
సాక్షి, హైదరాబాద్: కేరళలో వరద బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యతను విస్మరించి, సాయం చేయడంలోనూ బీజేపీ రాజకీయాలు చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్‌కుమార్ అంజాన్ మండిపడ్డారు. నగరంలోని మగ్దుంభవన్‌లో 2 రోజుల పాటు సాగే రాష్ట్ర సమితి సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అతుల్‌కుమార్ మాట్లాడుతూ.. కేరళ రాష్ట్రం 60 శాతం వరదలతో నష్టపోయిందన్నారు. కేరళకు సహాయం చేయడంలోనూ కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ప్రధాని మోదీ సంకుచిత భావాలతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
వాజ్‌పేయి కలశయాత్రల పేరిట ఓట్ల కోసం మోదీ శవ రాజకీయాలకు దిగజారుతున్నారని విమర్శించారు. నిజంగా మోదీకి ఎస్సీల మీద ప్రేమ ఉంటే మేధోమధన కమిటీతో ఎందుకు నాలుగేళ్లుగా సమావేశాలు పెట్టలేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళల దేహాలతో వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారని చెప్పారు. టీఆర్‌ఎస్ సభ పెట్టుకుని ప్రగతి నివేదిక ఏమని ఇస్తారని ప్రశ్నించారు. పౌరహక్కుల రక్షణ, ప్రజాస్వామిక పాలన జరగాలంటే మరోసారి టీఆర్‌ఎస్‌ను గెలిపించొద్దన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓటమి కోసం భావ సారూప్యత గల పార్టీలతో పొత్తు ఉంటుందన్నారు.