అమెరికన్ ఆదివాసుల నినాదం ‘నీళ్లే ప్రాణం’ | standing rock reservation and environment moments | Sakshi
Sakshi News home page

అమెరికన్ ఆదివాసుల నినాదం ‘నీళ్లే ప్రాణం’

Published Sun, Dec 4 2016 12:57 AM | Last Updated on Thu, Apr 4 2019 3:48 PM

అమెరికన్ ఆదివాసుల నినాదం ‘నీళ్లే ప్రాణం’ - Sakshi

అమెరికన్ ఆదివాసుల నినాదం ‘నీళ్లే ప్రాణం’

అభిప్రాయం
 
ప్రపంచం నలుమూలలా అభివృద్ధి పేరిట భూమి స్వరూపమే మారిపో తోంది. ఒకవైపు సముద్రాలు ఎడార్లవు తుంటే, మరోచోట పచ్చని పంట పొలాలు ముంపుకు గురౌతున్నాయి, లేదా కాంక్రీటు జంగిల్స్ అవుతున్నాయి. భూమిని, గాలిని, నీటిని కలుషితం చేస్తున్న కార్పొరేషన్లపై, నిరంకుశ ప్రభు త్వాలపై ప్రజలు తిరగబడుతున్నారు. అమెరికా అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఆదివాసీలకు పోరాటం తప్ప మరో మార్గం లేదని జరుగుతున్న ఘటనలు రుజువుగా నిలుస్తూనే ఉన్నాయి.
 
ఏ దేశాన్నైనా శాసించగలిగే అమెరికాలో ఓ మారుమూల గ్రామంలో ‘‘నీళ్ళే ప్రాణం’’ అంటూ నినదిస్తూ ఆదివాసి (నేటివ్ అమెరికన్) ప్రజలు పోరాడుతున్నారు. నార్త్ డకోట రాష్ట్రంలో, లకోట, డకోట తెగ ప్రజలకు చెందిన ‘స్టాండిగ్ రాక్’ రిజర్వేషన్ ఉంది.  లకోట, డకోట అంటే ఆ భాషల్లో ‘మిత్రులు, బంధువులు’ అని అర్థం. అమెరికా ప్రభుత్వం ఈ నేటివ్ అమెరికన్ తెగ ప్రజ లతో 1868లో చేసుకున్న ఒప్పందం ప్రకారం నార్త్ డకోటా, సౌత్ డకోటా రాష్ట్రాల్లోని మిస్సౌరి నదికి పడమర ఉన్న భూభాగాన్ని, మిస్సౌరి నదిని కేటాయించింది. కానీ, మరో రెండేళ్లకే 1870ల్లో బ్లాక్ హిల్స్ (ఇప్పటి రష్ మూర్ హిల్స్) కొండల్లో బంగారం బయటపడడంతో అమెరికా ప్రభుత్వం ఆ పర్వత ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. అప్పుడప్పుడు ప్రైవేట్ సంస్థలకు అమ్ముతూ కొంచెం కొంచెంగా రిజర్వేషన్ భూమిని ఆక్రమిస్తూనే ఉంది.
 
ఆ తెగ ప్రజలు తమకు మిగిలిన ప్రాంతంలో నివాసాలు ఏర్ప రుచుకుని, మెల్లగా వ్యవసాయం, వ్యాపారాలు మొదలు పెట్టారు. చుట్టుపక్కల కొన్ని టౌన్లు ఏర్పడ్డాయి. కానీ అమెరికా ప్రభుత్వం 1968లో మిస్సౌరి నదికి డ్యామ్ కట్టడంతో  కొన్ని టౌన్లు, ఎన్నో వందల ఎకరాల పంట భూములు మునిగిపోయాయి. ప్రజలు ఆ నష్టం నుంచి ఇంకా తేరుకోకముందే రిజర్వేషన్‌కు కొంచెం ఎగు వన మిస్సౌరీ నది అడుగు నుంచి డకోట ఆక్సెస్ ఆయిల్  పైప్‌లైన్ వేద్దామని సంకల్పించింది ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ పార్టనర్స్(Energy Transfer Partners) అనే కంపెనీ. ఈ రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతంలో వెలికి తీసిన చమురును శుద్ధి చేయడానికి 1,170 మైళ్ల దూరంలో ఉన్న ఇల్లినాయిస్(Illinois) రాష్ట్రానికి తరలించాలని ఈ పైపులైన్ నిర్మిస్తున్నారు.

రోజుకు 570,000 బ్యారెల్స్  చమురు పైప్ లైన్ ద్వారా సరఫరా అవుతుంది. లకోట తెగకు చెందిన పూర్వీకుల సమాధుల గుండా, చారిత్రిక స్థలాల గుండా ఈ పైప్ లైన్ సాగుతుంది. పవిత్ర స్థలాలను పోగొట్టుకోవడమే కాకుండా పైప్‌లైన్‌లో ప్రమాదం జరిగితే రిజర్వేషన్‌కు, దిగువన మరో పది లక్షల మందికి జీవనాధారమైన నది నీళ్లు కలుషితమౌతాయని, ప్రజలు పైప్‌లైన్‌ను అడ్డగిస్తూ ప్రతిఘటిస్తున్నారు. ఇన్నేళ్ల అణచివే తని ఇక సహించేది లేదని తిరగబడ్డారు.
 
పర్యావరణ ఉద్యమాల గురించి ఇప్పుడిప్పుడే తెలుసు కుంటూ ఉండడం వలన ఆ ఉద్యమకారులకు నా మద్ధతునివ్వా లని ఉద్యమం జరుగుతున్న ప్రదేశానికి వెళ్లాను. అక్కడంతా నేటివ్ అమెరికన్లే ఎక్కువ ఉన్నారు. అమెరికా నలుమూలల నుంచి దాదాపు 300 నేటివ్ అమెరికన్ తెగ ప్రజలు ఇక్కడికి వచ్చారని తెలిసి ఆశ్చర్యపోయాను. వందలకొద్దీ డేరాలతో ఒక ఊరులా కని పించింది ఆ ప్రదేశం. నేటివ్ అమెరికన్ తెగలు ఇంత పెద్ద ఎత్తున తరలి రావడం ఇదే మొదటిసారి. దక్షిణ అమెరికా,  న్యూజిలాండ్ దేశాల నుంచి కూడా కొంతమంది ఆదివాసి తెగలవారు వచ్చారు. ప్రపంచ ఆదివాసి తెగలందరికీ ముఖ్య సమస్య లైన నీళ్లు, పర్యావ రణం, మనుగడ అనే అంశాలపై వారు కలసి పోరాడుతున్నారు. ఈ ప్రాంతం చలికాలంలో మంచుతో గడ్డకట్టిపోతుంది. మంచు తుపాన్లు పెద్ద ఎత్తున చెలరేగుతాయి ఎలా ఉండగలుగు తారు ఇక్కడ అని అడిగాను. మంచుతుపాన్లను తమ పూర్వీకులు ఎలా ఎదుర్కొన్నారో అలాగే ఎదుర్కొంటామని, నార్త్ డకోట పోలీసులకంటే, ప్రభుత్వం కంటే క్రూరమైనవి కావు మంచు తుపాన్లు అని బదులిచ్చారు.
 
భారతదేశంలోనూ ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఛత్తీస్ గఢ్‌లోని బస్తర్ జిల్లాలో బొగ్గు, ఇనుము, వజ్రాలు వంటి విలువైన ఖనిజాల తవ్వకాల కోసం ఆదివాసీ తెగల మీద హింసాత్మక దాడులు జరుగుతున్నాయి. అణు ప్రమాదాల గురించి తెలిసి కూడా శ్రీకాకుళం జిల్లాలోని కొవ్వాడ పరిసరాల్లో ఆరు అణు రియాక్టర్లు కట్టడానికి ప్రణాళిక సిద్ధమౌతోంది. కడప జిల్లాలో పులివెందులలో యురేనియం మైనింగ్ ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. స్థానిక ప్రజల ఉద్యమాలను నిరంకుశ ప్రభు త్వాలు, దురాశపరులైన కాంట్రాక్టర్లు, కంపెనీలు అణచివేస్తు న్నాయి. అయితే అది స్థానిక ప్రజల సమస్య మాత్రమే కాదు.

మానవుడి చర్యల వలన పర్యావరణంలో మార్పులు సామాన్య ప్రజలకే రెండు మూడేళ్లనుంచి కొట్టొచ్చినట్లు తెలిసిపోతోంది. దారుణాలు, ఘోరాలు ఎక్కడో జరుగుతున్నాయి, మనకెందుకు అని నిర్లక్ష్యంగా ఉండలేం. ప్రకృతి ఎంత అందమైనదో, సున్నిత మైనదో అంతే భీకరంగా ఎదురుతిరగగలదని తెలియచెప్పే ఉదా హరణాలు ఎన్నో ఉన్నారుు. ఇంతవరకూ మనకు ప్రాణాన్నిచ్చిన భూమిని మన ముందు తరాలకోసం కాపాడుకోవలసిన బాధ్యత మన అందరి మీదా ఉంది.

మమత కొడిదెల
వ్యాసకర్త పర్యావరణ కార్యకర్త
ఈ-మెయిల్ : mamatha7621@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement