దేశంలో 1.80 కోట్ల మంది బానిసలు!
మోడరన్ బానిసలు ఎక్కువగా ఉన్నది మన దేశంలోనేనట. దాదాపు కోటి ఎనభై లక్షల మందికి పైగా భారతీయులు కట్టుబానిసలుగాను, బిచ్చగాళ్లుగా, వ్యభిచారులుగా, బాల కార్మికులుగా బతుకీడుస్తున్నారని ఓ అంతర్జాతీయ సర్వేసంస్థ తెలిపింది.
హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ వాక్ ఫ్రీ పౌండేషన్ కు చెందిన ది గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ ఈ విషయాలను బయటపెట్టింది. దాదాపు భారత జనాభాలో 1.4 శాతం బానిసలుగా బతుకుతున్నారని వివరించింది. ఇలా దేశ జనాభాలో బానిసలు అధికంగా ఉన్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉన్నట్లు తెలిపింది. మొత్తం 167 దేశాల్లో నిర్వహించిన ఈ సర్వేలో ఇండియాలో బానిసత్వం కొనసాగుతోందని తేలినట్లు చెప్పింది. వీటిలో ముఖ్యంగా కట్టుబానిసలు, బాల కార్మికులు, వ్యభిచారులు, భిక్షాటనలో ఉన్నవాళ్లు, బలవంతపు పెళ్లిళ్లు ముందు ముందు కూడా కొనసాగుతాయని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం బానిసల్లో 58 శాతం మంది ఇండియా, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఉజ్బెకిస్థాన్ దేశాల లోనే ఉన్నట్లు సంస్థ వెల్లడించింది.
మనుషుల అక్రమ రవాణా, కట్టుబానిసత్వం, వ్యభిచారం, బాలకార్మిక తదితర చట్టాలకు మరింత బలాన్ని చేకూరుస్తూ భారత ప్రభుత్వం కొత్త నియమాలను అమల్లోకి తెచ్చింది. కానీ వీటన్నింటినీ నిర్వహించే గ్యాంగుల జోరు మాత్రం తగ్గడం లేదు. పేద కుటుంబాలకు గాలం వేసి ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారు. వీటన్నింటికీ అడ్డుకట్ట వేయాలంటే ప్రైవేటు ఉద్యోగుల కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించుకుని, దాన్ని తరచు పరిశీలించుకోవాలని సర్వే సంస్థ సూచించింది. ఉగ్రవాద సంస్థలకు ఆకర్షితులవుతున్న వారిలో జమ్మూ-కశ్మీర్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పిల్లలు ఎక్కువగా ఉంటున్నారని హెచ్చరించింది.