Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

KCR fires on Congress Govt at BRS silver jubilee Meeting1
కాంగ్రెస్ అన్నిట్లోనూ ఫెయిల్: కేసీఆర్‌

మంచిగున్న తెలంగాణను ఆగం పట్టించి ఓట్లు వేయించుకుని ప్రజలను మోసం, దగా చేశారు. ఇవాళ అప్పు పుడత లేదని మాట్లాడుతుండ్రు. నా మనసు కాలుతోంది. బాధ పడుతోంది.దుఃఖం వస్తోంది. కాంగ్రెస్‌ సర్కార్‌ వచ్చి ఏడాదిన్నరయ్యింది.. ఏ మాయ రోగం వచ్చె.. ఏం బీమారి వచ్చె.. ఏమేం చెప్పిరి.. ఎన్నెన్ని చెప్పిరి.. గోల్‌మాల్‌ దింపుట్ల,అబద్ధాలు చెప్పుట్ల కాంగ్రెస్‌ను మించినోళ్లు లేరు. అప్పుడు చెరువుల పూడిక తీసిన బుల్డోజర్లు, ఇప్పుడు ఇళ్లు కూలగొడుతున్నయి. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్‌ ప్రభుత్వమే. ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నరు. ఓట్లెప్పుడు వస్తయా అని చూస్తున్నరు.ఎల్కతుర్తి నుంచి సాక్షి ప్రతినిధి: అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న తెలంగాణను దేశంలోనే నంబర్‌ వన్‌గా చేసుకుంటే, ఏడాదిన్నర కాలంలోనే కాంగ్రెస్‌ పార్టీ నాశనం చేసిందని, అన్నిట్లోనూ ఫెయిల్‌ అయ్యిందని భారత్‌ రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ధ్వజమెత్తారు. మా అంత సిపాయిలు లేరు..కేసీఆర్‌కు మించి ఇస్తాం.. ఆరు చందమామలు తెచ్చి ఇస్తాం.. ఏడు సూర్యుళ్లు పెడతాం అని నమ్మబలికి ఓట్లు వేయించుకుని ప్రజలను దగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 420 హామీలిచ్చి ఏమీ చేయలేదని, మంచిగున్న తెలంగాణను ఆగం పట్టించారని విమర్శించారు. రైతుబంధు లాంటి పథకాలు కావాలని తననెవరూ అడగలేదని, మన ప్రజలను మనమే బాగు చేసుకోవాలని ఆ పథకాలను అమలు చేశామని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తాము పడగొట్టబోమని, ప్రజలే వీపులు సాపు చేస్తారని వ్యాఖ్యానించారు. ఆనాడైనా, ఈనాడైనా తెలంగాణకు కాంగ్రెస్సే నంబర్‌ వన్‌ విలన్‌ అని అన్నారు. కాంగ్రెస్‌ను గద్దె దించేందుకు ఇక తాను బయటకు వస్తానని ప్రకటించారు. మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని చెప్పారు. బీఆర్‌ఎస్‌ (టీఆర్‌ఎస్‌) ఆవిర్భవించి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆదివారం వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన రజతోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. బుక్కులు పంచిండ్రు.. బాండ్లు రాసిచ్చిండ్రు హామీలు ఇచ్చుడు కాదు.. పెద్ద పెద్ద బుక్కులు ఊరూరా పంచిండ్రు. సిగ్గు లేకుండా బాండ్‌ పేపర్లు రాసిచ్చిండ్రు. అడ్డగోలుగా హామీలు ఇచ్చిండ్రు..యేడికెళ్లి ఇస్తారని కాంగ్రెస్‌ నేతలను అడిగితే.. చేసి చూపిస్తాం.. మాది పెద్ద పార్టీ.. మమ్మల్ని మించిన సిపాయిలు లేరని ఇప్పుడు ఆర్థికమంత్రిగా ఉన్నాయన జబ్బలు చరిచాడు.. ఒకడు మెడలు చరిచాడు. డైలాగులు మీద డైలాగులు కొట్టారు. మధ్యలో ఎంపీ ఎలక్షన్లు వచ్చాయి.. నాకు కాలు విరిగింది.. అయినా నేను బయల్దేరాను.. దీంతో తెలంగాణలో ఎంత మంది దేవుళ్లు ఉంటే అంతమంది దేవుళ్ల మీద ఒట్లు పెట్టిండ్రు. ఇన్ని మాటలు చెప్పి మోసం చేసిన్రు. ఉచిత బస్సు అని పెడితే జుట్లు పట్టుకుని కొట్టుకునేందుకు పనికి వస్తోంది తప్ప ఉపయోగం లేదు. ఈ ఉచిత బస్సు మాకు అవసరం లేదు అని ఆడబిడ్డలు అంటున్నరు. ఊ అంటే ఆ అంటే అబద్ధాలు చెబుతున్నారు. నమ్మి బోల్తా పడ్డం..’ అని కేసీఆర్‌ ధ్వజమెత్తారు. అప్పుడెంత బాగుండె.. ఇప్పుడెట్లయింది? ‘ఒక ఊరిలో నాట్లు వేసే టైమ్‌ వస్తే వడ్లు ఓ రైతు అలుకుతున్నడు. మొలకకు అలుకుడు చేస్తం కదా.. పెద్ద మొగోడు అని ఒకర్ని మొలక అలికేందుకు పిలిస్తే.. ఎలుక పిల్లను చూసి ఎల్లెలకల పడ్డడట. అట్లనే మా అంత సిపాయిలు లేరు.. మేం తెచ్చి ఇస్తాం అన్నరు. ఇవాళ మమ్మల్ని నమ్ముతలేరు.. అప్పు పుడుతలేదని మాట్లాడుతుండ్రు. ఎక్కడికెళ్లి తెచ్చి చేయాలని అంటున్నరు. అపారమైన అనుభవం ఉందని అప్పుడు అన్నరు.. ఇప్పుడేమో ఎల్లెలకల పడుతుండ్రు. నా ప్రసంగం టీవీల్లో వినే కోట్లాను కోట్ల మందిని అడుగుతున్నా.. ఇంత మోసం ఉంటదా.. ఇంత దగా ఉంటదా..? ఎంత వరకు ఇది కరెక్ట్‌..? తెలంగాణను బొందల పడగొట్టిండ్రు.. ఎంత ఘోరమైన ఫలితం చూస్తున్నాం. రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి ఎంత బాగుండె. ఇప్పుడెట్లయింది? నా మనసు కాలుతుంది. బాధయితంది. దుఃఖం వస్తోంది. కేసీఆర్‌ పక్కన పోంగనే ఇంత ఆగమయితదా? ఎందుకు ప్రజల గోస పోసుకుంటున్నరు? కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు భూముల ధరలు ఎట్లుండె. కొనేటోళ్లు ఎక్కువుండె. అమ్మేటోళ్లు తక్కువుండే. నేను 24 గంటలు కరెంటు ఇయ్యలేదా? ఇప్పుడు ఎందుకు ఇయ్య శాతనయిత లేదు? మళ్లీ తెల్లందాక కరెంటు పెట్టడానికి పోవాల్నా..? మంచినీళ్లు కూడా ఇయ్య శాతనయితలేదు. కానీ మేం ఇంత సిపాయిలం, అంత సిపాయిలం అంటున్నరు..’ అని కేసీఆర్‌ ఎద్దేవా చేశారు.ఎన్నెన్ని చెప్పిరి.. ఏమన్నా చేసిన్రా? ‘కాంగ్రెస్‌ సర్కార్‌ వచ్చి ఏడాదిన్నరయ్యింది.. ఏ మాయ రోగం వచ్చె..ఏం బీమారి వచ్చె.. ఏమేం చెప్పిరి.. ఎన్నెన్ని చెప్పిరి.. గోల్‌మాల్‌ దింపుట్ల, అబద్ధాలు చెప్పుట్ల కాంగ్రెస్‌ను మించినోళ్లు లేరు. ఇక్కడ ఉన్నోళ్లు చాలరని చెప్పి ఉన్న గాంధీలు, లేని గాం«దీలు, డూప్లికేట్‌ గాం«దీలు ఢిల్లీకెళ్లి దిగిరి. స్టేజీల మీద డ్యాన్స్‌లు చేసిన్రు. కేసీఆర్‌ రైతుబంధు కింద ఏం ఇస్తుండు..రూ.10 వేలు ఇస్తుండు.. మేం రూ.15 వేలు ఇస్తమని చెప్పిన్రు. పెన్షన్లు రూ.2 వేలు ఇస్తుండు మేం వస్తే రూ.4 వేలు ఇస్తమని చెప్పిరి. ఇద్దరు ఉంటే కేసీఆర్‌ ఒక్కరికే ఇస్తుండు.. మేం ముసలిది ముసలోడికి ఇద్దరికీ ఇస్తమనిరి. దివ్యాంగులకు రూ.4 వేలు ఇస్తుండు.. మేం రూ.6 వేలు ఇస్తమన్నరు. ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తమన్నరు. విద్యార్థులకు ఐదు లక్షల గ్యారంటీ కార్డు ఇస్తమని చెప్పిరి. ఇక ఒకరెనుక ఒకరు ఉరికి.. రూ.2 లక్షల లోన్‌ తెచ్చుకోండి.. డిసెంబర్‌ 9న ఒక్క కలం పోటుతో ఖతం చేస్తం అన్నరు. కల్యాణలక్ష్మి కింద కేసీఆర్‌ లక్షా నూటపదహార్లు ఇస్తున్నడు.. మేం తులం బంగారం కలిపి ఇస్తామని చెప్పిండ్రు. 420 హామీలు ఇచ్చిన్రు. ఏమన్నా చేసిన్రా .. ఏం చేయలేదు. మాట్లాడితే బీఆర్‌ఎస్, కేసీఆర్‌ మీద నిందలు వేస్తున్నారు.తెలంగాణ బిడ్డలను పిట్టల్లా కాల్చారు ‘ఆనాడైనా, ఏనాడైనా, ఈనాడైనా తెలంగాణకు విలన్‌ నంబర్‌ వన్‌ కాంగ్రెస్‌ పార్టీ. తెలంగాణ హైదరాబాద్‌ స్టేట్‌ పేరుతో ఉన్ననాడు.. ప్రజలు వద్దంటే కూడా బలవంతంగా తెలంగాణను ఆంధ్రాతో కలిపింది కాంగ్రెస్‌ పార్టీ, జవహర్‌లాల్‌ నెహ్రూ. 1969లో తెలంగాణ ఉద్యమం వస్తే.. 400 మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లా కాల్చి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం.. ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్‌ పరిపాలన. 2001 నుంచి గులాబీ పార్టీ పెట్టి విజృంభిస్తే.. నంగనాచిలాగా ఇదే కాంగ్రెస్‌ వచ్చి.. మన బలాన్ని, మన ఊపును చూసి పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇస్తమని నమ్మబలికిన్రు. మళ్లీ ఎగ్గొట్టే ప్రయత్నం చేసిన్రు. 14 సంవత్సరాలు ఏడిపించిన్రు. జయశంకర్‌ సార్‌తో కలిసి పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు కాంగ్రెస్‌ గొంతు పట్టుకుంటే.. అప్పుడు దిగివచ్చి తెలంగాణ కోసం ప్రకటన చేసిన్రు. మళ్లీ వెనక్కి వెళ్లారు. ఆ తర్వాత సకల జనుల సమ్మె కావొచ్చు. సాగర హారాలు కావొచ్చు. వంటావార్పులు కావొచ్చు.. అనేక రూపాల్లో విజృంభించి భీకరమైన పోరాటం చేశాం. మూడేళ్ల తర్వాత రాజకీయ అవసరం ఏర్పడి ఆనాడు మళ్లీ తెలంగాణ ఇస్తామని ప్రకటించారు. వారికి ఇష్టం లేకపోయినా తెలంగాణ సృష్టించిన సుడి గాడుపులు తట్టుకోలేమని తెలంగాణ ఇచ్చిన్రు..’ అని మాజీ సీఎం గుర్తు చేశారు.

Sakshi Guest Column On What is appropriate punishment for Pakistan2
పాక్‌కు ఏది సరిపోయే శిక్ష?

పహల్‌గామ్‌లో 26 మంది పౌరులను కాల్చి చంపిన భయంకర ఉగ్రదాడి తర్వాత భారత్‌ లో పాకిస్తాన్‌ పై ఆగ్రహం పెరుగుతోంది. భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఎస్‌) కటువైన ప్రకటన విడుదల చేసింది. దాడి చేయడంలో ఉగ్రవాదులు ప్రదర్శించిన క్రూరత్వాన్ని చూస్తే ఆ ఆగ్రహం ఆశ్చర్యం కలిగించదు. పాక్‌ మీడియా వ్యాఖ్యాతలు ఇస్లామాబాద్‌ను ఇరికించడానికి భారతదేశమే ఈ దాడిని నిర్వహించిందని దారుణమైన ఆరోపణ చేస్తున్నారు. స్పష్టంగా, వారు ఘోరమైన పరిణామాన్ని ఆశిస్తున్నారు.భద్రతా కేబినెట్‌ కమిటీ ప్రకటన కావలసిన అన్ని అంచనాలను తీర్చింది. న్యూఢిల్లీలో ఉన్న పాకిస్తాన్‌ హైకమిషన్‌ లోని ఛార్జ్‌ డి’అఫైర్‌ సహా 14 మంది సిబ్బంది ఇంకా మిగిలి ఉన్నప్పటికీ, పాక్‌ సైనిక సలహాదారులు, ఇతర సహాయక సిబ్బందిని భారత్‌ విడిచి వెళ్ళమని ఆదేశించారు. ఇది పాక్‌ సైనిక సంస్థపై పూర్తిగా నిందను మోపుతుంది. అటారీ చెక్‌పోస్ట్‌ మూసివేయడం, మిగిలిన వీసా ప్రోటోకాల్స్‌ని నిలిపివేయడం కూడా ఊహించినదే. పాక్‌పై తీవ్రమైన ప్రభావం కలిగించడానికి భారత్‌ కఠిన నిర్ణయాలు తీసుకోవడం ఆశ్చర్యం కలిగించలేదు. గత సంవత్సరం చివర్లో, సింధునదీ జలాల ఒప్పందంపై తిరిగి చర్చలు జరిగే వరకు సింధునదీ జలాల కమిషన్‌ సమావేశాలను నిర్వహించడానికి కూడా భారత్‌ నిరాకరించింది.కేవలం నిలిపేసింది!భారత్‌లో జలవిద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆలస్యం చేయడానికి పాకిస్తాన్‌ అతి స్వల్ప కారణాలను చూపుతూ సింధు జలాల ఒప్పందాన్ని ఉపయోగించుకుంటోంది. ఒప్పందంలో ఇరు దేశాల కమిషనర్లు సహా మూడు అంచెల వివాద యంత్రాంగం ఉంది. అది విఫలమైనప్పుడు, 1960లో ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించిన ప్రపంచ బ్యాంకు ఒక తటస్థ నిపుణుడిని నియమిస్తుంది. అది కూడా పని చేయకపోతే, మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయవచ్చు. 1970లలో, భారతదేశం సలాల్‌ (జమ్ము–కశ్మీర్‌) ఆనకట్ట ఎత్తును తగ్గించి, దాని అవుట్‌లెట్‌లను తెరిచి వేయవలసి వచ్చింది. దీనివలన ఆనకట్ట ఉపయోగం తగ్గి భారీగా బురద చేరి, కోతకు గురైంది. మరొక సందర్భంలో, బాగ్లిహార్‌ ఆనకట్ట (జమ్ము–కశ్మీర్‌) 14 ఏళ్ల ఆలస్యాన్ని ఎదుర్కొంది. కిషన్‌గంగా ప్రాజెక్టు మరింత ఇబ్బందులకు గురైంది. ప్రపంచ బ్యాంక్‌ నియమించిన తటస్థ నిపుణుడు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నప్పుడే పాక్‌ మధ్యవర్తిత్వ స్థాయికి వెళ్లింది. ప్రపంచంలోనే అత్యంత నీటి కొరత ఉన్న దేశాలలో పాకిస్తాన్‌ 15వది. భారతదేశం ప్రస్తుతం జలాల ఒప్పందాన్ని కేవలం ‘నిలిపివేసింది’. సరిహద్దుకు అవతలి వైపు ఉన్న బాధ్యతాయుతమైన మనుషులు ఈ స్వల్పభేదాన్ని అర్థం చేసుకోవాలి.అయితే, ఇవేవీ భారతదేశ ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చలేవు. భద్రతా కేబినెట్‌ కమిటీ ప్రకటన ‘ఇటీవల తహవ్వుర్‌ రానాను వెనక్కి రప్పించినట్లే, ఉగ్రవాద చర్యలకు పాల్పడిన లేదా వాటిని సాధ్యం చేయడానికి కుట్ర పన్నిన వారిని వెంబడించడంలో భారతదేశం అవిశ్రాంతంగా ఉంటుంది’ అని పేర్కొంది. ఉగ్రదాడి తర్వాత ప్రధాని బిహార్‌లో ఉద్దేశపూర్వకంగానే ఇంగ్లీషులో మాట్లాడుతూ, ‘భారతదేశం ప్రతి ఉగ్రవాదినీ, వారికి మద్దతు ఇచ్చేవారినీ గుర్తించి, వెంబడించి, శిక్షిస్తుంది. మేము వారిని భూమ్మీద ఎక్కడున్నా దొరికించుకుంటాం’ అన్నారు. ఉగ్రవాదాన్ని శిక్షించే చర్యలు దీర్ఘకాలంపాటు కొనసాగుతాయని ఈ ప్రకటన సూచిస్తుంది.ఎలా దాడి చేయొచ్చు?కాబట్టి, ఇప్పుడు ఇక్కడ ఏమి సాధ్యమవుతుంది అంటే కచ్చితంగానే బాలకోట్‌ తరహా దాడి సాధ్యం కాదు. ఈసారి, పాక్‌ సైన్యం పూర్తి అప్రమత్తంగా ఉంది. స్పష్టమైన ప్రత్యామ్నాయం ఏమిటంటే, నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలను గుర్తించే లక్ష్యంతో భారత భూభాగం నుంచే 290 కిలోమీటర్ల పరిధి కలిగిన బ్రహ్మోస్‌ క్షిపణిని ప్రయోగించడం. అది భారత్‌ తనదని చెప్పుకొంటున్న ప్రాంతం కాబట్టి ఇది సాంకేతికంగా పాకిస్తాన్‌పై దాడి కాదు. మరింత కావాల్సిన లక్ష్యం లష్కర్‌–ఎ–తొయిబా కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న మురిద్కే. ఇది లాహోర్‌కు దగ్గరగా, భారత సరిహద్దు నుండి దాదాపు 30 కి.మీ. దూరంలో ఉంది. సాయుధ డ్రోన్‌ లను ఉపయోగించి కూడా దీనిపై దాడి చేయవచ్చు. దీని వలన కచ్చితత్వంతోపాటు ఎటువంటి ఆనుషంగిక నష్టం ఉండదు.కానీ ఏదైనా సరే, ఎంత సమర్థనీయమైనా సరే, అది యుద్ధ చర్యే. పాకిస్తాన్‌ సైన్యం ప్రతీకారం తీర్చుకుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. బాలకోట్‌ తరువాత, అది జాగ్రత్తగా దాడి చేసింది. పెద్దగా నష్టం కలిగించకుండా ప్రతిస్పందనను నమోదు చేసింది. దానికి ప్రధానంగా అప్పటి పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కమర్‌ బాజ్వా కారణం. ఆయన దేశ సొంత ప్రయోజనం కోసం పాక్‌ అంతటా భారతదేశానికి వాణిజ్యాన్ని ప్రతిపాదించిన వాస్తవికవాది. కానీ, యుద్ధం, దాని అన్ని తీవ్రతరమైన అవకాశాలను దృష్టిలో ఉంచుకుంటే ప్రస్తుత చీఫ్‌ జనరల్‌ అసిమ్‌ మునీర్‌ వివేకవంతమైన వ్యూహకర్త కాదు. భారతదేశం ఈ యుద్ధాన్ని భరించగలదు. అయినప్పటికీ ముఖ్యంగా ఆయుధాల కోసం దిగుమతులపై ఆధారపడి ఉన్నప్పుడు ఇది అత్యంత వ్యర్థమైన ఖర్చు.ముక్కలుగా కత్తిరిస్తే!భారత్‌ యుద్ధాన్ని కాకుండా, ఆర్థిక వృద్ధిని కోరుకుంటోంది. పాక్‌ నిజంగా యుద్ధాన్ని భరించలేదు. పైగా అంతర్జాతీయ ద్రవ్య నిధి అటువంటి ఖర్చులను దయతో చూస్తుందా లేదా అనేది విషయం కాదు... వాస్తవం ఏమిటంటే, ఆ దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలు సంక్షోభంలో ఉన్నాయి. ఇది జెట్‌ ఇంధనం విషయంలో తీవ్రమైన కొరతకు దారితీస్తుంది. గత తొమ్మిది నెలల్లో ఆరు ప్రధాన శుద్ధి కర్మాగారాలలో ఏవీ చమురు పంపిణీ చేయలేదు. కనీస జ్ఞానం ఉన్న ఏ దేశమైనా, కీలకమైన ఇంధనాన్ని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితుల్లో యుద్ధం ప్రారంభించదు. అయినా భారత్‌ను పాక్‌ యుద్ధంలోకి లాగాలని కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. దానికి పోయేది ఏమీ లేదు. అందుకే తక్కువ ‘ఆడంబర’ ప్రత్యామ్నాయం ఏమిటంటే, ఎల్‌ఓసి అంతటా ఫిరంగి కాల్పులు జరపడం. కానీ మన వైపు పౌరులకు కూడా నష్టాలు ఉంటాయి. పైగా ఈ మొత్తం విన్యాస ప్రయోజనమే ప్రశ్నార్థకం అవుతుంది. ఏమైనప్పటికీ ఉగ్రవాదులు చొరబడతారు. ఏమైనా పాక్‌ కోరుకుంటున్న దిశలో ఇండియా కొట్టుకుపోకుండా జాగ్రత్త వహించాలి. బదులుగా, చాలా నైపుణ్యంతో పాక్‌ని శిక్షించడాన్ని ఎంచుకోవాలి.చాలా కాలంగా, పాకిస్తాన్‌ రెండు వైపులా ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడాన్ని అందరూ గుర్తించారు. పాకిస్తాన్‌ ను మోకరిల్లేలా చేసేవరకు సంబంధిత దేశాలు ఆంక్షలు విధించాలని డిమాండ్‌ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా ఆంక్షలనేవి పాక్‌ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకోవాలి. ఇకపై పాక్‌ సైన్యాధికారులు సౌకర్యవంతమైన విదేశాల పర్యటనలు చేయకుండా చూడాలి. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుండి వచ్చే అన్ని బాహ్య నిధులకు అడ్డుకట్ట వేయాలి.అవును, చాలా దేశాలు పాక్‌ను శిక్షించే కార్యక్రమంలో చేరవు. ఉగ్రవాదాన్ని ఎంత ఇష్టపడకపోయినా, పాక్‌ని శిక్షించని దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంటుంది. అందుకే పాక్‌ కోరుకోని విధంగా, దీర్ఘకాలంగా అణచివేతకు గురైన బలూచ్‌లు, పష్తూన్‌లకు బహిరంగ మద్దతు ప్రకటించే సమయం ఇదే కావచ్చు. ఇది పాక్‌ రహస్య వ్యూహాల అనుకరణ కాకూడదు. ఇది ప్రపంచాన్ని ముందుకు రావాలని పిలుపునిచ్చే బహిరంగ మద్దతుగా ఉండాలి. ఇక జరిగింది చాలు, పాక్‌కు దాని స్థాయేమిటో తెలియజెప్పాలి.తారా కార్థా వ్యాసకర్త డైరెక్టర్‌ (పరిశోధన), సెంటర్‌ ఫర్‌ ల్యాండ్‌ వార్‌ఫేర్‌ స్టడీస్‌(‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)

Sakshi Guest Column On Hindi cinema On Jyotirao Phule, Savitribai Phule3
‘ఫూలే’ను ఎందుకు ఆపాలని చూశారు?

మొదటిసారి మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలే మీద ఒక హిందీ సినిమా వచ్చింది. దాన్ని ప్రఖ్యాత సినిమా డైరెక్టర్‌ అనంత్‌ మహాదేవన్‌ తీశారు. ప్రతీక్‌ గాంధీ, పత్రలేఖా పాల్‌ అనే ఇద్దరు యాక్టర్లు ఫూలే, సావిత్రిగా నటించారు. ఆ సినిమా నిజానికి ఫూలే 198వ జయంతి అయిన 2025 ఏప్రిల్‌11న విడుదల కావలసి ఉంది. కానీ దేశంలోని కొన్ని బ్రాహ్మణ సంఘాలు సినిమా విడుదలను వ్యతిరేకించి ‘సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిమ్‌ సర్టిఫికేషన్‌’ (సీబీఎఫ్‌సీ)కి ఎన్నో ఫిర్యాదులు పంపారు. సీబీఎఫ్‌సీ అతివేగంగా స్పందించి, విడుదల కావాల్సిన సినిమాను ఆపేసి కొన్ని మార్పులు సూచించింది. ఎన్నో ఇబ్బందుల అనంతరం చివరికి ఏప్రిల్‌ 25న సినిమా విడుదలయ్యింది.‘ఫూలే’ సినిమా ఊహాజనిత కథపై ఆధారపడి తీసింది కాదు. ఫూలే, సావిత్రిపై రాసిన ఇంగ్లిష్, మరాఠీ, హిందీ భాషల్లోని చాలా జీవిత చరిత్రలపై ఆధారపడి తీసింది. కానీ సీబీఎఫ్‌సీ బలమైన చారిత్రక ఆధారాలతో సినిమాలో పెట్టిన ఘటనలను, కొన్ని పేర్లను తొలగించాలని సూచించింది. ముఖ్యంగా ఫూలే కాలంలో కూడా దళితులు గ్రామ వీధుల్లోకి వస్తే మూతికి ముంత, నడుముకు తాటాకు కట్టుకోవలసి ఉండింది. ఈ ఘోరమైన అంటరానితనాన్ని ఆ ప్రాంతాన్ని పరిపాలించిన బ్రాహ్మణ రాజులైన పీష్వాలు కఠినంగా అమలుచేశారు.ఫూలే స్వయంగా చదువు చెప్పి సావిత్రీబాయిని దేశంలోనే మొదటి మహిళా టీచర్‌ని చేశాక, పుణె పట్టణ సమీపంలోని దళితవాడలో ఆడపిల్లలకు స్కూలు పెట్టారు. ఏ కులానికి చెందిన అమ్మాయిలైనా వచ్చి చదువుకోవచ్చని ప్రకటించారు. సావిత్రీబాయితోపాటు చదువుకున్న ముస్లిం స్త్రీ ఫాతిమా షేక్‌ ఆమెకు అండగా ఉండేది. సావిత్రీబాయి ఈ దేశం మొత్తం చరిత్రలో భర్త సహాయంతో చదువుకొని టీచరై, ఆడపిల్లలకు బడి పెట్టిన మొదటి మహిళ. ఫూలే దంపతులు బ్రాహ్మణులతో తగువు పెట్టుకోలేదు. కొట్టినా, తిట్టినా ఈ దేశ రైతాంగ జీవితాన్ని, కూలీల జీవితాన్ని, వృత్తిపనివారి జీవితాన్ని, ముఖ్యంగా స్త్రీ సమాజ జీవితాన్ని మార్చిన ఏకైక ఆదర్శ భార్యాభర్తల జంట అది. ఆ జంట అహింసకు మారుపేరు.ఈ సినిమాలో పీష్వాల కాలం నాటి ఘోర అంటరానితనం, మనుషులను జంతుప్రాయంగా చూసిన పీష్వా రాజ్య న్యాయ వ్యవస్థను ఈనాటి సమాజానికి చెప్పకుండా, సినిమా రూపంలో చూపించకుండా ఎందుకుండాలి? చుట్టూ బ్రిటిష్‌ పరిపాలన ఉన్నా, పీష్వా రాజులు పుష్యమిత్రశుంగుని క్రూరాతిక్రూరమైన వర్ణధర్మ రాజ్యాన్ని నడిపింది చరిత్ర కదా! మొత్తం రైతాంగాన్ని – అంటే ఇవాళ పై శూద్ర కులంగా ఉన్న మరాఠాలు, కుంబీలు (ఫూలే కులస్థులు) సైతం చదువు నేర్చుకునే హక్కు లేని కట్టుబానిసలు కదా! అందుకే ‘గులాంగిరీ’ పుస్తకంలో ఫూలే వ్యవసాయ ఉత్పత్తిదారులను బానిసత్వం నుండి విముక్తి చెయ్యకుండా దేశం అభివృద్ధి కావడం అసంభవం అని రాశారు.ఆనాటి శూద్ర బానిసలకు తాము బానిసలమనే సోయి కూడా లేదు. ఈ వ్యవస్థ వ్యవసాయ ఉత్పత్తిని పెంచలేదు. ఉన్న పంటలో అదిరించి, బెదిరించి, స్వర్గం–నరకం సిద్ధాంతం చెప్పినవాళ్లు మాత్రమే కాస్త మంచి తిండి తిన్నారు. వీళ్ళకు ఆనాడు జాతీయ భావం లేదు. కుల భావం మాత్రమే ఉంది. జాతీయ భావన సమానత్వంతో ముడిపడి ఉంది.ఈ దేశంలో అన్ని కులాల వారికి జాతీయ భావాన్ని నేర్పిన మొట్టమొదటి దైవసమాన జంట ఫూలే–సావిత్రీబాయి. వారిని మించిన జంట ఈ భూమి మీద ఆనాటికి పుట్టలేదు. ఈనాటికీ వెతికినా దొరికే స్థితి లేదు. పిల్లలు లేని ఈ జంట... విధవలుగా జీవిస్తున్న ఇద్దరు (బ్రాహ్మణ, ఇతర కులాలకు చెందిన) స్త్రీలను... ఇంట్లో పెట్టుకొని, ఒక బ్రాహ్మణ విధవకు పుట్టిన యశ్వంత రావును పెంచుకొని, మొదటి డాక్టరును చేశారు. ఆనాటి వరకు బ్రాహ్మణ పురుషులు కూడా అలోపతి మెడిసిన్‌ చదవడం లేదు. సముద్రాలు దాటడం లేదు. ఈ దంపతులను ఈనాటి బ్రాహ్మణులైనా, ఏ కులస్థులైనా ఎలా చూడాలి? ఈ భూమి మీద నడిచిన దేవ–దేవతా దంపతులుగా చూడాలి కదా! వారి జీవిత చరిత్ర చిత్రీకరణను వ్యతిరేకించడమేమిటి?సావిత్రీబాయి ఈ దేశ మొదటి మహిళా టీచరయ్యారు నిజమే. ఆమెపై ఆనాటి సంప్రదాయ యువకులు పేడ కొట్టింది నిజమే. కొంతమంది బ్రాహ్మణులు ఆ దంపతులకు మద్దతిచ్చిందీ నిజమే. సీబీఎఫ్‌సీ పేడకొట్టే సీను సినిమాలో తీసెయ్యాలని ఎలా అన్నది? ఈ సీబీఎఫ్‌సీలో ఒక్క శూద్ర వ్యక్తిగానీ, దళిత వ్యక్తిగానీ లేకుండా ఎలా చేశారు బీసీ ప్రధానమంత్రి? ఈ సీబీఎఫ్‌సీ కశ్మీర్‌ మీద, గుజరాత్‌ మీద, కేరళ మీద ముస్లింలపై సినిమా తీసినప్పుడు వాళ్ళు ట్రైలర్లు చూసి ఎన్ని అభ్యంతరాలు పెట్టినా ఒక్క సీన్‌గానీ, ఒక్క పదంగానీ కట్‌ చెయ్యలేదు. ఇప్పుడు సీబీఎఫ్‌సీ అధ్యక్షుడు ప్రసూన్‌ జోషీ ఈ దేశ జాతీయతను ఏం చెయ్యదలచుకున్నారు?ఆ సినిమాలు ప్రధానమంత్రి చూశారు. పొగిడారు. మరి ‘ఫూలే’ సినిమాను ప్రధానమంత్రి చూస్తారా? ఒక బీసీగా ప్రధానమంత్రి అయి, ముఖ్యంగా శూద్ర బీసీల ఓట్లతో గెలిచి ఫూలే వ్యతిరేకులను సమర్థిస్తారా అనేది చాలా ముఖ్యమైన అంశం.ఈ సినిమా భారతదేశపు సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త మలుపు. మన సంఘ సంస్కర్తల జీవిత చరిత్రలు పుస్త కాలుగా వచ్చాయి. కానీ వారిపై పెద్ద డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు సినిమాలు తీసే ప్రయత్నం చెయ్యలేదు. అందులో ముఖ్యంగా ప్రపంచ ఆధునిక చరిత్రలో ఎక్కడా లేని ఒక ఫూలే జంట లాంటి జంట మీద సినిమా తీయడం, వారి జీవితాలను ఇంటింటికీ ఆదర్శవంతం చేయడం నిజానికి జాతీయ లక్షణాలు కలిగిన సినిమా ఇండస్ట్రీకి ఉండాలి. కానీ అదెక్కడా కనిపించలేదు. ఈ సినిమాతో అది మొదలయింది.ఒక సినిమా మంచిదా, కాదా అనేది అది ఎన్ని కోట్లు సంపాదిస్తుంది అనే మార్కెట్‌ విలువను బట్టి ఈ రోజుల్లో, మార్కెట్‌లో కూడా ఈ సినిమా విలువను పెంచాల్సి ఉంది. ప్రభుత్వాలు ఈ సినిమాకు పన్ను తగ్గిస్తాయా, మాఫీ చేస్తాయా అనేది అంత ముఖ్యం కాదు. ఎంతమంది ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఈ సినిమాను చూస్తారు అనేది ముఖ్యం. అమెరికాలో రేసిజాన్ని అంతం చేసిన ప్రెసిడెంట్‌ అబ్రహాం లింకన్‌ 1865లో ‘అవర్‌ అమెరికన్‌ కజిన్‌’ డ్రామాను థియేటర్‌లో చూస్తూ హత్యకు గురయ్యారు. మంచిని నేర్చుకోవడానికి ఆయన చూపిన శ్రద్ధ అది. ఈ సమాజం సమానత్వం వైపు పయనిస్తేనే ప్రజాస్వామ్యం బతికి ఉంటుంది. లేకపోతే ఫూలేలు నేర్పిన శ్రమ గౌరవ పాఠాలు ఇసుక దిబ్బల మీద రాసిన రాతలయ్యే ప్రమాదముంది.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెఫర్డ్‌ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు

Ponguleti Srinivas Reddy challenges on KCR comments4
డేట్‌ ఫిక్స్‌ చేయండి..అసెంబ్లీకి రండి: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రజతోత్సవ సభ పేరుతో ఎల్కతుర్తిలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. కాంగ్రెస్‌ పార్టీపై ఆక్రోశంతో విషం కక్కారని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ధ్వజమెత్తారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో అద్భుతాలు జరిగినట్టు, ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఏమీ జరగనట్టు ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఏం జరిగిందో..కాంగ్రెస్‌ టైంలో ఏం జరిగిందో చర్చించేందుకు సిద్ధం కావాలని చాలెంజ్‌ చేశారు. ‘మీరు డేట్‌ ఫిక్స్‌ చేయండి. అసెంబ్లీకి రండి. మీరే సరి్టఫికెట్‌ ఇచ్చిన మీ బచ్చాగాళ్లతో మాట్లాడేది లేదు. మీరు రండి. మీ పాలనలో అద్భుతాలు, మీరు చేసిన ఘనకార్యాలను ప్రజలకు వివరిద్దాం. కాంగ్రెస్‌ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి కూడా మాట్లాడదాం. డేట్‌ మీరే చెప్పండి. చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం’ అని పొంగులేటి వ్యాఖ్యానించారు. ఎల్కతుర్తిలో బీఆర్‌ఎస్‌ సభ ముగిసిన అనంతరం హైదరాబాద్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసం వద్ద మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, సీతక్కలతో కలిసి పొంగులేటి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలు తనను గద్దె దింపారనే ఆక్రోశంతో కేసీఆర్‌ మాట్లాడారని విమర్శించారు. కడుపునిండా కాంగ్రెస్‌ పార్టీపై విషం పెట్టుకొని మమ్మల్ని విలన్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు విలన్‌ అయ్యిందో రాష్ట్ర ప్రజలకు కేసీఆర్‌ సమాధానం చెప్పాలన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇచ్చిన మాటకు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు విలన్‌ అయ్యిందా? హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను ఏర్పాటు చేసినందుకు విలన్‌ అయ్యిందా అని ప్రశ్నించారు. రజతోత్సవ సభలో తన హయాంలో జరిగిన మంచి పనులను చెప్పుకోవచ్చు.. అదేవిధంగా లోపాలను కూడా మాట్లాడి ఉంటే ఎవరూ అభ్యంతరం చెప్పరన్నారు. రైతుల గుదిబండగా మారిన ధరణి పోర్టల్‌ గురించి, కుప్పకూలిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆ సభలో కేసీఆర్‌ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అసలు కేసీఆర్‌ పెట్టిన ఏ పథకాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీసేసిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తామేదో బీఆర్‌ఎస్‌ సభను అడ్డుకునేందుకు ప్రయత్నం చేశామని చెబుతుంటే నవ్వు వస్తుందన్నారు. కేసీఆర్‌ అధికారంలో ఉండగా, కాంగ్రెస్‌ సభలకు బస్సులు ఇవ్వలేదని, టూవీలర్లు కూడా రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని, కానీ తాము ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించామని, వారు ఎన్ని బస్సులకు డబ్బులు కడితే అన్ని బస్సులు ఇచ్చామని తెలిపారు. నిజంగా కాంగ్రెస్‌ అడ్డుకొని ఉంటే బీఆర్‌ఎస్‌ సభ జరిగేదా అని నిలదీశారు. తామేదో వర్సిటీ భూములు అమ్మినట్టు కేసీఆర్‌ చెప్పారని, ఏ యూనివర్సిటీ భూముల అమ్మామో ప్రజలకు చెప్పాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మించిన ఔటర్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టును తనకు కావాల్సిన వారికి లీజుకు ఇచ్చుకుంది.. వైన్‌ షాపుల టెండర్లు ముగియక ముందే డబ్బులు వసూలు చేసుకుంది కేసీఆర్‌ కాదా అని ప్రశ్నించారు. తాము కమీషన్లు తీసుకున్నామని కేసీఆర్‌ అంటున్నారని, ఎక్కడ తీసుకున్నామో చూపించాలని డిమాండ్‌ చేశారు. ఏ కమీషన్లు తీసుకోకుండానే దేశంలోనే అత్యంత ధనిక ప్రాంతీయ పార్టీగా బీఆర్‌ఎస్‌ ఎలా ఎదిగిందని, రూ.1,500 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చబోమని కేసీఆర్‌ ప్రగల్భాలు పలుకుతున్నారని, ఆయన కూలిస్తే కూలిపోవడానికి ప్రభుత్వమేమైనా బొమ్మరిల్లా అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టి ధనిక రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన నాయకుడు... ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం పథకాలు అమలు చేయడం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కేసీఆర్‌ లేదన్నారు. తెలంగాణ వచ్చాక దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చేయలేదని, ఇప్పుడైనా ఆ పార్టీ శాసనసభ పక్ష పదవిని దళితుడికి ఇస్తారా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవిని బీసీకి ఇవ్వగలరా అని వ్యాఖ్యానించారు. వీటన్నింటిపై మాట్లాడేందుకు కేసీఆర్‌ డేట్‌ఫిక్స్‌ చేస్తే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించేందుకు సిద్ధం కావాలని మంత్రి పొంగులేటి బీఆర్‌ఎస్‌ నేతలను సవాల్‌ చేశారు. అధికారం పోయినా గర్వం పోలేదు: మంత్రి జూపల్లి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రజలు ఉద్యోగం ఊడగొట్టినా కేసీఆర్‌కు గర్వం పోలేదని.. చింత చచ్చినా పులుపు చావనట్టు ఆయన మాట్లాడుతున్నారన్నారు. ఒక్కో గ్రామానికి రూ. 3 లక్షలు ఖర్చు చేసి ఈ సభ నిర్వహించారని, ఆ డబ్బులు ఎక్కడివని నిలదీశారు. తాము కూడా రాజకీయాల్లోనే ఉన్నామని, తమకు ఏమీ తెలియదని అనుకోవడం పొరపాటని అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తానని కేసీఆర్‌ పగటి కలలు కంటున్నాడని, అసలు ఆయన ఉద్యోగం ఎందుకు ఊడిందో..ప్రజలు ఎందుకు ఓడించారో ఇప్పటికైనా జ్ఞానోదయం చేసుకోవాలని హితవు పలికారు. ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి: మంత్రి పొన్నం కాంగ్రెస్‌ పార్టీని విలన్‌ అంటూ కేసీఆర్‌ మాట్లాడిన మాటలను వెంటనే ఉపసంహరించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీనే లేకుంటే కేసీఆర్‌ మూడు చెరువుల నీళ్లు తాగినా, వంద మంది కేసీఆర్‌లు వచ్చినా తెలంగాణ వచ్చేది కాదని చెప్పారు. ఎల్కతుర్తి సభకు జనం రాకపోతే అదేదో తాము అడ్డుకున్నట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అగ్గిపెట్టి రాజకీయానికి బలైన ఉద్యమకారులు, అమరవీరులకు ఆ సభలో ఎందుకు నివాళులరి్పంచలేదని మంత్రి పొన్నం ప్రశ్నించారు. నియంత మాట్లాడినట్టుంది: మంత్రి సీతక్క మంత్రి సీతక్క మాట్లాడుతూ ఒక నియంత అధికారాన్ని కోల్పోయిన తర్వాత మాట్లాడినట్టు కేసీఆర్‌ ప్రసంగం ఉందని చెప్పారు. అధికారం పోయాక కుటుంబం, ఆస్తులు చీలికలు,పీలికలు అయ్యాయన్న ఆవేదనతో ఆయన మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ బిడ్డ మంచి కార్లలో తిరగొచ్చు గానీ.. పేద మహిళలు ఆర్టీసీ బస్సుల్లో తిరగవద్దా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ అంత దరిద్రంగా పోలీసులను ఎవరూ ఉపయోగించుకోలేదని చెప్పారు. వారు అధికారంలో ఉన్నప్పుడు ధర్నా చౌక్‌ తీసేశారని, ఇప్పుడు మళ్లీ తాము ధర్నాచౌక్‌ తెరిస్తే సిగ్గు లేకుండా అక్కడకు వచ్చి ధర్నాలు చేస్తున్నారన్నారు. అసెంబ్లీలో సొల్లు కబుర్లు మాట్లాడుతున్నారని చట్టసభను అవమానించిన కేసీఆర్‌కు అసెంబ్లీకి వచ్చే అర్హత ఉందా అని ప్రశ్నించారు.

Pakistan Ratna BJP After Siddaramaiah Remark5
సీఎం సార్.. మీరు నిజంగా ‘పాకిస్తాన్ రత్న’

బెంగళూరు: పాకిస్తాన్‌తో యుద్ధం చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదని. భారత్‌ శాంతిప్రియ దేశం. కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు చనిపోవడానికి దేశ అంతర్గత భద్రత, ఇంటెలిజెన్స్‌ శాఖల వైఫల్యమే కారణమని సిద్దరామయ్య ఆరోపించారు. వేలాది మంది పర్యాటకులు సంచరించే స్థలంలో వారికి తగిన భద్రతను కల్పించాల్సిందన్నారు. ఆ భద్రత లేనందునే ఈ ఘోరం జరిగిందన్నారు. భద్రత ఉందనుకొని ప్రజలు కశ్మీరుకు వెళ్లి మృత్యువాత పడ్డారని దుయ్యబట్టారు. ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నా పోయిన ప్రాణాలను వెనక్కు తెచ్చివ్వగలరా అని ప్రధాని మోదీని విమర్శించారు. సిద్ధరామయ్య.మీరు నిజంగా ‘పాకిస్తాన్ రత్న’దీనిపై కర్ణాటక బీజేపీ తీవ్రంగా మండిపడింది. పాకిస్తాన్ లో , పాకిస్తాన్ బోర్డర్ లో సిద్ధరామయ్య పేరు మారుమ్రోగుతోంది. ‘ మీరు పాకిస్తాన్ రత్న’ కర్ణాటక బీజేపీ ధ్వజమెత్తింది. మన దేశానికి తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గురించి ప్రస్తావించిన బీజేపీ చీఫ్ బీవై విజయేంద్రన్... పాకిస్తాన్ కు అనుకూలంగా సింధు జల ఒప్పందంపై సంతకం చేసినప్పుడు పాకిస్తాన్ చాలా సంతోషం ఉంది. కాబట్టే అప్పుడు రావల్పిండి వీధ/ల్లో నెహ్రూను ఓపెన్ జీప్ లో తీసుకెళ్లారు. పాకిస్తాన్ లో ఓపెన్ జీప్ లో తిప్పబడే భారత దేశ తదుపరి రాజకీయ నేత మీరు అవుతారా సిద్ధరామయ్య అవుతారా? అని ప్రశ్నించారు బీజేపీ చీఫ్‌ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా?ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా అంటూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యురప్ప విమర్శించారు. ‘ మనదేశం అంతా ఒక్కటిగా ఉండాల్సిన సమయంలో ఈ తరహ మాటాలేమిటి.. అసలు వాస్తవ పరిస్థితులు ఏమిటో అర్ధం చేసుకోవాలి. మీకు సీఎంగా ఇచ్చే ఫేర్ వెల్ పార్టీ కాదు ఇది. మీ వ్యాఖ్యలు కచ్చితంగా అభ్యంతరకరమే. మీరు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు యడ్యురప్ప.

RCB defeated Delhi by 6 wickets6
బెంగళూరు ప్రతీకారం

దాదాపు రెండు వారాల క్రితం బెంగళూరు వేదికగా ఢిల్లీ, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్‌... 163 పరుగులు చేసిన ఆర్‌సీబీ ఓటమి పాలైంది. అద్భుత ప్రదర్శనతో గెలిపించిన ‘లోకల్‌ ప్లేయర్‌’ కేఎల్‌ రాహుల్‌ మ్యాచ్‌ ముగిశాక ‘ఇది నా అడ్డా’ అన్నట్లుగా కాంతారా స్టయిల్‌లో సంబరం చేసుకున్నాడు. ఇప్పుడు అవే రెండు జట్ల మధ్య వేదిక ఢిల్లీకి మారింది. మ్యాచ్‌పై చర్చ కూడా కోహ్లి వర్సెస్‌ రాహుల్‌గానే సాగింది. ఈసారి ఆర్‌సీబీ విజయలక్ష్యం అదే 163 పరుగులు... 26/3తో బెంగళూరు కష్టాల్లో పడినట్లు కనిపించినా... కోహ్లి, కృనాల్‌ పాండ్యా శతక భాగస్వామ్యంతో ఆర్‌సీబీ ఘన విజయాన్ని అందుకొని బదులు తీర్చుకుంది. ఈసారి బ్యాటింగ్‌లో పరుగులు చేసేందుకు రాహుల్‌ తీవ్రంగా ఇబ్బంది పడగా... ‘దిల్లీవాలా’ కోహ్లి చక్కటి ఆటతో బెంగళూరు విజయానికి బాటలు వేశాడు. మ్యాచ్‌ ముగిశాక ప్రతీకార శైలిలో కోహ్లి విజయనాదం చేశాడు. న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య సమరం 1–1తో సమంగా ముగిసింది. సొంతగడ్డపై గత మ్యాచ్‌లో ఓడిన బెంగళూరు ఈసారి ప్రత్యర్థి మైదానంలో విజయాన్ని అందుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (39 బంతుల్లో 41; 3 ఫోర్లు), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (18 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్‌) మాత్రమే ఫర్వాలేదనిపించగా, భువనేశ్వర్‌ 3 కీలక వికెట్లు పడగొట్టాడు. అనంతరం బెంగళూరు 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు సాధించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కృనాల్‌ పాండ్యా (47 బంతుల్లో 73 నాటౌట్‌; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), విరాట్‌ కోహ్లి (47 బంతుల్లో 51; 4 ఫోర్లు) నాలుగో వికెట్‌కు 84 బంతుల్లో 119 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. బ్యాటింగ్‌ తడబాటు... అభిషేక్‌ పొరేల్‌ (11 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్టబ్స్‌ కలిసి 29 బంతుల్లో 62 పరుగులు చేయగా... మిగతా బ్యాటర్లంతా కలిసి 92 బంతుల్లో 96 పరుగులు మాత్రమే సాధించడం ఢిల్లీ బ్యాటింగ్‌ పరిస్థితిని చూపిస్తోంది. భువనేశ్వర్‌ ఓవర్లో 2 సిక్స్‌లతో ధాటిని ప్రదర్శించిన పొరేల్‌ ఎక్కువ సేపు నిలవలేకపోగా, కరుణ్‌ నాయర్‌ (4) విఫలమయ్యాడు. పవర్‌ప్లేలో జట్టు 52 పరుగులు చేసింది. అయితే ఆపై ఆర్‌సీబీ స్పిన్నర్లు సుయాశ్, కృనాల్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పరుగుల రాక కష్టంగా మారిపోయింది. ఈ ఇద్దరు బౌలర్లు కలిసి 8 ఓవర్లలో 2 ఫోర్లు, 1 సిక్స్‌ సహా 50 పరుగులు మాత్రమే ఇచ్చారు. ఒత్తిడిలో డుప్లెసిస్‌ (22), అక్షర్‌ పటేల్‌ (15) వెనుదిరగ్గా... రాహుల్‌ కూడా షాట్లు ఆడేందుకు బాగా ఇబ్బంది పడ్డాడు. భువీ ఒకే ఓవర్లో రాహుల్, అశుతోష్‌ (2)లను అవుట్‌ చేయడంతో ఢిల్లీ 17 ఓవర్లలో 120/6 వద్ద నిలిచింది. అయితే స్టబ్స్‌ దూకుడుగా ఆడటంతో తర్వాతి రెండు ఓవర్లలో 36 పరుగులు వచ్చి స్కోరు 150 దాటింది. కీలక భాగస్వామ్యం... ఛేదనలో బెంగళూరుకు సరైన ఆరంభం లభించలేదు. ఆరు పరుగుల వ్యవధిలో బెథెల్‌ (12), పడిక్కల్‌ (0), పాటీదార్‌ (6) వెనుదిరగడంతో స్కోరు 26/3 వద్ద నిలిచింది. ఈ దశలో కోహ్లి, కృనాల్‌ కలిసి చక్కటి సమన్వయంతో జట్టును ఆదుకున్నారు. ఆరంభంలో జాగ్రత్తగా ఆడినా... నిలదొక్కుకున్న తర్వాత కృనాల్‌ ధాటిని పెంచాడు. 8 ఓవర్లలో 85 పరుగులు చేయాల్సిన సమయంలో తర్వాతి 3 ఓవర్లలో బెంగళూరు 36 పరుగులు రాబట్టడంతో పని సులువైంది. ఈ క్రమంలో సిక్సర్లతో చెలరేగిన కృనాల్‌ 38 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. 2016 సీజన్‌లో తన ఏకైక హాఫ్‌ సెంచరీని సాధించిన కృనాల్‌ ఇన్నేళ్లకు మళ్లీ ఆ మార్క్‌ను దాటడం విశేషం. ఆ తర్వాత కోహ్లి కూడా 45 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. విజయానికి 18 పరుగుల దూరంలో కోహ్లి అవుటైనా... కృనాల్, టిమ్‌ డేవిడ్‌ (5 బంతుల్లో 19 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కలిసి 9 బంతుల ముందే మ్యాచ్‌ను ముగించారు. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: పొరేల్‌ (సి) జితేశ్‌ శర్మ (బి) హాజల్‌వుడ్‌ 28; డుప్లెసిస్‌ (సి) కోహ్లి (బి) కృనాల్‌ 22; కరుణ్‌ నాయర్‌ (సి) భువనేశ్వర్‌ (బి) దయాళ్‌ 4; రాహుల్‌ (సి) బెథెల్‌ (బి) భువనేశ్వర్‌ 41; అక్షర్‌ (బి) హాజల్‌వుడ్‌ 15; స్టబ్స్‌ (సి) హాజల్‌వుడ్‌ (బి) భువనేశ్వర్‌ 34; అశుతోష్‌ (బి) భువనేశ్వర్‌ 2; విప్‌రాజ్‌ (రనౌట్‌) 12; స్టార్క్‌ (నాటౌట్‌) 0; చమీరా (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–33, 2–44, 3–72, 4–102, 5–118, 6–120, 7–158, 8–162. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–33–3, యశ్‌ దయాళ్‌ 4–0–42–1, హాజల్‌వుడ్‌ 4–0–36–2, సుయాశ్‌ శర్మ 4–0–22–0, కృనాల్‌ పాండ్యా 4–0–28–1. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: బెథెల్‌ (సి) నాయర్‌ (బి) అక్షర్‌ 12; కోహ్లి (సి) స్టార్క్‌ (బి) చమీరా 51; పడిక్కల్‌ (బి) అక్షర్‌ 0; పాటీదార్‌ (రనౌట్‌) 6; కృనాల్‌ (నాటౌట్‌) 73; డేవిడ్‌ (నాటౌట్‌) 19; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (18.3 ఓవర్లలో 4 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–20, 2–20, 3–26, 4–145. బౌలింగ్‌: అక్షర్‌ పటేల్‌ 4–0–19–2, స్టార్క్‌ 3–0–31–0, ముకేశ్‌ కుమార్‌ 3.3–0–51–0, విప్‌రాజ్‌ 1–0–12–0, కుల్దీప్‌ 4–0–28–0, చమీరా 3–0–24–1. ఐపీఎల్‌లో నేడురాజస్తాన్‌ X గుజరాత్‌ వేదిక: జైపూర్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Director SS Rajamouli Chief Guest For Nani Hit-3 Pre Release Event7
నాని నా అంచనాలను మించిపోయాడు: దర్శకుడు రాజమౌళి

‘‘నాని ఏ సినిమా చేసినా హిట్‌ అని తెలిసిపోతుంటుంది. కానీ తన దగ్గర్నుంచి ఇంకా కావాలని ఓ ఫంక్షన్‌లో అన్నాను. అయితే నా అంచనాలను మించి నాని చాలా ముందుకెళ్లిపోయాడు. కానీ నానీ... మేం ఇంకా కోరుకుంటూనే ఉంటాం. నువ్వు ఇంకా ముందుకు వెళ్లు’’ అని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. నాని హీరోగా నటించిన చిత్రం ‘హిట్‌ 3: థర్డ్‌ కేస్‌’. ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్ . శైలేష్‌ కొలను దర్శకత్వంలో నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా దర్శకుడు రాజమౌళి, అతిథులుగా ‘హిట్‌ 1’లో హీరోగా నటించిన అడివి శేష్, ‘హిట్‌ 2’లో హీరోగా నటించిన విశ్వక్‌ సేన్ హాజరయ్యారు. ఈ వేదికపై దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ – ‘‘అ!, హిట్‌ 1, హిట్‌ 2, కోర్ట్‌’... ఆల్‌ సక్సెస్‌. వంద శాతం సక్సెస్‌ అయిన నిర్మాత ప్రశాంతి. ఇండస్ట్రీలో హిట్‌ మిషన్ అని పిలుచుకుంటుంటాం. ఇప్పుడు ‘హిట్‌ 3’ సక్సెస్‌ అవుతుందని నా గట్టి నమ్మకం. ఓ ఫ్రాంచైజీని స్టార్ట్‌ చేసినప్పుడు అది ఎంతకాలం ఉంటుందో చెప్పలేం. కానీ ‘హిట్‌ ఫస్ట్‌ కేస్, సెకండ్‌ కేస్‌... చాలా కేస్‌లు ఉండొచ్చు. శైలేష్‌ ఏడు సినిమాలే అనుకుని ఉండొచ్చు. కానీ ఈ ఫ్రాంచైజీ ఎప్పటికీ ఉంటుందని అనుకుంటున్నాను. ‘హిట్‌ 3’ ప్రమోషనల్‌ కంటెంట్‌ చూశాను. సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అనే వైబ్‌ని క్రియేట్‌ చేసింది. మే1 థియేటర్స్‌లో... అబ్‌ కీ బార్‌ అర్జున్ సర్కార్‌. హిట్‌ ది థర్డ్‌ కేస్‌’’ అని రాజమౌళి అన్నారు.కాగా.. ఈ వేదికపై ‘‘మీరు తీయబోతున్నటు వంటి ‘మహాభారతం’ సినిమాలో నానీగారి క్యారెక్టర్‌ ఫిక్స్‌ అయిందని విన్నాం... నిజమేనా’’ అని యాంకర్‌ సుమ అడిగితే ‘‘నాని ఉంటాడన్నది మాత్రం ఫిక్స్‌’’ అని రాజమౌళి చెప్పారు. నాని మాట్లాడుతూ– ‘‘నా ప్రతి కొత్త సినిమాకు మార్నింగ్‌ షోకి ప్రసాద్‌ ఐమ్యాక్స్‌కి వెళతాను. వెళ్లే ముందే రాజమౌళిగారి ఫ్యామిలీ మెంబర్స్‌ కూడా వస్తున్నారా? అని చెక్‌ చేసుకుని, థియేటర్లో వాళ్ల రియాక్షన్ చూస్తుండేవాడిని. సినిమా అయిపోయాక వల్లీగారు, రమగారిని టాక్‌ అడిగేవాడిని. ప్రేమగా హగ్‌ ఇచ్చి వెళ్లిపోయారంటే నచ్చలేదని అర్థం. ‘చాలా బాగుంది. కారు ఎక్కిన వెంటనే నీకు మెసేజ్‌ చేస్తాం’ అంటే సినిమా బాగుందని అర్థం. అయితే ఈ మధ్య థియేటర్‌కి వెళ్లకపోవడంతో కాస్త బ్రేక్‌ వచ్చింది.ఈసారి ‘హిట్‌ 3’ సినిమా చూసి, ఆయన (రాజమౌళి) నాకు ఆ మార్నింగ్‌ షో ఎనర్జీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. రాజమౌళిగారు ఈ మూవీని ఎంజాయ్‌ చేస్తారనే నమ్మకం ఉంది. ఒక థ్రిల్లర్, ఒక మాస్‌ కమర్షియల్‌ ఫిల్మ్‌ కలిస్తే అది ‘హిట్‌ 3’. మే 1న ఆడియన్స్ కు ఒక అమేజింగ్‌ థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్ ను నానిప్రామిస్‌ చేస్తున్నాడు’’ అన్నారు. ‘హిట్‌ 3’ సక్సెస్‌ అవ్వాలనే ఆకాంక్షను అడివి శేష్, విశ్వక్‌ సేన్‌ వ్యక్తం చేశారు. శైలేష్‌ కొలను, శ్రీనిధీ శెట్టి, కోమలీ ప్రసాద్‌ తదితరులు మాట్లాడారు.

BRS Silver Jubilee Public Meeting super hit 8
ఓరుగల్లు.. గులాబీ జల్లు

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ రజతోత్సవ బహిరంగసభ ఉద్యమకాలం నాటి సభలను గుర్తు చేసింది. భారీగా జనం తరలివచ్చి సభ విజయవంతం కావడం పార్టీలో కొత్త జోష్‌ను నింపింది. భారీ జన సమీకరణ లక్ష్యంగా కేసీఆర్‌ ఆదేశాల మేరకు జరిగిన ప్రయత్నాలు సఫలం కావడంతో సభా ప్రాంగణమంతా గులాబీమయమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం, పార్లమెంట్‌ ఎన్నికలో నిరాశ కలిగించే ఫలితాలు ఎదుర్కొన్న బీఆర్‌ఎస్‌లో కొత్త ఉత్సాహం నింపేలా సభ సాగింది. సుమారు ఏడాది కాలం తర్వాత ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టిన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పార్టీ కేడర్‌లో ఉత్తేజం నింపే ప్రయత్నం చేశారు. ఉద్యమ కాలం నుంచి నేటి దాకాటీఆర్‌ఎస్‌ ఏర్పాటుకు ముందు తెలంగాణలో ఉన్న సామా జిక పరిస్థితులను కేసీఆర్‌ వివరించారు. ఉద్యమ కాలంలో తాను ఎదుర్కొన్న ఆటుపోట్లు, ఎత్తు పల్లాలను గుర్తు చేశారు. తాను చేపట్టిన ఆమరణ దీక్ష మూలంగా తెలంగాణ ఇవ్వాల్సిన అనివార్యత కాంగ్రెస్‌కు ఏర్పడిన తీరును వివరించారు. ప్రత్యేక రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్ల పాలనలో వ్యవసా యం, విద్యుత్, తాగునీరు, సాగునీరు, విద్య తదితర రంగాల్లో జరిగిన కృషిని గుర్తు చేశారు. రైతాంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తాను ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాన్ని కేసీఆర్‌ పలుమార్లు ప్రస్తావించారు.కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మెరుపు దాడిఏడాది తర్వాత బహిరంగసభ వేదికగా మాట్లాడిన కేసీఆర్‌ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రుల పేరు ఎత్తకుండా వారి పనితీరుపై విమర్శల దాడి చేశారు. సీఎం రేవంత్‌ ప్రభుత్వ పాలనావైఫల్యం, అనుభవలేమి, అవినీతిపై విమర్శల దాడి చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల వైఫల్యాన్ని తనదైన శైలిలో సామెతలు, పిట్ట కథలతో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. తెచ్చిన తెలంగాణ.. కాంగ్రెస్‌ పాలనలో ఆగమవుతోందని భావోద్వేగంతో వ్యాఖ్యలు చేసిన సందర్భంలో ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన కనిపించింది. వచ్చే రెండున్నర ఏళ్లలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏమీ చేయలేదనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్‌ ప్రయత్నించారు. హెచ్‌సీయూ భూముల అమ్మకాన్ని ప్రస్తావించారు.కేటీఆర్‌ స్థానాన్ని బలోపేతం చేసేలాసభావేదికను ‘బాహుబలి’గా పార్టీ నేతలు అభివర్ణించగా, సభా మైదానంలో చేసిన ఏర్పాట్లపై బీఆర్‌ఎస్‌ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కేసీఆర్‌తోపాటు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు, భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. సభా వేదికపైనా కేటీఆర్‌ వచ్చిన సందర్భంలో నేతలు ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. పార్టీ రజతోత్సవ సభ వేదికగా కేటీఆర్‌ స్థానాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఏర్పాట్లు జరిగాయని పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది.భవిష్యత్‌ కార్యాచరణపై సంకేతాలుసోషల్‌ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెట్టి వేధించడాన్ని కేసీఆర్‌ ఖండించారు. అదే సమయంలో పార్టీ కేడర్‌ వెంట నిలుస్తానని, రాబోయే రోజుల్లో పదవులు లభిస్తాయని భరోసా ఇచ్చారు. ఇకపై ప్రజాక్షేత్రంలో చురుగ్గా వ్యవహరిస్తాననే సంకేతాలు ఈ సభ ద్వారా కేసీఆర్‌ ఇచ్చారు. ఆపరేషన్‌ కగార్‌ మినహా బీజేపీకి సంబంధించిన ప్రస్తావన కేసీఆర్‌ ప్రసంగంలో పెద్దగా కనిపించలేదు. తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన వరంగల్‌ను రజతోత్సవ సభ నిర్వహణకు ఎంపిక చేసుకున్న బీఆర్‌ఎస్‌.. రాష్ట్ర రాజకీయాల్లో తమ స్థానం చెక్కు చెదరలేదనే సంకేతం ఇచ్చేందుకు బలంగా ప్రయత్నించింది. మూడు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలుహసన్‌పర్తి/వరంగల్‌క్రైం: బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ సందర్భంగా ట్రాఫిక్‌ను పోలీసులు నియంత్రించలేకపోయారు. అధిక సంఖ్యలో వాహనాలు రోడ్లపై బారులుదీరడంతో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల్ని నిలిపేందుకు మూడుచోట్ల పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. ఇటు హనుమకొండ నుంచి ఎల్కతుర్తి, దేవన్నపేట–అన్నాసాగరం మార్గంతోపాటు హుజూరాబాద్, సిద్దిపేట ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించింది. ఎటూ చూసినా మూడు కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సభకు వెళుతున్న బస్సుల అడ్డగింత తిరుమలాయపాలెం: ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల బస్సులకు బీఆర్‌ఎస్‌ స్టిక్కర్లు వేసుకొని రజతోత్సవ సభకు వెళుతుండగా, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం వద్ద ఆర్‌టీఓ, అధికారులు అడ్డుకున్నారు. లైసెన్స్‌లు రద్దు చేసి, డ్రైవర్లపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య అక్కడకు చేరుకొని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయగా, బస్సులను పంపించారు. ఆ తర్వాత మళ్లీ బస్సులు ఆపుతుండగా, మాజీమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆగి రాష్ట్ర రవాణా శాఖ మంత్రితో పాటు ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. తెలంగాణ చరిత్రలో నిలిచిపోయేలా సభ: కేసీఆర్‌తెలంగాణ నలమూలల నుంచి లక్షలాదిగా తరలివచ్చి బీఆర్‌ఎస్‌ సభను విజయవంతం చేసిన ప్రజలకు, పార్టీ శ్రేణులకు బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ చరిత్రలో నిలిచిపోయేలా భారీ సభను విజయవంతం చేయడంలో భాగస్వాములైన పార్టీ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కిక్కిరిసిన గూడూరు టోల్‌ప్లాజాబీబీనగర్‌: బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు జంట నగరాలు సహా.. వివిధ ప్రాంతాల నుంచి పార్టీ కార్యకర్తల వాహనాలు భారీగా తరలి రావడంతో జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. దీంతో గూడూరు టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్‌ స్తంభించిపోయి.. వాహనాలు నెమ్మదిగా కదిలాయి.

Major transfers in the state administration9
ప్రాధాన్యాలకు కొత్త జట్టు!

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పాలనా యంత్రాంగంలో భారీగా బదిలీలు జరిగాయి. ఆదివారం తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.రామకృష్ణారావును నియమించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ వెంటనే పలు కీలక శాఖలు, విభాగాలకు కొత్త బాస్‌లను నియమించింది. పెట్టుబడుల ఆవిష్కరణ, మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధి, హైదరాబాద్‌ నగరాభివృద్ధి, పట్టణాభివృద్ధి వంటి ప్రభుత్వ ప్రాధాన్యాంశాలకు అనుగుణంగా కొత్త జట్టును సిద్ధం చేసింది. ఈ మేరకు 18 మంది ఐఏఎస్‌లు, ఇద్దరు నాన్‌ కేడర్‌ అధికారులకు స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కీలకమైన ఐటీ, పరిశ్రమలు, క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయేశ్‌ రంజన్‌ను సీఎంఓలోని ఇండస్ట్రీ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సెల్, స్మార్ట్‌ ప్రొయాక్టివ్‌ ఎఫీషియంట్‌ అండ్‌ ఎఫెక్టివ్‌ డెలివరీ (స్పీడ్‌) విభాగాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/సీఈఓగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో పరిశ్రమలు, ఐటీ, క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ, కర్మాగారాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్‌ స్థానచలనం పొందారు. ఇక గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ భూముల వ్యవహారంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేవిధంగా ‘ఎక్స్‌’లో పోస్టులను షేర్‌ చేసిన యువజన అభ్యుదయ, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి, పురావస్తు శాఖ డైరెక్టర్‌ స్మితా సబర్వాల్‌పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆమెను రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యకార్యదర్శిగా మళ్లీ ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేసింది. ఆమె స్థానంలో యువజన అభ్యుదయ, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి, పురావస్తు శాఖ డైరెక్టర్‌గా జయేశ్‌ రంజన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆ శాఖ ఆధ్వర్యంలోనే హైదరాబాద్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతుండగా, శాఖాధిపతిని మార్చడం గమనార్హం. సీనియారిటీ ప్రకారం సీఎస్‌ రేసులో ముందంజలో ఉన్న శశాంక్‌ గోయల్‌ను ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ డీజీ పోస్టు నుంచి మరో ప్రాధాన్యత లేని సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ వైస్‌ చైర్మన్‌ పోస్టుకు ప్రభుత్వం బదిలీ చేసింది. రెండుగా పురపాలక శాఖ విభజన పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్‌ను ప్రభుత్వం కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ, కర్మాగారాల శాఖ ముఖ్యకార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ శాఖను రెండుగా విడగొట్టి ఇద్దరు కార్యదర్శులను నియమించింది. పురపాలక శాఖ డైరెక్టర్, కమిషనర్‌ టీకే శ్రీదేవిని పురపాలక శాఖ (హెచ్‌ఎండీ వెలుపలి ప్రాంతం) కార్యదర్శిగా బదిలీ చేసింది. హెచ్‌ఎండీఏ వెలుపలి ప్రాంతాల్లోని పురపాలికలు మాత్రమే ఈ పోస్టు పరిధిలోకి రానున్నాయి. మెట్రోపాలిటన్‌ ఏరియా, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖ (హెచ్‌ఎండీఏ పరిధి) పేరుతో కొత్త శాఖను సృష్టించి దాని కార్యదర్శిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కె.ఇలంబర్తిని బదిలీ చేసింది. ఇక ప్రభుత్వ ప్రాధాన్య అంశాల్లో ఒకటైన ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ ఆథారిటీ(ఎఫ్‌సీడీఏ) కమిషనర్‌గా కె.శశాంకను నియమించింది. రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) సీఎండీగా అదనపు బాధ్యతల నుంచి సందీప్‌కుమార్‌ సుల్తానియాను తప్పించింది. జెన్‌కో సీఎండీగా సమాచార, ప్రజాసంబంధాల శాఖ ఎక్స్‌అఫిషియో స్పెషల్‌ సెక్రటరీ ఎస్‌.హరీశ్‌ను నియమించింది. సమాచార, ప్రజాసంబంధాల శాఖ ఎక్స్‌అఫిషియో స్పెషల్‌ సెక్రటరీగా, రెవెన్యూ శాఖ సంయుక్త కార్యదర్శిగా హరీశ్‌ అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు.

Baisaran Reels Videographer Who Recorded Entire Pahalgam Attack10
పహల్గాం దాడి.. చెట్టుపై కూర్చుని కెమెరాలో బంధించి..

శ్రీనగర్‌: అందాల కశ్మీరంలోని పహల్గాం బైసారన్‌ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్ర ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు.. ఈ దారుణానికి 26 మంది పర్యాటకులు బలయ్యారు. అయితే, బైసరన్‌కు వచ్చే టూరిస్టుల కోసం రీల్స్‌ను చిత్రీకరించే ఓ స్థానిక వీడియో గ్రాఫర్‌ ఈ దాడికి సంబంధించి అత్యంత కీలక సాక్షిగా నిలిచాడు. ఈ దాడి మొత్తాన్ని అతడు కెమెరాలో బంధించగా, కీలక ఆధారమైన ఓ వీడియో ఇప్పుడు ఎన్‌ఐఏ చేతికి చిక్కింది.ఈ స్థానిక వీడియో గ్రాఫర్‌ కాల్పులు ప్రారంభమైనప్పుడు తన ప్రాణ రక్షణ కోసం పరిగెత్తి, బుల్లెట్ల నుంచి తప్పించుకోవడానికి ఒక చెట్టుపైకి ఎక్కాడు. దాడి జరిగిన సమయంలో అతడు ఓ చెట్టుపై దాక్కొని ఘటన మొత్తాన్ని చిత్రీకరించాడు. ఆ వీడియోల ఆధారంగా జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) దర్యాప్తు చేస్తోంది.వీడియో గ్రాఫర్‌ విచారించిన ఎన్‌ఐఏ అధికారులు.. ఆయన వద్ద నుంచి ఆధారాలు సేకరించారు. ఉగ్రవాదులు రెండు గ్రూపులుగా విడిపోయి లోయలో వేర్వేరు దిక్కుల నుంచి కాల్పులు జరిపినట్లు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. ముందగా ఇద్దరు ఉగ్రవాదులు.. పర్యాటకులను ముస్లిం మతాచారాన్ని పాటించమంటూ బెదిరించారు. అనంతరం నలుగురిని కర్కశంగా కాల్చి చంపారు.ఘటనా స్థలంలో ఏకే-47, ఎం4 రైఫిల్‌ ఖాళీ తూటాలను గుర్తించారు. ఉగ్రవాదులు స్థానికుల నుంచి రెండు సెల్‌ఫోన్లు కూడా లాక్కునట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. వాటిని ట్రాక్‌ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వీటి ఆధారంగా ఉగ్రవాదుల ప్రస్తుత లొకేషన్లు కూడా కనుగొనే అవకాశం ఉంది. అయితే, దాడి తర్వాత నుంచి స్విచ్ఛాఫ్‌ అయినట్లు అధికారులు గుర్తించారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement