జన ఉప్పెన
► కదిరి నియోజకవర్గంలో పూర్తయిన రైతుభరోసా యాత్ర
► రోడ్‌షోకు వేలాదిగా తరలివచ్చిన ప్రజలు
► నాల్గోరోజు ఒక కుటుంబానికి భరోసా... ఎన్‌పీకుంట సోలార్ భూ బాధితులతో ముఖాముఖి
► ప్లాంటు పరిశీలనకు వెళుతుండగా అనుమతిలేదని కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు
► కదిరిలో జగన్ కాన్వాయ్‌పై రాళ్లు వేసిన కందికుంట అనుచరులు.. ప్రచారరథం అద్దాలు ధ్వంసం
► నేడు పుట్టపర్తి నియోజకవర్గం ఓడీసీలో రైతుభరోసా యాత్ర
సాక్షిప్రతినిధి, అనంతపురం :- కదిరి రోడ్లన్నీ జనంతో కిక్కిరిశాయి. జీవిమాన్ సర్కిల్ నుంచి నాలుగు రోడ్లలో ఎటువైపు చూసినా కనుచూపు మేర జనమే కన్పించారు. అభిమాన నేతను చూడాలనే తపన.. ఆదరించి ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే పార్టీ మారారనే కసి కలగలిసి భారీగాపోటెత్తారు. నాలుగోరోజు రైతుభరోసాయాత్ర శనివారం కదిరి ఆర్‌అండ్‌బీ అతిథిగృహం నుంచి మొదలైంది. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని చూసేందుకు ఉదయమే ప్రజలు భారీగా అతిథిగృహం వద్దకు తరలివచ్చారు. అందరినీ జగన్ ఆప్యాయంగా పలకరించారు. అక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే కడపల మోహన్‌రె డ్డి నివాసానికి వెళ్లారు. అక్కడి నుంచి కుమ్మరవాండ్లపల్లి, మరవతండా మీదుగా కమతంపల్లికి చేరుకున్నారు. రిటైర్డ్ పోస్టుమాస్టర్ వలి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆ తర్వాత ద్వార్నాల, కటారుపల్లి క్రాస్ మీదుగా గాండ్లపెంటకు చేరుకున్నారు. ఇక్కడ గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలతో హోరెత్తించారు. కాన్వాయ్‌పై పూలవర్షం కురిపించారు. అక్కడి నుంచి తాళ్లకాలువ మీదుగా రెక్కమాన్ క్రాస్ చేరుకున్నారు. దారిలో కూలీలు, వృద్ధులు, వికలాంగులను పలకరించారు. రెక్కమాను క్రాస్‌లోనూ జనం పోటెత్తారు.
ఆపై ధనియాన్‌చెరువు, టి.కొత్తపల్లి, కొట్టంవారిపల్లి, బందారుచెట్లపల్లి మీదుగా ఎన్‌పీకుంట చేరుకున్నారు. ఎన్‌పీ కుంట రోడ్లన్నీ కిక్కిరిశాయి. గ్రామ ప్రవేశం నుంచి వైఎస్ విగ్రహం వరకు పూలవర్షం కురిపిస్తూ, డప్పు వాయిద్యాలతో హోరెత్తించారు. దివంగత వైఎస్‌ఆర్ విగ్రహానికి జగన్ పూలమాల వేశారు. తర్వాత సోలార్ భూ బాధితులతో ముఖాముఖి నిర్వహించారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని వారు ఏకరువు పెట్టారు. వైఎస్సార్‌సీపీ అండగా ఉండి పోరాడుతుందని జగన్ భరోసా ఇచ్చారు. తర్వాత సోలార్‌ప్లాంటును పరిశీలించేందుకు బయలుదేరారు. ఇందుకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. ప్లాంటు ఎలా ఏర్పాటు చేశారో చూసి వచ్చేందుకు వెళుతున్నామని, అక్కడ ధర్నా చేయడం లేదని విన్నవించినా వారు వినలేదు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు కాన్వాయ్ ముందు నిలబడి వెళ్లకుండా అడ్డుపడ్డారు. తర్కాత సింగిల్‌విండో ప్రెసిడెంట్ జగదీశ్వరరెడ్డి నివాసానికి వెళ్లారు.
అక్కడి నుంచి తిరిగి కదిరికి బయల్దేరారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఎన్‌పీకుంట నుంచి తిరుగుప్రయాణమైన జగన్ కాన్వాయ్ కదిరికి వచ్చేందుకు ఆరు గంటలు పట్టింది. జగన్ ఎన్‌పీ కుంటకు వెళ్లినప్పటి నుంచి తిరిగొచ్చేదాకా జనాలు రోడ్లపైనే వేచి ఉన్నారు. మిద్దెలపై కూడా భారీ సంఖ్యలో గుమికూడారు. కదిరిలో ప్రజలనుద్దేశించి జననేత ప్రసంగించారు. తర్వాత తలుపుల మండలం కుర్లిరెడ్డివారిపల్లికి చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న చంద్రశేఖర్ అనే రైతు కుటుంబాన్ని పరామర్శించారు. నాలుగోరోజు యాత్రలో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిలరఘురాం, రాష్ట్ర ప్రధానకార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, రాయచోటి, మదనపల్లి, చంద్రగిరి ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, దేశాయ్ తిప్పారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు బి.గురునాథరె డ్డి, కాపు రామచంద్రారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, సీఈసీ సభ్యులు డాక్టర్ సిద్దారెడ్డి, జక్కల ఆదిశేషు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్ర భాస్కర్‌రెడ్డి, క్రమశిక్షణ కమిటీ సభ్యుడు ఎర్రిస్వామిరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు శ్రీధర్‌రెడ్డి, ఆలూరి సాంబశివారెడ్డి, ఉషాశ్రీచరణ్, నవీన్‌నిశ్చల్ తదితరులు పాల్గొన్నారు.