తీవ్రంగా గాయపడిన సాయి
విజయనగరం మున్సిపాలిటీ : పందుల నియంత్రణ చర్యల్లో అధికారుల నిర్లక్ష్య వైఖరి ఓ బాలుడి నిండు ప్రాణాల మీదకు తెచ్చింది. జిల్లా కేంద్రమైన విజయనగరం మున్సిపాలిటీలో ఆదివారం పట్టణ శివారు ప్రాంతమైన సింగపూర్ సిటీ ప్రాంగణంలో జరిగిన సంఘటనతో ప్రజలంతా ఉలిక్కిపడ్డారు. అదే ప్రాంతానికి టి.సాయి (9) నిత్యావసరాల కోసం దుకాణానికి వెళ్తుండగా.. మార్గమధ్యలో పిల్లల పంది అనూహ్యంగా దాడి చేసింది. సమీపంలో ఎవ్వరు లేకపోవడంతో సాయిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. దీంతో సాయి ముఖంతో పాటు కడుపు, రెండు చేతులు, తొడ భాగంపై తీవ్ర గాయలపాలయ్యాయి. విషయం తెలుసుకుని తల్లిదండ్రులు, స్థానికులు సాయిని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స అందించి 40 కుట్లు వేశారు. మెరుగైన శస్త్ర చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.
ఉలిక్కిపడిన సింగపూర్ కాలనీ వాసులు..
బాలుడిపై పంది దాడి చేయడంతో సింగపూర్ సిటీ ప్రాంతంలో నివసిస్తున్న వారంతా ఉలిక్కిపడ్డారు. నిత్యం వందలాది మంది చిన్నారులు ఈ ప్రాంతంలో పాఠశాలలకు వస్తుంటారు. అయితే ఆదివారం జరిగిన సంఘటనతో పిల్లలను బడికి పంపించేందుకు కూడా భయపడాల్సి వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారిపై పంది తీవ్ర స్థాయిలో దాడి చేసినా మున్సిపల్ యంత్రాంగం స్పందించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం చేశారు. పందులు, కుక్కల దాడిలో నిత్యం ఎవరో ఒకరు గాయపడుతున్నా మున్సిపల్ పాలకవర్గం, యంత్రాంగం పట్టించుకోకపోవడం పట్ల దారుణమంటూ పట్టణవాసులు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment