Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

AP High Court expresses deep anger over police department1
హద్దు మీరొద్దు.. పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

పోలీసుల తీరు చూస్తుంటే మాకు రక్తపోటు (బీపీ) పెరిగిపోతోంది. చాలా క్యాజువల్‌గా కేసులు పెడుతున్నారు. వాంగ్మూలాలను సృష్టిస్తున్నారు. ఏదో ఒక కేసు నమోదు చేయాలి. ఎవరో ఒకరిని అరెస్టు చేయాలనే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. -హైకోర్టు ధర్మాసనం తప్పు చేస్తే.. కేసు పెట్టడం, అరెస్ట్‌ చేయడం తప్పు కాదు. కానీ అరెస్ట్‌ చేయడానికే కేసు పెడితేనే సమస్య. మీ తప్పులను ఎన్నని ఎత్తి చూపాలి? ఎలా పడితే అలా వ్యవహరించే ముందు బాగా ఆలోచించుకోండి. పోలీసులు పరిధి దాటి వ్యవహరించడంపై మాకు చాలా విషయాలు తెలుసు. మేం కోర్టుల్లో ఉంటాం కాబట్టి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలియదని ఎంత మాత్రం అనుకోవద్దు. మీరేం చేస్తున్నా చూస్తూ ఉండాలంటారా? మేమేం చేయలేం..! మీరు మరో మార్గం చూసుకోండని పిటిషనర్లకు చెప్పమంటారా? పోలీసులకు సొంత నిబంధనలతో కూడిన మాన్యువల్‌ ఉంది. దాన్ని కూడా ఫాలో కావడం లేదు. కేవలం పోలీసులను మాత్రమే తప్పుపడితే సరిపోదు.. మా మేజిస్ట్రేట్లను కూడా తప్పు పట్టాల్సి ఉంది. పోలీసులు ఏది దాఖలు చేస్తే దాని ఆధారంగా రిమాండ్‌ విధించేస్తున్నారు. వారు సమర్పించిన కాగితాల్లో ఏముందో కూడా కనీస స్థాయిలో చూడటం లేదు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసుల ‘అతి’పై హైకోర్టు మరోసారి నిప్పులు చెరిగింది. పెద్దల మెప్పు కోసం పనిచేస్తే, సమస్య వచ్చినప్పుడు వాళ్లొచ్చి మిమ్మల్ని కాపాడరని వ్యాఖ్యానించింది. చట్టం, నిబంధనలు, పోలీసు మాన్యువల్‌కు లోబడి పని చేయాల్సిందేనని స్పష్టం చేసింది. పోలీసులు తమ పరిధులు గుర్తెరిగి విధులు నిర్వర్తించాలంది. పోలీసులు ఎలా పనిచేస్తున్నారో తమకు బాగా తెలుసని పేర్కొంది. అలాగే తాము ఏమీ చేయలేమని అనుకోవద్దని హెచ్చరించింది. ఏం చేస్తున్నా కూడా చూడనట్లుగా తమను (కోర్టు) కళ్లు మూసుకుని ఉండాలని భావిస్తున్నారని, అది ఎంత మాత్రం సాధ్యం కాదని తెలిపింది. పోలీసుల తీరు చూస్తుంటే తమకు రక్తపోటు (బీపీ) పెరిగిపోతోందంటూ వ్యాఖ్యానించింది. చాలా క్యాజువల్‌గా కేసులు పెట్టేస్తున్నారని, వాంగ్మూలాలను సృష్టిస్తున్నారని పోలీసుల తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఇలాంటి వాటిని తాము నమ్మాలని పోలీసులు అనుకుంటున్నారని పేర్కొంది. ఏదో ఒక కేసు నమోదు చేయాలి.. ఎవరో ఒకరిని అరెస్ట్‌ చేయాలనే రీతిలో పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడింది. ప్రభుత్వాన్ని డ్రామా రూపంలో వ్యంగ్యంగా విమర్శించినందుకు కేసు పెడితే.. ప్రతి సినిమా హీరోను, ప్రతి నటుడినీ అరెస్ట్‌ చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. వ్యంగ్య విమర్శలతో ప్లకార్డులు పట్టుకోవడం తప్పా? దానిపై రీల్‌ చేయడం తప్పా? అని పోలీసులను నిలదీసింది. వ్యంగ్య విమర్శలతో ప్లకార్డులు పట్టుకోవడం వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం కిందకు వస్తుందా? అని విస్మయం వ్యక్తం చేసింది. పోలీసులు ఎలా పడితే అలా కేసులు పెడితే విశ్వసనీయత ఏముంటుందని ప్రశ్నించింది. కేవలం పోలీసులను మాత్రమే తప్పుపడితే సరిపోదని, తమ మేజిస్ట్రేట్లను కూడా తప్పు పట్టాల్సి ఉందని హైకోర్టు తెలిపింది. పోలీసులు ఏం దాఖలు చేస్తే దాని ఆధారంగా రిమాండ్‌ విధించేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. పోలీసులు సమర్పించిన కాగితాల్లో ఏముందో కూడా కనీస స్థాయిలో చూడటం లేదని, ఈ విషయాన్ని తాము ఒప్పుకుని తీరాల్సిందేనని పేర్కొంది. ఇప్పటికే పలు సందర్భాల్లో మేజిస్ట్రేట్ల తీరును ఆక్షేపించామని హైకోర్టు గుర్తు చేసింది. డ్రామా రూపంలో వ్యంగ్యంగా ప్రభుత్వాన్ని విమర్శించి, రీల్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టినందుకు మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్‌ అరెస్ట్‌ చేయడంపై సంబంధిత రికార్డులన్నీ తమ ముందుంచాలని కర్నూలు త్రీ టౌన్‌ పోలీసు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ను ఆదేశించింది. అలాగే పోలీసులు సమర్పించిన రికార్డులు, నమోదు చేసిన వాంగ్మూలాల కాపీలను తమకు పంపాలని కర్నూలు ఫస్ట్‌ క్లాస్‌ స్పెషల్‌ జుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్‌ 8కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రావు రఘునందన్‌రావు, డాక్టర్‌ జస్టిస్‌ కుంభజడల మన్మథరావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.అక్రమ నిర్భంధంపై హెబియస్‌ కార్పస్‌..పోలీసులు తన తండ్రి ప్రేమ్‌కుమార్‌ను అక్రమంగా నిర్భంధించారని, ఆయన్ను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ కొరిటిపాటి అభినయ్‌ గతేడాది హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్‌ రఘునందన్‌రావు ధర్మాసనం తాజాగా మరోసారి విచారణ నిర్వహించింది. అభినయ్‌ తరఫున న్యాయవాది వేలూరి మహేశ్వరరెడ్డి వాదనలు వినిపించగా, పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) విష్ణుతేజ వాదనలు వినిపించారు.తప్పుల మీద తప్పులు...డ్రామా రూపంలో వ్యంగ్యంగా ప్రభుత్వాన్ని విమర్శించినందుకు బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారంటూ కేసు పెడతారా? అది కూడా అరెస్టు సమయంలో రూ.300 దొరికాయంటూ! అని ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని, ఇలా చేస్తే సమస్యలపై సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ సమయంలో మహేశ్వరరెడ్డి స్పందిస్తూ.. నానాపటేకర్‌ నటించిన వజూద్‌ సినిమాలో పోలీసులు వ్యవహరించిన రీతిలో ఈ కేసులో పోలీసులు ప్రవర్తిస్తున్నారని తెలిపారు. సోషల్‌ మీడియా యాక్టివిస్టుల పట్ల పోలీసులు ఏకపక్షంగా, చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను సైతం బేఖాతరు చేస్తున్నారని, ఈ నేపథ్యంలో చట్ట నిబంధనల గురించి పోలీసులను జాగృతం చేయాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ఉత్తర్వులు జారీ చేయాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది జోక్యం చేసుకుని పోలీసుల చర్యలను సమర్థించే ప్రయత్నం చేయగా ధర్మాసనం ఆయన్ను వారించింది. తప్పు చేసిన వారిని వెనకేసుకురావద్దని హితవు పలికింది.అరెస్ట్‌ చేయడానికే కేసు పెడతామంటే ఎలా..?“ప్రేమ్‌కుమార్‌ను అర్థరాత్రి అరెస్ట్‌ చేస్తారా? అంత అత్యవసరంగా అరెస్టు చేయాల్సినంత కేసా ఇది? పైగా కర్నూలు నుంచి 8–9 గంటలు ప్రయాణం చేసి వచ్చి మరీ అరెస్ట్‌ చేస్తారా? ఆయననేమన్నా పారిపోతున్నారా? ప్రేమ్‌కుమార్‌ రీల్‌ను సోషల్‌ మీడియాలో చూశానంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడం.. మీరు పోలోమంటూ కర్నూలు నుంచి అర్థరాత్రి వచ్చి అరెస్ట్‌ చేయడం! అంతేకాదు.. అరెస్ట్‌ చేసి పలు ప్రదేశాలు తిప్పారు. ఇదంతా ఎవరి మెప్పు కోసం చేస్తున్నారు? ఉన్నతాధికారుల మెప్పు కోసం పనిచేస్తే ఇలాంటి సమస్యలు వస్తాయి. ఓ వ్యక్తిని ఎక్కడ అరెస్ట్‌ చేస్తే అక్కడి వ్యక్తులను పంచాయతీదారులుగా చూపాలి. కానీ ఈ కేసులో కర్నూలు పోలీసులు తమ వెంట అక్కడి నుంచే పంచాయతీదారులను తెచ్చుకున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పోలీసులు కొత్త కొత్త పద్ధతులు కనిపెడుతున్నారు. మీరు ఇలాంటివి చేస్తుంటే, మేం కళ్లు మూసుకుని ఉండాలని భావిస్తున్నారు. మీరు ఇలాగే వ్యవహరిస్తుంటే చాలా సమస్యలు వస్తాయి. తప్పు చేస్తే కేసు పెట్టడం, అరెస్ట్‌ చేయడం తప్పు కాదు. కానీ అరెస్ట్‌ చేయడానికే కేసు పెడితేనే సమస్య’ అని ధర్మాసనం పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఎలా పడితే అలా చేసే ముందు బాగా ఆలోచించుకోండి...!“గుంటూరులో ప్రేమ్‌ కుమార్‌ బలవంతపు వసూళ్లకు పాల్పడితే కర్నూలు పోలీసులు కేసు ఎలా పెడతారు? మీకున్న పరిధి ఏమిటి? అసలు కర్నూలు నుంచి గుంటూరుకు వచ్చేందుకు మీ జిల్లా ఎస్పీ నుంచి అనుమతి తీసుకున్నారా? మేం ఇప్పుడు అనుమతి ఉందా? అని అడిగాం కాబట్టి వచ్చే విచారణ నాటికి అనుమతి తెస్తారు. ప్రేమ్‌కుమార్‌ అరెస్ట్‌ గురించి గుంటూరు పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలి. కానీ వారికి మీరెప్పుడు సమాచారం ఇచ్చారు? మీ తప్పులను ఎన్నని ఎత్తి చూపాలి? ఎలా పడితే అలా వ్యవహరించే ముందు బాగా ఆలోచించుకోండి. పోలీసులు పరిధి దాటి వ్యవహరించడంపై మాకు చాలా విషయాలు తెలుసు. మేం కోర్టుల్లో ఉంటాం కాబట్టి, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలియదని ఎంత మాత్రం అనుకోవద్దు. పోలీసుల చర్యలు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతోంది. ప్రేమ్‌ కుమార్‌ను అర్ధరాత్రి అరెస్ట్‌ చేసిన కర్నూలు త్రీటౌన్‌ ఎస్‌హెచ్‌వో.. ఫిర్యాదులు అందగానే ఎన్ని కేసుల్లో ఇలా అప్పటికప్పుడు అరెస్టులు చేశారు? ఎన్ని కేసుల్లో ఇలా అర్ధరాత్రులు వెళ్లారు? మీరేం చేస్తున్నా చూస్తూ ఉండాలంటారా? మేమేమీ చేయలేం.. మీరు మరో మార్గం చూసుకోండని మమ్మల్ని పిటిషనర్లకు చెప్పమంటారా? పోలీసులకు వారి సొంత నిబంధనలతో కూడిన మాన్యువల్‌ ఉంది. దాన్ని కూడా వాళ్లు ఫాలో కావడం లేదు. ఇక్కడ మా మేజిస్ట్రేట్ల తప్పు కూడా ఉంది. ఈ కేసులో ప్రేమ్‌కుమార్‌ నేరాలు చేయడమే అలవాటైన వ్యకిŠాత్గ పేర్కొంటూ పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌లో రాస్తే మేజిస్ట్రేట్‌ దాన్ని కనీస స్థాయిలో కూడా పరిశీలించలేదు. రూ.300 వసూలు చేయడం అలవాటైన నేరం కిందకు వస్తుందా? అనే విషయాన్ని కూడా గమనించలేదు. ఈ కేసుకు సంబంధించిన అన్నీ రికార్డులను మేం పరిశీలించాలనుకుంటున్నాం’ అని ధర్మాసనం తెలిపింది. ఈమేరకు రికార్డులను తమ ముందుంచాలని కర్నూలు త్రీటౌన్‌ ఎస్‌హెచ్‌వో, మేజిస్ట్రేట్‌ను ఆదేశించింది.పౌర స్వేచ్ఛపై “సుప్రీం’ ఏం చెప్పిందంటే...“ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలను విమర్శించడం.. నిరసించడాన్ని నేరం అంటే ప్రజాస్వామ్య మనుగడే సాధ్యం కాదు..’’“స్వేచ్ఛగా మాట్లాడటం, భావ వ్యక్తీకరణ లాంటి వాటి గురించి మన పోలీసు యంత్రాంగానికి బోధించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విషయంలో వారికి జ్ఞానోదయం కలిగించాలి. స్వేచ్ఛగా మాట్లాడం, భావవ్యక్తీకరణపై ఎంత వరకు సహేతుక నియంత్రణ విధించాలన్న దానిపై అవగాహన కల్పించాలి. రాజ్యాంగం మనకందించిన ప్రజాస్వామ్య విలువల గురించి వారికి అవగాహన కల్పించాల్సిన సమయం వచ్చింది’’“భిన్నాభిప్రాయం, అసమ్మతి తెలియచేయడం అన్నది రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో అంతర్భాగం. ప్రతి పౌరుడు కూడా ఇతరులు వ్యక్తం చేసే భిన్నాభిప్రాయాన్ని గౌరవించాలి. ప్రభుత్వ నిర్ణయాలపై శాంతియుతంగా నిరసన తెలియచేసే అవకాశం ఇవ్వడం ప్రజాస్వామ్యంలో తప్పనిసరి’’– ప్రొఫెసర్‌ జావీద్‌ అహ్మద్‌ హజమ్‌ కేసులో “సుప్రీం కోర్టు’’ కీలక వ్యాఖ్యలు

Supreme Court comments on BRS MLAs party defection2
వార్షికోత్సవం చేసుకుంటున్నారా?: సుప్రీంకోర్టు

సాక్షి, న్యూఢిల్లీ: ‘ఫిరాయింపులపై చర్యలు తీసుకునేందుకు ఇంకెంత సమయం కావాలి? ఎమ్మెల్యేల పదవీకాలం పూర్తి అయ్యేవరకు వేచి చూడటం రీజనబుల్‌ టైం (తగిన సమయం) అవుతుందా? న్యాయపరంగా చర్యలు తీసుకోవడానికి ఒక గడువు అనేది ఉండాలి కదా? పార్టీ ఫిరాయింపులపై మొదటి ఫిర్యాదు అందినప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత సమయం అవుతోంది? ఏడాది అవుతోందని వార్షికోత్సవం జరుపుకుంటున్నారా?..’ అంటూ స్పీకర్‌ కార్యాలయాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మీరు అడిగే సమయానికి ఒక నిర్దేశిత గడువు అనేది ఉండదా? అని ప్రశ్నిస్తూనే.. మరోపక్క ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వొచ్చా లేదా? అనే అంశంపై మాత్రమే తాము వాదనలు వింటున్నట్లు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 2వ తేదీకి వాయిదా వేసింది. అదేరోజు స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శుల వాదనలను వింటామని తెలిపింది. బీఆర్‌ఎస్‌ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్‌లపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద్‌ల పేర్లతో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్పీ).. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, ప్రకాశ్‌ గౌడ్, గూడెం మహిపాల్‌ రెడ్డి, అరికెపూడి గాందీలపై బీఆర్‌ఎస్‌ పార్టీ, ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు, తదితరులు రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జి మైస్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. స్పీకర్‌ కార్యాలయం తరఫున సీనియర్‌ న్యాయవాదులు అభిషేక్‌ మనుసింఘ్వీ, ముకుల్‌ రోహత్గిలు హాజరయ్యారు. ఎస్‌ఎల్పీపై సీనియర్‌ న్యాయవాది ఆర్యమా సుందరం, రిట్‌ పిటిషన్‌పై దామ శేషాద్రినాయుడు, పి.మోహిత్‌రావు వాదనలు వినిపించారు. ఆ తీర్పుల ఆధారంగా చర్యలకు అవకాశం: ఆర్యమా సుందరం పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందిగా గతేడాది మార్చి 15న తొలిసారి స్పీకర్‌కు తాము ఫిర్యాదు చేశామని ఆర్యమా సుందరం ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆ తర్వాత ఏప్రిల్‌లో ఫిరాయింపులపై తొలిసారి కోర్టును ఆశ్రయించామని, జూన్‌లో రిట్‌ పిటిషన్‌ వేశామని చెప్పారు. దానం నాగేందర్‌ కాంగ్రెస్‌ బీ ఫామ్‌పై ఎంపీ ఎన్నికలకు పోటీ చేశారని, మరో ఎమ్మెల్యే తన కుమార్తె కోసం కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకుని ప్రచారం చేశారని, తెల్లం వెంకట్రావ్‌ సైతం పార్టీ ఫిరాయించారని పేర్కొన్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై వేర్వేరుగా ఫిర్యాదు చేసినా స్పీకర్‌ స్పందించలేదని, కనీసం నోటీసులు ఇవ్వలేదని వివరించారు. దీనిపై రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా ఈ వ్యవహారంపై విచారణ సమయాన్ని ఖరారు చేయాలన్న సింగిల్‌ బెంచ్‌ నాలుగు వారాలు గడువు ఇచ్చిందని గుర్తు చేశారు. దీనిపై స్పీకర్‌ కార్యాలయం అప్పీల్‌ కు వెళ్లగా.. స్పీకర్‌కు తగినంత సమయం ఇవ్వాలన్న గ్రౌండ్స్‌పై ఈ ఉత్తర్వులను డివిజన్‌ బెంచ్‌ పక్కన పెట్టిందని తెలిపారు. కానీ ఇప్పటివరకు ఆ తగినంత సమయం అంటే ఎంతో చెప్పలేదన్నారు. స్పీకర్‌ తీసుకోవాల్సిన సమయంపై సుభాష్‌ దేశాయ్, కేశం మేఘాచంద్, రాజేంద్ర సింగ్‌ రాణా కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందన్నారు. ఈ తీర్పుల ఆధారంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉందని విన్నవించారు. స్పీకర్‌ రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉండాలి సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాతే.. ఈ ఏడాది ఫిబ్రవరి 13న మూడు వారాల్లో రిప్లై ఇవ్వాలని స్పీకర్‌కు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చిందని ఆర్యమా సుందరం గుర్తు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్‌ గవాయి జోక్యం చేసుకున్నారు. ‘ఇప్పటికి ఏడాది అంటే...పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయ్యిందా? వార్షికోత్సం జరుపుకుంటున్నారా?’ అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. కేసు విషయంలో డిలే ట్యాక్టిక్స్‌ (ఆలస్యం చేసే చిట్కాలు) ఉపయోగించొద్దని అన్నారు. సుందరం తన వాదనలు కొనసాగిస్తూ.. ‘స్పీకర్‌ క్వాషి జ్యుడీషియరీ అధికారాలతో ఉన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉండాలి. రాజ్యాంగం కల్పించిన హక్కులు, అధికారాలను పరిరక్షించాల్సిన బాధ్యత స్పీకర్‌పై కూడా ఉంది. ఒకవేళ అది జరగడం లేదు అని భావిస్తే హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి కూడా రాజ్యాంగం అవకాశం కల్పించింది. స్పీకర్‌ క్వాషి జ్యుడీషియరీ అధికారాలతో ఒక ట్రిబ్యునల్‌గా వ్యవహరించాలి. స్పీకర్‌ అధికారాల్లోకి వెళ్లాలని, ఆయన విధుల్లో జోక్యం చేసుకోవాలని కోరడం లేదు కానీ, రాజ్యాంగ విధులు నిర్వర్తించాలని మాత్రమే మేము కోరుతున్నాం’ అని అన్నారు. ఆ ధర్మాసనాలు స్పష్టంగా చెప్పలేదు: జస్టిస్‌ గవాయి గతంలో ఇలాంటి కేసులు విచారించిన రాజ్యాంగ ధర్మాసనాలు స్పీకర్‌కు సమయంపై స్పష్టత ఇవ్వలేదని, ఉన్నత ధర్మాసనాల తీర్పులను తాము తిరిగి ఎలా రాయగలమని జస్టిస్‌ గవాయి వ్యాఖ్యానించారు. దీంతో ‘తగినంత సమయం’ అనే విషయంలో ఒక్కో కేసులో ఒక్కో విధంగా నిర్ణయాలు జరిగాయని సుందరం చెప్పారు. వారంలోపే హైకోర్టును ఆశ్రయించారు: సింఘ్వీ ఫిరాయింపులపై గతేడాది జూలై మొదటి వారంలో స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తే, 9వ తేదీ నాటికే హైకోర్టులో పిటిషన్‌ వేశారని సింఘ్వీ చెప్పారు. నారిమన్‌ కేసులో ఫిర్యాదుకు, పిటిషన్‌కు మధ్య నిర్దిష్ట గడువు ఉండాలని కోర్టు తీర్పునిచ్చిందని చెప్పారు. ఇక్కడ ఫిరాయింపులపై ఫిర్యాదు అందగానే స్పీకర్‌ స్పందించి నోటీసులు ఇచ్చారని చెబుతుండగా జస్టిస్‌ గవాయి జోక్యం చేసుకుని.. గత విచారణ సందర్భంగా స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీ, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన విషయం గుర్తు చేశారు. వారిపై చర్యలు తీసుకోండి: బీజేఎల్పీ నేత పిటిషన్‌ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కూడా మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన తరఫు న్యాయవాది మిథున్‌ శశాంక్‌ జోక్యం చేసుకుని.. ఫిరాయింపులకు సంబంధించి రాజ్యాంగంలోని అంశాలను ప్రస్తావించబోతుండగా.. జస్టిస్‌ గవాయి ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ‘తాము ఈ కేసు మెరిట్స్‌లోకి వెళ్లడం లేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చాం. ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంలో స్పీకర్‌కి ఆదేశాలు జారీ చేయవచ్చా లేదా అన్న అంశాన్ని మాత్రమే పరిశీలిస్తున్నాం..’ అని చెప్పారు. కాగా ఈ వ్యవహారంలో తాము వాదనలు వినిపించేందుకు సుదీర్ఘ సమయం కావాలని రోహత్గి కోరారు. ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణ వాయిదా వేసింది.

Rasi Phalalu: Daily Horoscope On 26-03-2025 In Telugu3
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. ధన, వస్తులాభాలు

గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి: బ.ద్వాదశి రా.10.44 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: ధనిష్ఠ రా.11.54 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.11.44 నుండి 12.32 వరకు, అమృత ఘడియలు: ప.1.35 నుండి 3.11 వరకు.సూర్యోదయం : 6.03సూర్యాస్తమయం : 6.07రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకుయమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు మేషం... యత్నకార్యసిద్ధి. నూతన వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి పిలుపు. భూలాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు.వృషభం.... రుణయత్నాలు. ఆలోచనలు కలసిరావు. ఎంత శ్రమ పడినా ఫలితం ఉండదు. పనుల్లో ప్రతిబంధకాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.మిథునం.... కొన్ని వ్యవహారాలు వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.కర్కాటకం.... వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. పాతబాకీలు వసూలవుతాయి. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు లాభాలదిశగా సాగుతాయి. ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.సింహం.... ఆర్థికాభివృద్ధి. ముఖ్య విషయాలు తెలుస్తాయి. ధన, వస్తులాభాలు. నూతన పరిచయాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.కన్య..... మిత్రులు, బంధువులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. వ్యవహారాలలో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.తుల....... ఆస్తి వివాదాలు. సోదరులతో కలహాలు. స్వల్ప అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.వృశ్చికం... వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. కుటుంబంలో వివాదాలు సర్దుకుంటాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.ధనుస్సు... పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో ప్రతిబంధకాలు. అనారోగ్యం. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.మకరం.. కొత్త పనులు చేపడతారు. కొత్త వ్యక్తుల పరిచయం. ఆహ్వానాలు రాగలవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు అధిగమిస్తారు.కుంభం....... వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు.మీనం.... కొన్ని సమస్యలు తీరతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య విషయాలలో చర్చలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

Allagadda TDP MLA Akhila Priya ultimatum for Illegal Commissions4
అడుగుకు కమీషన్‌.. 'రూపాయి పావలా'

సాక్షి, నంద్యాల: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేమో ఓ వైపు సంపద సృష్టించాకే సూపర్‌ సిక్స్‌ అమలు చేస్తానని చెబుతూ.. మరోవైపు మద్యం దందా, ఇరిగేషన్‌ పనుల్లో మొబిలైజేషన్‌ అడ్వాన్సుల పేరిట సొంతంగా సంపద సృష్టించుకుంటుంటే, టీడీపీ ప్రజాప్రతినిధులు సైతం రెండడుగులు ముందుకేసి సొంతానికి సంపద సృష్టించుకోవడానికి వినూత్న మార్గాలు వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో ఆక్రమ ఆదాయ మార్గాలను అన్వేషించడంలో ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో పరిస్థితి మరీ చిల్లరగా ఉంది. కిలో చికెన్‌కు రూ.10 మామూళ్లు ఇవ్వాల్సిందేనని టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ భర్త భార్గవ్‌ రామ్‌ ఇటీవల హుకుం జారీ చేసిన విషయంపై కలకలం సద్దుమణగక ముందే ఈ దంపతుల కన్ను గోడౌన్లపై పడింది. చదరపు అడుగుకు రూపాయి పావలా కమీషన్‌ ఇచ్చి తీరాల్సిందేనని స్వయంగా ఎమ్మెల్యేనే గోడౌన్ల యజమానులకు అల్టిమేటం జారీ చేశారు. సొంత పార్టీ నేతలైనా సరే కమీషన్‌ ఇచ్చిన తర్వాతే గోడౌన్‌ లీజుకు పర్మిషన్‌ ఇస్తామని తెగేసి చెప్పడంతో టీడీపీ నాయకులు సైతం గగ్గోలు పెడుతున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు సుమారు 14 వేల ఎకరాల్లో పొగాకు పంట సాగు చేశారు. ఇప్పటికే కోతలు పూర్తయ్యాయి. రైతుల వద్ద నుంచి కొన్న పొగాకును నిల్వ చేసుకునేందుకు పొగాకు కంపెనీలకు ఆళ్లగడ్డ, దొర్నిపాడు, ఉయ్యాలవాడ, ఆర్‌.జమ్ములదిన్నెలోని గోడౌన్లు అవసరమవుతాయి. సుమారు 2.50 లక్షల చదరపు అడుగుల స్థలం అవసరం ఉంటుంది. ఒక్కో చదరపు అడుగుకు నెలకు రూ.5.25 చొప్పున ఇస్తామని పొగాకు కంపెనీలు యజమానులకు ఆఫర్‌ ఇచ్చాయి. మూడేళ్ల పాటు అగ్రిమెంట్‌ ఇవ్వాలని చెప్పడంతో యజమానులంతా సంతోషపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న సదరు ప్రజాప్రతినిధి ప్రతి అడుగుకు తనకు రూపాయి పావలా కమీషన్‌ ఇచ్చి తీరాల్సిందేనని ఖరాకండిగా చెప్పేశారు. కమీషన్‌ ఇవ్వకుంటే అగ్రిమెంట్‌ ఎలా చేసుకుంటారో చూస్తానని హెచ్చరించినట్లు యజమానులు వాపోతున్నారు. తమకు పెద్దగా మిగిలేది ఉండదని మొరపెట్టుకున్నా వినిపించుకోలేదని సమాచారం. దీంతో చేసేది లేక ఆమె గారు అడిగిన మేరకు అడుగుకు “రూపాయి పావలా’ కమీషన్‌కు ఓకే చెప్పారు. ఈ లెక్కన ప్రతి నెలా రూ.3.12 లక్షల మేర ఎమ్మెల్యేకు ముట్టజెప్పాల్సి ఉంటుంది. ఈ విషయం స్థానికంగా రైతులందరికీ తెలియడంతో ఇంత చిల్లర వ్యవహారాలు ఎక్కడా ఉండవని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Nitish Kumar vs Rabri Devi in Assembly: Bihar5
నువ్వు కూర్చో.. పార్టీ మీ ఆయనది

పట్నా: బిహార్‌ శాసన మండలిలో మంగళవారం సీఎం నితీశ్‌ కుమార్, మాజీ సీఎం రబ్డీదేవి మధ్య వాడీవేడి చర్చ జరిగింది. ఆర్‌జేడీ ఎమ్మెల్సీలు పచ్చ రంగు బ్యాడ్జీలు ధరించి సభలోకి రావడం, ఆ పార్టీ నేత తేజస్వీ యాదవ్‌కు అనుకూలంగా నినాదాలు చేయడంతో సీఎం నితీశ్‌ కోపంతో ఊగిపోయారు. ఎమ్మెల్సీల బ్యాడ్జీలను మీడియాకు చూపుతూ ఆయన..ఇలాంటివి ఆర్‌జేడీలోనే సాధ్యమంటూ ఎద్దేవా చేశారు.ఆ పార్టీ నేత, మాజీ సీఎం రబ్డీదేవి జోక్యం చేసుకునేందుకు యత్నించగా నితీశ్‌ బిహారీ యాసలో..‘నువ్వు కూర్చో..నీకేమీ తెలియదు. ఆర్‌జేడీ నీదికాదు, నీ భర్తది. ఈ విషయంలో నీ జోక్యం వద్దు’అంటూ అడ్డుకున్నారు. అంతటితో ఆగక.. ‘ఈమెకు ఏమీ తెలియదు. కష్టాల్లో చిక్కుకు న్నప్పుడు భర్త(లాలూ)ఈమెను సీఎంను చేశాడు’అని పేర్కొన్నారు. 1997లో సీఎంగా ఉన్న లాలు ప్రసాద్‌ దాణా కుంభకోణంలో ఇరుక్కుని, సీఎం కుర్చీపై భార్య రబ్డీని కూర్చోబెట్టడం తెల్సిందే.ఇటీవలి కాలంలో రబ్డీదేవి, నితీశ్‌ మధ్య తరచూ మాటల యుద్ధం జరుగుతోంది. గంజాయి మత్తులో సభకు వచ్చిన సీఎం నితీశ్, నాతోపాటు మహిళలను సైతం అవమానిస్తూ మాట్లాడారు’అంటూ రబ్డీదేవి ఆరో పించారు. ఓ కార్యక్రమానికి వెళ్లిన నితీశ్‌ జాతీయ గీతాలాపనను పట్టించుకోకుండా పక్కనున్న వారి తో సరదాగా మాట్లాడుతూ కన్పించడంతో ‘మానసికంగా అనర్హుడు’ అంటూ రబ్డీదేవి వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది.

Coup in Bangladesh against Yunus: Army holds emergency meeting6
బంగ్లాదేశ్‌లో త్వరలో సైనిక పాలన!

ఢాకా: బంగ్లాదేశ్‌లో త్వరలో సైనిక పాలన అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించడం సంచలనాత్మకంగా మారింది. తాత్కాలిక ప్రభుత్వాధినేత, నోబెల్‌ బహుమతి గ్రహీత మహమ్మద్‌ యూనస్‌పై తిరుగుబాటుకు సైన్యం సిద్ధమవుతున్నట్లు మీడియా పేర్కొంది. గతేడాది అక్టోబర్‌లో ప్రధానమంత్రి పదవి నుంచి షేక్‌ హసీనా వైదొలిగిన తర్వాత మహమ్మద్‌ యూనస్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పనితీరు పట్ల ప్రజలతోపాటు సైన్యం అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో యూనస్‌పై తిరుగుబాటు జరిగే అవకాశం కచ్చితంగా ఉన్నట్లు మీడియా స్పష్టంచేసింది.యూనస్‌ను పదవి నుంచి తొలగించి సైన్యమే అధికార పగ్గాలు చేపట్టబోతున్నట్లు బంగ్లాదేశ్‌ ప్రసార మాధ్యమాల్లో వరుసగా కథనాలు వస్తున్నాయి. బంగ్లాదేశ్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వాకర్‌ ఉజ్‌ జమాన్‌ నేతృత్వంలో సైన్యం సోమవారం అత్యవసరంగా సమావేశమైంది. ఐదుగురు లెఫ్టినెంట్‌ జనరల్స్, ఎనిమిది మంది మేజర్‌ జనరల్స్, ఇండిపెండెంట్‌ బ్రిగేడ్‌ కమాండింగ్‌ అధికారులు, పలువురు ఆర్మీ అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. దేశంలో తొలుత అత్యవసర పరిస్థితిని(ఎమర్జెన్సీ) ప్రకటించి, ఆ తర్వాత మహమ్మద్‌ యూనస్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే అవకాశం ఉన్నట్లు బంగ్లాదేశ్‌ మీడియా అంచనా వేస్తోంది. సైన్యం ఆధ్వర్యంలో జాతీయ ఐక్యతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు చెబుతోంది. అత్యవసర భేటీ జరగలేదన్న సైన్యం సైనిక ఉన్నతాధికారుల అత్యవసర సమావేశమేదీ జరగలేదని బంగ్లాదేశ్‌ సైన్యం తేల్చిచెప్పింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తప్పుడు ప్రచారం చేయొద్దని సూచించింది. మహమ్మద్‌ యూనస్‌పై తిరుగుబాటు అంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టంచేసింది. ప్రభుత్వాన్ని కూలదోయాలన్న ఉద్దేశం లేదని పరోక్షంగా తేల్చిచెప్పింది. ప్రజలు తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రసార మాధ్యమాలకు సూచించింది.

TDP Govt Not Responding In Victims: Andhra pradesh7
వెల్లువలా ఫిర్యాదులు

సాక్షి నెట్‌వర్క్‌:⇒ పింఛన్‌ ఇప్పించాలంటూ వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళల వేడుకోలు..!⇒ తమ భూములు కబ్జాకు గురయ్యాయంటూ కాళ్లరిగేలా తిరుగుతున్న గిరిజనులు..!⇒ రేషన్‌ కార్డులు, ఇళ్ల కోసం నెలల తరబడి ఆరాటంతో ఎదురు చూస్తున్న పేదలు..! ⇒ అడుగు ముందుకు పడని భూముల మ్యుటేషన్లు.. పాస్‌బుక్‌లు అందక రైతన్నల గగ్గోలు..! ⇒ స్థలాలు ఆక్రమణలకు గురై తీవ్ర ఆందోళనలో సామాన్యులు..! ⇒ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందక చదువులు మధ్యలో ఆగిపోయిన పిల్లలు..!ఇంతమంది ఇన్ని సమస్యలతో ప్రభుత్వ కార్యాల­యాలకు వస్తున్నా పరిష్కారం లభిస్తుందనే భరోసా ఏ ఒక్కరిలోనూ కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరి­ష్కార వేదిక ఓ ప్రహసనంగా.. సమస్యల నిలయంగా మారింది! కలెక్టర్‌ నుంచి జిల్లా స్థాయి అధికారులు పాల్గొంటున్న ఈ వేదిక ప్రజలకు ఏమాత్రం భరోసా కల్పించలేకపోతోంది. ప్రతి సోమవారం కలెక్టరేట్‌కు తరలి వస్తున్న వారితోపాటు కార్యాలయాలను కుప్ప­లు తెప్పలుగా ముంచెత్తుతున్న అర్జీలే ఇందుకు సాక్ష్యం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎక్కడ చూసినా సమస్యలతో సతమతమవుతూ నెలల తరబడి తిరుగు­తున్నవారే కనిపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పరి­ష్కార వేదికల వద్దకు వచ్చిన వారిని ‘సాక్షి’ ప్రతినిధుల బృందం పలుకరించగా ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు కనిపించాయి. గత ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంతృప్త స్థాయిలో ప్రయోజనం కల్పిస్తూ అడుగులు ముందుకు వేసిందని, గ్రామ స్థాయిలో ఇంటి వద్దకే పౌర సేవ­లను అందచేసిందని గుర్తు చేసుకున్నారు. ఏ కారణం చేత­నైనా సరే.. అర్హుల్లో ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి కూడా లబ్ధి చేకూరేలా ఏటా రెండుసార్లు జాబితాను సిద్ధం చేసి సచివాలయాల్లో పార­దర్శకంగా ప్రదర్శించి వలంటీర్ల ద్వారా ఇంటికే పథ­కాలను చేరవేసిందని చర్చించుకోవడం కనిపించింది.⇒ ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రామలింగం. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం మాచాపురానికి చెందిన ఆయన కుమారుడు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 32లో 89 సెంట్లను రామచంద్రుడు అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశాడు. ఇందులో 44 సెంట్ల భూమిని ఈశ్వరయ్య అనే వ్యక్తికి విక్రయించాడు. మిగిలిన 45 సెంట్ల భూమికి పాస్‌బుక్‌ కోసం వెళితే మూడు సార్లు సర్వే కోసం చలానా కట్టించుకున్నారు. సర్వేయర్‌ ఒక్కసారి కూడా వచ్చి సర్వే చేయలేదు. కోర్టు పరిధిలో భూమి ఉందంటూ దాట వేస్తున్నారు. దీంతో బాధితుడు నాలుగైదుసార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం.⇒ ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నమ్మలు తన కుమారుడిని పాలిటెక్నిక్‌ చదివిస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాకపోవడంతో కాలేజీ యాజమాన్యం వారిపై ఒత్తిడి తెస్తోంది. దీంతో అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం చౌడువాడ నుంచి దివ్యాంగుడైన తండ్రి సాయంతో కలెక్టరేట్‌కు వచ్చింది. కాలేజీకి ఫీజు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం అందించింది. నిరుపేదనైన తాను ఇన్నాళ్లూ ప్రభుత్వం ఇచ్చే ఫీజుల డబ్బులతోనే కుమారుడిని చదివిస్తున్నానని, ఈ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో కాలేజీ యాజమాన్యం ఇబ్బంది పెడుతోందని చిన్నమ్మలు వాపోయింది.⇒ చిత్రంలో కనిపిస్తున్న గిరిజనులు పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గుణదతీలేసు పంచాయతీ పరిధిలోని లాబేసు గ్రామం వాసులు. వీరంతా నిరుపేదలు. గ్రామానికి చెందిన18 మంది గిరిజన రైతులు సర్వే నంబర్‌ 16, 11లోని కొంత ప్రభుత్వ భూమిలో తుప్పలు తొలగించి 1995 నుంచి పంటలు పండిస్తున్నారు. సాగు హక్కు పట్టాలు మంజూరు చేయాలంటూ తొమ్మిది నెలలుగా తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే వారే లేరని వాపోతున్నారు.నేను చచ్చిన తరువాత పింఛన్‌ ఇస్తారా? పెన్షన్‌ కోసం కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా. కలెక్టరేట్‌కు వస్తే సచివాలయానికి వెళ్లమంటారు. అక్కడికి వెళితే మళ్లీ ఇక్కడికే పొమ్మంటారు. అసలు పెన్షన్‌ ఇస్తారా? ఇవ్వరా? ఇవ్వబోమంటే మా పని ఏదో చేసుకొని బతుకుతాం. పేదలను ఇలా తిప్పుకోవడం మంచిది కాదు. నేను చచ్చిన తరువాత పెన్షన్‌ ఇస్తామంటే ఏం లాభం? గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ల మంజూరు చాలా చక్కగా ఉండేది. – మద్దయ్య, బి.తాండ్రపాడు, కర్నూలు మండలం, కర్నూలు జిల్లాఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం లేదు బండిపై బాదంపాలు విక్రయిస్తూ జీవిస్తున్నా. ఒంటరి మహిళను. ఈ ఏడాది జనవరి 22వ తేదీన చిలకలూరిపేటలో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా కారు ఢీకొనడంతో కాలు, చేయి విరిగాయి. ఆపరేషన్‌కు రూ.లక్ష ఖర్చు అయింది. ఇప్పటికీ నడవలేకపోతున్నా. నిందితుడిని గుర్తించి, పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం లేదు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలి. ప్రమాదానికి కారకుడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. –షేక్‌ సైదాబీ, కావూరు లింగంగుంట్ల, నాదెండ్ల మండలం, పల్నాడు జిల్లాముళ్ల పొదల్లో మృతదేహాలను మోసుకుంటూ..మా గ్రామం నుంచి నంద్యాల వెళ్లే రహదారిలో మాంటిస్సోరి స్కూల్‌ వెనుక భాగంలో 70 సెంట్ల హిందూ శ్మశాన వాటిక స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. అక్కడకు వెళ్లాలంటే రహదారి లేదు. పొలం గట్లపై, ముళ్ల పొదల్లో భయంభయంగా మృతదేహాలను మోసుకుంటూ తీసుకెళ్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నాలుగు సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకొనే నాథుడే లేరు. – చాపిరేవుల గ్రామస్తులు, నంద్యాల జిల్లా

Information to Telangana Congress leaders on cabinet expansion8
కేబినెట్‌ విస్తరణ.. మూడున ముహూర్తం!

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ వచ్చే నెల 3న జరగనున్నట్టు సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చినట్టు తెలుస్తోంది. కేబినెట్‌ విస్తరణతో పాటు అదేరోజు మంత్రుల శాఖల్లో మార్పులు కూడా జరగనున్నాయని, ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు సమాచారం అందినట్లు పార్టీవర్గాలు వెల్లడించాయి. సోమవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ అధిష్టానం, రాష్ట్ర పెద్దల భేటీ అనంతరం రాష్ట్ర పార్టీలో మంత్రివర్గ విస్తరణ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. ఎవరెవరికి మంత్రి పదవులు వచ్చే అవకాశాలున్నాయి.. ఎవరి శాఖల్లో మార్పులు జరగొచ్చు.. ప్రస్తుత మంత్రుల్లో ఎవరినైనా తప్పిస్తారా? అనే అంశాలపై మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నేతల్లో విస్తృత చర్చ జరిగింది. అటు కాంగ్రెస్‌ శ్రేణులు, ఇటు రాజకీయ వర్గాలతో పాటు శాసనసభ బడ్జెట్‌ సమావేశాలకు హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చర్చోపచర్చలు సాగించారు. ఇంకా సమాచారం లేదన్న ఆ ముగ్గురూ.. మంగళవారం శాసనసభ లాబీల్లో మంత్రివర్గ విస్తరణే ప్రధాన చర్చనీయాంశం అయ్యింది. ఢిల్లీ వేదికగా జరిగిన చర్చల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చాంబర్‌ ఎమ్మెల్యేలతో హడావుడిగా కనిపించింది. పలువురు ఆశావహ ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు భట్టి చాంబర్‌కు వచ్చి చర్చలు జరిపారు. అసలు ఢిల్లీలో ఏం జరిగిందన్న దానిపై ఆరా తీశారు. మరోవైపు రాజగోపాల్‌రెడ్డి, వివేక్, శ్రీహరిలకు బెర్తులు ఖాయమయ్యాయన్న వార్తల నేపథ్యంలో అసెంబ్లీలో ఈ ముగ్గురికి అభినందనలు వెల్లువెత్తాయి. అసెంబ్లీ సమావేశాల విధులకు హాజరైన వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, జర్నలిస్టులు కూడా ఆ ముగ్గురిని కలిసి అభినందనలు తెలిపారు. అందరికీ కృతజ్ఞతలు తెలిపిన ఆ ముగ్గురూ.. మరోవైపు ఇంకా సమాచారమేమీ లేదంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. ఢిల్లీలో సాయంత్రం వరకు సీఎం కసరత్తు మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చలు జరిపేందుకు సోమవారం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. అంతకుముందు మంగళవారం ఉదయం నుంచి హైదరాబాద్‌ బయలుదేరేంతవరకు ఢిల్లీలో ఒంటరిగానే గడిపారు. ఎలాంటి అపాయింట్‌మెంట్లు, పార్టీ పెద్దలతో ములాఖత్‌లకు వెళ్లని రేవంత్‌ మంత్రివర్గ కూర్పుపై ఏకాంతంగా కసరత్తు చేశారనే చర్చ జరుగుతోంది. కొత్తగా కేబినెట్‌లోకి తీసుకునే మంత్రులకు శాఖలు, ప్రస్తుతమున్న మంత్రుల శాఖల్లో మార్పుల గురించి ఓ అభిప్రాయానికి వచ్చే దిశలో ఆయన కసరత్తు చేశారని, ఈ మేరకు అధిష్టానానికి సమాచారమిచ్చారని తెలుస్తోంది. ఈ కసరత్తు నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ సాయంత్రం వరకు ఢిల్లీలోనే ఉండిపోయారని చెబుతున్నారు. ఇద్దరు కీలక మంత్రుల శాఖల్లో మార్పులు! కేబినెట్‌లోకి కొత్తగా నలుగురు లేదా ఐదుగురిని తీసుకుంటారనే చర్చతో పాటు ప్రస్తుత మంత్రుల్లో ఒకరిద్దరికి ఉద్వాసన పలకవచ్చనే చర్చ కూడా జరుగుతోంది. ఇందుకు సంబంధించి ఓ మహిళా మంత్రితో పాటు దక్షిణ తెలంగాణకు చెందిన మరో మంత్రి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిని తప్పించేందుకు కారణాలున్నాయని కొందరు చెబుతుండగా, అధిష్టానం ఇప్పుడే ఆ నిర్ణయం తీసుకోదని, ప్రస్తుతమున్న మంత్రులంతా కొనసాగుతారని, కొత్తగా కొందరు మంత్రులవుతారని టీపీసీసీ వర్గాలంటున్నాయి. శాఖల మార్పుపై కూడా విస్తృత చర్చ జరుగుతోంది. ఒక సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు కీలక మంత్రులకు చెందిన శాఖల్లో మార్పులుంటాయని, ఓ మహిళా మంత్రికి అదనపు బాధ్యతలిస్తారనే ఊహాగానాలు విన్పిస్తున్నాయి. మరోవైపు డిప్యూటీ స్పీకర్‌గా లంబాడా సామాజిక వర్గానికి చెందిన నల్లగొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే ఎన్‌.బాలూనాయక్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తుండగా, కొత్తగా కోదాడ ఎమ్మెల్యే ఎన్‌.పద్మావతిరెడ్డి పేరు కూడా చర్చలోకి వచ్చింది. డిప్యూటీ స్పీకర్‌గా ఈమెను నియమించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. మరోవైపు చీఫ్‌ విప్‌ పదవిలో ఎవరిని నియమిస్తారు?, విప్‌లలో ఎవరికైనా మంత్రిగా అవకాశమిస్తే వారి స్థానంలో ఎవరిని నియమిస్తారన్న దానిపైనా రకరకాల చర్చలు జరుగుతుండడం గమనార్హం.

Sakshi Editorial On Girl child safety9
మహానగరంలో ఏదీ భద్రత?

ఆడపిల్లల భద్రతకు ప్రమాదం పొంచివున్నదని స్పష్టంగా కనబడుతున్నా కళ్లుమూసుకున్న పోలీస్‌ యంత్రాంగం సాక్షిగా హైదరాబాద్‌లో మొన్న శనివారం ఒక యువతిపై లైంగిక దాడి జరిగింది.ఎంఎంటీఎస్‌లో ప్రయాణిస్తుండగా బోగీలో ఎవరూలేని సమయం చూసి దుండగుడు దాడి చేయగా తప్పించుకునే యత్నంలో నడుస్తున్న రైలునుంచి ఆమె దూకి తీవ్ర గాయాలపాలైంది. పగలంతా కిక్కిరిసి వుండే ఎంఎంటీఎస్‌ రైళ్లు చీకటిపడే వేళకు దాదాపు ఖాళీ అవుతుంటాయి. జనం ఎక్కువున్న సమయాల్లో కూడా నిబంధనలకు విరుద్ధంగా ఆడవాళ్ల బోగీల్లో ఎక్కి వెకిలిచేష్టలకు పాల్పడటం, సెల్‌ఫోన్లు, ఆభరణాలు అపహరించటం వంటివి పెరిగాయని అనేకులు చెబుతున్నారు. హిజ్రాల ఆగడాలు సరేసరి. ఒంటరిగా ప్రయాణించక తప్పని స్థితిలో ఈ అరాచకాలు ఇంకెంత మితిమీర గలవో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఈ మాదిరి ఉదంతాలపై నిత్యం ఫిర్యాదులు అందుతూనే ఉంటాయని మీడియా కథనాలు చెబుతున్నాయి. ప్రయాణికుల సంఘాలు కూడా ఆందోళనలు చేసినా పోలీసులు మేల్కొనలేదు. రైల్వే భద్రతా దళం(ఆర్‌పీఎఫ్‌), ప్రభుత్వ రైల్వే పోలీస్‌(జీఆర్‌పీ) విభాగం అసలు దీన్ని సమస్యగానే భావించలేదు. ఆ విభాగాలు కర్తవ్య నిర్వహణలో విఫలం కావటమే నిజమైన సమస్య. కనీసం చీకటిపడింది మొదలు అర్ధరాత్రి సర్వీసులు ఆగిపోయే వరకైనా బందోబస్తు అవసరమని గ్రహించలేదు. సరిగదా అంతక్రితం ఎంఎంటీఎస్‌ రైళ్లలోవుండే హోంగార్డుల్ని సైతం ఈమధ్య తొలగించారంటున్నారు. హైదరాబాద్‌ నగరంలో సుమారు 30 ఎంఎంటీఎస్‌ స్టేషన్లువుంటే కేవలం పది స్టేషన్లలో మాత్రమే భద్రత ఉండటం, అది కూడా అంతంత మాత్రం కావటం దారుణం. స్టేషన్లలో అక్కడక్కడ పేరుకు ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ కానిస్టేబుళ్లు కనబడు తుంటారు. కానీ మహిళల కోచ్‌లు ఎలావున్నాయో, భద్రత ఏ మేరకు అవసరమో గమనించేపాటి పని కూడా వారినుంచి ఆశించే స్థితి లేదంటే నిర్వాహకులు సిగ్గుపడాలి. సాంకేతికత విస్తరించిన ఈ కాలంలో కూడా దాన్ని సవ్యంగా వినియోగించలేని అశక్తతలో ప్రభు త్వాలుండటం విచారకరం. హైదరాబాద్‌ నగర శివారులో 2019 నవంబర్‌లో ఒక మహిళా వైద్యు రాలిని అపహరించి, ఆమెపై అత్యాచారం జరిపి హత్య చేసిన ఉదంతం చోటు చేసుకున్నప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దాన్ని తెలంగాణకు సంబంధించిందిగా చూడలేదు. అలాంటి పరిస్థితి ఏపీలో తలెత్తకూడదన్న సంకల్పంతో పోలీస్‌ వ్యవస్థను కదిలించి కేవలం మూడు నెలల వ్యవధిలోనే దిశ యాప్‌ అందుబాటులోకి తెచ్చారు. దిశ ప్రత్యేక పోలీస్‌ స్టేషన్లు నెలకొల్పారు. లక్షలాదిమంది ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవటంవల్ల ఆపత్కాలంలో అనేకమందిని రక్షించటం సాధ్యమైంది. 2021 సెప్టెంబర్‌లో ఉపాధ్యాయ ఎంపిక పరీక్ష రాయటానికి ఢిల్లీ వెళ్లిన ఏపీ యువతి తెల్లారుజామున దిగి ఆటో ఎక్కాక కీడు శంకించినప్పుడు దిశ యాప్‌ వల్లే పోలీసులను అప్రమత్తం చేసింది. ఏపీ పోలీసుల సమన్వయంతో ఆమె క్షేమంగా పరీక్ష రాసింది. తిరిగి ఏపీకి వెళ్లే రైలు ఎక్కేవరకూ సాయం దొరికింది. హైదరాబాద్‌లో బెంగళూరు వెళ్లే రైలెక్కిన మహిళ సైతం ఈ యాప్‌ను ఉపయోగించుకునే తనను తాను రక్షించుకోగలిగింది. దేశంలో ఏ మూలనున్నా ఈ యాప్‌ ద్వారా సమాచారం అందుకుని మహిళలను రక్షించిన ఉదంతాలు కోకొల్లలు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక వెనకా ముందూ చూడకుండా దీన్ని రద్దుచేశారు. తొమ్మిది నెలలు జాప్యంచేసి, అదే యాప్‌కు సురక్షా అనే పేరు తగిలించి ఈ నెల మొదటివారంలో మళ్లీ తీసుకొచ్చారు. వేషం మారిన ఈ యాప్‌పై మహిళల్లో పెద్దగా ప్రచారం చేసిన దాఖలా కూడా లేదు. అఘాయిత్యాలు మితిమీరిన ఈ కాలంలో దిశవంటి యాప్‌ను కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేవరకైనా కొనసాగించాలన్న ఇంగితజ్ఞానం కూటమి ప్రభు త్వానికి లేకపోయింది. బహుశా ఆ యాప్‌ కొనసాగివుంటే ఎంఎంటీఎస్‌లో ఆపదలో చిక్కుకున్న యువతికి అది ఆసరాగా నిలిచేదేమో! ఎక్కడో వేరే రాష్ట్రంలోవున్న యువతులకు ఆపత్కాలంలో సాయపడటం మాట అటుంచి, తాడేపల్లిలో డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో దుండ గుల బారిన పడిన మహిళను కూడా కాపాడలేని అశక్తతలో ఏపీ పోలీసులు కూరుకుపోయారు. ఫలితంగా ఆ మహిళపై దుండగులు అత్యాచారం చేసి, హతమార్చారు. అదే ప్రాంతంలో మొన్న జనవరి 31న మరో మహిళ బలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఈమాదిరి అఘాయిత్యాలకు అంతేలేదు.ఎంఎంటీఎస్‌ ఉదంతంలో రైల్వే పోలీసులు బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. దుండ గుడు పట్టుబడవచ్చు కూడా. ఈ ఉదంతం పోలీసులకు ఎలాంటి గుణపాఠం నేర్పిందోగానీ మళ్లీ మరోటి జరిగేవరకూ పట్టనట్టు వ్యవహరించే ధోరణికి ఇకనైనా స్వస్తి పలకాలి. ఖర్చు తగ్గించుకుని లాభార్జన చేయాలన్న యావ భద్రతకు తూట్లు పొడుస్తుందన్న సంగతి ఎంఎంటీఎస్‌ నిర్వాహకులు తెలుసుకోవాలి. ఆకతాయిలూ, అసాంఘిక శక్తులూ, యధేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించేవారూ తమకేం కాదన్న భరోసాతో ఉండటం మహిళలకూ, పిల్లలకూ ప్రాణాంతకమవుతుంది. రైల్వే స్టేషన్లతోపాటు బోగీల్లో సైతం సీసీ కెమెరాలుంటే, వాటిని నిత్యం పర్యవేక్షిస్తుంటే, తక్షణం చర్యలు తీసుకునే యంత్రాంగం పనిచేస్తే ఆగడాలను అరికట్టడం సులభమవుతుంది. అలాగే మహిళల రక్షణకు తగిన యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలి. గడప దాటితే క్షేమంగా తిరిగొస్తామో లేదోనన్న భయాందోళనల మధ్య పౌరులు బతికే దుఃస్థితి ఉండటం మంచిదికాదని ప్రభుత్వం, రైల్వేశాఖ గుర్తించాలి.

Punjab Kings beat Gujarat Titans by 11 runs10
పంజాబ్‌ తొలి పంచ్‌

కొత్త కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలో పంజాబ్‌ కింగ్స్‌ తొలి విజయం నమోదు చేసుకుంది. బ్యాటర్ల జోరుకు బౌలర్ల సహకారం తోడవడంతో... ఐపీఎల్‌ 18వ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌పై పంజాబ్‌ పంజా విసిరింది. ఆరంభంలో ప్రియాంశ్‌ ఆర్య మెరుపులు... చివర్లో శశాంక్‌ సింగ్‌ ఫినిషింగ్‌ టచ్‌... ఇన్నింగ్స్‌ ఆసాంతం శ్రేయస్‌ అయ్యర్‌ దూకుడు... వెరసి పంజాబ్‌ కింగ్స్‌ భారీ స్కోరు చేయగా... ఛేదనలో తగ్గేదేలే అన్నట్లు బాదిన గుజరాత్‌ చివరకు 11 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అహ్మదాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టి20 టోర్నమెంట్‌ 18వ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన పోరులో పంజాబ్‌ 11 పరుగుల తేడాతో మాజీ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌పై గెలిచింది. మొదట పంజాబ్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ (42 బంతుల్లో 97 నాటౌట్‌; 5 ఫోర్లు, 9 సిక్స్‌లు) సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోగా... ప్రియాంశ్‌ ఆర్య (23 బంతుల్లో 47; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), శశాంక్‌ సింగ్‌ (16 బంతుల్లో 44 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శ్రేయస్‌ సిక్సర్లతో రెచ్చిపోగా... శశాంక్, ప్రియాంశ్‌ ఆర్య బౌండరీల మోత మోగించారు. గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్లలో సాయికిషోర్‌ 3 వికెట్లు పడగొట్టాడు. లక్ష్యఛేదనలో గుజరాత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 232 పరుగులు చేసింది. సాయి సుదర్శన్‌ (41 బంతుల్లో 74; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), బట్లర్‌ (33 బంతుల్లో 54; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలు సాధించగా... కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (14 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), షెర్ఫాన్‌ రూథర్‌ఫర్డ్‌ (28 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) పోరాడినా ఫలితం లేకపోయింది. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌... టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు శుభారంభం దక్కలేదు. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (5) తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో 28 పరుగుల వద్ద పంజాబ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. అయితే మరో ఎండ్‌లో ప్రియాంశ్‌ దూకుడు కనబర్చడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఇన్నింగ్స్‌ రెండో బంతికి ఫోర్‌తో ఖాతా తెరిచిన ప్రియాంశ్‌... సిరాజ్‌ వేసిన మూడో ఓవర్‌లో 6, 4 బాదాడు. అయ్యర్‌ వచ్చిరాగానే 4, 6తో చాంపియన్స్‌ ట్రోఫీ ఫామ్‌ కొనసాగించగా... ఐదో ఓవర్‌లో ప్రియాంశ్‌ 4, 4, 6, 4 కొట్టాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి పంజాబ్‌ 73/1తో నిలిచింది. ఆ తర్వాత గుజరాత్‌ బౌలర్లు కాస్త ఒత్తిడి పెంచడంతో పరుగుల రాక మందగించగా... సాయికిషోర్‌ వరుస బంతుల్లో అజ్మతుల్లా (16), మ్యాక్స్‌వెల్‌ (0)లను పెవిలియన్‌కు పంపాడు. ఎదుర్కొన్న తొలి బంతికే మ్యాక్స్‌వెల్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. అయితే రివ్యూలో బంతి వికెట్ల మీద నుంచి వెళ్తున్నట్లు తేలింది. 2 రివ్యూలు ఉన్నా పంజాబ్‌ సరైన సమయంలో వినియోగించుకోలేక స్టార్‌ బ్యాటర్‌ వికెట్‌ కోల్పోయింది. అవన్నీ మరిపించేలా అయ్యర్, శశాంక్‌ ఆఖర్లో బౌండరీలతో రెచ్చిపోయారు. సాయికిషోర్‌ ఓవర్‌లో 2 సిక్సర్లు బాదిన శ్రేయస్‌... రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లోనూ రెండు సిక్స్‌లు కొట్టాడు. కొన్ని చక్కటి షాట్లు ఆడిన స్టొయినిస్‌ (20; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కూడా సాయికిషోర్‌కు వికెట్‌ సమర్పించుకోగా... ప్రసిధ్‌ కృష్ణ వేసిన ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌లో శ్రేయస్‌ 6, 4, 6, 6 కొట్టి 90 పరుగుల మీదకు చేరాడు. మరో 3 ఓవర్ల ఆట మిగిలి ఉండటంతో ఐపీఎల్లో అయ్యర్‌ తొలి సెంచరీ ఖాయమే అనుకుంటే... ఆఖర్లో అతడికి ఎక్కువ బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. 18వ ఓవర్లో 6, 4, 6 కొట్టిన శశాంక్‌ సింగ్‌.. చివరి ఓవర్‌లో 5 ఫోర్లు బాది జట్టుకు భారీ స్కోరు అందించాడు. చివర్లో చిత్తు... భారీ లక్ష్యం కళ్లెదురుగా ఉన్నా... గుజరాత్‌ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. నాలుగో ఓవర్‌లో గిల్‌ 6, 6, 4తో మోత ప్రారంభించగా... సుదర్శన్‌ దాన్ని కొనసాగించాడు. బౌలర్‌తో సంబంధం లేకుండా బంతి తన పరిధిలో ఉంటే దానిపై విరుచుకుపడ్డాడు. వేగంగా ఆడే క్రమంలో గిల్‌ వెనుదిరగగా... బట్లర్‌ చక్కటి షాట్లతో అలరించాడు. ఫలితంగా 10 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్‌ 104/1తో నిలిచింది. ఈ క్రమంలో సుదర్శన్‌ 31 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 11వ ఓవర్లో బట్లర్‌ 2 సిక్స్‌లు కొట్టగా... తదుపరి ఓవర్లో సుదర్శన్‌ 4, 6, 4 బాదాడు. సుదర్శన్‌ ఔటయ్యాక ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా క్రీజులోకి వచ్చిన రూథర్‌ఫర్డ్‌ కూడా అలరించాడు. చివర్లో వైశాఖ్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో... లక్ష్యంవైపు సజావుగా సాగుతున్న గుజరాత్‌ ఒక్కసారిగా వెనుకబడింది. చివరి ఓవర్లో టైటాన్స్‌ విజయానికి 27 పరుగులు అవసరం కాగా.. ఆ జట్టు 15 పరుగులే చేసింది. స్కోరు వివరాలు పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రియాంశ్‌ ఆర్య (సి) సాయి సుదర్శన్‌ (బి) రషీద్‌ 47; ప్రభ్‌సిమ్రన్‌ (సి) అర్షద్‌ (బి) రబడ 5; శ్రేయస్‌ అయ్యర్‌ (నాటౌట్‌) 97; అజ్మతుల్లా (సి) అర్షద్‌ (బి) సాయికిషోర్‌ 16; మ్యాక్స్‌వెల్‌ (ఎల్బీ) (బి) సాయికిషోర్‌ 0; స్టొయినిస్‌ (సి) అర్షద్‌ (బి) సాయికిషోర్‌ 20; శశాంక్‌ సింగ్‌ (నాటౌట్‌) 44; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 243. వికెట్ల పతనం: 1–28, 2–79, 3–105, 4–105, 5–162. బౌలింగ్‌: సిరాజ్‌ 4–0– 54–0; రబడ 4–0–41–1; అర్షద్‌ 1–0–21 –0; రషీద్‌ 4–0–48–1; ప్రసిధ్‌ కృష్ణ 3–0–41–0; సాయికిషోర్‌ 4–0–30–3.గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సుదర్శన్‌ (సి) శశాంక్‌ (బి) అర్ష్ దీప్ 74; గిల్‌ (సి) ప్రియాంశ్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 33; బట్లర్‌ (బి) యాన్సెన్‌ 54; రూథర్‌ఫర్డ్‌ (బి) అర్ష్ దీప్ 46; తెవాటియా (రనౌట్‌) 6; షారుక్‌ (నాటౌట్‌) 6; అర్షద్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 232. వికెట్ల పతనం: 1–61, 2–145, 3–199, 4–217, 5–225, బౌలింగ్‌: అర్ష్ దీప్ 4–0–36–2; అజ్మతుల్లా 2–0–29–0; యాన్సెన్‌ 4–0–44–1; మ్యాక్స్‌వెల్‌ 2–0–26–1; స్టొయినిస్‌ 2–0–31–0; చహల్‌ 3–0–34–0; వైశాఖ్‌ 3–0–28–0. ఐపీఎల్‌లో నేడురాజస్తాన్‌ X కోల్‌కతావేదిక: గువాహటిరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement