మద్దూరులో దీక్ష కొనసాగిస్తున్న బాధితురాలు ఉమా మహేశ్వరి
పశ్చిమగోదావరి , కొవ్వూరు: ఐదేళ్ల కాపురం అనంతరం భర్త నిరాదరణకు గురైన బండి ఉమా మహేశ్వరి(గౌరి) కొవ్వూరు మండలం మద్దూరులో చేపట్టిన నిరసన దీక్ష ఆరో రోజుకు చేరింది. కడియపులంకకు చెందిన ఉమా మహేశ్వరి మద్దూరుకు చెందిన బండి పూర్ణ సుబ్బారావును 2012లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం దుబాయ్ వెళ్లిన సుబ్బారావు ఉమా మహేశ్వరికి విడాకులు నోటీసులు పంపించాడు. దీంతో బాధితురాలు మద్దూరులోని సుబ్బారావు పెంపకానికి వచ్చిన అతని పెద నాన్న పుసులూరి గంగాధరరావు ఇంటివద్దనే నిరశన దీక్ష చేపట్టింది. అయితే ఆమె పూర్తిగా నీరసించి పోవడంతో బుధవారం వైద్యులు సెలైన్‌లు పెట్టారు.
అధికార పార్టీ నేతల తీరుపై విమర్శలు
అధికార పార్టీ నేతలు సుబ్బారావు కుటుంబానికి సహకరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెళ్లి చేసుకుని ఐదేళ్ల పాటు కాపురం చేసి ఇప్పుడు విడాకులు ఇవ్వమంటున్నాడని ఓ మహిళ ఆవేదనతో రోడ్డెక్కి భర్త ఇంటి వద్ద నిరసన వ్యక్తం చేస్తుంటే ఇంత వరకు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి కేఎస్ జవహర్ ఆమెను పరామర్శించకపోవడానికి ఇదే కారణమని చెబుతున్నారు. తనకు న్యాయం చేసి తన కాపురం నిలబెట్టాలని బాధితురాలు దీనంగా వేడుకుంటోంది. మంత్రి అండతో కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
బాధితురాలికి పలువురి మద్దతు
ఇప్పటికే కాపు సంఘం యువకులు భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీవోకు, డీఎస్పీకి వినతిపత్రాలు సమర్పించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు అధికార పార్టీనేతలు బాధితురాలి భర్త పూర్ణ సుబ్బారావుకు అండగా ఉండడం చేతనే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత, ఆ పార్టీ నాయకులు బాధితురాలిని పరామర్శించి ఆమెకు బాసటగా నిలిచారు. మాజీ ఎమ్మెల్సీ వైఎస్సార్ సీపీ నేత కందుల దుర్గేష్ బుధవారం దీక్షా శిబిరాన్ని సందర్శించి బాధితులిరాలి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా బాధితురాలికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. అనంతరం దుర్గేష్ మాట్లాడుతూ ఇప్పటి వరకు అధికార యంత్రాంగం స్పందించకపోవడం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు గురుజు బాలమురళీకృష్ణ, కడియపులంక మాజీ సర్పంచ్ గట్టు నరసయ్య, గంగుమళ్ల శేషగిరి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దళిత హక్కుల పోరాట సమితి నాయకురాలు ఎండీ సలీమ, బాధితురాలి బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వారిద్దరూ కలిసున్నా అభ్యంతరం లేదు :విలేకరులతో మాట్లాడిన పూర్ణ సుబ్బారావు తల్లిదండ్రులు
చాగల్లు: బండి ఉమా మహేశ్వరి దీక్షపై ఎట్టకేలకు చంద్రవరంలో పూర్ణ సుబ్బారావు తల్లిదండ్రులు బండి సత్యనారాయణ, లక్ష్మీ తాయారు స్పందించారు. బుధవారం వారు గ్రామంలో ఎంపీపీ రమామణి ఆధ్వర్యంలో విలేకరులతో మాట్లాడారు. ఉద్రిక్తతలకు తావివ్వకుండా సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. ఐదేళ్ల క్రితం కొవ్వూరు పోలీస్‌స్టేషన్‌లో వీరిద్దరి వివాహం మా ప్రమేయం లేకుండానే జరిగిందని చెప్పారు. సుబ్బారావు చిన్ననాటి నుంచి మద్దూరులో ఉన్న పెదనాన్న వద్ద పెరిగాడని అన్నారు. ఇప్పుడు జరుగుతున్న వీరి కుటుంబ కలహాలు కూడా తమకు ఏమాత్రం తెలియదన్నారు. అయితే మంగళవారం అమెకు మద్దతుగా నిర్వహించిన బైక్ ర్యాలీలో కొంతమంది తమ ఇంటివద్దకు వచ్చి హడావుడి సృష్టించారన్నారు. కొడుకు, కోడలు కలిసి ఉన్నా మాకు అభ్యంతరం లేదని తెలిపారు. కాగా తమకు మిగిలిన కుమారుల మీద కూడా కేసులు పెట్టారని సుబ్బారావు తల్లిదండ్రులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎంవీ సుబ్బారావు, మాజీ వైస్ ఎంపీపీ మద్దుకూరి వీరరాఘవులు, కోడూరి ప్రసాద్, మద్దుకూరి శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment