జాప్యం ఖరీదు
దశాబ్దాల తరబడి న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్ పడిపోవడంవల్ల తుది ఫలితం ఎలా ఉంటుందో తెలియడానికి ఉపహార్ విషాద ఉదంతం కేసులో సుప్రీం కోర్టు గురువారం వెలువరించిన తీర్పే ఉదాహరణ. ఈ కేసులో కీలక నిందితులైన ఉపహార్ థియేటర్ యజమానులు సుశీల్ అన్సల్, గోపాల్ అన్సల్ సోదరుల్లో పెద్ద వాడు సుశీల్ కేసు నుంచి విముక్తి కాగా అతని తమ్ముడికి ఏడాది శిక్ష పడింది. ఆ విషాదం మాటలకందనిది. 1997 జూన్ 13న దక్షిణ ఢిల్లీలోని ఆ థియేటర్ కింది భాగంలో ఉన్న రెండు ట్రాన్స్‌ఫార్మర్లలో ఉన్నట్టుండి మంటలంటుకుని దాన్నుంచి వచ్చిన పొగ థియేటర్‌ను కమ్మేసింది. ఆ ఘటనలో 59మంది మరణించారు. మరో వందమంది గాయపడ్డారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ కేసులో సుశీల్ అన్సల్, గోపాల్ అన్సల్ సోదరులతోపాటు 16మంది నిందితులున్నారు. ఆ రోజే విడుదలైన హిందీ చిత్రం ‘బోర్డర్’ చూడటానికి ఉత్సాహపడి థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులకు ఆ విషాదం ఈనాటికీ వెంటాడుతోంది.
ఘటన జరిగిన రోజు ప్రాణ భయంతో హాహాకారాలు చేస్తూ పరుగులు పెట్టడం, తొక్కిసలాట, ఈ క్రమంలో కొందరు గాయపడటం ఇప్పటికీ వారి కళ్లముందు కదులుతోంది. కలవారు నింది తులుగా ఉంటే కేసులెలా నత్తనడకన సాగుతాయో, చివరకెలా ముగుస్తాయో ఈ కేసు చెబుతుంది. ఘటన జరిగిన రెండు నెలల తర్వాతగానీ నిందితులు పట్టుబడలేదు. ఆ తర్వాత కేసు ఢిల్లీ పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ అయింది. దర్యాప్తు నాలుగు నెలల్లో ముగిసినా సెషన్స్ కోర్టులో విచారణకు రావడానికే మరో రెండేళ్లు పట్టింది. కనీసం ఆ తర్వాతనైనా అది చురుకందుకోలేదు. ఈ వ్యవహారాన్నంతా ఏడాదిపాటు గమనించిన బాధిత కుటుంబాలు సత్వర విచారణ కోసం 2002లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించక తప్పలేదు. ఆ ఏడాది ఆఖరుకల్లా కేసు తేల్చాలని హైకోర్టు ఆదేశించినా షరా మామూలే. 2003లో మరోసారి బాధిత కుటుంబాలు తన ముందుకొచ్చినప్పుడు హైకోర్టు మళ్లీ కింది కోర్టును మందలించక తప్పలేదు. ఆ సందర్భంలోనే బాధిత కుటుంబాలకు రూ. 18 కోట్లు చెల్లించమని అన్సల్ సోద రులను ఆదేశించింది. ఇంత జరిగినా సెషన్స్ కోర్టుకు తీర్పు చెప్పడం 2007 వరకూ సాధ్యపడలేదు. అన్సల్ సోదరులు రెండేళ్ల కఠిన శిక్ష అనుభవించాలనడంతోపాటు ఇతర నిందితులకు వేర్వేరు శిక్షలు విధించింది. ఈ తీర్పుపై అప్పీళ్లు విచారించిన ఢిల్లీ హైకోర్టు మరో ఏడాదికి తీర్పునిచ్చింది. అన్సల్ సోదరుల కఠిన శిక్షలో ఏడాది కోత పెట్టింది.
ఈ కేసు తీరుతెన్నులను ఆది నుంచి గమనిస్తున్న బాధిత కుటుంబాలవారు ఇదే ఉదంతంలో ఇద్దరు పిల్లలను పోగొట్టుకున్న నీలమ్ కృష్ణమూర్తి నేతృత్వంలో ఏకమై ఉపహార్ విషాద బాధితుల సంఘం(ఏవీయూటీ)ను ఏర్పాటు చేసుకు న్నారు. సుప్రీంకోర్టు వరకూ ఎంతో పట్టుదలతో దృఢంగా పోరాడారు. కొత్త సినిమా చూడాలన్న ఉత్సాహంతో థియేటర్‌కు వెళ్లి ఆహుతైపోయిన తమ చిన్నా రుల కోసం, ఆప్తుల కోసం డబ్బునూ, విలువైన సమయాన్ని వెచ్చించి రెండు దశాబ్దాలపాటు నిర్విరామంగా ఈ పోరాటం జరిపారు. పర్యవసానంగా అన్సల్ సోదరులు చెల్లించాల్సిన నష్టపరిహారం రూ. 18 కోట్లు రూ. 60 కోట్లకు చేరింది గానీ... దోషులను కఠినంగా దండించాలన్న కోరిక నెరవేరలేదు. దోషుల విష యంలో అచ్చం హైకోర్టు మాదిరే సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది. నిరుడు వెలువరించిన తీర్పులో వారు పెద్ద వయసువారు కావడం, అప్పటికే కొంతకాలం శిక్ష అనుభవించి ఉండటంలాంటి కారణాలను చూపి విడుదల చేసింది. దానిపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తే తాజా తీర్పులో అన్సల్ సోదరుల్లో పెద్దవాడైన 77 ఏళ్ల సుశీల్ అన్సల్ వృద్ధాప్యంవల్ల కేసు నుంచి విముక్తుణ్ణి చేసి 69 ఏళ్ల గోపాల్ అన్సల్‌కు ఏడాది శిక్ష విధించింది.
ఈ కేసులో కింది కోర్టులో శిక్షపడ్డ మరో 14మంది నింది తులు ఇప్పటికే దాన్ని అనుభవించారు. అదే సూత్రం అన్సల్ సోదరులకు వర్తింప జేయడంలో వచ్చే ఇబ్బందేమిటి? కేసును లోతుగా గమనించకపోతే అన్సల్ సోద రులిద్దరూ థియేటర్ యజమానులే తప్ప రోజువారీ నిర్వహణతో వారికి సంబంధ మేమిటన్న సందేహం వస్తుంది. కానీ వారు కేవలం డబ్బు దండుకోవడమే లక్ష్యంగా థియేటర్ బాల్కనీలో నడక దారిని కూడా ఆక్రమించి అదనపు సీట్లు ఏర్పాటు చేయించారు. అందుకోసం పక్కనున్న ప్రవేశద్వారాన్ని కూడా మూయించారు. కను కనే ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి అక్కడివారు చేసిన ప్రయత్నాలు విఫల మయ్యాయి. అది యాదృచ్ఛికంగా చోటు చేసుకున్నదే తప్ప మానవతప్పిదమేమీ లేదని నిందితుల తరఫున వాదనలు వినిపించినా న్యాయస్థానాలు వాటిని అంగీ కరించలేదు. ఇంతవరకూ బాగానే ఉన్నా శిక్షించే సమయానికి నిందితుల వయ సును పరిగణనలోకి తీసుకోవడం ఎంతవరకూ సబబో అర్ధంకాదు. కేసులు ఎంతకీ తెమలకుండా ఏళ్ల తరబడి సాగితే నిందితులకే కాదు... బాధితులకు కూడా వృద్ధాప్యం వస్తుంది. ఆ ఉదంతంలో ప్రాణాలు పోగొట్టుకున్న పిల్లలు అందరిలా పెరిగి పెద్దయి ఉంటే తమ వ్యాపారాల్లో, వృత్తుల్లో ఆసరాగా నిలిచేవారని వారూ అనుకుంటున్నారు. వారిని పట్టించుకునేదెవరు?
మన చట్టాలు ఏ నేరానికి ఏం శిక్ష విధించవచ్చునో నిర్దేశిస్తాయి తప్ప నింది తుల ఆర్థిక స్థితిగతులను, విద్యార్హతలను, వారి సామాజిక హోదాలనూ గమనిం చవు. వారికి నేరచరిత్ర ఉన్నదా అనే అంశాన్ని మాత్రం చూస్తాయి. చిత్రమేమంటే శిక్షలో కోత విధించినప్పుడు ఢిల్లీ హైకోర్టు నిందితుల నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేస్తామని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. ఉద్దేశపూర్వకంగా, లాభార్జన ధ్యేయంతో ప్రమాదకరమైన పర్యవసానాలకు కారకులయ్యేవారిని, ప్రాణాలతో చెలగాటమాడేవారిని... వారు ఏ స్థాయివారైనా కఠినంగా దండించే పరిస్థితులుం టేనే సమాజం సురక్షితంగా ఉండగలుగుతుంది. కొందరి డబ్బు యావకు బలైన తమవారి కోసం ఉపహార్ బాధిత కుటుంబాలు చేస్తున్న పోరాటంలో అంతిమంగా న్యాయం గెలవాలని... నిందితులకు కఠిన శిక్ష పడాలని అందరూ కోరుకుంటారు.