం పాలసీని కూడా రూపొందించే దిశగా ఆలోచించాలని కోరుతున్నాం. పాలసీ ఉంటే జవాబుదారీతనం ఉంటుంది. లేని పక్షంలో సాంస్కృతిక రంగం గుప్పుమంటుంది.
వ్యాసకర్త కవి, రచయిత ‘ మొబైల్ : 99519 42242
జయధీర్ తిరుమలరావు
జానపదం 'అంటరానిదా'?
Published Thu, Jun 2 2016 2:21 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement