ఇంగ్లిష్ కావాలంటే తెలుగు పోవాల్సిందేనా?
ఇంగ్లిష్ కావాలంటే తెలుగు పోవాల్సిందేనా?పిల్లలకు విద్యాబోధన విషయంలో మాతృభాష ప్రాధా న్యత గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి చర్చ మొదలైంది. మునిసిపల్ పాఠశాలల్లో విద్యా బోధనను పూర్తిగా ఆంగ్లమాధ్యమంలోకి మార్చాలని ఏపీ మునిసి పల్ శాఖ తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న రాజకీయ కారణాలను పక్కనపెడదాం. బోధనా భాష వరకు మాత్రమే పరిమితమవుదాం. వాణిజ్యానికి కీలకం కాబట్టి ఇంగ్లిష్ ప్రపంచవ్యాప్తంగా అనుసంధాన భాషగా వుంది. అంతమాత్రాన ఇంగ్లిషే సర్వస్వంగా భావించ నక్కర్లేదు. అభివృద్ధిలో అగ్రగాములుగా భావించే జపాన్, చైనా, జర్మనీ లాంటి దేశాలేవీ ఇంగ్లిష్‌ను ఏనాడూ పట్టుకుని వేలాడలేదు. తమ మాతృభాషల ప్రాధాన్యతను పెంచుకుంటూనే, ప్రపంచ వాణిజ్య భాష ఇంగ్లిష్‌ను కూడా బాగా బోధిస్తున్నాయి.
ఈరోజు పోటీ మార్కెట్‌లో నెగ్గుకురావాలంటే ఇంగ్లిష్ పరిజ్ఞానం ఉండడం తప్పనిసరి. కానీ, అది లేక పోతే జీవితమే లేదు అనుకోవడం భ్రమ. ఇంగ్లి్లషైనా, ఇంకో భాషయినా, లేదా ఇంకో సబ్జెక్ట్ అయినా అంతి మంగా అది ఉపయోగపడాల్సింది మన జీవనోపాధికి, మన టార్గెట్ ఆడియన్స్ (కస్టమర్లు)ను చేరడానికే. ఇంగ్లిష్‌లో మాత్రమే చదువుకుని డాక్టర్లయినవారిని ఉదాహరణగా తీసుకుందాం. వీళ్లు చదువుకునే మెడికల్ టెర్మినాలజీ అంతా ఇంగ్లిష్‌లోనే. కానీ ప్రాక్టీస్ చేసేది మాత్రం తెలుగు నేల మీదే. పేషెంట్లకు రోగసమాచారం ఇవ్వాల్సిందీ, సమాధానాలు చెప్పాల్సిందీ తెలుగులోనే.
ప్రాథమిక విద్య నుంచి 12వ తరగతి (ఇంటర్మీ డియేట్) దాకా అన్ని అంశాల్నీ సొంత భాషలోనే బోధిం చుకుంటూ, ఇంగ్లిష్‌ను కూడా ఒక ప్రధాన భాషగా బోధించాల్సిన అవసరాన్ని గుర్తించాల్సివుంది. 1990– 95ల మధ్య ప్రపంచ మార్కెట్ విస్తృతి పెరిగింది. ఈ సమయంలోనే ఈ విద్యా కార్పొరేటీకరణ జాఢ్యం మొద లైంది. 300 ఏళ్లపాటు విపరీతమైన ఇంగ్లిష్ ప్రభావంలో వుండి కూడా మన మాతృభాషలు చచ్చిపోలేదంటే దీన్నెలా అర్థం చేసుకుంటారు?
నాకున్న అవగాహన మేరకు రెండు పరిష్కారా లున్నాయి. ఇంగ్లిష్‌ను ప్రాధాన్యభాషగా ఎలా గుర్తి స్తామో తెలుగును కూడా అలాగే గుర్తించాలి. ఇందు కోసం–టెర్మినాలజీ గైడ్‌లను రూపొందించడం, కమ్యూ నికేషన్ పద్ధతుల్ని తప్పనిసరి చేయడం అనే రెండు పద్ధతులు ఎంచుకోవచ్చు. 1. సైన్స్, గణితం సబ్జెక్టుల్లో కఠినమైన, ప్రామాణిక, ప్రాధాన్య పదాలన్నిటికీ ఇంగ్లిష్, తెలుగు భాషల్లో అర్థాలు చెప్పే ప్రాక్టికల్ నోట్స్‌ను పాఠ్యాంశాల్లో భాగం చేయాలి. 2. ఇక రెండో పరిష్కారం–హైస్కూలు స్థాయిలోనే విద్యార్థులకు కమ్యూనికేషన్ నైపుణ్యాలపై నిర్బంధ శిక్షణ ఇప్పిం చడం.
ఈ రెండు పద్ధతుల్నీ ప్రభుత్వాలు పాటించగలి గితే.. బోధనాభాషగా ఇంగ్లిష్, తెలుగు అనే ప్రశ్నలకి అడ్డుకట్ట వేసినవారిమవుతాం. అన్నిటినీ మించి, రాబోయే తరాలు వారి బతుకుల్ని వారు అర్థవంతంగా బతకడానికి ఆయువిచ్చినవాళ్లం కూడా అవుతాం.
(సురేశ్ వెలుగూరి, రచయిత, ప్రచురణకర్త మొబైల్ : 8125968527)