‘చిత్తం శివునిమీదా... భక్తి చెప్పులమీదా’ అని నానుడి. ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు అందుకు సంబంధించిన అన్ని అంశాలనూ పరిశీలించడం... సంబంధిత వ్యక్తులు, సంస్థలతో మాట్లాడటం ఒక పద్ధతి. అలాంటిదేమీ లేకుండా జల్లికట్టుపై గత కొన్నేళ్లుగా అమలులో ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంవల్ల అది కాస్తా బెడిసికొట్టింది. దీనికి సంబంధించి కేంద్రం ఈ నెల 8న జారీచేసిన నోటిఫికేషన్‌పై స్టే విధిస్తూ సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం ఉత్తర్వులు వెలువరించింది. సహజంగానే ఈ ఉత్తర్వులపై తమిళనాట తీవ్ర ఆందో ళన నెలకొంది. సుప్రీంకోర్టు స్టేను అధిగమించడం కోసం తక్షణం ఆర్డినెన్స్ తీసుకు రావాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత డిమాండ్ చేశారు. మిగిలిన పార్టీలన్నీ దాదాపు ఇదే మాదిరి డిమాండ్ చేస్తున్నాయి. న్యాయస్థానాలిచ్చే తీర్పులనైనా, స్టే ఉత్తర్వులనైనా అధిగమించడానికి కార్యనిర్వాహక వ్యవస్థకు తగిన వెసులుబాటుంది. దాన్నెవరూ కాదనరు. కానీ అందుకు కొన్ని పద్ధతులున్నాయి. వాటిని పాటించకపోబట్టే ఇప్పుడీ సమస్య వచ్చిపడింది.
మరికొన్ని నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు లేనట్టయితే కేంద్రమైనా, ఈ పార్టీలైనా జల్లికట్టు విషయంలో ఇంతగా ఆదుర్దాను ప్రదర్శించేవా అన్న అనుమానం ఎవరికైనా కలుగు తుంది. ఎందుకంటే జల్లికట్టు క్రీడ నిషేధం సమస్య ఈమధ్యకాలానిది కాదు. వివిధ జంతువులను శిక్షణ పేరిట హింసించటం, సర్కస్‌లలో ప్రదర్శించడంవంటి చర్య లను నిషేధిస్తూ 1991లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పటినుంచీ జల్లికట్టు, ఎడ్ల బండ్ల పోటీలు వగైరావంటివి చర్చకొస్తూనే ఉన్నాయి. ఆ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసి పుచ్చాక 2011లో కేంద్రం విడుదల చేసిన మరో నోటిఫికేషన్‌లో ఇతర జంతువు లతోపాటు ఎడ్లను కూడా చేర్చారు. ఆ నోటిఫికేషన్ చెల్లుబాటవుతుందని గత ఏడాది మే నెలలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
నోటిఫికేషన్‌లో ఎడ్లు చేరడం వెనకా కారణముంది. 2008లోనే సుప్రీంకోర్టులో జల్లికట్టు నిర్వహణను ఆపాలంటూ పిటిషన్ దాఖలు కావడం, పర్యవసానంగా దానిపై స్టే విధించడం జరిగాయి. అంత క్రితం సంవత్సరం ఈ పోటీల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసు కోలేదు గనుక అనుమతించాలని యూపీఏ సర్కారు అప్పట్లో వాదించింది. కానీ సుప్రీంకోర్టు ఆ వాదనను తోసిపుచ్చింది. పశువులపై క్రౌర్యాన్ని ప్రదర్శించే ఈ మాదిరి క్రీడలను అనుమతించరాదని చెప్పింది. ఇప్పుడింతగా జల్లికట్టుపై ఒత్తిళ్లు తెస్తున్న పార్టీలు ఇన్నేళ్లనుంచీ ఆ విషయంలో పెద్దగా చేసిందేమీ లేదు.
జల్లికట్టు, ఎడ్ల బండ్ల పోటీలు, కోడిపందాలు వంటివి గ్రామసీమల్లో శతా బ్దాలుగా సాగుతున్న క్రీడలు. ఈ క్రీడలను గ్రామీణులంతా వినోదంగా, వేడుకగా భావించి చూస్తుంటారు. సంక్రాంతికి తమిళనాడులో జల్లికట్టు పోటీలున్నట్టే మహారాష్ట్రలో ఎడ్ల బండ్ల పోటీలు, ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందాలు వంటివి సాగుతుంటాయి. జల్లికట్టు పోటీల్లో పాల్గొనే ఎడ్లను ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పెంచడం, అందుకోసం ఎంతైనా ఖర్చుపెట్టడానికి సిద్ధపడటం తమిళనాడులో ఆనవాయితీ. మరోపక్క వీటిలో అంతులేని జంతు హింస దాగి ఉన్నదని, క్రౌర్యాన్ని ప్రదర్శించడానికి అవి సందర్భాలుగా మారుతున్నాయని జంతు ప్రేమికులంటారు.
వీక్ష కులను సంతోషపెట్టడం కోసం జల్లికట్టులో పాల్గొనే ఎడ్లను భౌతికంగా, మానసికంగా హింసించడం పెరిగిపోతున్నదని గతంలో సుప్రీంకోర్టు ముందు జంతు సంక్షేమ బోర్డు, ఇతర జీవహింస నివారణ సంస్థలు వాదించాయి. ఎడ్ల కళ్లల్లో కారం చల్లడం, వాటికి మత్తు పానీయాలు పట్టించడం వంటివి అలవాటుగా మారాయని సాక్ష్యాధారాలు చూపాయి. మహారాష్ట్రలో సాగే ఎడ్ల బండ్ల పోటీలు కూడా క్రౌర్యానికి చిరునామాగా మారాయని ఆరోపించాయి.
నిరుడు జల్లికట్టు, ఎడ్ల బండ్ల పందాలు వంటివాటిని నిషేధిస్తూ ఉత్తర్వు లిచ్చిన సుప్రీంకోర్టు ఆ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. జంతువులు సహా జీవులన్నిటికీ సహజసిద్ధమైన గౌరవమర్యాదలు, ప్రశాంతంగా జీవించే హక్కు ఉంటాయని...వాటిని మనం గౌరవించాల్సిన అవసరం ఉన్నదని చెప్పింది. ఏ రాష్ట్రంలోనూ ఎద్దులను ప్రదర్శనకు ఉపయోగించే జంతువులుగా చూడరాదని స్పష్టంచేసింది. ఇలాంటి ప్రదర్శనల్లో ఎడ్లను హింసించే తీరు ఊహకు మించి ఉన్నదని ఆందోళన వ్యక్తంచేసింది. చాలా దేశాల్లో చేసినట్టే జంతువుల హక్కు లను కూడా రాజ్యాంగ హక్కుల్లో చేర్చాలని పార్లమెంటుకు సూచించింది. జంతువుల సంరక్షకూ, సంక్షేమానికీ పూచీపడే అంతర్జాతీయ ఒప్పందం లేక పోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. జల్లికట్టు వంటి పందాలను మన పురాతన సంస్కృతీసంప్రదాయాలు కూడా అంగీకరించవని సుప్రీంకోర్టు గుర్తుచేసింది. తమిళ సంప్రదాయంలో ఎద్దును పూజిస్తారని, దాన్ని శివుడి వాహనంగా భావిస్తారని తెలిపింది.
ఇప్పుడు జల్లికట్టు, ఎడ్ల బండ్ల పోటీలను నిషేధంనుంచి తప్పిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం ఆ తీర్పు పూర్తి పాఠాన్ని సరిగా చదివినట్టు లేదు. ఎందుకంటే నిరుడంతా చాలామంది కేంద్రమంత్రులైనా, బీజేపీ నేతలైనా మిగిలిన అంశాలకంటే ఆవుకే ప్రాధాన్యమిచ్చారు. అది క్షేత్ర స్థాయికి వెళ్లేసరికి ఏమైందో అందరికీ తెలుసు. ఆవును చంపడానికి తీసు కెళ్తున్నారన్న అనుమానంతో నలుగురైదుగురు ట్రక్కు డ్రైవర్లను హతమార్చిన ఉదంతాలు మాత్రమే కాదు...గోమాంసం ఉన్నదన్న నెపంతో యూపీలోని ఓ ఇంటిపై దుండగులు దాడిచేసి ఆ ఇంటి యజమానిని సైతం కొట్టి చంపారు.
ఆవు పవిత్ర జంతువైనవారికి ఎద్దు ఎందుకు కాకుండా పోయిందో అర్ధంకాని విషయం. జల్లికట్టు విషయంలో కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ ఆ క్రీడకు అనేక పరిమితుల్ని విధించడం, జాగ్రత్తలు తీసుకోవడం నిజమే కావొచ్చు. కానీ సుప్రీంకోర్టు తీర్పు అమలు కాకుండా నోటిఫికేషన్ జారీచేయాలనుకోవాలన్న ఆలోచనే మౌలికంగా సరైందికాదు. అందుకు బదులు పార్లమెంటులో చర్చించి చట్టం తీసుకురావడం లేదా సుప్రీంకోర్టులోనే ఆ తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం అనే ప్రత్యామ్నాయాలున్నాయి. ఆ రెండు మార్గాలనూ విడిచి నోటిఫికేషన్ జారీ చేయడం వెనక ఎన్నికల ప్రయోజనాలున్నాయని ఎవరైనా అనుకుంటే అది వారి తప్పు కాదు.
జల్లికట్టు...రాజకీయ కనికట్టు
Published Wed, Jan 13 2016 1:30 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement