సాక్షి, హైదరాబాద్: దేశాన్ని అమ్మనీయబోమంటూ అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ ఇప్పుడు దేశాన్ని అమ్మేందుకు తహతహలాడుతున్నారని సీపీఐ జాతీయకార్యదర్శి అతుల్ కుమార్ అంజాన్ విమర్శించారు. నేషనల్ ఇన్ పైప్ పేరుతో రైల్వే, రోడ్లు వంటి ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్, విదేశీ కంపెనీలకు మోదీ ప్రభుత్వం కట్టబెట్టి రూ.6 లక్షల కోట్లు సమీకరిస్తోందని ఆరోపించారు. బీజేపీ హయాంలో ఆర్థికవ్యవస్థ కుదేలైపోయిందని, శాంతిభద్రతలు గాలికి ఎగిరిపోయాయని, సరిహద్దులకు రక్షణ కరువైందని, ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని విమర్శించారు.
శుక్రవారం ఇక్కడి మఖ్దూంభవన్‌లో రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శులు పల్లా వెంకట్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. మోదీ పాలనలో ఆర్థికరంగం అథఃపాతాళానికి చేరుకుందని, తిరిగి పూర్వస్థితికి రావడం కష్టంగా మారిందన్నారు. లఖింపూర్ ఖిరీ ఘటనకు కారణమైన కేంద్ర హోం శాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిశ్ మిశ్రాను ఎందుకు అరెస్టు చేయలేదని అతుల్ కుమార్ ప్రశ్నించారు.
అజయ్ మిశ్రాకు నేరచరిత్ర ఉన్నదని, 2003లో ఒక యువకుని హత్య కేసులో హైకోర్టు తీర్పు రిజర్వ్‌లో ఉందన్నారు. అటువంటి వ్యక్తిని మంత్రివర్గం నుంచి ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. రైతుల డిమాండ్ కేంద్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే మరోసారి చలో పార్లమెంటు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, బుల్లెట్లు దూసుకొచ్చినా ఖాతరుచేయబోమని స్పష్టం చేశారు.
జూలైలో సీపీఐ రాష్ట్ర మహాసభలు: చాడ
వచ్చే ఏడాది జూలై నెలాఖరున రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో సీపీఐ రాష్ట్ర మహాసభలు, వచ్చే ఏడాది అక్టోబర్ 14–17 తేదీలలో విజయవాడలో జాతీయ మహాసభలు జరుగుతాయని చాడ తెలి పారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని తాను ఎన్నడూ అనలేదని సీఎం కేసీఆర్ శాసనసభలో అసత్యం పలకడం శోచనీయమన్నారు. 2014 టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలో మూడెకరాల భూమి ఇస్తామని స్పష్టంగా ఉందన్నారు.
లఖింపూర్ ఖీరి ఘటన నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 11న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నుట్లు తెలిపారు. రెండు రోజులపాటు ఇక్కడ జరిగిన సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాల నిర్ణ యాలను వెల్లడించారు. పోడుభూముల సమస్య పరిష్కారమయ్యే వరకు ప్రత్యక్ష కార్యాచరణ కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment