atul kumar anjaan
-
దేశాన్ని అమ్మేందుకు మోదీ తహతహ
సాక్షి, హైదరాబాద్: దేశాన్ని అమ్మనీయబోమంటూ అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ ఇప్పుడు దేశాన్ని అమ్మేందుకు తహతహలాడుతున్నారని సీపీఐ జాతీయకార్యదర్శి అతుల్ కుమార్ అంజాన్ విమర్శించారు. నేషనల్ ఇన్ పైప్ పేరుతో రైల్వే, రోడ్లు వంటి ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్, విదేశీ కంపెనీలకు మోదీ ప్రభుత్వం కట్టబెట్టి రూ.6 లక్షల కోట్లు సమీకరిస్తోందని ఆరోపించారు. బీజేపీ హయాంలో ఆర్థికవ్యవస్థ కుదేలైపోయిందని, శాంతిభద్రతలు గాలికి ఎగిరిపోయాయని, సరిహద్దులకు రక్షణ కరువైందని, ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని విమర్శించారు. శుక్రవారం ఇక్కడి మఖ్దూంభవన్‌లో రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శులు పల్లా వెంకట్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. మోదీ పాలనలో ఆర్థికరంగం అథఃపాతాళానికి చేరుకుందని, తిరిగి పూర్వస్థితికి రావడం కష్టంగా మారిందన్నారు. లఖింపూర్ ఖిరీ ఘటనకు కారణమైన కేంద్ర హోం శాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిశ్ మిశ్రాను ఎందుకు అరెస్టు చేయలేదని అతుల్ కుమార్ ప్రశ్నించారు. అజయ్ మిశ్రాకు నేరచరిత్ర ఉన్నదని, 2003లో ఒక యువకుని హత్య కేసులో హైకోర్టు తీర్పు రిజర్వ్‌లో ఉందన్నారు. అటువంటి వ్యక్తిని మంత్రివర్గం నుంచి ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. రైతుల డిమాండ్ కేంద్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే మరోసారి చలో పార్లమెంటు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, బుల్లెట్లు దూసుకొచ్చినా ఖాతరుచేయబోమని స్పష్టం చేశారు. జూలైలో సీపీఐ రాష్ట్ర మహాసభలు: చాడ వచ్చే ఏడాది జూలై నెలాఖరున రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో సీపీఐ రాష్ట్ర మహాసభలు, వచ్చే ఏడాది అక్టోబర్ 14–17 తేదీలలో విజయవాడలో జాతీయ మహాసభలు జరుగుతాయని చాడ తెలి పారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని తాను ఎన్నడూ అనలేదని సీఎం కేసీఆర్ శాసనసభలో అసత్యం పలకడం శోచనీయమన్నారు. 2014 టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో మూడెకరాల భూమి ఇస్తామని స్పష్టంగా ఉందన్నారు. లఖింపూర్ ఖీరి ఘటన నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 11న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నుట్లు తెలిపారు. రెండు రోజులపాటు ఇక్కడ జరిగిన సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాల నిర్ణ యాలను వెల్లడించారు. పోడుభూముల సమస్య పరిష్కారమయ్యే వరకు ప్రత్యక్ష కార్యాచరణ కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
వరద సాయంలోనూ రాజకీయాలేనా?
సాక్షి, హైదరాబాద్: కేరళలో వరద బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యతను విస్మరించి, సాయం చేయడంలోనూ బీజేపీ రాజకీయాలు చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్‌కుమార్ అంజాన్ మండిపడ్డారు. నగరంలోని మగ్దుంభవన్‌లో 2 రోజుల పాటు సాగే రాష్ట్ర సమితి సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అతుల్‌కుమార్ మాట్లాడుతూ.. కేరళ రాష్ట్రం 60 శాతం వరదలతో నష్టపోయిందన్నారు. కేరళకు సహాయం చేయడంలోనూ కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ప్రధాని మోదీ సంకుచిత భావాలతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వాజ్‌పేయి కలశయాత్రల పేరిట ఓట్ల కోసం మోదీ శవ రాజకీయాలకు దిగజారుతున్నారని విమర్శించారు. నిజంగా మోదీకి ఎస్సీల మీద ప్రేమ ఉంటే మేధోమధన కమిటీతో ఎందుకు నాలుగేళ్లుగా సమావేశాలు పెట్టలేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళల దేహాలతో వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారని చెప్పారు. టీఆర్ఎస్ సభ పెట్టుకుని ప్రగతి నివేదిక ఏమని ఇస్తారని ప్రశ్నించారు. పౌరహక్కుల రక్షణ, ప్రజాస్వామిక పాలన జరగాలంటే మరోసారి టీఆర్ఎస్ను గెలిపించొద్దన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి కోసం భావ సారూప్యత గల పార్టీలతో పొత్తు ఉంటుందన్నారు. -
'సన్నీ యాడ్‌తో అత్యాచారాలు పెరుగుతాయి'
శృంగార తార సన్నీలియోన్ చేసిన కండోమ్ ప్రకటన వల్ల భవిష్యత్తులో మరిన్ని అత్యాచారాలు జరిగే ప్రమాదం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అన్జాన్ హెచ్చరించారు. ఆమె నటించిన ప్రకటన భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ఉందని, ప్రజలు గనక ఆ ప్రకటన చూస్తే అత్యాచారాలు మరింత పెరగడం ఖాయమని ఆయన అన్నారు. 'మ్యాన్‌ఫోర్స్' అనే కండోమ్ ప్రకటనలో సన్నీ లియోన్ నటించింది. అయితే, అతుల్ కుమార్ వ్యాఖ్యల గురించి సన్నీ లియోన్ మాత్రం ఎక్కడా స్పందించినట్లు లేదు. కాగా, సన్నీ లియోన్ మీద విమర్శలు గుప్పించడం, ఆమెపై కేసులు పెట్టడం ఇప్పుడు కొత్తేమీ కాదు. గతంలో కూడా ఆమె చిత్రాలు అసభ్యంగా ఉన్నాయంటూ ముంబైలో ఒక మహిళ సన్నీపై కేసు పెట్టారు. సన్నీలియోన్ ఇటీవల నటించిన మస్తీజాదే అనే సెక్స్ కామెడీ సినిమాకు ఇటీవలే సెన్సార్ బోర్డు పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే.