విప్లవ పంథాలో కడదాకా! | untill his death revolutionary who governed the Republic of Cuba | Sakshi
Sakshi News home page

విప్లవ పంథాలో కడదాకా!

Published Tue, Nov 29 2016 1:37 AM | Last Updated on Fri, May 25 2018 6:35 PM

విప్లవ పంథాలో కడదాకా! - Sakshi

విప్లవ పంథాలో కడదాకా!

రెండో మాట
అలాంటి చారిత్రక పరిణామాలకు వారసునిగా ఎదిగిన క్యాస్ట్రోను, ఆయన ప్రభుత్వాన్ని మొదటగా గుర్తించినవాడు నెహ్రూ. కాగా, అలీన ఉద్యమాన్ని మనసారా ఆహ్వానించి కీర్తించినవాడు క్యాస్ట్రో. వృద్ధాప్యంలో ఎలాంటి వ్యక్తిగత కోరికలు లేకుండా, నిరాడంబర జీవితాన్ని గడుపుతూనే విప్లవోద్యమాల నిర్వహణలో తీవ్రమైన తప్పులు చేయకుండా ఎలా జాగ్రత్తపడాలో విప్లవకారులకు, ఉద్యమకారులకు సలహాలు, సూచనలు ఇస్తూ తుది శ్వాస వరకూ ఒక క్యూబా పత్రికలో వ్యాసాలు రాశారాయన.

‘సామాజిక, ఆర్థిక, దోపిడీ, నిరంకుశ పాలనావ్యవస్థల మీద ఎక్కుపెట్టే విప్లవం ఎప్పుడు జయప్రదమవుతుంది? పాతతరం నుంచి నవతరం నాయకత్వాన్ని అందిపుచ్చుకున్నప్పుడే విప్లవం విజయవంతమవుతుంది!’
– ఫిడెల్‌ క్యాస్ట్రో

‘దేశ స్వేచ్ఛాస్వాతంత్య్రాలను కాపాడుకోవడానికి ఉభయతారకంగా విదే శాలతో జరిగే వర్తక వ్యాపారాల మధ్య సమతౌల్యాన్ని సాధించాలి. అలా కాకుండా, ఉనికిలోనే లేకుండా పోవాలనుకునే దేశం మాత్రమే ఒకే ఒక్క విదే శానికి తన సరుకులను విక్రయిస్తుంది. తాను బతికి బట్టకట్టాలనుకునే దేశం మాత్రం ఒక దేశానికి పరిమితం కాకుండా పెక్కు దేశాలకు తన సరుకులను విక్రయిస్తుంది.’
– జోసి మార్తి (క్యూబా జాతీయవీరుడు. కవి, క్యూబన్‌ రివల్యూషనరీ పార్టీ స్థాపకుడు. క్యాస్ట్రో ఆరాధకుడు)

అమెరికాకు కేవలం వంద, నూట యాభై మైళ్ల దూరంలో ఉంది (కరేబి యన్‌–లాటిన్‌ అమెరికా దేశం) క్యూబా దీవి. ప్రపంచ వలస సామ్రాజ్యశక్తిగా మారిన అమెరికా ఆ దీవిపైన దాడి చేసి, పెత్తనం చెలాయించాలని ఎందుకు అనుకుంది? దేశాలకు దేశాలు ఆక్రమించి, అనుభవించాలనుకునే సామ్రాజ్య శక్తికి దీవుల ఆక్రమణ లెక్కలోనిది కాదు. అయినా ఫిడెల్‌ క్యాస్ట్రో అనే క్యూబా విప్లవ విధాత ఆ సామ్రాజ్యశక్తి పక్కలో బల్లెంగా మారడానికి దారితీసిన చారిత్రక పరిస్థితులు ఏమిటి? క్యాస్ట్రో– ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా లకు ఆరాధ్య విప్లవకారుడు.

తొలి అడుగులు
బాటిస్టా అనే ఒక తైనాతీతో కలసి కుట్ర పన్ని, 1952లో క్యూబా మీద అమె రికా ఆకస్మికంగా దాడి చేసింది. ఆ దీవికి అతడినే పాలకునిగా ప్రకటించింది. అది మొదలు క్యూబా ప్రజానీకం విమోచన కోసం ఎన్నో పోరాటాలూ, త్యాగాలూ చేశారు. ఆ సమయంలోనే ప్రభవించిన విప్లవశక్తులు ఫిడెల్‌ క్యాస్ట్రో నాయకత్వంలో క్యూబా విమోచనకు సమాయత్తమైనాయి. ఆ పోరులో క్యాస్ట్రో వెంట నడిచినవాడు డాక్టర్‌ ఎర్నెస్టో గువేరా. అప్పుడే లాటిన్‌ అమెరికాలోని బొలీవియాలోనూ విప్లవం (1952) చెలరేగింది. యావత్తు లాటిన్‌ అమెరికా దేశాలను సందర్శించిన అనుభవంతో క్యాస్ట్రోతో ఆయన చేతులు కలిపారు. 1953లో క్యూబాలోనే శాంటియాగోలో ఉన్న బాటిస్టా సైనిక కేంద్రం మీద సాయుధ దాడి జరిగింది. దీనికి క్యాస్ట్రో నాయకత్వం వహించారు. అలా బాటిస్టా ఉద్వాసనకూ, క్యూబా విమోచన విప్లవానికి అంకురార్పణ జరిగాయి. ఎన్నో త్యాగాలు చేయవలసి వచ్చింది. క్యాస్ట్రో, అనుచరులు శత్రుబలగాలకు చిక్కి నిర్బంధాలకు గురయ్యారు. అదొక సుదీర్ఘ పోరాటం. ఆ పోరులో అంతిమఘట్టం 1959లో ఆవిష్కృతమైంది. ఆ సంవ త్సరమే బాటిస్టా క్యూబా విడిచి పారిపోయాడు. ప్రధానమంత్రిగా క్యాస్ట్రో ప్రమాణ స్వీకారం చేశారు. అధికారంలోకి రాగానే విమోచన సమర లక్ష్యాలకు అనుగుణంగా క్యాస్ట్రో అనేక సంస్కరణలు చేపట్టారు.  పరాయి పెత్తనంతో చితికిపోయిన వ్యవసాయ రంగాన్ని పునరుద్ధరిస్తూ, కమతాలకు పరిమితిని ప్రకటించి రైతులకు క్యాస్ట్రో భూములను పంచిపెట్టారు. విప్లవోద్యమ విజయ చిహ్నంగా ఆయన ప్రవేశపెట్టిన తొలి సంస్కరణ ఇదే.

50 లక్షల మంది పిల్లలను ఉచిత ఆరోగ్య పథకం పరిధిలోకి తీసు కొచ్చారు (నేడు వర్ధమాన దేశాలకు ఆరోగ్య సేవలు ఉచితంగా అందిం చడానికి దాదాపు 30 వేలమంది డాక్టర్లను పంపి క్యూబా ఉచిత సేవలు అందిస్తోంది). విమోచనోద్యమంలో తన వెంట నడిచిన గువేరాకు ప్రజల అనుమతితో క్యూబా పౌరసత్వం ఇచ్చి గౌరవించారు. నిజానికి పోర్చుగీసు, డచ్, బ్రిటిష్‌ పాలకుల ఏలుబడిలో భారత ప్రజలు మూడువందల ఏళ్లు మగ్గిన విధంగానే, క్యూబా సహా అనేక లాటిన్‌ అమెరికా దేశాలు స్పానిష్, అమెరికా వలస పాలనాధికారం కింద నలిగిపోయినవే. చిత్రం ఏమిటంటే క్యూబాలోనే ఉన్న గ్వాంటనామా మీద అమెరికా పెత్తనం ఇంకా కొనసాగు తోంది. క్యూబాకి చెందిన ఈ దీవిని పాత అసమ సంధులను అడ్డం పెట్టుకుని అమెరికా తన రహస్య వేధింపుల కేంద్రంగా మార్చింది. అలాగే ప్రపంచ దేశాల సంపదపైన, ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలలోను తిష్ట వేయడానికి తన వంతు కుట్రలు పన్నుతూనే ఉంది. ఇందుకు క్యూబాలో అమెరికా రాయబారిగా పనిచేసిన(1960) ఎర్ల్‌ స్మిత్‌ వ్యాఖ్యలే ప్రబల సాక్ష్యం– ‘క్యాస్ట్రో అధికారానికి వచ్చే వరకు క్యూబాలో అమెరికాది ఎదురు లేని పలుకుబడి. అమెరికా రాయబారి క్యూబాలో రెండో అధినాయకుడు. ఒక్కొక్క సందర్భంలో అతనే అధ్యక్షునికన్నా శిష్టాదిగురువు’.

చరిత్రను మార్చిన మార్గదర్శకుడు
పరాగ్వే అత్యున్నత న్యాయస్థానం నాలుగు వందల ఏళ్ల అనుభవాలను చూసిన తరువాత దేశంలోని అన్ని న్యాయస్థానాలకు పంపిన నోటీసులో పేర్కొన్న అంశం కూడా చెప్పుకోదగినది. ‘లాటిన్‌ అమెరికాలో  ఇండియన్లు కూడా రిపబ్లిక్‌లో నివశించే మానవమాత్రులే. పరాగ్వే రిపబ్లిక్‌లోని ప్రతి పది మందిలో ఎనిమిది మంది ఇండియన్లే. కాబట్టి వారిని పశువులుగా చూడడం దుర్మార్గం. స్పానియార్డులు, అమెరికన్లు ఇండియన్లను జంతువులను వేటాడి నట్టు వేటాడి వేధించారు. వారిని బేరసారాలతో అమ్ముతున్నారు’ (ఇలాంటి వివక్షకు స్వతంత్ర భారతంలోని కొన్ని పాలక వర్గాలు కూడా అతీతం కాదు). 16,17 శతాబ్దాలలో అమెరికన్‌ సామ్రాజ్యవాదులు 80 లక్షలమందికి పైగా ఇండియన్లను అక్షరాలా పొట్టన పెట్టుకున్నారని చరిత్రకారుల కథనం. టిన్ను, నికెల్, వెండి అపార లోహ ఖనిజ సంపద కలిగిన లాటిన్‌ అమెరికా ఖండ దేశాలు ఒకనాడు సంపన్న దేశాలుగా ఉన్నవే. సామ్రాజ్యవాద పెట్టుబడుల వ్యాప్తి ద్వారా లాభాల వేటలో భాగంగా పేద, నిరుపేద దేశాలుగా మారాయి.  ఇప్పుడు ఆ దేశాలేæ క్యాస్ట్రో నాయకత్వ ప్రభావంతో సామ్రాజ్యవాద కుట్ర లను ఎదుర్కొంటూ స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను కాపాడుకోవడానికి ప్రయత్ని స్తున్నాయి.  క్యూబా విప్లవ ప్రభావం వల్లనే లాటిన్‌ అమెరికాలో తిరిగి పెట్టు బడిదారీ వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్న అమెరికా తన ప్రాభ వాన్ని క్రమంగా కోల్పోతోంది. 50 ఏళ్ల నాడు అమెరికా ఏది శాసిస్తే దానినే నమ్మిన లాటిన్‌ అమెరికా మిలటరీ పాలకులు సైతం ఇప్పుడు క్యూబన్‌ విప్లవ ప్రభావానికి లొంగి రాక తప్పలేదు. చొరవలేని సమూహంగా ముద్రపడిన రైతాంగాన్ని సైతం సాంఘిక విప్లవం జయప్రదంగా సమీకరించగల్గుతుందని చైనా విప్లవం నిరూపించిందని ప్రసిద్ధ ఆర్థికవేత్త అశోక్‌ మిత్ర అంచనా. అలాంటి చారిత్రక పరిణామాలకు వారసునిగా ఎదిగిన క్యాస్ట్రోను, ఆయన ప్రభుత్వాన్ని మొదటగా గుర్తించినవాడు నెహ్రూ.

కాగా, అలీన ఉద్యమాన్ని మనసారా ఆహ్వానించి కీర్తించినవాడు క్యాస్ట్రో. వృద్ధాప్యంలో ఎలాంటి వ్యక్తి గత కోరికలు లేకుండా, నిరాడంబర జీవితాన్ని గడుపుతూనే విప్లవోద్యమాల నిర్వహణలో తీవ్రమైన తప్పులు చేయకుండా ఎలా ఉండాలో విప్లవకారు లకు, ఉద్యమకారులకు సలహాలు, సూచనలు ఇస్తూ తుది శ్వాస వరకూ ఒక క్యూబా పత్రికలో వ్యాసాలు రాశారాయన. చిన్న దేశమైన క్యూబా వర్ధమాన దేశాలకు ‘ఉన్నంతలోనే కొండంత’ సాయంగా లాటిన్‌ అమెరికా దేశాలకు, ఆసియా, ఆఫ్రికా దేశాలకు గోధుమ, బియ్యమే కాక, భారీగా వైద్య సహాయ సహకారాలు అందించింది. అమెరికా 50 ఏళ్లపాటు విధించిన ఆర్థిక ఆంక్ష లను తట్టుకుని నిలబడింది. ఆ విప్లవ స్ఫూర్తితోనే 1970ల నాటి ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితుల మధ్యనే ఒక చిన్న కరేబియన్‌ (లాటిన్‌ అమెరికా) దేశంగా వేల మైళ్ల దూరంలో ఉన్న అంగోలా, ఇథియోపియా దేశాల యుద్ధ క్షేత్రా లలోకి తన వలంటీర్లను, సైనికుల్ని దూకించింది క్యూబా. రానున్న రోజుల్లో ఆఫ్రికా ప్రపంచ విప్లవానికి విశ్వవేదిక కాగలదని క్యాస్ట్రో విశ్వసించారు. ఇటీవలి పదిమంది అమెరికన్‌ అధ్యక్షులలో ఒకరిద్దరు మినహా అందరూ క్యాస్ట్రోను హత్య చేయడానికి 600 సార్లు ఏర్పాట్లు చేసి విఫలమైనవారే. ఒబామా సర్కారు ఆర్థిక సంక్షోభం నుంచి తేరుకోలేని స్థితిలో, స్థానిక యుద్ధా లలో కూరుకుపోయి బలహీనపడుతున్న అమెరికాను బయటపడవేసే ప్రయ త్నంలో క్యూబాతో దౌత్య సంబంధాలను పునరుద్ధరించింది.

నిజాన్ని విశ్వసించినవాడు
రావుల్‌ క్యాస్ట్రోకి పాలనా బాధ్యతలు బదలాయించిన తరువాత క్యాస్ట్రో  ప్రసిద్ధ భారత జర్నలిస్టు సయీద్‌ నక్వీకి ఇచ్చిన ఇంటర్వూ్యలో ‘సోషలిజం’ గురించి చెప్పిన మాటలు ప్రశంసార్హమైనవి: ‘సోషలిజం అంటే  ప్రజలం దరినీ సంపన్నులుగా మార్చడమని కొందరు భావిస్తున్నారు. అది తప్పు. ప్రజలందరినీ వివక్ష లేకుండా సరిసమాన హోదాలో బతకడానికి కనీస అవసరాలను తీర్చి, శాంతిని, సుఖసంతోషాలను సమకూర్చి పెట్టడమేగానీ కోటీశ్వరుల్ని, మహా కోటీశ్వరుల్ని సృష్టించడం సోషలిజం కానేరదు’ అన్నా రాయన. దోపిడీ, బానిస వ్యవస్థల రద్దు కోసం తమ జీవితాలను పణంగా పెడుతూ వచ్చిన మార్టిన్‌ లూథర్‌ కింగ్, మాల్కోమ్‌ ఎక్స్‌ తదితర యోధుల బాటలో నడిచి చరితార్థుడైన విప్లవ నేత క్యాస్ట్రో. ఆయన ఒక సందేశంలో ఇలా పేర్కొన్నాడు: ‘ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా ఖండాలలో చాలా వివక్షలకు ఇంకా ఆటవిడుపు లేదు. ఈ వాస్తవాల్ని చైతన్యంతో గమనించాలి. ప్రత్యామ్నాయ మార్గాలు చేతికి అందివస్తాయి. తీవ్ర సంక్షోభాల నుంచి మాత్రమే గొప్ప గొప్ప పరిష్కార మార్గాలు ఆవిష్కరించుకుంటాయని చరిత్ర రుజువు చేసింది. జీవించే హక్కుకు, న్యాయం పొందే హక్కుకు ప్రజలే వార సులు. ఈ రెండు హక్కులూ వెయ్యిన్నొక్క మార్గాల్లో తమ ఉనికిని నిరూ పించుకుంటాయి. నేను మనిషిని నమ్ముతాను, నిజాన్ని విశ్వసిస్తాను (సత్య మేవ జయతే)’ అన్నారు క్యాస్ట్రో.

సీనియర్‌ సంపాదకులు
ఏబీకే ప్రసాద్‌
abkprasad2006@yahoo.co.in


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement