న్యూజెర్సీ: ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ అధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ సమావేశం న్యూ జెర్సీలోని పిన్డ్ రెస్టారెంట్లో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న జమ్మూకాశ్మీర్ భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు మోతీ కౌల్ మాట్లాడుతూ.. ప్రవాస కశ్మీరీలు, కశ్మీరీ పండితులు, ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, సభకు విచ్చేసిన ప్రవాస భారతీయులకు కశ్మీర్లో నెలకొన్న పరిస్థితుల గురించి వివరించారు. అలాగే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కశ్మీరీల కోసం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి, దేశంలో నెలకొన్న సామాజిక, రాజకీయ పరిస్థితులను గురించి చెప్పారు.
అలాగే కశ్మీరీయుల కోసం కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజి వివరాలను తెలిపారు. ప్రవాస కశ్మీరీయులు, కశ్మీరీ పండితులు సహా ప్రవాస భారతీయులు అడిగిన పలు ప్రశ్నలకు మోతీ కౌల్ సమాధానాలు ఇచ్చారు. ముఖ్యంగా రాజ్యాంగ నిబంధన 370, వేర్పాటువాద నేతలను సమర్థంగా ఎదుర్కోవడం, కశ్మీరీ పండితుల పునరావాసికరణం, ఉగ్రవాదులను ఎదుర్కోవడం అంశాలఫై ఈ సందర్భంగా చర్చించారు.
ఈ కార్యక్రమానికి ఓఎఫ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు కృష్ణ రెడ్డి ఏనుగుల, మాజీ అధ్యక్షుడు జయేష్ పటేల్, ఓఎఫ్ బీజేపీ జాతీయ మండలి సభ్యులు శ్రీ కల్పన శుక్ల, బాల గురు, నీలిమ మదన్, ఓఎఫ్ బీజేపీ న్యూజెర్సీ కో-ఆర్డినేటర్లు ఆనంద్ జైన్, రవి బుద్ధనూరు, ఓఎఫ్ బీజేపీ జాతీయ యువ కన్వీనర్ హరి సేథీ, ఓఎఫ్ బీజేపీ జాతీయ యువ సహాయ కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల, మీడియా కో-కన్వీనర్లు జయశ్రీ నాయర్, దిగంబర్ ఇస్లాంపురే, న్యూ జెర్సీ యువ కన్వీనర్ పార్తీబన్ వర్ధన్, సహాయక కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి, గుంజన్ మిశ్ర, ఫణిభూషణ్ తాడేపల్లితో పలువురు ప్రవాస భారతీయలు, కశ్మీరీలు, కాశ్మీరీ పండితులు ఉత్సాహంగా పాల్గొన్నారు.