సాక్షి, కడప : జిల్లాలో టీడీపీ వర్గపోరు రచ్చకెక్కింది. ఓ కాంట్రాక్ట్ విషయంలో టీడీపీ వర్గాలు బాహాబాహీకి దిగాయి. టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మంత్రి ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు. వివరాల్లోకి వెళితే...గండికోట రిజర్వాయర్ పరిధిలో కొండాపురంలో పునరావాస కాలనీ పనులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లకు పిలిచింది. ఈ టెండర్ల విషయంలో మంత్రి ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి వర్గీయులు సిండికేట్ అయ్యారు.
అయితే ఈ విషయం తెలుసుకున్న సీఎం రమేష్... ఆ టెండర్ల ప్రక్రియను నిలిపివేశారు. దీంతో మంత్రి ఆది, రామసుబ్బారెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ... సీఎం రమేష్ కార్యాలయంపై దాడి చేసి కంపూటర్లు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అంతేకాకుండా సమీపంలో సీఎం రమేష్ చేస్తున్న రోడ్ల పనులను కూడా బలవంతంగా నిలిపివేయించారు. పనులు కొనసాగిస్తే వాహనాలను తగులబెడతామని హెచ్చరికలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇక స్థానికంగా ఉన్న తమకు కాకుండా సీఎం రమేష్‌కు కాంట్రాక్ట్ పనులు అప్పగించడంపై స్థానిక టీడీపీ నేతలు చాలాకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉప్పు,నిప్పుగా ఉండే మంత్రి ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి టెండర్ల విషయంలో సిండికేట్‌గా మారటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment