ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటన జరిపి ఏడాది దాటుతుండగా ఆ దేశ ప్రధాని షింజో అబే భారత పర్యటనకు వచ్చారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలనూ మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. అందువల్లే ఇద్దరూ పాల్గొన్న విలేకరుల సమావేశంలో ‘భారత్ ఆర్థిక స్వప్నాలను జపాన్ అర్ధం చేసుకున్నంత బాగా మరే మిత్ర దేశమూ అర్ధం చేసుకోలేద’ని మోదీ వ్యాఖ్యానించి ఉండొచ్చు. అబే పర్యటన సందర్భంగా వివిధ రంగాల్లో 16 ఒప్పందాలపై సంతకాలయ్యాయి. మనతో పౌర అణు ఒప్పందం చేసుకోవడానికి జపాన్ సూత్రప్రాయంగా అంగీకరించింది. కొన్ని అవరోధాలు పరిష్కారం అయ్యాక దీనిపై తుది ఒప్పందం కుదురుతుంది.
ఢిల్లీ-అహ్మదాబాద్‌ల మధ్య నడిచే బుల్లెట్ రైలు కోసం రూ. 98,000 కోట్ల ప్యాకేజీతోపాటు ఆ రైలు ఏర్పాటుకు అవసరమైన సాంకేతిక సహకారం అందజేసేందుకు జపాన్ అంగీకరించింది. జపాన్ ఈ మధ్య ఆగ్నేయాసియా దేశాలన్నిటితో చెలిమిని దృఢపర్చుకుంటోంది. ఇదంతా యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదు. పొరుగునున్న చైనా కొన్నేళ్లుగా ఆర్ధిక రంగంలో పెను వేగంతో ఎదుగుతూ...సైనికంగా ఆధిపత్య ధోరణుల్ని ప్రదర్శిస్తున్న వేళ జపాన్ దానికి దీటైన వ్యూహంతో ఈ అడుగులేస్తున్నది. అలాగని ఆ రెండు దేశాలూ ఇప్పటికిప్పుడు బాహాబాహీకి దిగటం లేదు. ఆ రెండు దేశాలకూ మధ్య తూర్పు చైనా సముద్రంలోని ఏడెనిమిది చిన్న చిన్న దీవుల విషయంలో తగాదాలున్నాయి. ఈ విషయంలో జపాన్‌కు అమెరికా వెన్నుదన్నుగా నిలుస్తున్న తీరులో సహజంగానే చైనా ప్రమాదాన్ని శంకిస్తున్నది. అదే సమయంలో చైనా, జపాన్‌లు రెండూ కరచాలనాలు చేసుకుంటున్నాయి.
పారిస్‌లో నాలుగు రోజులనాడు ముగిసిన ప్రపంచ వాతావరణ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ షింజోతో కొద్దిసేపే అయినా సంభాషించారు. ఇరు దేశాల ‘ఉమ్మడి ప్రయోజనాల’ గురించి మాట్లాడటం మాత్రమే కాదు... ఇప్పుడు నెలకొన్న ‘అనుకూల వాతావరణాన్ని’ రెండు దేశాలూ మరింత పెంచుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. నిరుడు బీజింగ్‌లో జరిగిన ఎపెక్ దేశాల శిఖరాగ్ర సదస్సును దృష్టిలో పెట్టుకుని జిన్‌పింగ్ ఈ మాటలన్నారు. మనకు కూడా చైనాతో సరిహద్దులకు సంబంధించి సమస్యలున్నాయి. అయినా సరే వ్యాపార, వాణిజ్య రంగాల్లో సహకారం నానాటికీ విస్తరిస్తున్నది.
దౌత్యం అనేది ఎంతో మెలకువతో వ్యవహరించాల్సిన రంగం. ఇక్కడ కేవలం మిత్రులో, శత్రువులో మాత్రమే ఉండరు. దేనికైనా అవసరాలు, ప్రయోజనాలు వంటివి కీలకపాత్ర పోషిస్తాయి. అస్థిరత, ప్రమాదం నిరంతరం పొంచివుండే వర్తమాన ప్రపంచంలో అప్పటికున్న పరిస్థితులనుబట్టి, దీర్ఘకాలం ప్రభావం చూపగలవనుకునే పరిణామాలనుబట్టి అన్ని దేశాలూ తమ తమ ఎత్తుగడలను రూపొందించుకుంటాయి. ఒకరికొకరు సన్నిహితంగా ఉంటూనే పోటీకి దిగడం, స్వీయప్రయోజనాల రక్షణకు ప్రయత్నించడం దౌత్యంలో సర్వసాధారణం. చైనా, జపాన్‌లు ఒకపక్క కలహించుకుంటూనే కలుసుకుని ముచ్చట్లాడుతుంటే మన దేశమూ, జపాన్ సన్నిహితం కావడంలో వింతేమీ లేదు. నేర్పుగా వ్యవహరిస్తే చైనా-జపాన్‌లమధ్య నెలకొని ఉన్న సమస్యలు, వాటి మధ్య పెరుగుతున్న పోటీ మన దేశానికి ఉపయోగపడే అంశాలుగా మారతాయి. భారత్, జపాన్‌ల చెలిమిలో రెండు దేశాలకూ పరస్పర ప్రయోజనాలున్నాయి. జపాన్‌వద్ద పుష్కలంగా నిధులున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం ఉంది. ఈ రెండింటి అవసరమూ మన దేశానికి ఎంతో ఉంది. అటు జపాన్ కోణంనుంచి చూస్తే జనాభా, విస్తీర్ణాలతోపాటు భవిష్యత్తులో శక్తిమంతంగా తయారు కాగల అవకాశమున్న దేశంగా అది భారత్‌ను గుర్తిస్తోంది. ఇలాంటి దేశంతో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకుంటే తమకు అన్నివిధాలా మేలు జరుగుతుందని జపాన్ భావిస్తోంది.
అయితే ఈ సాన్నిహిత్యాన్ని చైనా అంత తేలిగ్గా చూడలేదు. ఆ రెండు దేశాలూ అమెరికాతో కలిసి ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో తన ఎదుగుదలను అరికట్టే ప్రయత్నాలు చేస్తాయేమోనన్న శంక చైనాకు ఓ మూల ఉండనే ఉంది. దక్షిణ చైనా సముద్రంలో ఇటీవలికాలంలో పెరిగిన అమెరికా దూకుడును అది కనిపెడుతూనే ఉంది. ఈ విషయమై భారత్-జపాన్ ఉమ్మడి ప్రకటన చేసిన ప్రస్తావన గమనార్హమైంది. ‘ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచే ఏకపక్ష చర్యలను అన్ని పక్షాలూ నిలిపేయాల’ని అది అన్ని పక్షాలనూ కోరింది. దాని అంతరార్ధమేమిటో చైనాకు ఎరుకే. అమెరికా-జపాన్‌ల వ్యూహంలో భారత్ కూడా భవిష్యత్తులో భాగం కావచ్చునని చైనా ఎప్పటినుంచో అనుకుంటున్నది.
జపాన్ మన దేశంతో పౌర అణు ఒప్పందం చేసుకోవడానికి సంసిద్ధత తెలియపరచడం సాధారణ విషయం కాదు. 1998లో పోఖ్రాన్ అణు పరీక్షలనాటి నుంచీ అది మన దేశానికిచ్చే సాయాన్ని గణనీయంగా ఆపేసింది. 2010లో పౌర అణు ఇంధన ఒప్పందంపై చర్చలు ప్రారంభమైనా 2011లో జపాన్‌లోని ఫుకుషిమా అణు విద్యుత్ కర్మాగారంలో సంభవించిన పేలుడు తర్వాత అవి కాస్తా నిలిచిపోయాయి. రెండేళ్లక్రితం అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్, అబేల సమావేశం తర్వాత చర్చలు పునఃప్రారంభమయ్యాయి. రక్షణ రంగానికి సంబంధించి విధించుకున్న స్వీయ పరిమితులను సడలించుకుంటూ ఇటీవల జపాన్ తన చట్టాలను సవరించుకున్నాక సైనిక పరికరాలు, సాంకేతిక విజ్ఞానంవంటివి విక్రయించడానికి ఆ దేశం ఉత్సాహం చూపుతోంది. కనుక ఇప్పుడు కుదిరిన రక్షణ ఒప్పందం భవిష్యత్తులో మరింతగా విస్తరించే అవకాశం ఉంది.
మొత్తానికి భారత్-జపాన్‌లు వ్యూహాత్మకంగా మరింత దగ్గరయ్యాయి. అటు చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకుంటూనే... ఆ దేశంతో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తూనే జపాన్‌తో చెలిమిని విస్తరించుకోవడం చాకచక్యంతో చేయాల్సిన పని. అలా చేసినప్పుడే మన ప్రయోజనాలు సంపూర్ణంగా నెరవేరతాయి.