స్థానికేతర ప్రాతినిధ్యం? | mahesh vijapurkar opinion on non local representation | Sakshi
Sakshi News home page

స్థానికేతర ప్రాతినిధ్యం?

Published Tue, May 31 2016 1:02 AM | Last Updated on Mon, Sep 4 2017 1:16 AM

స్థానికేతర ప్రాతినిధ్యం?

స్థానికేతర ప్రాతినిధ్యం?

విశ్లేషణ
బాలీవుడ్ నటుడు అనుపమ్‌ఖేర్ గురించి తాను చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలను ‘తప్పుగా నివేదించార’ని నటుడు నసీరుద్దీన్ షా పేర్కొన్నట్లు ప్రముఖ ఇంగ్లిష్ పత్రిక పేర్కొంది. కశ్మీర్ పండిట్ల సమస్యను ఖేర్ ఎత్తిపడుతున్నట్లు నసీరుద్దీన్ చెప్పి ఉండవచ్చు. ‘కశ్మీర్‌లో ఎన్నడూ నివసించని వ్యక్తి కశ్మీర్ పండిట్ల కోసం పోరాటం ప్రారంభించారు. ఉన్నట్లుండి ఆయన నిర్వాసితుడిలాగా మారి పోయారు.’
నసీరుద్దీన్ ఈ విధంగానే చెప్పి ఉన్నట్లయితే, నాకు తీవ్ర అభ్యం తరం ఉంది.

కశ్మీర్‌ను మనం భారత్‌లో ఒక భాగంగా చూస్తున్నప్పుడు, ఆ సమస్యను ఏవరయినా చేపట్టినప్పుడు దాంట్లో తప్పేముంది? గుజరాత్‌లో, తర్వాత ఉత్తరప్రదేశ్‌లో ముస్లింల గురించి మనం పట్టించుకుంటున్నందున, కశ్మీర్ పండిట్ల విధి గురించి మీరూ నేను కూడా అదేవిధంగా పట్టించుకోవలసి ఉంటుంది. ‘కశ్మీర్ పండిట్ల సమస్యలపై పోరాడటానికి మీరు కశ్మీరీ అయివుండనవసరం లేదని’ దాంట్లో ఏ ప్రమాదాన్నీ తాను చూడటం లేదని మధుర్ భండార్కర్ వ్యాఖ్యా నించినట్లు ఆ ఇంగ్లిష్ పత్రికే పేర్కొంది. ఆయన మాట ఎంత చక్కగా ఉందో!
 
బయటివారు, స్థానికులకు సంబంధించిన వ్యవహారం చేతులు దాటిపోతోంది. నాగాలాండ్ వంటి చోట్ల ప్రజలు మనల్ని భారతీయులమని, తాము మాత్రం భిన్నమైన వారిమని పరిగణిస్తుండటం ఒక వాస్తవికతగానే ఉంది. మహారాష్ట్రలో మరాఠీ వర్సెస్ మరాఠీయేతరుల సమస్య ఉండనే ఉంది. ఒక సమయంలో ఇది హిందీ మాట్లాడే ప్రజలను భయాందోళనలకు గురిచేసి నాసిక్ నుంచి పారిపోయేలా చేసింది. దీంతో పారిశ్రామిక కార్యకలాపాలు దాదాపుగా స్తంభించిపోయినంత పనయింది. స్థానికుల ప్రయోజనాల కోసం స్థానికేతరులు లేదా బయటి వారు పడుతున్న దుస్థితిని ఇది వాస్తవంగానే వివరించాల్సి ఉంది.

కానీ మాటల యుద్ధం జరుగుతున్నప్పుడు, చిత్రసీమకు చెందిన అశోక్ పండిట్ అనే మరో కశ్మీరీ పండిట్, తన వంతుగా అగ్నికి ఆజ్యం పోశారు. ‘మీరట్‌కు చెందిన నసీరుద్దీన్ షా.. గుజరాత్ అల్లర్లపై తన గొంతు పెంచుతున్నారే’. ఇదంతా మీడియా దృష్టికి రావడమే కాదు.. సోషల్ మీడియాలో దుమారం లేచింది కూడా. కానీ అసలు సమస్యలు మాత్రం నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. చాలా కాలం క్రితమే అన్యాక్రాంతమైన లేదా దాదాపుగా విధ్వంసానికి గురైన తమ సొంత ఇళ్లకు తిరిగి రావడంపై కశ్మీర్ పండిట్లు చెందుతున్న ఆందోళనను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు.
 
నసీరుద్దీన్ షా ప్రకటనను కానీ, అశోక్ పండిట్ చేసిన అసంబధ్ద వ్యాఖ్యను కానీ పరిశీలించి నట్లయితే, దేశం ఉప జాతీయవాదం కోసం లెక్కలు తేల్చుకోవలసి ఉంటుంది. రాష్ట్రాల ఆవిర్భావానికి విస్తృతమైన భాషా కారణాల్లో ఇది వేళ్లూనుకుని ఉంది. ఇక భాష విషయానికి వస్తే అది ఒక ప్రజాబృందం సంస్కృతితో ముడిపడి ఉంది. తన అభిప్రాయాన్ని వివరించడంలో లేదా కశ్మీర్ పండిట్ల గురించి ఆందోళన వ్యక్తపర్చటంలో ఖేర్ ఏ తప్పూ చేయలేదు.
 
భారత సంతతి ప్రజలు మరొక దేశంలో మూడో స్థాయి పౌరులుగా పనిచేస్తుండటాన్ని మన గర్వకారణంగా భావిస్తున్నట్లయితే, తమ సొంత దేశంలోనే శరణార్థులుగా ఉంటున్న ప్రజలకోసం నెత్తురు కార్చడం సరైందే. రెండు దశాబ్దాలకు ముందు మిలిటెంట్లు దాదాపు 3 లక్షల మందిని తరిమేశారు. వారి హృదయం నేటికీ లోయలోనే ఉంది కానీ మళ్లీ అక్కడకి వెళ్లి స్థిరపడటానికి వారికి ఇచ్ఛ కలగటం లేదు. కశ్మీర్‌లో మిలిటెంట్లు తమదైన ప్రభావం కలిగి ఉన్నారు కాబట్టి అక్కడ జీవితం కష్టభూయిష్టంగానే దాదాపు బహిష్కార స్థితిలోనే ఉంటుంది.
 
సిమ్లాలో పుట్టి ముంబైలో నివసిస్తున్న కశ్మీర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి తన కమ్యూనిటీ వేదనపై గొంతు విప్పలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, తమిళనాడుకు చెందిన పి.చిదంబరం, రాజ్యసభలో మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించగలగడం (చట్టాలు దానికి వీలు కల్పించి నప్పటికీ) ఎలా సబబు అవుతుంది? అలాగే ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించిన కపిల్ సిబల్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌కు, మునుపటి ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన జైరాం రమేష్ ప్రస్తుతం కర్ణాటకకు ప్రాతినిధ్యం వహించడం ఎలా సబబు?
 
హైదరాబాద్ నివాసి అయిన నిర్మలా సీతారామన్ కర్ణాటక నుంచి, నెల్లూరుకు చెందిన వెంకయ్యనాయుడు గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎలా ప్రాతినిధ్యం వహించగలరు? దేశానికి రెండుసార్లు ప్రధానిగా వ్యవహరించిన వ్యక్తి స్థానిక చిరునామాను పొందడానికి ఒక ఇంటిని అద్దెకు తీసుకోవలసి వచ్చింది. పండిట్ల సమస్య నుంచి అనుపమ్ ఖేర్‌ను దూరం జరగాలని కోరుతున్నవారు తమ ప్రశాంతతను కూడా నిలుపుకోవలసి రావచ్చు. తన వ్యాఖ్యలకుగాను అనుపమ్‌ఖేర్‌ను ఎవరూ మందలించాల్సిన అవసరం లేదు.
వ్యాసకర్త: మహేష్ విజాపుర్కార్, సీనియర్ పాత్రికేయులు
ఈమెయిల్: mvijapurkar@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement