అవినీతి రహిత పాలనేనా?
సందర్భం
అవినీతి రహిత పాలనకు తాము మారు పేరని కేంద్రం గొప్పలు చెప్పుకుంటోంది. విదేశాల్లో అదానీ గ్రూపు బొగ్గు వ్యాపారానికి ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఇవ్వడం, కార్పొరేట్ సంస్థలకు రూ.10 లక్షల కోట్ల రాయితీని ఇవ్వడం స్వచ్ఛపాలనేనా..?!
బీజేపీ అధికార పగ్గాలు చేపట్టి ద్వితీయ సంవత్సరం ముగిసి, తృతీయ సంవత్సరంలోకి అడుగి డుతోంది. ప్రధాని నుండి చోటా మోటా బీజేపీ లీడరు వరకు అవినీతిలేని స్వచ్ఛమైన పాలన అందించామని ప్రగల్భాలు పలు కుతున్నారు. ఈ నేపథ్యంలో వీరి పాలన ఎవరినుద్ధరించిందనేది మరుగున పడుతోంది. ప్రభుత్వ పనితీరులో నిజంగానే నీతి నియమాలు అమలవుతున్నాయా? ఉంటే వాటి ఆచరణపై కేంద్ర ప్రభుత్వం తగు స్పష్టతను ఇవ్వాల్సి ఉంది.
ఎన్డీయే అధికారంలోకి వచ్చాక వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో కార్పొరేట్ అనుకూల, విదేశీ బహుళజాతి కంపెనీలను స్వాగతించే విధానాలకు పెద్ద పీట వేశారు. అదాని గ్రూపునకు విదేశాలలో బొగ్గు వ్యాపారం చేయ డానికి ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీపై కాగ్ తప్పు పట్టే పరిస్థితి వచ్చిందంటే చట్టాలను కేంద్రం ఎలా ఉల్లంఘి స్తోందో అర్థమవుతుంది. దాదాపు రూ.10 లక్షల కోట్ల మేరకు పన్నుల రాయితీలను కార్పొరేట్ సంస్థలకు ఎందుకి స్తున్నట్లు? లలిత్‌మోదీ, వ్యాపం కుంభకోణం, ఈ మధ్య విజయ్‌మాల్యా వ్యవహారాలకు ఏం జవాబు చెబుతారు? విజయ్‌మాల్యాను రాజ్యసభ సభ్యుడిగా చేసింది బీజేపీ కాదా? వీటిపై మోదీ ఎప్పుడైనా, ఎక్కడైనా నోరు విప్పి స్పష్టమైన ప్రకటన చేశారా? అనేది ప్రశ్న.
‘‘స్వచ్ఛ భారత్’’, ‘‘మన్‌కీ బాత్’’ ఎవరి కోసం? మీ స్వంత డబ్బా వాయించుకోవడానికి తప్ప.. నిరుపేదలకు, ఆకలితో అలమటించే సగటు మూగజీవికి అందించిన సహాయమెంత? గత ప్రభుత్వానికి మీకు తేడా ఏమిటి? వారు నూతన ఆర్థిక విధానాల అమలు పేరుతో ప్రపంచీక రణ, ప్రైవేటీకరణ, సరళీకరణల వైపు పయనించారు. ఆ ప్రభుత్వ కొనసాగింపుగా మీరు వ్యవహరిస్తున్నది విదేశీ కంపెనీలను ఆహ్వానించేందుకే కదా!
పరిపాలనపై బీజేపీ ముద్ర వేసుకోవడంలో సఫలీకృ తులైనారనడంలో అతిశయోక్తి లేదు. సంఘ్‌పరివార్ శక్తులు దేశం నలుమూలలా విజృంభిస్తున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్ విస్త రణ పెరుగుతోంది. ఏబీవీపీ ద్వారా యూనివర్సిటీలపై పెత్తనం చేస్తామంటే విద్యావంతులైన, చురుకైన విద్యార్థులు ఎదురు తిరిగారు. భరించలేని ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేసి, వారిని మానసిక వేదనకు గురిచేసింది. అందులో మెరికలాంటి రోహిత్ చిత్రహింసలు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంతటి ఘోర సంఘటనను వివాదాస్పదం చేశారు. ప్రజాస్వామ్య విలువలను గౌర వించలేకపోయారు. ఈ తప్పును కప్పిపుచ్చుకోవడానికి జేఎన్‌యూ విద్యార్థి సంస్థ అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ని రాజద్రోహం ఆరోపణతో జైల్లో పెట్టారు. పోలీసుల రక్షణతో పాటియాల కోర్టుకు వచ్చిన కన్హయ్యపై బీజేపీ ఎంఎల్‌ఏ, లాయర్ల దుస్తుల్లో కొంతమంది దుండగులు న్యాయ దేవత ముందు దాడి చేసింది నిజం కాదంటారా?
