
మత్స్యకారులను బెదిరిస్తున్న సీఎం చంద్రబాబు
సాక్షి, విశాఖపట్నం: ‘నేను సీఎంగా ఉండగా ఏ కులం వాళ్లూ రోడ్డెక్కే అవకాశం ఇవ్వలేదు. మీ ధర్నాలు, దీక్షలకు భయపడను. రాజకీయాలు చేస్తే సహించను. వెంటనే టెంట్లు ఎత్తేయండి. లేదంటే తోలుతీస్తా.. ఖబడ్దార్!’ అంటూ సీఎం చంద్రబాబు మత్స్యకారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఎస్టీల్లో చేరుస్తామంటూ ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరిన మత్స్యకారులపై సీఎం విరుచుకుపడ్డారు. దీక్షలు విరమించకపోతే రోడ్లు కూడా వేయనంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రే బెదిరింపులకు దిగడంతో మత్స్యకారులు షాక్‌కు గురయ్యారు. ‘జన్మభూమి–మాఊరు’ కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన సీఎం శుక్రవారం విశాఖ హార్బర్ పార్కులో బస చేశారు.
ఈ సందర్భంగా జీవీఎంసీ ఎదుట కొన్నాళ్లుగా దీక్షలు చేస్తున్న మత్స్యకారులను టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్(మత్స్యకారుడు) సీఎం వద్దకు తీసుకెళ్లారు. అయితే మత్స్యకారులను చూసిన బాబు ఒక్కసారిగా తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఏం.. తమాషా చేస్తున్నారా? మీ బెదిరింపులకు భయపడను అంటూ ఫైర్ అయ్యారు. వెంటనే దీక్షలు విరమించకపోతే మత్స్యకార ప్రాంతాల్లో రోడ్లు కూడా వేయను.. మీకు దిక్కున్న చోట చెప్పుకోండంటూ బెదిరించారు.
ఇప్పుడే మీ ఎమ్మెల్యేకి గట్టిగా అయ్యిందంటూ రుసరుసలాడారు. సీఎం తీరుతో షాక్ తిన్న మత్స్యకారులు.. ఎస్టీల్లో చేరుస్తానని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు కదా? అని ప్రశ్నించగా.. సీఎం స్పందిస్తూ ఎప్పుడేమి చేయాలో తనకు తెలుసంటూ ముందుకు కదిలారు. దీంతో వినతిపత్రం ఇచ్చేందుకు వారు ప్రయత్నించగా.. సీఎం చంద్రబాబు తీసుకోకుండా కారెక్కి వెళ్లిపోయారు. ఆ వెంటనే ఎమ్మెల్యే వాసుపల్లికి సీఎం ఫోన్ చేసి.. మత్స్యకారుల దీక్షలను ఎత్తివేయించిన తర్వాతే తనకు కనిపించాలని ఆదేశించారు. దీంతో ఎమ్మెల్యే వాసుపల్లి బిక్కమొఖం వేసి మత్స్యకారులను అక్కడ్నుంచి పంపించేశారు. \
తోలుతీస్తా.. ఖబడ్దార్!
Comments
Please login to add a commentAdd a comment