సీబీ నాట్ మిషన్
ప్రొద్దుటూరు క్రైం : క్షయ వ్యాధి నిర్ధారణ కావాలంటే గతంలో నాలుగైదు రోజులు ఆస్పత్రి చుట్టూ తిరగాల్సి వచ్చేది. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో ఇప్పుడు రెండు గంటల్లోనే టీబీ వ్యాధి నిర్ధారణ జరుగుతోంది. ఇటీవల జిల్లా ఆస్పత్రికి సీబీ నాట్ అనే కొత్త పరికరాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దీని వల్ల టీబీ జన్యువును గుర్తిస్తారు. రూ.30 లక్షలు విలువ చేసే ఈ పరికరాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన మేరకు టీబీ కంట్రోల్ ప్రోగ్రాం కింద అన్ని ప్రముఖ ఆస్పత్రులకు మంజూరు చేశారు.
ఒకేసారి నలుగురికి పరీక్షలు
గతంలో టిబి వ్యాధి నిర్ధారణ జరగాలంటే ముందుగా జిల్లా ఆస్పత్రిలోని క్షయ వ్యాధి విభాగంలో సంప్రదించాలి. సంబంధిత అధికారి పరిశీలించి క్షయ వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే రోగి గల్ల సేకరిస్తారు. మూడు రోజుల తర్వాత దాని రిపోర్టు వస్తుంది. ఒక్కోసారి మరింత ఆలస్యం కావచ్చు. ఇలా రోగులు అనేక మార్లు తిరగాల్సి వచ్చేది. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వంచే మంజూరు చేసిన సీబీనాట్ పరికరాన్ని జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేశారు. టీబీకి సంబంధించి రెండు గంటల్లోనే రిపోర్టు వస్తుందని అధికారులు తెలిపారు. ఒక ఎంఎల్ స్పుటంలో 10 వేలకుపైగా కాలనీస్ ఉంటేనే టీబీ ఉందో లేదో తెలిసేది. సీబీ నాట్ మిషన్‌లో ఒక ఎంఎల్ స్పుటంలో కేవలం 130 కాలనీస్ ఉన్నా టీబీ నిర్ధారణ జరుగుతుందని సూపరింటెండెంట్ లక్ష్మీప్రసాద్ అన్నారు. ఒకే సారి నలుగురికి పరీక్షలు నిర్వహించవచ్చు. యూపీఎస్ ద్వారా ఆన్‌లైన్ పరీక్షలు చేస్తారు.
శరీరంలో ఏ భాగంలో ఉన్నా గుర్తింపు
ఇంత వరకు ఊపిరి తిత్తులకు సంబంధించిన క్షయ వ్యాధిని మాత్రమే గుర్తించి, నివారణకు మందులను ఇచ్చే వారు. ఇది కూడా రోగి నుంచి సేకరించిన గల్ల ద్వారా నిర్ధారణ చేసేవారు. మనిషి శరీరంలోని ఏ భాగానికైనా ఈ వ్యాధి సోకుతుందని వైద్యులు అంటున్నారు. హెచ్‌ఐవీ, షుగర్ ఉన్నవారికి, వ్యాధి నిరోధక శక్తి తగ్గిన వారికి, మురికి వాడల్లో నివసిస్తున్న ప్రజలకు, బీడీ, చేనేతలకు టీబీ సోకే అవకాశాలు ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. దగ్గుతో బాధపడుతున్న వీరు వెంటనే వైద్యులను సంప్రదించి సీబీ నాట్ పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఊపిరితిత్తుల్లో మినహా శరీరంలో ఇతర ఏ భాగాల్లో టీబీ సోకినా అది ఇతరులకు ప్రమాదం కాదన్నారు.
ప్రత్యక్ష పర్యవేక్షణ పోగ్రాం ద్వారా మందులు
టీబీ సోకిన వారికి కేంద్ర ప్రభుత్వం ఖరీదైన మందులను ఉచితంగా అందిస్తోంది. గ్రామాల్లోని వ్యక్తులకు ప్రొద్దుటూరు టీబీ కేంద్రం నుంచి ఆయా పీహెచ్‌సీలకు మందులను పంపిస్తారు. అంగన్‌వాడీ సిబ్బంది లేదా ఆశా వర్కర్ల పర్యవేక్షణలో మందులు వాడేలా చూస్తారు. టీబీ ఉన్న వారి టవల్‌ను ఇతరులు వాడకుండా చూడాలి. వయసుతో నిమిత్తం లేకుండా ఈ వ్యాధి వస్తుందని వైద్యులు తెలిపారు. టీబీ రాకుండా ఉండేందుకు పిల్లలు పుట్టగానే బీసీజీ టీకాను వేస్తారన్నారు.
టీబీ 100 శాతం నయం అయ్యే వ్యాధి
క్షయ వ్యాధి 100 శాతం నయం అవుతుంది. ప్రభుత్వం ఖరీదైన మందులను ఉచితంగా అందచేస్తోంది. క్రమం తప్పకుండా కోర్సు వాడితే వ్యాధి పూర్తిగా నయం అవుతుంది. సీబీ నాట్ పరికరం ద్వారా 2 గంటల్లోనే వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. – లక్ష్మీప్రసాద్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, ప్రొద్దుటూరు.
Comments
Please login to add a commentAdd a comment