ఆన్‌ ‘లైనేస్తారు’ జాగ్రత్త | Cyber ​​Criminals Targeting Youth | Sakshi
Sakshi News home page

ఆన్‌ ‘లైనేస్తారు’ జాగ్రత్త

Published Mon, Jun 17 2019 11:49 AM | Last Updated on Thu, Jun 20 2019 11:47 AM

Cyber ​​Criminals Targeting Youth - Sakshi

బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్న నవీన్‌కు స్మార్ట్‌ ఫోన్‌తో ఎక్కువ సేపు గడపడం అలవాటు. రెండు వారాల క్రితం పేటీఎం లక్కీ డ్రాలో మీరు ఎంపికయ్యారంటూ.. సెల్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. ఆ మెసేజ్‌ని నమ్మి రిప్లై ఇవ్వగా లక్కీడ్రాలో బ్లూ స్టార్‌ ఏసీ గెలుచుకున్నారని సమాధానం వచ్చింది. మీ ఇంటికి ఏసీ పంపించాలంటే ముందుగా జీఎస్టీ కట్టాలి. జీఎస్టీ చెల్లించినట్లయితే ఎలాంటి రుసుము లేకుండా ఏసీ ఇంటికి చేరుతుందని చెప్పడంతో నవీన్‌ కొంత నగదును పేటీఎం ద్వారా ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. ఇంటి అడ్రసుకు ఏసీ రాలేదు. మెసేజ్‌లోని నంబర్‌కు ఫోన్‌ చేస్తే స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. బదిలీ చేసిన సొమ్ము తక్కువ కావడంతో ఎవరికీ చెప్పుకోలేక సన్నిహితుల వద్ద వాపోయాడు. ఈ విధంగా చాలామంది యువత నేరగాళ్ల వలలో పడి మోసపోతున్నారు.    –సాక్షి, విశాఖపట్నం

రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతోంది. సమాజంలో సోషల్‌ మీడియా వాడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువుతోంది. సాంఘిక మాధ్యమాల వినియోగంతో పాటుగా నగదు రహిత లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి. డిజిటల్‌ లావాదేవీలు అవినీతిని అంతం చేసేందుకు మంచి మార్గాలైనప్పటికీ ఇందులో మంచితో పాటు చెడు కూడా ఎక్కువగానే ఉంది. కొంతమంది సైబర్‌ నేరగాళ్లు సోషల్‌ మీడియాను ఆయుధంగా చేసుకుని యువత జేబులను ఖాళీ చేస్తున్నారు. సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోతున్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. అత్యాశకు పోయి నష్టపోతున్నారు.
 
ఆన్‌లైన్‌ మోసాలకు చెక్‌ పెట్టండిలా.....
అపరిచితుల నుంచి వచ్చే సందేశాలకు, ఫోన్లకు స్పందించకూడదు.పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకోకుండా ఆన్‌లైన్‌లో డబ్బులు బదిలీ చేయకూడదు. ఆర్‌బీఐ గుర్తించిన యాప్‌లను మాత్రమే బదలాయింపులకు వినియోగించాలి. వ్యక్తిగత సమాచారమైన ఓటీపీ, సీవీవీ, డెబిట్, క్రెడిట్‌ కార్డు నంబర్లు ఆకౌంట్‌ నంబర్లు చెప్పకూడదు. బ్యాంక్‌ సిబ్బందిమంటూ ఫోన్‌ చేసేవారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలి. నకిలీ నోటిఫికేషన్లను గుర్తించి వాటిపట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి. అసలు నోటిఫికేషన్‌ విడుదల అయ్యిందా లేదా అనే విషయాన్ని చెక్‌ చేసుకోవాలి.

యువతే లక్ష్యంగా......
ఉద్యోగాలు, ఆకర్షణీయమైన ఆఫర్లు, లక్కీడ్రాల పేర్లతో సైబర్‌ నేరగాళ్లు వేసే ఉచ్చులో పడి మోసపోతున్న వారిలో అధిక శాతం యువతే. పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చిరిస్తున్నప్పటికీ పట్టించుకోకుండా అత్యాశ, అవగాహన రాహిత్యంతో సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని బాధితులుగా మారుతున్నారు. సైబర్‌ నేరగాళ్లు అనునిత్యం సోషల్‌ మీడియాలో చురుకుగా ఉండే యువతను టార్గెట్‌ చేసుకుం టుకున్నారు. సైబర్‌ వలలో పడినవారిలో అధిక శాతం మంది అత్యాశతో చిక్కుకున్నవారే. ఉచితంగా డబ్బులు, గిఫ్ట్‌లు వస్తున్నాయనే ఆÔశతో విచక్షణ కోల్పోయి ఎవరిని సంప్రదించకుండా డబ్బులు చెల్లించి చేతులు కాల్చుకుంటున్నారు. సైబర్‌ నేరగాళ్లు ఇతర దేశాలు, రాష్ట్రాలు నుంచి ఫోన్‌కాల్స్‌తో బురడీ కొట్టిస్తున్నారు. దీంతో పోలీసులు కూడా ఏమి చేయలేకపోతున్నారు. ఆన్‌లైన్‌లో అపరిచితులతో కొంత జాగ్రత్త వహిస్తే మోసాల నుంచి రక్షించుకోవచ్చు.

బ్యాంక్‌ అధికారులమంటూ...
అశ చూపించి దోచుకోవడం ఒక రకమైతే బ్యాంక్‌ నుంచి కాల్‌ చేస్తున్నామంటూ...కొందరు సొమ్మును కాజేస్తున్నారు. బ్యాంక్‌ తరుఫునుంచి ఫోన్‌ చేస్తున్నామని చెప్పి మీ ఏటీఎం కార్డు బ్లాక్‌ అయ్యింది. మీ అకౌంట్‌ పని చేయడం లేదంటూ భయానికి గురిచేసి వ్యక్తిగత వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మరికొందరు మీకు రుణం ఇస్తామంటూ ఫోన్‌ చేసి బ్యాంక్‌ ఖాతా సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. కొందరు మీరు పెద్ద మొత్తంలో నగదు గెలుచుకున్నారని అకౌంట్‌లో డబ్బులు వేసేందుకు మీ వివరాలు కావాలంటూ ఫోన్లు, మెసేజ్‌లు చేస్తున్నారు. స్పందించిన వారి అకౌంట్లలో సొమ్మును లూటీ చేస్తున్నారు. వీటితో పాటు పర్సనల్‌ లోన్స్, హౌస్‌ లోన్స్‌ ఇస్తామంటూ సందేశాలు పంపి మోసం చేస్తున్నారు.
 
ఆన్‌లైన్‌ను ఆసరాగా తీసుకుని..
ఆధునిక ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. అత్యధిక శాతం మంది ప్రజలు గడిచిన కొన్నేళ్ల నుంచి ఆన్‌లైన్‌ బ్యాంకింగ్, ఆన్‌లైన్‌ కొనుగొళ్లు అంటూ అధిక శాతం లావాదేవీలు ఇంటర్‌నెట్‌లోనే నిర్వహిస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకొని సైబర్‌ నేరగాళ్లు రోజు రోజుకీ రెచ్చిపోతున్నారు. ప్రజల్లో ఉన్న అత్యాశను అవకాశంగా మార్చుకుంటున్నారు. లాటరీ టికెట్‌ కొనకుండానే మీరు లాటరీలో డబ్బులు గెలుచుకున్నారని, ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోకుండానే మీకు ఉద్యోగం ఇప్పిస్తామని, లక్కీ డ్రాలో పాల్గొనకుండానే మీ నంబర్‌పై లక్కీ డ్రా వచ్చిందని ఆయా నంబర్లకు ఫోన్లు, మెసేజ్‌లు పంపుతున్నారు. నిజమే అనుకుని రిప్‌లై ఇచ్చిన వారి నుంచి రిజిస్ట్రేషన్‌ ఫీజులు, జీఎస్టీ అంటూ వివిధ పేర్లు చెప్పి డబ్బు గుంజుతున్నారు. ఈ విధంగానే కాకుండా బ్యాంకు అధికారులమంటూ క్రెడిట్, డెబిట్‌ కార్డుల వివరాలను తెలుసుకుని క్లోనింగ్‌ ద్వారా బ్యాంకు ఖాతాలోని డబ్బును దోచేస్తున్నారు.

డమ్మీ నోటిఫికేషన్లతో మోసం..
రాని నోటిఫికేషన్లు వచ్చాయంటారు. కొత్త కొత్త నోటిఫికేషన్ల పుట్టిస్తారు. నోటిఫికేషన్లు అంటూ నోట్లో మన్ను కోడతారు. నిరుద్యోగుల బలహీనతను సొమ్ము చేసుకుంటారు. ఫీజుల పేరిట డబ్బులు వసూలు చేస్తారు. అధికంగా ఉన్న నిరుద్యోగులు డమ్మీ నోటిఫికేషన్లు చూసి నిజమేననుకోని అప్లై చేస్తున్నారు. డమ్మి నోటిఫికేషన్లు విడుదల చేసే వెబ్‌సైట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ప్రభుత్వ నోటిఫికేషన్లు విడుదల చేసినప్పుడు సైతం మరో వెబ్‌సైట్‌తో ఆదే నోటిఫికేషన్‌ విడుదల చేస్తున్నారు. అసలైన వెబ్‌సైట్‌ ఎదో తెలియక డమ్మీ వెబ్‌సైట్‌లో ఫీజు కట్టి మోసపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. రైల్వేలకు సంబంధించిన ఉద్యోగ ప్రకటనలో ఈ తరహా మోసం అధికంగా ఉంది.

ప్రత్యేక నిఘా 
వినియోగదారులు, నిరుద్యోగులలో అవేర్‌నెస్‌ పెరగాలి. ముఖ్యంగా యువత సోషల్‌ మీడియాలో అపరిచితులు చెప్పే మాటలు నమ్మవద్దు. బ్యాంక్‌ల నుంచి వచ్చే మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ తెలియపరచకూడదు. బ్యాంకు అధికారులు వ్యక్తిగత సమాచారం ఎట్టి పరిస్థితుల్లో అడగరు. ఇటువంటి ఫోన్‌ కాల్స్‌ వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయజేయాలి.
 – మహేందర్‌ మాతే, సిటీ టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement