
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్వదేశానికి తిరిగి వచ్చాడు.

శ్రీలంకతో వన్డే సిరీస్ నేపథ్యంలో అమెరికాను వీడి భారత్‌లో అడుగుపెట్టాడు. భార్య రితిక సజ్దే, కుమార్తె సమైరా శర్మతో కలిసి ముంబైకి చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. దాదాపు పదకొండేళ్ల విరామం తర్వాత రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు మరోసారి వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడింది.

ఇక కెప్టెన్‌గా ఐసీసీ టైటిల్ గెలవాలన్న తన చిరకాల కోరిక తీరిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.

ఈ క్రమంలో జట్టుతో కలిసి ట్రోఫీతో భారత్‌కు తిరిగి వచ్చిన రోహిత్ శర్మ విజయోత్సవాల్లో పాల్గొన్నాడు. ముంబైలో సెలబ్రేషన్స్ ముగిసిన అనంతరం సెలవు తీసుకున్న హిట్‌మ్యాన్.. కుటుంబంతో కలిసి అమెరికాకు వెళ్లిపోయాడు.

అయితే, శ్రీలంకతో వన్డే సిరీస్‌కు కూడా అతడు దూరమవుతాడనే వార్తలు వచ్చాయి.