
చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుత్మంతుడికి నైవేద్యంగా పెట్టే ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతానం లేని మహిళలకు పిల్లలు కలుగుతారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేయడంతో శుక్రవారం అనూహ్యంగా భక్తులు పోటెత్తారు.

ప్రసాదం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఢిల్లీ, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాదిగా తరలివచ్చారు.

ఇందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. వేకువ జామున 4 గంటల నుంచే వాహనాలు భారీ సంఖ్యలో రావడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.

మూడు నాలుగు గంటల పాటు ట్రాఫిక్‌లో ఇరుక్కుని, ఎండలో కాలినడకన ఆలయానికి చేరుకున్న భక్తులకు క్యూలైన్లు ఎక్కడ ఉన్నాయో..? ప్రసాదం ఎక్కడ పంపిణీ చేస్తున్నారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.

