మహారాష్ట్రలోని కొల్లాపూర్‌లో సీపీఐ నాయకుడు గోవింద పన్సారేని, కర్ణాటకలో హంపీ యూనివర్సిటీ మాజీ వీసీ కల్బుర్గిని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపిన ఘటనకు కారకులెవరు? వీటిపై నేటివరకూ తీసుకున్న చర్య లేవీ? హంతకులను, రౌడీలను చట్ట పరిధిలో శిక్షించాల్సింది పోయి, వారిని కాపాడటం దారుణం. మరోవైపు మతోన్మా దాన్ని రెచ్చగొట్టి లబ్ధిపొందే పథకాలకు రూపకల్పన చేస్తూ, ‘‘లవ్ జిహాద్’’, ‘‘ఘర్ వాపసీ’’లాంటì ప్రచార కార్య క్రమాలు దేనికి సంకేతమిస్తాయి? బీజేపీ వచ్చాకే ఇలాంటివి ఎందుకు జరుగుతున్నట్లు?
యూపీఏ ప్రభుత్వం కంటే ఎన్డీయే ప్రభుత్వం అవినీతి సమర్థనలో ఒక అడుగు ముందుకేస్తున్నట్లు కనబడుతోంది. కోర్టు ఆదేశాలు ఇచ్చాకే నల్లధనం కుబేరుల పేర్లు కొన్న యినా బయట పెట్టారు కదా! విజయ్‌మాల్యాకు, లలిత్ మోడీకి ప్రభుత్వ మద్దతు పూర్తిగా ఉన్నదనేది అబద్ధమా? మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసిన కూలీలకు కూలి డబ్బులు చెల్లించక బకాయి పడితే సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేయలేదా? ఆ తర్వాతే గదా ఆగమేఘాల మీద కేంద్రం రూ.12,538 కోట్లు విడుదల చేసింది. 12 రాష్ట్రాలలో తీవ్రమైన కరువు ఉండగా కేంద్రం తమ బాధ్యత విస్మరించిందని సుప్రీం కోర్టు గుర్తు చేయడం అంటే ప్రభుత్వ వైఖరిని మందలించినట్లు కాదా?
పేదల పట్ల ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అలసత్వం సహిం చరానిది. కోర్టులు మందలిస్తే గానీ ప్రభుత్వాలకు కను విప్పు కలగడంలేదు. అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధిస్తే కోర్టులు ఎత్తి చూపే పరి స్థితి రావడం ప్రభుత్వానికి చెంపపెట్టు కాదా?
ఎన్డీయే ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న ప్పటికీ ప్రజలకిచ్చిన వాగ్దానం మేరకు నల్లడబ్బు వెలికి తీతలో విఫలమైంది. ఇప్పటికైనా చిత్తశుద్ధితో ప్రయత్నించి, ఎగవేతదారులు ఎంతటి పలుకుబడి ఉన్నవారైనా సరే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొని నల్లడబ్బును వెనక్కు తెచ్చి ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకోవాలి.కార్పొరేట్ సంస్థలకు పన్నుల రాయితీలు, ప్రజలపై పన్నుల భారాలా? ఇది పూర్తిగా ముమ్మాటికి రాజ్యాంగ విరుద్ధ చర్యే అవుతుంది. అందుకే ఈ దేశంలో పేదలు మరింత నిరుపేదలుగానూ, ధనవంతులు మరింత కుబేరు లుగానూ ఎదుగుతున్నారు. ఇది డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి ఆకాంక్షలకు, మనోభావాలకు భిన్నమైనది. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేది.
రెండు సంవత్సరాల అనుభవాలను నెమరువేసుకుని, మిగిలిన మూడేళ్ల కాలంలోనైనా రాజ్యాంగంలో పొందు పరచిన ప్రాథమిక హక్కుల అమలు, అవినీతి రహిత పాలనకు మోదీ ప్రభుత్వం కట్టుబడాల్సిన అవసరం ఉంది. పరమత సహనం పాటిస్తూ, దేశ సమైక్యతను, సమగ్రతను కాపాడాల్సి ఉంది. లేకుంటే వామపక్ష, ప్రగతిశీల, ప్రజా తంత్ర శక్తులు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఐక్య కార్యాచరణతో ముందుకు సాగాలి.
వ్యాసకర్త సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి
మొబైల్ : 9490952301
చాడ వెంకటరెడ్డి