ప్రతితాత్మక చిత్రం
విశాఖసిటీ: విదేశీ మోడళ్లతో నిర్మాణమన్నారు.. కోట్ల రూపాయలు పెట్టి ఇళ్లు కట్టేశారు. కానీ.. స్థానికుల్ని ఆకర్షించడంలో మాత్రం విఫలమయ్యారు. ఫలితం.. దశాబ్దకాలంగా సగానికిపైగా గృహాలు నిరుపయోగమైపోయాయి. హాట్ కేకుల్లా అమ్ముడై పోతాయని భావించిన వుడాకు పరాభవం ఎదురైంది. సగమైనా చెల్లకపోవడంతో దశాబ్దం గడిచినా.. ఆ ప్రాజెక్టు వుడాకు పీడకలలా వెంటాడుతూనే ఉంది. అసలే ఆదాయ వనరులు సమకూర్చుకోలేక ఆపసోపాలు పడుతున్న వుడాకు రోహౌస్‌లు కుంపటిలా మారాయి. తాజాగా శాటిలైట్ టౌన్‌షిప్ నిర్మాణం చేపట్టేందుకు వుడా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 900 ఎకరాల్లో ఓ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌తో కూడిన టౌన్‌షిప్ నిర్మించాలని యోచిస్తోంది. ఇప్పటికే దీనిపై కలెక్టర్ ఆదేశాలతో తహశీల్దార్ల నేతృత్వంలో ఎంజాయ్‌మెంట్ సర్వే రెండు నెలల క్రితమే నిర్వహించారు. ఏఏ ప్రాంతంలో ఎంత భూమి ఉంది. ఇందులో కొండ పోరంబోకు ఎంత, ఎంత మేర కాంటూరుని వినియోగించుకోవచ్చు, ఆక్రమిత భూమలు, పట్టాలిచ్చిన స్థలాలు ఎంతమేర ఉన్నాయి, ఏఏ మండలాలకు చెందిన భూములున్నాయనే అంశాలపై సమగ్ర సర్వే నిర్వహించి నివేదికను అందించారు.
మూడు మండలాల్లో భూములు
శాటిలైట్ టౌన్‌షిప్ కోసం రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ భూముల్ని బదలాయింపు కింద వుడా కోరుతోంది. గతంలో వుడాకు చెందిన భూముల్ని చాలా వరకూ రెవెన్యూ అధికారులు వివిధ ప్రభుత్వ శాఖలకు కేటాయించిన నేపథ్యంలో వాటి బదులుగా ఈ ట్రై జంక్షన్ పరిధిలో ఉన్న భూములు తమకు ఇస్తే అభివృద్ధి చేస్తామని వుడా కోరింది. దీనిపై జిల్లా కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించారు. సబ్బవరం మండలం గంగవరం, నంగినారపాడు గ్రామాల పరిధిలోనూ, పరవాడ మండలం పెదముషిడివాడ, ఈమర్రిపాలెం గ్రామాల్లోనూ, గాజువాక మండలం అగనంపూడిలో కలిపి 1570.04 ఎకరాలుండగా ఇందులో అభివృద్ధికి పనికిరాని కొండల ప్రాంతాలు 669.15 ఎకరాలున్నాయి. మిగిలిన 899.27 ఎకరాల స్థలాల్ని శాటిలైట్ టౌన్‌షిప్ కోసం గుర్తించారు. ఎంజాయ్‌మెంట్ సర్వే ప్రకారం భూముల వివరాలిలా ఉన్నాయి.
సామాన్యుల్ని విస్మరిస్తారా..?
హైదరాబాద్‌లో నిర్మించిన శాటిలైట్ టౌన్‌షిప్‌లు విజయవంతమయ్యాయి. దీనికి కారణం అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేలా టౌన్‌షిప్ నిర్మాణం జరగడమే. ముందుగా చిన్న వర్గాల వారికి అంటే పనులు చేసుకునేవారి కోసం అందుబాటులో ఉండేలా గృహ నిర్మాణాలు చేపట్టారు. వాటికి మౌలిక సదుపాయాలు కల్పించి నగరానికి బస్సు సౌకర్యం కూడా కల్పించారు. ఆ తర్వాత మధ్యతరగతి, ధనిక వర్గాల వారికి ఆకట్టుకునే ధరలతో ఇళ్లు నిర్మించారు. క్రమంగా అది విస్తరించి అన్ని మౌలిక సదుపాయాలతో మరో ఊరిలా మారింది.
విశాఖలోనూ అదే తరహాలో నిర్మిస్తే తప్ప వుడా ప్రయత్నాలు సఫలీకృతమవ్వవు. కానీ.. వుడా ఆలోచనలెప్పుడూ ధనికవర్గాలను దృష్టిలో పెట్టుకొనే జరుగుతున్నాయి. ఫలితంగా నష్టాల్ని మూటకట్టుకుంటోంది. లంకెలపాలెం వద్ద నిర్మించాలనుకుంటున్న టౌన్‌షిప్‌ను అన్ని వర్గాల వారికి అనుగుణంగా నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇందులో 150 ఎకరాలు స్పోర్ట్స్ కాంప్లెక్ గా అభివృద్ధి చేయనున్నారు. మిగిలిన వాటినిల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించినప్పుడు నిర్వాసితులకు కొంత స్థలం కేటాయించి.. మిగిలిన భూముల్లో టౌన్‌షిప్ అభివృద్ధి చెయ్యాలని ప్రణాళికలు రూపొందించినట్లు వుడా అధికారులు చెబుతున్నారు. సరైన ప్రణాళికతో రూపొందిస్తే ఈ శాటిలైట్ టౌన్‌షిప్ వుడాకు కాసుల వర్షం కురిపిస్తుంది. లేదంటే రో హౌసింగ్ ప్రాజెక్టులా నష్టాల ఊబిలోకి నెట్టేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment