
లేలేత గులాబీల స్పర్శకు ఎర్ర తివాచీ మురిసిపోయింది. సుతి మెత్తని అడుగులు పడుతుంటే ఆ అందాన్ని మోస్తున్నందుకు సంబర పడిపోయింది. ఇదంతా ఫ్రాన్స్‌లో జరుగుతున్న 77వ కేన్స్ చిత్రోత్సవాల్లోని ‘రెడ్ కార్పెట్’ గురించి. దేశ, విదేశీ తారలు డిజైనర్ ఫ్రాక్స్‌లో క్యాట్ వాక్ చేస్తుంటే చూడ్డానికి రెండు కళ్లూ చాల్లేదంటున్నారు చిత్రోత్సవానికి హాజరైన వీక్షకులు. ఇప్పటికే మన దేశీ తారలు ఐశ్వర్యా రాయ్, దీప్తీ సద్వానీ, ఊర్వశీ రౌతేలా కాన్స్‌లో మెరవగా.. తాజాగా కియారా అద్వానీ, శోభితా ధూళిపాళ్ల కూడా అందంగా ముస్తాబై, చిత్రోత్సవాల్లో ఆకట్టుకున్నారు. తెలుపు రంగు ఫ్రాక్‌లో దేవకన్యలా అగుపించారు కియారా. పర్పుల్ కలర్ ఫ్రాక్‌లో బ్రైట్‌గా కనిపించారు శోభిత. కేన్స్ చిత్రోత్సవాల్లోని ‘రెడ్ సీ ఫిల్మ్ ఫౌండేషన్ ఉమన్ ఇన్ సినిమా గాలా డిన్నర్’లో భారతదేశం తరఫున కియారా పాల్గొన్నారు. ఓ ఉత్పత్తి ప్రచారంలో భాగంగా శోభిత హాజరయ్యారు. ఇంకా విదేశీ తారలు సైతం కనువిందు చేశారు.




























