చెల్లని కాసులు.. చిల్లర కాసులు | Mahesh vijpurkar on notes cancellation | Sakshi
Sakshi News home page

చెల్లని కాసులు.. చిల్లర కాసులు

Published Tue, Nov 15 2016 12:47 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

చెల్లని కాసులు.. చిల్లర కాసులు - Sakshi

చెల్లని కాసులు.. చిల్లర కాసులు

విశ్లేషణ
నలుపు లేదా తెలుపు ఏదైనా కావచ్చు.. కోట్ల కొద్దీ నగదు కలిగిన వారు కూడా ఉన్నట్లుండి చిల్లర కాసులకు ఎంత విలువ ఉందో ఇప్పుడు గ్రహించారు. ఈ చిల్లరే లేకుంటే వారి జీవితాలు ఘోరంగా దెబ్బతింటాయి.

గత శుక్రవారం నా బ్యాంకు నుంచి రూ. 2,000ల నోట్ల తొలి సెట్‌ను తీసుకోగానే, 1893లో సుప్రసిద్ధ రచ యిత మార్క్‌ ట్వెయిన్‌ ప్రచురించిన ‘ది మిలి యన్‌ పౌండ్‌ బ్యాంక్‌ నోట్‌’ అనే కథానిక నా తలపుకు వచ్చింది. ఆ కథానికలో ముఖ్య పాత్ర హెన్రీ ఆడమ్స్‌ పదిలక్షల పౌండ్ల విలువైన సింగిల్‌ కరెన్సీ నోట్‌కి సొంతదారై, దాన్ని ఖర్చు పెట్టాలని ప్రయత్నించాడు. కానీ అతడా నోటుని ఇవ్వబోయి నప్పుడు షాప్‌ కీపర్లు, రెస్టారెంట్‌ యజమానులు ఒక్కసారిగా బెదిరిపోయారు. ఆ నోటుకు తగిన చిల్లర వారి వద్ద లేకపోయింది.

అలాగని అంత పెద్ద నోటుతో వచ్చిన అత డిని వెనక్కు పంపాలని కూడా వారనుకోలేదు. అంత పెద్ద సంపన్నుడిని కోల్పోయే సంప్రదాయం కూడా వారికి లేదు. ఆ క్రమంలో రుణం అతడిని వెతుక్కుంటూ వచ్చింది. తక్కువ ధరలో అతడు కొనుక్కోవాలనుకున్న సూట్‌ స్థానంలో ఖరీదైన పూర్తి స్థాయి వార్డ్‌రోబ్‌ వచ్చేసింది. వాళ్లు అతడికి రుణాలు కూడా ఇచ్చారు. అత్యధిక విలువ గల నోటుతో ఏదైనా బిల్లు కట్టడానికి కూడా కష్టమే అయినప్పటికీ, ఆ నోటు నిరుపయోగం మాత్రం కాలేదు. భారత్‌లో అయితే చిన్న కమ్యూనిటీలలో తప్పితే, రూ.2,000ల కరెన్సీ నోటుతో ఎవరూ రుణం పొందలేరు. పైగా సరైన ప్రణాళికతో నోట్ల రద్దు చేయనందున,  తక్కువ విలువ కలిగిన 100, 50, 10 రూపాయల నోట్ల సరఫరాని అది సమర్థ వంతంగా తీసుకురాలేకపోయింది.

మార్క్‌ ట్వెయిన్‌ కథానికలో హెన్రీ ఆడమ్స్‌కి దక్కిన అదృష్టం గురించి నేనయితే కల్లో కూడా ఆశించలేను. ఎందుకంటే రిటైల్‌ మార్కెట్‌లో రుణం తీసుకోవడం అంత సులభం కాదు. అందు కనే నవంబర్‌ 10న నా బ్యాంకు నుంచి రూ. 10 వేల చెక్కును విత్‌డ్రా చేసి మరీ నేను తీసుకున్న అయిదు 2 వేల రూపాయల నోట్లు నేటికీ నా వాలె ట్‌లోనే వృథాగా ఉండిపోయాయి. నేను కొనాలను కున్న చిన్న చిన్న కొనుగోళ్లు వాయిదా పడ్డాయి.  

శాసన మండలి ఎన్నికలు జరగనున్న మహా రాష్ట్రలో రాజకీయ నాయకులు తమ ఓటర్లకు బంగారు, వెండి నాణేలు లంచంగా ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. కానీ ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లో ఈ పరిస్థితిని ఎలా తట్టుకోవాలో ఎవరికీ అర్థం కావటం లేదు. బహుశా అవినీతి పెరిగి బంగారు, వెండి నాణేల సత్వర సేకరణకు దారి తీయవచ్చు. అలా కాదంటే.. పరిశుద్ధమైన, తక్కువ ఖర్చుతో కూడిన ఎన్నికలు జరగవచ్చు. రెండుసార్లు ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ చేసిన ప్రయోగాన్ని మినహాయిస్తే, నల్లధనం ప్రభావం లేని ఎన్నికలను ఇంతవరకు మనం విని ఉండలేదు. నలుపు లేదా తెలుపు ఏదైనా కావచ్చు.. కోట్ల కొద్దీ నగదు కలిగిన వారు కూడా ఉన్నట్లుండి చిల్లర కాసులకు ఎంత విలువ ఉందో ఇప్పుడు గ్రహించారు. ఈ చిల్లరే లేకుంటే వారి జీవితాలు ఘోరంగా దెబ్బతింటాయి. కూరలో కలిపే కొత్తి మీరను కొనుగోలు చేయ డానికి ఎస్‌యువీ వాహనాలలో లేదా సెడాన్‌ కార్లలో తమ డ్రైవర్లను పంపడం కూడా వారికి సాధ్యం కావడం లేదు. ఇక మధ్యతరగతి కుటుం బాలయితే చిల్లర కోసం తమ పిల్లల హుండీలలో చేయి పెట్టాల్సివచ్చింది.

ఇది పట్టణ ప్రాంతాల్లోని మధ్యతర గతి, సంప న్నవర్గాలు ఎదుర్కొంటున్న సంక్షోభం. ఇక ద్రవ్యో ల్బణం కారణంగా అధిక విలువ కలిగిన నోట్లు ఆడుతున్న గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఏమిట నేది ఎవరికీ తెలియటం లేదు. బ్యాంకింగ్‌ రంగం విస్తరించినప్పటికీ గ్రామీణులకు బ్యాంకులు అంత సులభంగా అందుబాటులో లేవు. ప్రధాన నగరా ల్లోని బ్యాంకులకు కూడా కొత్త, చిన్న నోట్లను తగినంతగా అందుబాటులో ఉంచలేకపోతున్న నేపథ్యంలో మారుమూల ప్రాంతాల్లో బ్యాంకుల తీరును ఎవరైనా ఊహించు కోవచ్చు. ఏమైనప్ప టికీ సంపన్న, మధ్యతరగతి వర్గాలు నిరుపేదల పట్ల సహానుభూతి ప్రదర్శించాల్సిన సమయమిది. ప్రపంచంలోని 120 కోట్లమంది అత్యంత నిరు పేదల్లో మూడోవంతు మంది భారత్‌లోనే ఉంటు న్నారు. ఇప్పుడు వీరిని గణాంకాలుగా లెక్కించడం మాని మనుషులుగా భావించాల్సిన పరిస్థితి ఆసన్నమైంది.

డబ్బు లేకుంటే ఏం జరుగుతుందన్నది మన అనుభవంలోకి వచ్చింది కాబట్టి, డబ్బులేని వారి పరిస్థితి గురించి మనం ఆలోచించవలసిన సమ యమిది. అవినీతిని ప్రోత్సహిస్తూ, సంక్షేమ పథకాల పేరుతో కొల్లగొడుతున్న వ్యవస్థకు పేదలు బలవుతుంటారు. పెద్ద నోట్ల రద్దు జరిగి ఆరురోజులు పూర్తయింది. ఈలోగా అరుణ్‌ జైట్లీ ఈ బాధ మరో రెండు వారాలు కొనసాగుతుందని సెలవిచ్చేశారు కూడా.
http://img.sakshi.net/images/cms/2015-06/41435518586_295x200.jpg
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు, మహేష్‌ విజాపుర్కర్‌
ఈ–మెయిల్‌ : mvijapurkar@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement