విజయనగరం ఫోర్ట్: ఆదాయార్జనే ధ్యేయం. ఆరోగ్య పరిరక్షణ పూజ్యం. జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వాటికి అనుబంధంగా ల్యాబ్‌రేటరీలు కూడా సందుకొకటి వెలుస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ప్రతి వైద్యునికి ఒకటి రెండు క్లినిక్‌లున్నాయి. వీటన్నిటికీ వైద్యశాఖ అనుమతి ఉన్న దాఖలాల్లేవు. కనీసం సగం ఆస్పత్రులకు కూడా లేకపోవడం గమనార్హం.
అధికారుల ఉదాసీనత
వైద్య ఆరోగ్య శాఖాధికారులు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోని ఆస్పత్రులు గురించి పట్టించుకోవడం లేదు. ఏటా దృష్టి సారిస్తున్నామని చెప్పడం తప్ప చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల యజమానులు కూడా తమను ఎవరేమీ చేయలేరనే ధీమాతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల యజమానులతో సమావేశమై రిజిస్ట్రేషన్ చేయించుకోమని గట్టిగాద సందర్భాలు కానరావడం లేదు. ఇలాంటి ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే రోగులు కూడా నష్టపోతారు. ఏదైనా ప్రమాదం జరిగితే బీమా వంటి సౌకర్యాలు వర్తించవు. ఆస్పత్రులు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వైద్య ఆరోగ్యశాఖకు కూడా ఆదాయం వస్తుంది. కానీ ఆ దిశగా ఆ శాఖాధికారులు కసరత్తు చేయడం లేదు.
క్లినిక్ అయితే రిజిస్ట్రేషన్ నిమిత్తం రూ.2500 వైద్య ఆరోగ్యశాఖకు చెల్లించాలి. నర్సింగ్‌హోమ్‌లు రూ.3750, 20 నుంచి 50 పడకల ఆస్పత్రి రూ.7500, 50 దాటితే రూ.10 వేలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఒకసారి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అయిదేళ్ల వరకు చాలు. అయిదేళ్లు దాటితే రెన్యువల్ చేయించుకోవాలి. కొత్త స్కానింగ్ సెంటర్ రిజిస్ట్రేషన్‌కు రూ.35,000 రుసుము చెల్లించాలి. ల్యాబ్‌రేటరీలకు రూ.2500 చెల్లించాలి. సీటీ స్కాన్, ఎంఆర్ స్కాన్‌లకు అయితే రూ.17,500 చెల్లించాలి. జిల్లాలోని ఆస్పత్రులు, ల్యాబ్‌రేటరీలు, నర్సింగ్‌హోమ్‌లన్నీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వైద్య ఆరోగ్యశాఖకు సుమారు రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఆదాయం వస్తుంది.
అనుమతి లేకున్నా వైద్యం
జిల్లాలో 400 వరకు ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లున్నాయి. వీటిలో 203 ఆస్పత్రులు, ల్యాబ్‌లు మాత్రమే వైద్య ఆరోగ్యశాఖ వద్ద నమోదు చేయించుకున్నాయి. వైద్య శాఖ అనుమతి లేకుండానే ప్రైవేటు ఆస్పత్రులను నిర్వహిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నాయి. ఆస్పత్రులకు వచ్చే రోగులకు అధిక మెత్తంలో బిల్లులు వేసి అడ్డంగా దోచేస్తున్నారు. సాధారణ జ్వరాలకు కూడా వేలాల్లో బిల్లులు వేసేసి దోచేస్తున్నారు. జిల్లాలో 200 వరకు ల్యాబ్‌రేటరీలు, క్లినిక్‌లు రిజిస్ట్రేషన్ లేకుండానే ఆస్పత్రులను నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చేయించుకోమంటున్నాం
జిల్లాలో 203 క్లినిక్‌లు, ల్యాబ్‌రేటరీలు, నర్సింగ్‌హోమ్‌లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి. రిజిస్ట్రేషన్ చేయించుకోని ఆస్పత్రులకు కూడా చేయించుకోమని చెబుతున్నాం. – సి.పద్మజ, డీఎంహెచ్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment