ఎవరైనా ఉన్నారా ?
నిజాలు దేవుడికెరుక: జనవరి 2007. బ్రిటన్‌లోని నాటింగ్ హామ్....
‘‘వావ్... ఈ ఇల్లు భలేవుంది డాడ్’’
పెద్ద కూతురి మాట వినగానే అబ్దుల్ రషీద్ ముఖం వికసించింది. అతడికి తెలుసు... తన భార్యకి, పిల్లలకి ఇల్లు చాలా నచ్చుతుందని. 3.6 మిలియన్ డాలర్లు పోసి సొంతం చేసుకున్నాడు, నచ్చకుండా ఎలా ఉంటుంది! ‘‘నిజం రషీద్... అద్భుతంగా ఉంది. కానీ మనకింత పెద్ద ఇల్లు అవసరమా?’’ అంది రషీద్ భార్య నబీలా ఇల్లంతా పరికించి చూస్తూ. పదిహేడు బెడ్రూములు, ఓ థియేటర్, జిమ్ తదితర విలాసవంతమైన సౌకర్యాలు ఉన్న ఆ ఇంటిని చూస్తే ఎవరూ ఈ ప్రశ్న అడక్కుండా ఉండరు.
‘‘అలా అంటావేంటి నబీలా? ఇలాంటి ఇంట్లో ఉండటం ఎంత బాగుంటుంది చెప్పు! మన ఆరుగురికీ ఇల్లు పెద్దదే. కానీ ఇక్కడ నేను వ్యాపారం కూడా ప్రారంభించబోతున్నానని చెప్పాను కదా! దీన్ని మన కలల స్వర్గంలానే కాదు, మంచి బిజినెస్ సెంటర్‌గా కూడా మారుస్తాను’’ భర్త హుషారు చూసి ముచ్చటేసింది నబీలాకి. రషీద్ మంచి వ్యాపారి. దుబాయ్‌లో హాస్పిటళ్లు, హోటళ్లు నడుపుతున్నాడు. లాభాలను పండిస్తున్నాడు.
‘‘మళ్లీ కొత్త వ్యాపారమన్నమాట. కానివ్వు. ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటావ్ కదా!’’ అంది నబీలా నవ్వుతూ. ‘‘మరి! ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా చేయాలనుకునేవాడే జీవితంలో గొప్పవాడు అవుతాడు. నీ భర్త గొప్పవాడవుతానంటే వద్దంటావేంటి?’’ ‘‘అరే... నేనెప్పుడు వద్దన్నాను? నువ్వేం చేసినా సక్సెస్ అవుతావని నాకు నమ్మకం ఉంది. నీకు నచ్చింది చెయ్యి’’ అంది నబీలా భర్త కళ్లలోకి చూస్తూ. ఆమె నమ్మకానికి మురిసిపోయాడు రషీద్. భార్యని, ముగ్గురు కూతుళ్లన్నీ ఇల్లంతా తిప్పాడు. వారి పద్దెనిమిది నెలల కొడుకు హుషారుగా గెంతసాగాడు. ‘‘చివరికి వీడిక్కూడా ఇల్లు నచ్చినట్టుంది నబీలా... చూడు ఎలా గంతులేస్తున్నాడో’’... కొడుకుని ఎత్తుకుంటూ అన్నాడు రషీద్. నబీలా నవ్వింది. ఆ నవ్వుల మధ్య కొత్త ఇంట్లో వారి జీవితం మళ్లీ కొత్తగా మొదలైంది.
‘‘రషీద్... రషీద్’’
భార్య అరుపులు విని గదిలోంచి బయటకు వచ్చాడు రషీద్. నబీలా కంగారుగా వచ్చి అతడి ఎదురుగా నిలబడింది. ‘‘ఏమైంది నబీలా... ఎందుకలా అరిచావ్? అలా ఉన్నావేంటి నువ్వు?’’... ఆతృతగా అడిగాడు. నబీలా వెంటనే మాట్లాడలేకపోయింది. ‘‘అక్కడ... అక్కడ..’’ అంటూ నసిగింది. ‘‘ఏమైంది? ఏదైనా చూసి జడుసుకున్నావా ఏంటి?’’లేదన్నట్టు తలూపింది. ‘‘ఎవరో తలుపు కొట్టారు రషీద్. ఎవరైనా ఉన్నారా అంటూ పిలిచారు కూడా. నేను తలుపు తీసి చూశాను. కానీ ఎవ్వరూ లేరు.’’‘‘అంతేనా... ఒక్కోసారి అలా అనిపిస్తూ ఉంటుంది. ఎవరూ ఉండి ఉండరు. అయినా నోటితో ఎందుకు పిలుస్తారు? కాలింగ్ బెల్ ఉంది కదా?’’అదీ నిజమే అన్నట్టు చూసింది నబీలా. అయినా ముఖంలో ఆందోళన తగ్గలేదు. బెరుకుగా చూసింది భర్తవైపు. ‘‘భయపడకు డియర్... కొత్త ఇల్లు కదా. అలవాటయ్యే వరకూ కాస్త అలానే ఉంటుంది. అయినా నేను ఉన్నానుగా, భయమెందుకు?’’ అంటూ భార్యను దగ్గరకు తీసుకున్నాడు రషీద్.
‘‘నబీలా... నీ చేత్తో కాస్త కాఫీ ఇస్తావా?’’హాల్లో సోఫాలో కూర్చుని ఫైలు తిరగేస్తూ అరిచాడు రషీద్. ఎంతమంది పనివాళ్లు ఉన్నా భార్య చేతి కాఫీ రుచి అంటే మహా ఇష్టం అతడికి. ‘‘ఓ... ఇప్పుడే తెస్తా’’ అంటూ బదులు వినిపించింది. ఆ వెంటనే మరో స్వరం కూడా వినిపించింది. ‘‘ఎవరైనా ఉన్నారా’’ అంటూ.
ఒక్కక్షణం ఫైలు చూడ్డం ఆపి చుట్టూ చూశాడు. ఆ మాట ఎక్కడ్నుంచి వినిపించిందో అర్థం కాలేదు. దాంతో మళ్లీ ఫైల్లో తలదూర్చాడు. క్షణం తర్వాత మెయిన్ డోర్ కొడుతున్నట్టు అనిపించింది. పని ఆపి అటు చూశాడు. ‘‘ఎవరైనా ఉన్నారా?’’.. ఓ మగ మనిషి అరిచాడు.‘‘ఏంటలా చూస్తున్నారు?’’ అప్పుడే అక్కడికి వచ్చిన నబీలా అడిగింది. ‘‘ఎవరో తలుపు కొడుతున్నారు’’ చెప్పాడు. నబీలాకి తన అనుభవం గుర్తొచ్చింది. ‘‘ఇంత రాత్రిపూట ఎవరొస్తారు రషీద్’’ అంది భయంగా. ‘‘చూస్తానుండు’’ అంటూ వెళ్లి తలుపు తీశాడు. కానీ అక్కడెవ్వరూ లేరు. ‘‘ఎవరూ లేరు కదా? నేను చెబితే నమ్మావా?’’ అంది వెనకే నిలబడిన నబీలా. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు రషీద్‌కి. సెక్యూరిటీ గార్డ్స్‌ని పిలిచి నిలదీశాడు. ఎవ్వరూ రాలేదని చెప్పారు వాళ్లు. దాంతో మౌనంగా లోనికి నడిచాడు. ఇక పని చేయబుద్ధి కాకపోవడంతో నిద్రకు ఉపక్రమించాడు. కాసేపటికే మత్తుగా నిద్రలోకి జారుకున్నాడు.
ఉదయం ఐదు కావస్తుండగా మెలకువ వచ్చింది రషీద్‌కి.‘‘సారీ రషీద్... నా కదలికలకి మెలకువ వచ్చినట్టుంది నీకు. బాబు ఊరికే కదులుతున్నాడు. ఆకలేస్తోందేమో. పాలు కలిపి తీసుకొస్తాను’’ అంటూ వెళ్లింది. ఓసారి కొడుకు వైపు చూసి మళ్లీ కళ్లు మూసుకున్నాడు రషీద్. పది నిమిషాల తర్వాత ‘రషీద్’ అన్న అరుపు వినబడి ఉలిక్కిపడ్డాడు. ఏమయ్యిందోనని గబగబా పరుగు తీశాడు. పిల్లల బెడ్రూమ్ గుమ్మం దగ్గర నిలబడి ఉంది నబీలా. గజగజా వణుకుతోంది. ఒళ్లంతా చెమటలు! ‘‘నబీలా... ఏమైంది? ఎందుకలా భయపడుతున్నావ్?’’ అంటూ పట్టి కుదిపాడు. ‘‘రషీద్... పాప... పెద్ద పాప...’’గదిలోకి తొంగి చూశాడు రషీద్. ఏమీ కాలేదు. పిల్లలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. మరి నబీలా ఎందుకు అరచినట్టు!
‘‘పాపా... పాపకేమైంది? నిద్రపోతోంది కదా’’ అన్నాడు అయోమయంగా.
‘‘కానీ నాలుగు నిమిషాల ముందు హాల్లో టీవీ చూస్తోంది’’ అంది వణుకుతున్న స్వరంతో.
‘‘వ్వా....ట్? టీవీ చూస్తోందా? నీకేమైనా మతిపోయిందా? ఈ టైమ్‌లో టీవీ ఎందుకు చూస్తుంది?’’
‘‘అదే నాకూ అర్థం కాలేదు రషీద్. బాబుకి పాలు కలిపి కిచెన్‌లోంచి బయటకు వచ్చాను. హాల్లో సోఫాలో కూర్చుని పాప టీవీ చూస్తోంది. ఇప్పుడు కిందికొచ్చావేంటి అని అడిగాను. తను మాట్లాడలేదు. టీవీ ఆఫ్ చేసి పడుకో అంటూ అరిచి, మన రూమ్‌కి వస్తూ ఎందుకో పిల్లల గదిలోకి చూశాను. తను గదిలోనే ఉంది. నిద్రపోతోంది. ఇదెలా సాధ్యం రషీద్?’’
ఆశ్చర్యంతో నోరు తెరచుకుని వింటున్నాడు రషీద్. ‘‘ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు?’’ అన్నాడు నమ్మలేనట్టుగా.‘‘నిజం రషీద్. ఎప్పుడూ ఎవరో వెనక ఉన్నట్టనిపిస్తుంది. నీడలా వెంటాడుతున్నట్టుగా ఉంటుంది. నాకేమీ అర్థం కావడం లేదు. ఈ ఇంట్లో నాకేం బాలేదు.’’ఏడుపు ముంచుకొచ్చేసింది నబీలాకి. బేలగా భర్త గుండెల మీద వాలిపోయింది. అతడేమీ మాట్లాడలేదు. భార్య వెన్ను నిమురుతూ ఉండిపోయాడు. ఆమె చెప్పేదంతా నిజమని అతడికీ తెలుసు. ఆ ఇంట్లో ఏదో జరుగుతోంది. ఆడవాళ్ల ఏడుపులు వినిపిసున్నాయి. మగవాళ్ల నీడలు కనిపిస్తున్నాయి. చిన్నపిల్లల అల్లరి చెవుల్లో పడుతుంది. చూస్తే తమ పిల్లలు బుద్ధిగా చదువుకుంటూ ఉంటారు. ఇవన్నీ రషీద్ కూడా రుచి చూసిన అనుభవాలే.
కానీ భార్యను భయపెట్టడం ఇష్టం లేక మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు ఆమెకి కూడా తెలిసిపోయింది. అయినా ధైర్యం చేసి ఉండాలనుకున్నారు కానీ, కొద్ది రోజుల తరువాత తమ బాబు దుప్పటి మీద కనిపించిన రక్తపు మరకలు వారిని ఆందోళనలో పడేశాయి. బాబుకేదైనా అయ్యిందేమోనని ఒళ్లంతా చెక్ చేశారు. కానీ ఎక్కడా చిన్న గాయం కూడా కనిపించలేదు. దాంతో ఇక ఆ ఇంట్లో ఉండలేనని గొడవ చేసింది నబీలా. ఆమె బాధను అర్థం చేసుకున్న రషీద్... రాత్రికి రాత్రే కుటుంబాన్ని తీసుకుని వేరే ఇంటికి వెళ్లిపోయాడు. దాంతో ఒక్కసారిగా ఆ భవంతి వెలుగులోకి వచ్చింది. దాని వెనక ఉన్న చీకటి చరిత్ర అందరికీ తెలిసింది.
రషీద్ కొన్న భవంతి పేరు... క్లిఫ్టన్ హాల్. సర్ క్లిఫ్టన్ 1778-1797 మధ్యలో దీనిని నిర్మించారు. జాన్ కార్ అనే ఆర్కిటెక్టు దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఏడు వందల యేళ్లపాటు ఆ వంశస్తులే ఈ భవంతిలో నివసించారు. తర్వాత ఇది వారి బంధువుల చేతికి వచ్చింది. 1958లో ఇక్కడ క్లిఫ్టన్ హాల్ గ్రామర్ స్కూల్‌ను పెట్టారు. 1976 వరకూ అది నిరాటంకంగా కొనసాగింది. అది మూతబడిన తర్వాత నాటింగ్ హామ్ యూనివర్శిటీని ఇందులో పెట్టారు. 2000వ సంవత్సరంలో మొత్తం భవనాన్ని విభజించి, రెండు ఆధునికమైన గృహాలుగా చేశారు. వాటిలో ఒకదాన్ని రషీద్ కొన్నాడు. తొమ్మిది నెలలు నివసించాక భయంతో ఆ ఇంటి నుంచి వెళ్లిపోయాడు.
నిజానికి రషీద్ అక్కడ ఓ మ్యారేజ్ హాల్, కాన్ఫరెన్స్ హాల్, ట్రెయినింగ్ కాలేజీ వంటివి పెట్టాలనుకున్నాడు. కానీ ఎవ్వరూ ఆ భవంతిలో అడుగు పెట్టడానికి ఇష్టపడేవారు కాదు. ఆ ఇంట్లో పని చేయడానికి కూడా ఎవరూ వచ్చేవారు కాదు. సెక్యూరిటీ ఏజెంట్లు కూడా ఓ రాత్రి పని చేశాక మానేసేవారు. దానికితోడు కుటుంబ సభ్యులకే భయంకర అనుభవాలు ఎదురు కావడంతో ఇక ఆ ఇంటిని వదులుకోక తప్పలేదు రషీద్‌కి. అక్కడికీ పరిశోధకులను పిలిపించి ఇల్లు చూపించాడు. వచ్చినవారిలో ఇద్దరు ఆత్మలను చూసి కళ్లు తిరిగి పడిపోయారు. దాంతో అమ్మకానికి పెట్టేశాడు. కొన్నాళ్ల తర్వాత ఓ బ్యాంకు వారు దాన్ని కొనుక్కున్నారు.
దెయ్యాలు లేవనేవారు ఆ ఇంటిని కొనడానికి చేసిన అప్పు తీర్చలేక రషీద్ పుకార్లు పుట్టించాడన్నారు. కానీ అది నిజం కాదు. అతడు విజయవంతమైన వ్యాపారి. డబ్బున్నవాడు. అలా చేయాల్సిన అవసరం అతడికి లేదు. పైగా పత్రికాముఖంగా తాము ఎదుర్కొన్న అనుభవాలను చెప్పాడు! మరోపక్క పోలీసులు, పరిశోధకులు కూడా ఆ ఇంట్లో భయంకర అనుభవాలను ఎదుర్కొన్నారు. ఆ ఛాయలకు ఇక పోయేది లేదని తేల్చేశారు. వాళ్లెం దుకు అబద్ధం చెప్తారు?! అంటే ఇదంతా నిజమనే అను కోవాలా? అంటే... అక్కడ ఎవరైనా ఉన్నారా?
- సమీర నేలపూడి