అన్నదాతకు ‘సుప్రీం’ అండ
మేం చేయాల్సిన పనుల్లో న్యాయవ్యవస్థ జోక్యం పెరిగిందని తరచుగా ప్రభు త్వాలు ఆరోపిస్తాయి. ఈమధ్య పార్లమెంటులో సైతం ఇలాంటి విమర్శలే వినిపిం చాయి. కానీ అక్కడికి కూతవేటు దూరంలో జంతర్‌మంతర్ దగ్గర దాదాపు నెల రోజులుగా ఆందోళన సాగిస్తున్న తమిళనాడు రైతుల ఘోషను మళ్లీ సుప్రీంకోర్టే పట్టించుకోవాల్సివచ్చింది. వారి కోసం ఏమీ చేయలేరా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సివచ్చింది. ఇంతవరకూ చేసిందేమిటో వచ్చే నెల 2లోగా వివరాలు దాఖలు చేయాలని న్యాయస్థానం కోరింది. ఒక పిటిషన్‌పై విచారణ సందర్భంగా గురువారం ధర్మాసనం వ్యక్తపరిచిన ఆవేదన గమనించదగ్గది.
జల్లికట్టు నిషేధం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఎంత చురుగ్గా కదిలాయో, సుప్రీంకోర్టు ఉత్తర్వులను వమ్ము చేయడానికి ఎలా తాపత్రయపడ్డాయో అందరికీ తెలుసు. ఓట్లతో ముడిపడి ఉండే ఏ సమస్య విషయంలోనైనా ప్రభుత్వాలు చూపే ఆదుర్దా మిగిలిన అంశాల్లో గల్లంతుకావడమే మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం. తమిళనాడు ప్రభుత్వం సంగతలా ఉంచి బుధవారంతో ముగిసిన పార్లమెంటు సమావేశాలకు సైతం తమిళ రైతుల గోడు పట్టలేదు. చాన్నాళ్ల తర్వాత తొలిసారి అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభ సమావేశాలు ఫలవంతంగా ముగిశాయని విశ్లేషకులు విడుదల చేసిన లెక్కలు చెబుతున్నాయి.
కీలకమైన సరుకులు, సేవల పన్ను (జీఎస్‌టీ) బిల్లుతో సహా 21 బిల్లుల్ని పార్లమెంటు ఆమోదించింది. మరెన్నిటినో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎయిర్ ఇండియా ఉద్యోగిపై దౌర్జన్యం చేసిన తమ ఎంపీని విమానాల్లో ఎక్కనీయక పోవడంపై ఆగ్రహించిన శివసేన లోక్‌సభలో దాదాపు మళ్లీ అలాంటి పరిస్థితుల్నే సృష్టించి ఆ నిషేధాన్ని తొలగింపజేసుకుంది. కానీ తమిళనాడు రైతుల గోడు మాత్రం కంఠ శోషగానే మిగిలిపోయింది. వారి ఆందోళనపై తమకు సానుభూతి ఉన్నదని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని కేంద్రం నుంచిగానీ, పార్లమెంటునుంచి గానీ రైతులకు హామీ లభించలేదు. వాస్తవం ఇలా ఉన్నప్పుడు పార్లమెంటు సమావేశాలు ఎంత గొప్పగా జరిగి ఏం లాభమని తమిళ రైతులనుకుంటే అది వారి తప్పు కాదు.
తమిళనాడులో మాత్రమే కాదు... దేశంలో ప్రతి రైతూ ఎంతటి దుర్భర స్థితిలో సాగు యజ్ఞాన్ని సాగిస్తున్నాడో పాలకులకు తెలియనిదేమీ కాదు. నానా టికీ పెరుగుతూ పోతున్న సాగు వ్యయం ఒకపక్క, అంతకంతకూ దిగజారుతున్న దిగుబడి ధరలు మరోపక్క రైతును కుంగదీస్తుంటే... పగబట్టినట్టు వ్యవహ రిస్తున్న ప్రకృతి వారిని ఊపిరాడకుండా చేస్తోంది. దీంతో బ్యాంకులకు వేలకు వేలు బకాయిలు పడటం, వడ్డీతోసహా చెల్లించాలని తాఖీదులు రావడంతో దిక్కుతోచక వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత నూటయాభై సంవ త్సరాల్లో కనీవినీ ఎరుగనంత స్థాయిలో అక్కడ కరువు విలయతాండవం చేస్తోంది. ఆ ప్రాంతానికి ప్రాణప్రదమైన ఈశాన్య రుతుపవనాలు వరసగా మూడో ఏడాది కూడా రైతులను దగా చేశాయి.
ఈశాన్య రుతు పవనాల వర్షపాతంలో 62 శాతం లోటున్నదంటే పరిస్థితులెలా ఉన్నాయో అంచనా వేసుకోవచ్చు. నిజానికి 2012–13లో కూడా ఇలాంటి స్థితి వారికెదురైంది. కానీ అప్పట్లో మెట్టూరు డ్యాంనుంచి దాదాపు మూడు నెలలపాటు ప్రభుత్వం నీరందించడంవల్ల పంటల్ని రైతులు కాపాడుకోగలిగారు. కానీ ఈసారి ఆ డ్యాంలో సైతం నీరు తక్కువుంది. అటు సుప్రీంకోర్టు ఎన్నిసార్లు కర్ణాటక రాష్ట్రానికి ఆదేశాలిచ్చినా ఆ డ్యాంకు కావేరీ నదీజలాలు విడుదల కాలేదు. ఫలితంగా తమిళనాడులో కాల్వలు సైతం ఎండిపోయి పంట పొలాలకు చుక్క నీరు లేకుండా పోయింది. వేలకు వేలు అప్పు తెచ్చి తాము వేసిన పంటలు కళ్లముందు ఎండిపోతుంటే, పశువులు సైతం దాహార్తికి ప్రాణాలు విడు స్తుంటే నిస్సహాయులైన రైతులు ఏం చేయాలి? తమ గోడు ఎవరికీ పట్టడం లేదన్న ఆవేదనతో ఇప్పటివరకూ 50మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
వాస్తవానికి ఈ ఏడాది మొదటినుంచే వారు ఆందోళన బాటపట్టారు. చివరకు దేశ రాజధాని నగరంలో తమ గోడు వినిపిద్దామని జంతర్‌మంతర్‌కు చేరుకున్నారు. బలవన్మరణాలకు పాల్పడిన రైతుల కపాలాలను ప్రదర్శించారు. అర్ధనగ్నంగా ఊరేగింపు తీశారు. ప్రధాని నరేంద్ర మోదీ వద్ద తమ గోడు వినిపించడం సాధ్య పడలేదన్న ఆగ్రహంతో చివరకు ప్రధాని కార్యాలయం ముందు బట్టలు విప్పు కుని నిరసన తెలిపారు. ఎన్ని చేసినా వారి ఆందోళన పాలకుల్ని తాకలేక పోయింది... ఎంత విషాదం! చిత్రమేమంటే, అసెంబ్లీ ఎన్నికలొచ్చిన ఉత్తర ప్రదేశ్‌లో రైతులకు అడగకపోయినా బీజేపీ పెద్ద మనసు చేసుకుని మేనిఫెస్టోలో రుణమాఫీ ప్రకటించింది. అందువల్ల ఆ పార్టీకి అక్కడ అధికారం దక్కింది. ఎన్నికలు ఇప్పట్లో లేని తమిళనాట సరిగ్గా అదే డిమాండ్‌తో అరచి గీపెట్టినా, ఢిల్లీ వీధులకెక్కినా ఫలితం లేకపోయింది. ఏమనాలి దీన్ని?
రైతులు అడుగుతున్నవి గొంతెమ్మ కోర్కెలేమీ కాదు. రుణమాఫీ చేయాలం టున్నారు. కావేరీ నదీజలాల బోర్డు ఏర్పాటు చేయమంటున్నారు. నదుల అను సంధానం అవసరమంటున్నారు. కొంత హెచ్చుతగ్గులతో దేశమంతా వ్యవ సాయ సంక్షోభం ఆవరించి ఉంది. అందరికీ అన్నం పెట్టే రైతన్న అర్థాకలితో బతు కీడుస్తున్నాడు. తన గోడు వినేవారు లేరని తల్లడిల్లుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేసి గద్దెనెక్కిన పాలకులు దాన్ని అరకొరగానే కానిచ్చారు. నిజానికిది ఎన్నికలతో ముడిపెట్టి ఆలోచించాల్సిన సమస్య కాదు. మొత్తంగా వ్యవసాయంపై పాలకుల ఆలోచనా సరళి మారితే తప్ప పరిష్కారం కానిది. కేవలం ఆ సమస్యపై కూలంకషంగా చర్చించడానికి పార్లమెంటు, అసెం బ్లీలు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలి. ఏం చేస్తే సమస్యను అధిగమించ వచ్చునో గుర్తించాలి. నిర్దిష్టమైన కాలావధితో కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయాలి. దీన్ని అత్యవసర సమస్యగా పరిగణించి పరిష్కారానికి పూనుకోనట్ట యితే పరిస్థితి చేయి దాటుతుందని పాలకులు గ్రహిస్తారని ఆశిద్దాం.