ఫరూక్ యూటర్న్.. కొనసాగుతున్న సస్పెన్స్!
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతున్నది. జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ మృతితో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత ఫరూక్ అబ్దుల్లా ప్రకటించడం సంచలనం రేపింది. దీంతో తెరవెనుక బీజేపీ-ఎన్సీ సర్కార్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? అన్న ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై ఫరూక్ అబ్దుల్లా యూటర్న్ తీసుకొన్నారు. బీజేపీతో తాము పొత్తు పెట్టుకుంటామని తాను ఎన్నడూ అనలేదంటూ ఆయన మాట మార్చారు. మరోవైపు ఎన్సీ చీఫ్ ఒమర్ అబ్దుల్లా కూడా ఈ విషయంలో స్పష్టత ఇచ్చారు. సిద్ధాంతపరమైన విబేధాలు ఉన్న బీజేపీతో ఎన్సీ ఎట్టిపరిస్థితుల్లో చేతులు కలుపబోదని పేర్కొన్నారు.
మరోవైపు గతంలో మాదిరిగానే బీజేపీ-పీడీపీ కూటమి మళ్లీ కశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందా అన్నది స్పష్టం కావడం లేదు. ప్రభుత్వ ఏర్పాటు అంశంపై పీడీపీ అధినాయకురాలు మహబూబా ముఫ్తీ పార్టీ సీనియర్ నేతలతో ఆదివారం సమావేశమయ్యారు. పాత మిత్రుడు బీజేపీతో కలిసి వెళ్లాలా? లేక కొత్త స్నేహ హస్తం చాటుతున్న కాంగ్రెస్‌తో జట్టు కట్టాలా అన్నది ఈ సమావేశంలో మహబూబా నిర్ణయించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.