సెలవులకు ‘సెలవు’ | Supreme Court takes a break from summer holidays | Sakshi
Sakshi News home page

సెలవులకు ‘సెలవు’

Published Sat, Apr 1 2017 4:24 AM | Last Updated on Sun, Sep 2 2018 5:28 PM

సెలవులకు ‘సెలవు’ - Sakshi

సెలవులకు ‘సెలవు’

ఈసారి కీలకమైన కేసుల విచారణ కోసం వేసవి సెలవులను త్యాగం చేయాలని నిర్ణయించడం ద్వారా సుప్రీంకోర్టు కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది.

ఈసారి కీలకమైన కేసుల విచారణ కోసం వేసవి సెలవులను త్యాగం చేయాలని నిర్ణయించడం ద్వారా సుప్రీంకోర్టు కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. దాదాపు 50 రోజులుండే వేసవి సెలవు దినాల్లో అత్యవసర కేసుల పరిశీలన కోసం రెండు ధర్మాసనాలు పనిచేయడం ఎప్పటినుంచో ఉన్నదే. ఈ ధర్మాసనాల్లో ఉండే నలుగురు న్యాయమూర్తులు తప్ప మిగిలినవారు వేసవి సెలవులు వినియోగించుకుంటారు. సాధారణ కేసులు మాత్రం వేసవి సెలవులు పూర్తయ్యాకే విచారణకొస్తాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ ఖేహార్‌ ఈసారి అలాంటి సమస్య లేకుండా చూశారు. ఈ నిర్ణయం పర్యవసానంగా ప్రస్తుతం ఉన్న 28మంది న్యాయ మూర్తుల్లో 19మంది వేసవిలో పనిచేస్తారు. అంతేకాదు... అవసరమని భావిస్తే వారు శని, ఆదివారాల్లో కూడా కేసులు వింటారు. ఇది అసాధారణమనే చెప్పాలి.

జస్టిస్‌ ఖేహార్‌ నిర్ణయం మింగుడు పడనివారూ ఉన్నారు. ముఖ్యంగా సీనియర్‌ న్యాయవాదులు దీన్ని అంగీకరించడం లేదు. వేసవి సెలవుల్లో పనిచేయడంపై వారి కుండే అభ్యంతరం సంగతలా ఉంచి రాజ్యాంగపరంగా అత్యంత కీలకమైన మూడు కేసుల్ని వేర్వేరు ధర్మాసనాలు సమాంతరంగా వినడమేమిటని కూడా వారు ప్రశ్నిస్తు న్నారు. ఇందులో తలాక్‌ పద్ధతిలో విడాకులివ్వడం, బహుభార్యత్వం తదితర అంశాలకు సంబంధించిన కేసు ఒకటి కాగా, భారత పౌరులు పంపుకునే వాట్సాప్‌ సందేశాలను ఫేస్‌బుక్‌ తెలుసుకోవడం పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలి గించడమా కాదా అనేది మరో కేసు. మూడోది– దేశంలో చట్టవిరుద్ధంగా ఉంటున్న వారికి ఇక్కడ సంతానం కలిగితే ఆ పుట్టినవారికి పౌరసత్వం ఇవ్వొచ్చునా లేదా అనేది. మూడు ధర్మాసనాలూ వేర్వేరుచోట్ల ఏకకాలంలో ఈ కేసుల్ని విచారిస్తుంటే సహజంగానే సీనియర్‌ న్యాయవాదులకు అది సమస్య అవుతుంది. వారు ఏదో ఒక కేసులో మాత్రమే తమ వాదనలు వినిపించగలుగుతారు. అందుకే అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ సైతం ఇలా సమాంతరంగా మూడు కేసులనూ విచారించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. చివరకు ఈ అంశంలో ప్రధాన న్యాయమూర్తి ఏ నిర్ణయం తీసు కుంటారన్న సంగతలా ఉంచి కేసుల విచారణ కోసం వేసవి సెలవుల్ని తగ్గించు కోవడమన్నది అసాధారణం.

న్యాయస్థానాల్లో కేసులు ఏళ్లకొద్దీ పెండింగ్‌ పడుతున్నాయన్న ఆదుర్దా ఎప్పటి నుంచో ఉన్నదే.  సమస్య తీవ్రంగా ఉన్నా న్యాయస్థానాలు తమ సెలవు దినాలను తగ్గించుకోవడంలేదని తరచు విమర్శలు రావడం... వాటిని న్యాయమూర్తులు పెద్దగా పట్టించుకోకపోవడం కూడా మామూలే. ఎవరి వరకో ఎందుకు... ప్రధాని నరేంద్ర మోదీ నిరుడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో సుదీర్ఘ కాలం సెలవులు తీసుకునే విధానాన్ని ప్రశ్నించారు. లక్షలాది కేసులు పెండింగ్‌ పడుతున్నా యని వాపోయే న్యాయస్థానాలు సెలవుల్ని తగ్గించుకునే ఆలోచన చేయాలని హితవు పలికారు. జస్టిస్‌ ఖేహార్‌కు ముందు పనిచేసిన జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ వేసవిలో కొన్ని హైకోర్టులు పనిచేసేలా చూడగలిగారు గానీ సీనియర్‌ న్యాయ వాదులనుంచి వ్యతిరేకత రావడంతో సుప్రీంకోర్టులో ఆ విధానాన్ని ప్రవేశపెట్టలేక పోయారు. జస్టిస్‌ ఖేహార్‌ మాత్రం ఇందుకు భిన్నంగా వారి అభ్యంతరాలను బేఖా తరు చేస్తున్నట్టే కనబడుతోంది.  

మన దేశంలో విద్యాసంస్థలు తప్ప మిగిలినవన్నీ వేసవిలో యధావిధిగా పని చేస్తాయి. కానీ న్యాయస్థానాలు ఇందుకు భిన్నం. బ్రిటిష్‌ పాలనాకాలంలో ఉన్న సెలవుల సంప్రదాయాన్ని అవి విడనాడలేదు. సుప్రీంకోర్టుకు వేసవి సెలవులొక్కటే కాదు... హోలీ, దీపావళి, దసరాలకు వారం చొప్పున సెలవులుంటాయి. వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో 2014లో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎం లోధా పది వారాలుండే వేసవి సెలవుల్ని ఏడు వారా లకు తగ్గించారు. ఇది కూడా విమర్శకులను సంతృప్తిపరచలేకపోయింది. ప్రభుత్వ కార్యాలయాలన్నీ వేసవిలో పనిచేస్తున్నప్పుడు సుప్రీంకోర్టుకు మాత్రం ఈ వెసులు బాటు ఎందుకన్నదే వారి ప్రశ్న. ఉన్నత న్యాయస్థానాలకు ఇప్పుడున్న సెలవుల్లో 10 నుంచి 15 రోజులు కోత పెట్టాలని 2009లో లా కమిషన్‌ నివేదిక కూడా సూచిం చింది. సుప్రీంకోర్టుకు మాత్రమే కాదు... ఇతర కోర్టులకు కూడా సెలవులు బాగానే ఉన్నాయి. హైకోర్టులు ఏడాదికి 210 రోజులు, కింది కోర్టులు ఏడాదికి 245 రోజులు పనిచేస్తాయి. అయితే ఉన్నత న్యాయస్థానాలకు సెలవులుండటం సబబేనని చెబు తున్నవారి వాదనలు వేరేలా ఉన్నాయి. పేరుకు సెలవులు తీసుకున్నట్టే ఉంటుం దిగానీ తాము విచారిస్తున్న కేసులకు సంబంధించి న్యాయమూర్తులు అనేక అంశా లను అధ్యయనం చేయవలసి వస్తుందని, దేశంలోనూ, విదేశాల్లోనూ గతంలో వెలు వడిన తీర్పుల్లోని పలు విషయాలను కూలంకషంగా పరిశీలించవలసి ఉంటుందని వారంటారు. సెలవుల్లేకుంటే ఇలా నిశిత పరిశీలన సాధ్యపడదన్నది వారి వాదన.


సెలవుల మాటెలా ఉన్నా న్యాయస్థానాల్లో కేసులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో పడిపోతున్నాయన్నది నిజం. న్యాయమూర్తుల సంఖ్య తగినంతగా ఉంటే, వారు పరిష్కరించాల్సిన కేసుల సంఖ్య తక్కువుంటే ‘సెలవుల సమస్య’ కూడా తీరే అవకాశం ఉంటుంది. మన దేశంలో పది లక్షలమందికి సగటున పది మంది న్యాయమూర్తులుంటే అమెరికాలో ఈ సంఖ్య 107! పైగా అక్కడి న్యాయమూర్తులు ఏడాదికి పరిష్కరించే కేసులు 81 అయితే... మన దేశంలో 2,600! జనాభాకు తగి నట్టు న్యాయమూర్తుల సంఖ్య పెంచాల్సి ఉండగా ఉన్న ఖాళీలను భర్తీ చేయడమే మహద్భాగ్యమన్నట్టు మారింది. సుప్రీంకోర్టులో 60,000 కేసులు పెండింగ్‌లో ఉండగా, హైకోర్టుల్లో దాదాపు 39 లక్షల కేసులు అతీగతీ లేకుండా ఉంటున్నాయి. కింది కోర్టుల్లో మరింత భయానక స్థితి. అక్కడ దాదాపు 3.5 కోట్ల కేసులు తేలాల్సి ఉంది. కేసుల జాప్యం వల్ల బాధితులవుతున్నవారు సామాన్య పౌరులే గనుక వారి ప్రయోజనాల పరిరక్షణను దృష్టిలో ఉంచుకునే దేనిపైన అయినా నిర్ణయం తీసు కోవాలి. ఆ దిశగా మరిన్ని మెరుగైన చర్యలు తీసుకోవడానికి సుప్రీంకోర్టు తాజా నిర్ణయం దోహదపడితే మంచిదే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement