సాక్షి, అమరావతి: ఉల్లి, టమాటా రైతులకు ఏడాది పొడవునా గిట్టుబాటు ధర, పొదుపు సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నట్టు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ (ఏపీఎస్‌ఎఫ్‌పీఎస్) సీఈవో ఎల్.శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు. కర్నూలు జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన 100 యూనిట్లు విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారన్నారు.
దీంతో రూ. 84 కోట్ల అంచనాతో 5 వేల యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం సోమవారం విజయవాడలో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. సొసైటీ సీఈవో శ్రీధర్‌రెడ్డి, బీవోబీ డీజీఎం చందన్ సాహూ ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ఒక్కో యూనిట్ అంచనా వ్యయం రూ.1.68 లక్షలని చెప్పారు.
ప్రాజెక్టు వ్యయంలో ప్రభుత్వం 35 శాతం (రూ.29.40కోట్లు) సబ్సిడీగా భరిస్తుందని, లబ్ధిదారులు 10 శాతం (రూ.8.40 కోట్లు) చెల్లించాల్సి ఉంటుందన్నారు.మిగిలిన 55 శాతం (రూ.46.20 కోట్లు) బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. ఆహార వ్యర్థాలను తగ్గించడం, వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచడం, గ్రామీణ మహిళా సాధికారత ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలన్నారు.
కర్నూలులో పైలెట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన యూనిట్ల ద్వారా ఒక్కో మహిళ సగటున రూ.12 వేల అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని చెప్పారు. బి, సి గ్రేడ్ ఉల్లి, టమాటాలకు సైతం రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రాయలసీమ జిల్లాల్లో 3,500 యూనిట్లు, మిగిలిన జిల్లాల్లో మరో 1,500 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
బ్యాంక్ డీజీఎం చందన్ సాహూ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. ఈ తరహా ప్రాజెక్టులకు ఆర్థి క చేయూతనిచ్చేందుకు, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు బ్యాంక్ సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్‌ఎఫ్‌పీఎస్ స్టేట్ లీడ్ సుభాష్ కిరణ్ కే, మేనేజర్ సీహెచ్ సాయి శ్రీనివాస్, బ్యాంక్ రీజనల్ మేనేజర్లు కె.విజయరాజు, పి.అమర్నాథ్‌రెడ్డి, ఎంవీ శేషగిరి, ఎంపీ సుధాకర్, రీజనల్ ఇన్‌చార్జి డి. రాజాప్రదీప్, డీఆర్‌ఎం ఏవీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment