చావుబతుకుల్లో మావోయిస్టు రాజకీయ ఖైదీ
అభిప్రాయం
నక్సల్బరీ పంథా విప్లవో ద్యమ క్రమంలో మావోయిస్టు పార్టీ రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లలో సాకేత రాజన్, ఆజాద్ (చెరుకూరి రాజ్‌కుమార్) వరు సలో చేరదగిన వాడు అజిత్ (కన్నంపెల్లి మురళీధరన్). విద్యార్థిగా ఉండగానే అజిత్ కమ్యూనిస్టు రాజకీయాలకు ఆకర్షితుడయ్యాడు. నక్సల్బరీ ఉద్యమకాలం నుంచి కూడా విప్లవోద్యమంతో మమేకమై నాలుగు దశా బ్దాలుగా విప్లవోద్యమంలో పనిచేస్తూ మార్క్సిస్ట్ రాజ కీయార్థశాస్త్రంలో, మావోయిస్టు సిద్ధాంతంలో, అంత ర్జాతీయ రాజకీయాల్లో నిష్ణాతుడుగా పేరు తెచ్చు కున్నాడు.
అజిత్‌గా విప్లవ శిబిరంలో ప్రసిద్ధుడైన కె. మురళీ ధరన్ 61వ ఏట అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు 2015, మే 9న మహారాష్ట్రలోని పుణేకు దగ్గరగా ఉన్న తాలేగావ్ ధబాడే అనే చోట యాంటి టైస్ట్ స్క్వాడ్ అరెస్టు చేసింది. రోజుల తరబడి మానసిక చిత్రహింస లకు గురిచేస్తూ చివరికి ఆయనను దుర్మార్గమైన ఊపా (చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం - యుఏ పీఏ) కింద అరెస్టు చూపుతూ పుణె ఎరవాడ జైలుకు పంపించారు. సంవత్సరన్నర కాలంలో ఒక్కసారి మాత్రమే కోర్టుకు తీసుకెళ్లారు. విచారణ కూడా మొదలు కాలేదు. ఇప్పుడాయ నకు 62 ఏళ్లు కూడా దాటాయి. ఆయన హృద్రోగి. బైపాస్ సర్జరీ జరిగింది కూడా.
ఈ సెప్టెంబర్ 3న ఎరవాడ హైసెక్యూరిటీ సెంట్రల్ జైలులో ఒంటరి సెల్‌లో ఉన్న మురళీధరన్‌కు తీవ్రమైన గుండెనొప్పి వచ్చింది. దాంతో ఆయనను పుణేలోని ప్రభుత్వ సాసూన్ ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు ఆయన వెంట తోడుగా ఎవరైనా ఉంటే తప్ప చికిత్స సాధ్యం కాదన్నారు. తనకు తోడుగా ఎవరినైనా సహాయంగా ఉంచేందుకు పోలీసులు నిరాక రించడంతో మురళీధరన్ నిరాహారదీక్ష చేపట్టాడు. ఆయనను మళ్లీ సెప్టెంబర్ 6న జైలుకు తరలించారు.
అనారోగ్యం రీత్యా ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేయడానికి జనకీయ మనుష్యావకాశ ప్రస్థానం (జేఎంపీ) అనే ఒక ప్రజాస్వామిక హక్కుల సంస్థ అంతర్జాతీయ ప్రచారానికి పూనుకున్నది. దాని స్పందనగానే ప్రపంచ ప్రసిద్ధ ప్రజాస్వామిక హక్కుల స్వరం, భాషా శాస్త్రవేత్త నోమ్ చామ్‌స్కీ ఆయనను బెయిల్‌పై విడుదల చేయడమో, పారదర్శకమైన, న్యాయమైన విచారణ వేగవంతమైనా చేయాలని, ఇటు వంటి విజ్ఞప్తి సంతకం చేయడం తనకు సంతోషంగా ఉందని ప్రకటించాడు. కొలంబియా యూనివ ర్సిటీ నుంచి ప్రొ. గాయత్రీ చక్రవర్తి స్పైవాక్, ప్రొ. పార్థా ఛటర్జీ వంటి సుప్రసిద్ధ మేధావులు కూడా దీనిపై సంత కం చేశారు. మన దేశం నుంచి రచయిత్రి మీనా కంద స్వామి, ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్, మహారాష్ట్ర సీపీడీ ఆర్ నాయకుడు ఆనంద్ తెల్‌తూంబ్డే, ఈపీడబ్ల్యూ ఎడి టర్ బెర్నార్డ్ డిమెల్లో, అహ్మదాబాద్ ఎంఐసీఏ ప్రొ. టి.టి. శ్రీకుమార్, జెఎన్‌యు ప్రొ. ఎ.కె. రామకృష్ణన్, ప్రొ. హరగోపాల్ కూడా ఈ విజ్ఞప్తిపై సంతకం చేశారు.
కె. మురళీధరన్, కోబడ్ గాంధీ వంటి అరవై ఏళ్లు పైబడి, డెబ్భైలకు చేరువవుతున్న సుప్రసిద్ధ మావో యిస్టు మేధావులెందరో ఏళ్ల తరబడి తీవ్రమైన అనా రోగ్యాలతో, ఏ విచారణ కూడా కొనసాగని కల్పిత నేరా రోపణ చర్యల్లో జైళ్లలో మగ్గుతూ ఉన్నారు. ఈ తరు ణంలో దేశంలోనే వివిధ జైళ్లలో మగ్గుతున్న దళిత, ఆది వాసి, ముస్లిం తదితర పేద బడుగువర్గాల రాజకీయ ఖైదీల, సాధారణ ఖైదీల గురించి ఏమనుకోవాలి?
ఇట్లా ఒక వ్యక్తి, మేధావి, నాయకుడు అని మాత్రమే కాకుండా దేశంలో ఉన్న జైళ్లలో, ముఖ్యంగా కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, జార్ఖండ్, బెంగాల్, బిహార్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, ఏపీ, తెలంగాణ జైళ్లలో ఉన్న ఆదివాసి, దళిత, ముస్లిం, పేద ఖైదీల ఆరోగ్య పరిస్థితి గురించి, విడుదల గురించి పోరాడవలసిన మానవీయ బాధ్యత ప్రతి ప్రజాస్వామ్యవాదిపై ఉంది.
వ్యాసకర్త: వరవరరావు, విరసం వ్యవస్థాపక సభ్యుడు.