సాక్షి, యాదాద్రి : జిల్లాలో భువనగిరి, ఆలేరు, మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం ఉంది. ప్రస్తుతం ఈ ఐదు నియోజకవర్గాల్లోనూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్, బీజేపీ పక్షాలు తమ బలాబలాను బేరీజు వేసుకునేందుకు సర్వేలను ప్రారంభించాయి. ఆరు నెలల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీల పని తీరుపై రెండు దఫాలు సర్వే చేయించిన విషయం తెలిసిందే. అదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బెంగళూరుకు చెందిన ఓ సంస్థతో నియోజకవర్గాల వారీగా సర్వే చేయించారు. బీజేపీ సైతం జాతీయస్థాయి ప్రతినిధి బృందాన్ని జిల్లాకు పంపించి సర్వే చేయించింది. అయితే సర్వేలో అందరికీ సానుకూల ఫలితాలు వచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవారు వచ్చే ఎన్నికల్లో శాసనసభ స్థానాలకు పోటీ చేయాలనుకునే ఆశావహులు సైతం ఇటీవల సర్వేలు చేయించారు. తాజాగా జిల్లాలో ఓ సంస్థ ఆన్‌లైన్ సర్వే చేపట్టింది.
వందల సంఖ్యలో శా0పిల్స్ సేకరణ
ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు సర్వేల్లో బిజీగా ఉన్నాయి. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలాబలాలు, వ్యక్తిగత, పార్టీ పని తీరు, ఎన్నికల్లో ఎవరితో పోటీపడితే ఎలాంటి ఫలితాలు వస్తాయి, విజయానికి సానుకూల, వ్యతిరేక అంశాలపై సర్వేలో లెక్కలు తీస్తున్నట్లు తెలుస్తోంది. యువత, మహిళలు, ఉద్యోగ, వ్యాపార, మధ్య తరగతి, కులాల వారీగా, మైనార్టీ, దళిత, గిరిజన వర్గాల్లో ఆయా అభ్యర్థులు తమ అనుకూల, వ్యతిరేక అంశాలపై సర్వే చేయించారు. ఇందుకోసం ఆయా నియోజకవర్గాల్లో వందల సంఖ్యలో సేకరించిన శాంపిల్స్‌ను క్రోడీకరిస్తున్నారు. బలం, బలహీనతలను గుర్తించడంతోపాటు వాటిని అధిగమించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై ప్లాన్ చేసుకుంటున్నారు.
వేర్వురుగా సర్వేలు..
ఆశావహులతో పాటు రాజకీయ పార్టీలు, జాతీయ స్థాయి సంస్థలు, విద్యార్థి సంస్థలు వేర్వేరుగా సర్వేలకు దిగుతున్నాయి. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో మారుతున్న రాజకీయ సమీకరణలు, ప్రజల ఆలోచన విధానం, ప్రభుత్వ పనితీరు, ప్రతిపక్షాల పనితీరు, ఆయా పార్టీల నుంచి పోటీ చేసే ఆశావహుల పనితీరు ప్రజల్లో వారికి ఉన్న సానుకూల, వ్యతిరేక అంశాలపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తున్నాయి. ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వ్యవస్థతోపాటు, ప్రైవేట్ సంస్థలతో సర్వేలు చేయించడం జరుగుతుంది. అయితే ఆరు నెలలుగా జరిగిన వివిధ సర్వేల ఫలితాలు ఎప్పటికప్పుడు మారుతూ వస్తున్నాయి. ఆశావహులు సర్వే ఫలితాలను ఉత్కంఠతో పరిశీలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment