బోనులో సోనియా | ramachandra murthy article on national herald case | Sakshi
Sakshi News home page

బోనులో సోనియా

Published Sun, May 14 2017 12:57 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

బోనులో సోనియా - Sakshi

బోనులో సోనియా

త్రికాలమ్‌
‘నేషనల్‌ హెరాల్డ్‌’ కేసులో ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పు కాంగ్రెస్‌ పార్టీకీ, ఆ పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్షులకీ బలమైన ఎదురుదెబ్బ. రాబోయే రాష్ట్ర పతి ఎన్నికలలో ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయించేందుకు ప్రతిపక్షాలతో సోనియా గాంధీ సమాలోచనలు జరుపుతున్న దశలో కోర్టు తీర్పు ప్రతికూలంగా రావడం విశేషం. యూపీఏ–3ను నిర్మించే సంకల్పంతో ప్రతిపక్షాలతో జరిపిన చర్చలు ఒక  కొలిక్కి రాకముందే వెలువడిన కోర్టు నిర్ణయం సోనియా గాంధీ ప్రతిష్ఠపైన శరాఘాతం. 2014 ఎన్నికల నుంచి కాంగ్రెస్‌ పార్టీని వేధిస్తున్న శరపరంపరలో ఇది తాజాదీ, అత్యంత నష్టదాయకమైనదీ.

ఆదాయం పన్ను శాఖ (ఐటీ)ను ‘నేషనల్‌ హెరాల్డ్‌’కి సంబంధించిన అంశా లలో దర్యాప్తు చేయకుండా నిలువరించాలని అభ్యర్థిస్తూ యంగ్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (వైఐఎల్‌) కంపెనీ పెట్టుకున్న పిటిషన్‌ను కంపెనీ తరఫు న్యాయవాది, కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ మను సింఘ్వీ హైకోర్టు సూచన మేరకు ఉపసంహరించుకోగా పిటిషన్‌ను కొట్టివేసినట్టు కోర్టు ప్రకటించింది. ఫలితంగా ఈ కేసులో నిందితులైన కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, పార్టీ కోశాధికారి మోతీలాల్‌ వోరా, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌ ఫెర్నాండెస్, జర్నలిస్టు సుమన్‌ దుబే, సాంకేతిక శాస్త్ర ప్రవీణుడు శ్యామ్‌ పిత్రోడాల ఎదుట రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి, హైకోర్టు ఆదేశం శిరసా వహించి ఐటీ అధికారుల పరిశీలనను స్వాగతించడం. రెండు, సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవడం. రెండు మార్గాలూ కంటకప్రాయమైనవే.

సంస్థ లావా దేవీలను తెలిపే డైరీలనూ, పత్రాలనూ పరిశీలించే అవకాశం ఐటీ అధికారు లకు ఇస్తే వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. వెలిబుచ్చే సందే హాలను నివృత్తి చేయాలి. ఒక విషయం పరిశీలిస్తుంటే, దృష్టి కొత్త విష యంలోకి దారితీయవచ్చు. తవ్వినకొద్దీ కొత్త సమాచారం బయటపడవచ్చు. ఫలితం ఏదైనా కావచ్చు. సుప్రీంకోర్టుకు అప్పీలు చేసిన తర్వాత సర్వోన్నత న్యాయస్థానం అప్పీలును కొట్టివేస్తే అప్పుడైనా ఐటీ అధికారులను అనుమతిం చక తప్పదు. వారితో సహకరించకా తప్పదు. హైకోర్టు తీర్పు వల్ల హెరాల్డ్‌ విషయంలో అక్రమాలు జరిగాయనీ, వాటిలో సోనియా గాంధీకీ, రాహుల్‌కీ ప్రమేయం ఉన్నదనే అభిప్రాయం ప్రజలలో బలపడుతుంది. ఇటువంటి అభి ప్రాయం వాస్తవం కంటే బలమైనది (perception is more powerful than reality). అసలే కాంగ్రెస్‌ కార్యకర్తలు డీలాపడి ఉన్నారు. ప్రతిపక్షాల మధ్య ఐక్యత సాధించి ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించే క్రమంలో నాయకత్వ పాత్ర పోషిస్తున్న సోనియా గాంధీపైన అవినీతి ఆరోపణలు నిర్ధారణ కావచ్చు ననే అనుమానం సైతం ఆమె నాయకత్వాన్ని బలహీనపరుస్తుంది.

నెహ్రూ నుంచి రాహుల్‌ దాకా....
స్వాతంత్య్ర సమర సమాచారాన్ని దేశ ప్రజలకు తెలియజేయడానికీ, కాంగ్రెస్‌ పార్టీ వాణిని వినిపించడానికీ ఒక పత్రిక కావాలని స్వాతంత్య్ర సముపార్జనకు పూర్వమే జవహర్‌లాల్‌ నెహ్రూ తీర్మానించుకొని ‘నేషనల్‌ హెరాల్డ్‌’ పేపరును నెలకొల్పారు. ఈ పత్రికకు ఎక్కువ కాలం సంపాదక బాధ్యతలు సమర్థంగా నిర్వహించిన వ్యక్తి మహోన్నత పాత్రికేయుడు ఎం. చలపతిరావు. నెహ్రూ అన్నా, చలపతిరావు అన్నా నాకు ఎనలేని గౌరవం. పత్రికానిర్వహణ వ్యయంతో కూడిన పని. అధికార పార్టీకి చెందిన పత్రికను నిర్వహించడం ఇటీవలి కాలంలో సులువైంది. నెహ్రూ హయాంలో ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ సంస్థలు కానీ ‘నేషనల్‌ హెరాల్డ్‌’కు ప్రత్యేకంగా ప్రకటనల రూపంలో ఆదాయం సమకూర్చే ప్రయత్నం చేసేవికావు. ఆ పత్రిక నష్టాలలోనే నడిచింది.

హెరాల్డ్‌ను నిర్వహి స్తున్న సంస్థ అసోసియేట్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజెఎల్‌)కు ప్రభుత్వం ఢిల్లీలోని ప్రధాన కూడలిలో తక్కువ ధరకు స్థలం కేటాయించింది. అక్కడ నిర్మించిన భవనం నుంచే హెరాల్డ్‌ ప్రచురణ 2008 వరకూ సాగింది. ఈ పత్రిక నిర్వహ ణను ఇందిరా గాంధీ హయాంలో మహమ్మద్‌ యూనస్‌ పర్యవేక్షించేవారు. ఆ తర్వాత మోతీలాల్‌ వోరా. మూతపడేవరకూ పత్రికను నడిపేందుకు అవసర మైన నిధులను కాంగ్రెస్‌ పార్టీ వడ్డీలేని రుణంగా అందజేసింది. ఆ మొత్తం రూ. 90.26 కోట్లు.  ఇది కాంగ్రెస్‌ పార్టీకి ఏజెఎల్‌ చెల్లించవలసిన అప్పు. ఏజేఎల్‌లో వోరా, ఫెర్నాండెస్‌లు డైరెక్టర్లు. వోరాయే ఆ సంస్థకు అధ్యక్షుడు కూడా. ఈ వ్యవ హారంలో కాంగ్రెస్‌ మేధావులు ఒక ఎత్తుగడ వేశారు. యంగ్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెyŠ  పేరుతో ఒక కొత్త సంస్థను  నెలకొల్పారు. అందులో సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, వోరా, ఫెర్నాండెస్‌లు వాటాదారులు. సోనియా, రాహుల్‌కి చెరి 38 శాతం వంతున ఇద్దరికీ కలిపి 76 శాతం ఉన్నాయని ఒక వాదన. తల్లీకొడు కులకు కలిపి 86 శాతం ఉన్నాయని ఐటీ లెక్కలు సూచిస్తున్నాయి. ఐటీ శాఖ దగ్గర ఉన్న వివరాల ప్రకారం సోనియా, రాహుల్‌కి వైఐఎల్‌లో 83.3 శాతం వాటా ఉంది. వోరాకి 15.5 శాతం, ఫెర్నాండెస్‌కి 1.2 శాతం వాటా.

వైఐఏల్‌ ఆవిర్భావం, ఏజెఎల్‌ను ఆస్తులను కొత్త సంస్థ వాల్చుకున్న తీరూ సోనియా, తదితరులపైన ప్రైవేట్‌ క్రిమినల్‌ కేసు వేసేందుకు డాక్టర్‌ సుబ్రమణ్య స్వామికి అవకాశం ఇచ్చింది. వైఐఎల్‌ మూలధనం కేవలం రూ 5 లక్షలు. అంత తక్కువ పెట్టుబడితో నిర్మించిన సంస్థ కాంగ్రెస్‌ పార్టీకి రూ. 50 లక్షలు చెల్లిం చింది. ఏజెఎల్‌ కాంగ్రెస్‌కు కోట్లలో బకాయి ఉన్నది కనుక కాంగ్రెస్‌ పార్టీ ఏమి చేసిందంటే దానికి రావలసిన మొండి బకాయీని వసూలు చేసుకునే అధికారం వైఐఎల్‌కు దఖలు పరిచింది. అంటే, రూ 50 లక్షలు చెల్లించిన సంస్థకు రూ. 90.26 కోట్లు వసూలు చేసుకునే హక్కు ఇచ్చింది. అప్పు తీర్చలేక పోయింది కనుక ఏజెఎల్‌ సంస్థ వాటాలను వైఐఎల్‌ సంస్థకు బదలాయిస్తూ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకుంది. అంతవరకూ ఏజెఎల్‌ సంస్థలో వాటాదారులుగా కొనసా గిన 761 మందికీ కలిపి కొత్త సంస్థలో ఒకే ఒక శాతం వాటా దక్కింది. ఈ దశలో ఘటనాఘటన సమర్థుడు, హేమాహేమీలను లిటిగేషన్‌తో మట్టికరిపించిన అద్వితీయమైన మేధావి సుబ్రమణ్యస్వామి రంగప్రవేశం చేశారు. 2012లో సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ తదితరులను నిందితులుగా పేర్కొంటూ ప్రైవేట్‌ క్రిమినల్‌ కేసు దాఖలు చేశారు. సంస్థలలో వాటాల బదలాయింపు అంతవరకూ కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత వ్యవహారంగా పరిగణించిన సమాజం స్వామి వ్యాజ్యంతో భిన్న కోణంలో చూడటం ప్రారంభించింది. నిరుడు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సునీల్‌గౌర్‌ ఈ కేసును ‘ప్రత్యేకమైనది’ ('one of its kind') అంటూ అభివర్ణించారు.

సోనియాపై స్వామి ధ్వజం
ఏజెఎల్‌కు చెందిన ఆస్తులను కాజేయడానికి అడ్డదారులు తొక్కారంటూ సోనియా తదితరులపైన సుబ్రమణ్యస్వామి ఆరోపణ చేశారు. వైఐఎల్‌కి బదలా యించిన ఏజెఎల్‌ ఆస్తుల విలువ రూ. 2,000 కోట్ల వరకూ ఉంటుందని స్వామి అంచనా. ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలపైన వచ్చిన ఆరోప ణలు బలమైనవని న్యాయవాదులు అంటు న్నారు. ఈ  కేసును కక్ష సాధింపు చర్యగా కాంగ్రెస్‌ పార్టీ పరిగణించింది. కోర్టుకు హాజరు కానవసరం లేకుండా మినహాయింపు ఇవ్వాలని సోనియా బృందం పెట్టుకున్న అర్జీని అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఢిల్లీలోని పటియాలా హౌస్‌ కోర్టు (ట్రయిల్‌ కోర్టు)కు సోనియా, రాహుల్, వోరా, ఫెర్నాండెస్‌లు 2015 డిసెంబర్‌ 19న  హాజరైనప్పుడు కాంగ్రెస్‌  కార్యకర్తలు హంగామా చేశారు. నినాదాలు చేశారు. న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. పిత్రోడా దేశాంతరంలో ఉండటం వల్ల తర్వాత కోర్టుకు హాజరై బెయిల్‌ పొందారు.

రాహుల్‌ బెయిల్‌కు జామీను ప్రియాంక చెల్లించగా, సోనియా బెయిల్‌కు పూచీకత్తు మాజీ రక్షణ మంత్రి ఏకె ఆంటోనీ కట్టారు. ఇది న్యాయపరమైన అంశం అయినప్పటికీ మోదీ ప్రభుత్వం తమ నాయకులపైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ కాంగ్రెస్‌ సభ్యులు పార్లమెంటు శీతాకాల సమావేశాలలో చర్చ జరగకుండా చాలా రోజులు అడ్డుకున్నారు. ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు కూడా లేవు. వానా కాలం సమావేశాలు జులైలో జరుగుతాయి. ఇప్పుడు ఉన్నవి రాష్ట్రపతి ఎన్నికలు. ప్రతిపక్షాల తరఫున అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఈ కేసు ముందుకు రావడం విశేషం. కాంగ్రెస్‌తో సహకరిస్తున్న రాష్ట్రీయ జనతాదళ్, బహుజన్‌ సమాజ్‌ పార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్‌లు కూడా అవినీతి ఆరోపణలపైన కేసులు ఎదుర్కొంటున్నాయి. గడ్డి కుంభకోణంలో లాలూ పైన కేసు తిరగదోడా లని సుప్రీంకోర్టు నిర్ణయించింది. మాయావతి సోదరుడిపైనా, మాయావతిపైనా అవినీతి ఆరోపణల విచారణ తిరిగి ఎప్పుడైనా ప్రారంభం  కావచ్చు. నారదా కుంభకోణం, శారదా చిట్స్‌ అక్రమాలకు సంబంధించిన కేసుల దర్యాప్తుతో తృణ మూల్‌ కాంగ్రెస్‌ పార్లమెంటు సభ్యులూ, ఇతర నాయకులూ గిలగిలలాడుతు న్నారు. ఈ దశలో ప్రతి పక్షాలన్నీ ఒక్క తాటిపైన నిలిచి రాష్ట్రపతి ఎన్నికలలో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టి ఎన్‌డీఏ అభ్యర్థికి గట్టి పోటీ ఇవ్వడం కష్టం.

కాంగ్రెస్‌ వ్యూహాత్మక తప్పిదం
‘నేషనల్‌ హెరాల్డ్‌’ కేసులో దర్యాప్తును అడ్డుకోవడం వల్ల సోనియా గాంధీకి కానీ రాహుల్‌ గాంధీకి కానీ కాంగ్రెస్‌ పార్టీకి కానీ ప్రయోజనం ఉంటుందా? ఈ వ్యూహం వల్ల కాంగ్రెస్‌ పార్టీకీ, అధినాయకత్వానికీ నష్టమే కానీ లాభం లేదు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండగా జైన్‌ డైరీలో ఎల్‌కె అని రెండు పొడి అక్షరాలు ఉన్నాయనీ, అది లాల్‌కృష్ణ అడ్వాణీకి సంకేతమనీ ప్రభుత్వం పిటిషన్‌ వేసిన వెంటనే అడ్వాణీ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాను నిర్దోషి అంటూ న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాతనే మళ్ళీ ఎన్నికై సభలో అడుగు పెట్టారు. అంతే కానీ తన మీద విచారణ జరపరాదంటూ అడ్డుకునే ప్రయత్నం క్షణం కూడా చేయలేదు. ఇప్పుడు సోనియా ప్రభృతులు నడుస్తున్నది దశాబ్దా లుగా చంద్రబాబు నడిచిన బాటలోనే. జనం ఏమనుకుంటారు? నిజంగా నిర్దోషులైతే విచారణను అడ్డుకోవడానికి ఎందుకు తంటాలు పడతారు అని ప్రజలు ప్రశ్నించుకోరా? సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని డిమాండ్‌ చేయవలసిన సోనియా గాంధీ ఐటీ పరిశీలనను అడ్డుకునేందుకు కోర్టుల చుట్టూ తిరగడం ఆమెకు కానీ పార్టీకి కానీ శోభాయమానంగా ఉంటుందా? కేసు త్వరగా పరిష్కరించాలని బీజేపీ కోరుకోదు. అపరిష్కృతంగా ఉంటేనే ఈ కేసును అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చిన ఆరోపణలు చేయవచ్చు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలలో ప్రధాని మోదీ అదే పనిచేశారు.

యాదవ రాజ్యం కొన సాగాలంటే అఖిలేశ్‌కి ఓటేయండి అంటూ, అవినీతి రాజ్యం రావాలంటే మాయా వతికి ఓటేయండి అంటూ, స్వచ్ఛమైన ప్రజారాజ్యం కావాలంటే బీజేపీని గెలి పించాలంటూ బలంగా ప్రచారం చేసి మట్టి కరిపించారు. కాంగ్రెస్‌పైన అయి దేళ్ళుగా అవినీతి ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు. ఆరోపణలను సమర్థంగా తిప్పికొట్టలేక కాంగ్రెస్‌ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతూనే ఉన్నారు. అదే స్థితి 2019 లోనూ కొనసాగాలంటే ‘నేషనల్‌ హెరాల్డ్‌’ కేసులోనూ, ప్రియాంక భర్త రాబర్డ్‌ వద్రాపైన వచ్చిన భూకుంభకోణానికి సంబంధించిన కేసులోనూ దర్యాప్తు జర గకూడదనీ, కోర్టులో విచారణ సాగరాదనీ కాంగ్రెస్‌ కోరుకోవాలి. నిర్దోషిగా తేలి బీజేపీని దీటుగా ఎదుర్కొనే స్థాయికి వచ్చే ఎన్నికల నాటికి రావాలంటే కేసులపై సత్వర విచారణ జరిపించాలని ఉద్యమం చేయాలి. కాలం గడిచే కొద్దీ ప్రజలలో అనుమానాలు పెనుభూతాలై సోనియా, రాహుల్‌ నిజంగానే అవినీతికి పాల్ప డినట్టు బలంగా నమ్ముతారు. నేరం చేయకపోతే కోర్టు విచారణను ఎందుకు అడ్డుకుంటారనే మౌలికమైన ప్రశ్నకు కాంగ్రెస్‌ దగ్గర సమాధానం లేదు. అదే నరేంద్ర మోదీకి వరం.

కె. రామచంద్రమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement