'పూర్తిగా సన్నద్ధమై.. అమెరికాకు రండి'
వాషింగ్టన్: అమెరికాలో విద్యను అభ్యసించేందుకు వచ్చే భారతీయ విద్యార్థులు.. పూర్తి సమాచారం తెలుసుకుని, సన్నద్ధమై రావాలని తానా అధ్యక్షుడు వి చౌదరి జంపాల సూచించారు. భారత్, అమెరికా అధికారులతో మాట్లాడి విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి కృషిచేస్తున్నట్టు చెప్పారు. విద్యాభ్యాసం కోసం అమెరికాకు కోసం వెళ్తున్న విద్యార్థులను వెనక్కిపంపిస్తున్న నేపథ్యంలో.. వి చౌదరి జంపాల తెలుగువారికి పలు సూచనలు చేశారు.
'అమెరికాకు వచ్చే విద్యార్థులందరూ అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాలు, నిబంధనల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. కొత్త ఎఫ్ 1 వీసాతో అమెరికాకు రావాలి. విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు అడిగే ప్రశ్నలకు విద్యార్థులు చెప్పే సమాధానాలు సంతృప్తిగా అనిపిస్తేనే అమెరికా వెళ్లేందుకు అనుమతిస్తారు. భారతీయ విద్యార్థులను పలు విమానాశ్రయాల నుంచి తిప్పి పంపడానికి పలు కారణాలున్నాయి. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో మాట్లాడకపోవడం.. విద్యను అభ్యసించడానికి తగిన ప్రణాళికతో రాకపోవడం.. ఎక్కడ నివసిస్తారు, అక్కడ నివసించడానికి అయ్యే ఖర్చులకు డబ్బును ఎలా సమకూరుస్తారు వంటి ప్రశ్నలకు సరిగా సమధానం చెప్పకపోవడం వల్ల అధికారులు వెనక్కిపంపారు. కొందరు విద్యార్థులు పార్ట్ టైమ్ జాబ్లు చేస్తామని చెప్పడం కూడా వెనక్కి పంపడానికి కారణం. అమెరికా చట్టాల ప్రకారం చదువుకుంటూ ఉద్యోగం చేయరాదు. విద్యార్థులు ఈ విషయాలను తెలుసుకోవాలి. అమెరికా చట్టాలను గౌరవించాలి. అమెరికా వచ్చే ముందు ఓ ప్రణాళికతో సన్నద్ధమై రావాలి. అధికారులు అడిగే ప్రశ్నలకు ఆత్మవిశ్వాసంతో సమాధానం చెప్పాలి' అని వి చౌదరి జంపాల సూచించారు.
స్టూడెంట్ వీసాలు మంజూరు చేసేది విద్యను అభ్యసించడానికేనని, ఉద్యోగం కోసం కాదన్న విషయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తెలుసుకోవాలని చెప్పారు. అలాగే తాము చేరబోయే విద్యా సంస్థలకు ప్రభుత్వం అనుమతి, పర్యవేక్షణ ఉందా? అన్న విషయాన్ని ముందే తెలుసుకోవాలని సూచించారు. అమెరికాకు వెళ్తూ వెనక్కి వచ్చిన భారతీయ విద్యార్థుల్లో ఎక్కవగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన తెలుగు విద్యార్థులు ఉన్నారు. అమెరికాకు వెళ్తున్న విద్యార్థుల్లో కొందరిని హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచే వెనక్కిపంపగా, మరికొందరికి మార్గమధ్యమంలో అనుమతి నిరాకరించారు. అమెరికాలో ఇప్పటికే విద్యను అభ్యసిస్తూ పార్ట్ టైమ్ జాబ్లు చేస్తున్నారనే కారణంతో కొందరు విద్యార్థులను స్వదేశం పంపారు.