
‘ఉపాధి’లో మనమే ఫస్ట్!
విశ్లేషణ
హైదరాబాద్ శతాబ్దాల చారిత్రక వారసత్వం ఉన్న నగరంగానే కాకుండా ప్రపం చంలో ఉత్తమ జీవన ప్రమాణాలు ఉన్న మహానగరంగా కూడా నిలిచింది. గతంలో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ హైదరాబాద్ నగరానికి వచ్చి ఇక్కడ ఐటి రంగంలో సాధిస్తున్న పురోగతిని అభినందించారు. తెలుగు సమాజం నుంచి ఐటి సేవల ద్వారా అమెరికా దేశానికి అందిస్తున్న సహకారం వల్ల మా దేశం ఎంతో పురోభివృద్ధి సాధిస్తుందని అందుకే కృతజ్ఞతలు చెప్పేందుకే హైదరాబాద్‌కు వచ్చానని ప్రకటించారు. హైదరాబాద్ ఐటీలో మేటిగా నిలిచింది. ఇప్పుడు విశ్వనగరంగా రూపుదిద్దుకోబోతుంది. కరెంటు కోతలు లేని నగరంగా నిలబడగలుగుతోంది. మెర్సర్ సంస్థ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఉత్తమ జీవన ప్రమాణాలు ఉన్న నగరంగా హైదరాబాద్ నిలిచింది. ఉత్తమ నివాస యోగ్యమైన నగరంగా ప్రపంచంలో 139వ ర్యాంకును, సురక్షితమైన నగరాల జాబితాలో 121వ స్థానాన్ని హైదరాబాద్ పొందింది.
ఇండియాలో ఉన్న అన్ని మహానగరాల కంటే హైదరాబాద్ ఐటీ, తదితర కంపెనీలు పెట్టడానికి అనువైన స్థలమని నిపుణులు నిర్ధారించారు. ఇందుకు కారణాలు అనేకం ఉన్నాయి. హైదరాబాద్‌కు వాతా వరణ స్థ్థితిగతులు బాగా కలసి వచ్చాయి. మద్రాసు, తదితర మహానగరాల కంటే హైదరాబాద్ వాతా వరణం నిశ్చితంగా ఉంటుంది. ఎండ తీవ్రత, చలి తీవ్రతలు అధికంగా ఉండవు. వాతావరణంలో ఊహిం చని పరిణామాలు ఇక్కడ కన్పించవు. ఈ స్థితి దేశంలోని ఏ ఇతర మహానగరాలకూ లేదు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సందర్భంగా ఒక మహత్తర పోరాటం జరి గింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చాక ఇక్కడ రాజకీయ స్థిరత్వం వచ్చింది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్‌లో ఉంది. వివిధ బహుళజాతి కంపెనీలు పెద్ద ఎత్తున హైదరాబాద్ రావటానికి మక్కువ చూపిస్తు న్నాయి. ఇందుకు ఇక్కడి రాజకీయ స్థిరత్వం కూడా దోహదం చేసింది.
మానవ వనరులు ఎక్కువగా ఎక్కడ ఉంటాయో పెట్టుబడి కూడా అక్కడికే పరుగెత్తుకు వస్తుంది. హైద రాబాద్‌లో ఉన్న మధ్య తరగతి వర్గం విద్యారంగంపైన పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. తమ పిల్లల చదువుల కోసం ఆస్తులమ్ముకుని పెట్టుబడి పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. దానివలన ప్రైవేట్ రంగంలో ప్రాథమిక సెకండరీ విద్యలో ప్రపంచస్థాయి విద్యాప్రమాణాలతో పోల్చదగిన విద్యాసంస్థలు కూడా ఇక్కడ వెలిశాయి.
దాని నుంచి పటిష్టమైన సెకండరీ విద్యతో ప్రపంచంతో పోటీపడే స్థాయి మన పిల్లలకు వచ్చింది. హైదరాబాద్‌లో ఉన్నత విద్యకు కావాల్సిన యోగ్యతను అందించే సంస్థలు రావటం జరిగింది. బిర్లా ఇనిస్టి ట్యూట్, ఐఐటీ, హైదరాబాద్ సెంట్రల్ యూని వర్సిటీలు ఇక్కడికి వచ్చాయి.
సమర్థవంతమైన సంస్థలు రావటం వలన విరివిగా ఇక్కడ మానవ వనరులు లభిస్తున్నాయి. ఇదే స్థితి బ్రెజిల్‌లో ఉంది. బ్రెజిల్‌లో సెకండరీ విద్య ప్రైవేట్ రంగంలో ఉన్నప్పటికీ ఉన్నత ప్రమాణాలను అందిం చింది. పబ్లిక్ రంగంలో ఉన్నత విద్య, పరిశోధనను అభివృద్ధి చేశారు. దీనివల్ల బ్రెజిల్‌లో సమర్థవంతమైన మానవ వనరులు లభించాయి. అదే అమెరికాలో స్కూలు ఎడ్యుకేషన్ పబ్లిక్‌రంగంలో, ఉన్నత విద్య ప్రైవేట్ రంగంలో ఉంది. ఈ రెండింటి వలన అమెరికాలో విద్యకు సంబంధించిన ఉపాధి అవకాశాలు పెరిగినాయి.
మనదేశంలో విచిత్రం ఏమిటంటే ప్రైవేట్ రంగంలోనే ప్రైమరీ, ఉన్నత విద్య రెండూ ఉన్నాయి. దీన్ని ఎదుర్కోవటానికై రాష్ట్ర ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీమ్ పెట్టాయి. ఇలా ఉన్నత విద్యారంగాన్ని ఆదుకోవటం వల్ల సామాన్యులు ఉన్నత విద్య గడప తొక్కారు. అట్టడుగు వర్గాలు ఉన్నత విద్యకు రావాలంటే స్కూలు ఎడ్యుకేషన్‌ను పటిష్టం చేసుకోవాలి. ఉన్నత విద్యారంగానికి వచ్చిన మను షులను ఆదుకొంటే మానవ వనరులు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. పబ్లిక్ ప్రైవేటు రంగాలు ఒకదాని కొకటి కాంప్లిమెంట్ అయితేనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
అదేకాకుండా కేవలం సాంకేతిక విద్య పైనే దృష్టిపెడితే అందులో ఉద్యోగ అవకాశాలు దినదినం తగ్గుతున్నాయి. లిబరల్ ఎడ్యుకేషన్‌ను కూడా పెంచుకోవాలి. అందుకు స్కూలు ఎడ్యుకేషన్‌ను ప్రభుత్వరంగంలో పటిష్టం చేసుకొని ఉన్నత విద్యారంగంలో ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్‌ను తీసుకుంటే హైదరాబాద్‌కు మరింత బంగారు భవిష్యత్తు ఉంటుంది. దాంతో సహా లిబరల్ ఎడ్యుకేషన్‌లో కూడా అత్యున్నత ప్రమాణాలు గల ఉన్నత విద్యను తీసుకురాగలిగితే ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయి.
ఈనాడు మహానగరాల భవిష్యత్తు అంతా ఉపాధిపైననే ఆధారపడి ఉంటుంది. మన హైదరా బాద్‌కు ఎన్నో అనుకూల పరిస్థితులున్నాయి. రాజకీయ, ఆర్థికరంగంలో ఉన్న నాయకత్వం దీన్ని ఉపయోగిం చుకుంటే ఇప్పటికంటే మరింత భవిష్యత్తు ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుజరపబోయే కేజీ టు పీజీ విద్య పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా అమలు జరిగితే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్‌వన్‌గా నిలుస్తుంది.
ఇప్పటికే సమర్ధవంతమైన మానవ వనరులను అందించగలిగిన తెలంగాణ రాష్ట్రం భవిష్య త్‌లో ప్రపంచానికి మరింత శక్తివంతమైన మానవ వనరులను అందించగలదు. అందరికీ ప్రమాణాలు గల విద్య ఎంత వేగంగా అందించగలిగితే హైదరాబాద్ అంత వేగంగా విశ్వనగరంగా రూపుదాల్చుతుంది. హైదరాబాద్‌కు ఐటి మణిహారం కాబోతుంది. తెలం గాణ రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి నాణ్యమైన చదువును కేజీ టు పీజీ విద్య ద్వారా అందించగలిగితే మరింత శక్తివంతంగా ప్రపంచం ముందు నిలిచి తీరుతాం. హైదరాబాద్ మానవవనరుల సంపదల చిరునామాగా నిలుస్తుంది.
వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, చుక్కా రామయ్య
మాజీ శాసనమండలి సభ్యులు