abid rasool khan
-
మహిళలు దర్గాలకే వెళ్లి ప్రార్థించాలా?
హైదరాబాద్: ఎక్కడ మహిమ పరిచినా భగవంతుడికి తెలిసిపోతుంది కాబట్టి మహిళలు ప్రత్యేకంగా మసీదులు, దర్గాలకు వెళ్లి ప్రార్థనలు చేయాల్సిన అవసరం లేదని ఉమ్మడి రాష్ట్రాల మైనారిటీ కమిషన్ చైర్మన్ అబీద్ రసూల్ ఖాన్ అన్నారు. ఆథ్యాత్మిక కేంద్రాల సందర్శనలో మహిళలు వినయ విధేయతలతో మెలగాలని సూచించారు. హజీ అలీ దర్గాలోకి మహిళలను అనుమతించాలన్న బాంబే హైకోర్టు తీర్పు నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన రసూల్ ఖాన్ ఆసక్తికమైన వ్యాఖ్యలు చేశారు. మహిళలు మసీదుల్లోకానీ, బహిరంగ ప్రదేశాల్లోకానీ ప్రార్థనలు చేయడాన్ని ఇస్లాం ప్రోత్సహించదని, ఆ విషయంలో నిషేధం సమర్థనీయం కాదని రసూల్ ఖాన్ అన్నారు. దర్గాలకు వెళ్లాలా, వద్దా అన్నది వ్యక్తిగత అభిప్రాయమని, అయితే అంతిమతీర్పు(జడ్జిమెంట్ డే) రోజులన ఎవరికివారే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని అన్నారు.'నా పాయింట్ ఏమంటే..మహిళలు దర్గాలకు వెళ్లేకాదు, ఇంట్లోనూ ప్రార్థన చేసుకోవచ్చు. వాటిని దేవుడు వింటాడు. ప్రత్యేక ప్రదేశాల్లో ప్రార్థిస్తేనే అవి దేవుడికి చేరినట్లుకాదు' అని రసూల్ ఖాన్ వ్యాఖ్యానించారు. అయితే, మారుతున్న కాలాన్ని బట్టి ఇస్లాం సంప్రదాయాల్లోనూ మార్పులు చోటుచేసుకుంటున్నదని, ఇప్పుడు మహిళలు సైతం మసీదులకు వెళుతున్నారని రసూల్ ఖాన్ గుర్తుచేశారు. హైదరాబాద్ సహా సౌదీ అరేబియాలోని చాలా మసీదుల్లో మహిళలు ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక సౌకర్యాలు కల్పించారని తెలిపారు. -
అవగాహన లోపంతోనే మైనార్టీల వెనుకబాటు
రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ అబీద్ రసూల్ కర్నూలు(అర్బన్): ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల సమగ్ర అవగాహన లేకపోవడంతో మైనార్టీలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ అబిద్ రసూల్ ఖాన్ అభిప్రాయపడ్డారు. ఇక నుంచైనా జిల్లా అధికారులందరూ తమ శాఖ ద్వారా అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలను నియమ నిబంధనలతో ఉర్దూ, తెలుగు భాషలో కరపత్రాలను ముద్రించి పంపిణీ చేయడంతో పాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. శుక్రవారం ఆయన స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో ప్రధానమంత్రి 15 అంశాల పథకం, మైనార్టీలకు అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి అవకాశాలను మైనార్టీ వర్గాలు సద్వినియోగం చేసుకునే విధంగా పెద్దల ద్వారా చైతన్యం తీసుకురావాలన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ, శాసనసభ్యులు, ఎన్జీఓలు అందించిన సమాచారం మేరకు జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో అన్ని విషయాలను చర్చించి మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తామన్నారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ మైనార్టీ జనాభా అధికంగా ఉండే కర్నూలు జిల్లాకు బడ్జెట్‌ను అధికంగా కేటాయించాలన్నారు. సమావేశంలో కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, మైనార్టీ కమిషన్ సభ్యులు గౌతంజైన్, సుర్జీత్‌సింగ్, ఏజేసీ రామస్వామి, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి షేక్ మస్తాన్‌వలి, డ్వామా, డీఆర్డీఏ, ఐసీడీఎస్, మెప్మా, హౌసింగ్ పీడీలు పుల్లారెడ్డి, రామక్రిష్ణ, ముత్యాలమ్మ, రామాంజనేయులు, ఎన్. రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, మైనార్టీ కార్పొరేషన్ ఈడీ షేక్ కరీముల్లా, రాయలసీమ పుకార్ కమిటీ అధ్యక్షుడు ఎస్ నజీర్ అహ్మద్, ఎన్జీఓలు రోషన్‌అలీ, జి. జాన్ క్రిష్టఫర్ తదితరులు పాల్గొన్నారు. బాలికలకు సాయం అందేలా చూస్తాం: ఇటీవల కర్నూలులో అత్యాచారానికి గురైన ఏడేళ్ల బాలికకు రూ.5 లక్షలు ఆర్థిక సహాయం అందించేలా ప్రభుత్వాన్ని కోరతామని అబీద్ రసూల్ ఖాన్ చెప్పారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక బంధువులను ఆయన కలిసి మాట్లాడారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతు అలాగే బాలిక కుటుంబానికి ప్రభుత్వం గృహ వసతి కల్పించాలని, తల్లిదండ్రుల్లో ఒకరికి అవుట్ సోర్సింగ్ కింద ఉద్యోగం కల్పించాలని, బాలిక విద్యను ప్రభుత్వం భరించాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. ఉర్దూ పాఠశాలల సమస్యలు పరిష్కరించండి కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఉర్దూ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఉర్దూ టీచర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి దాదాపీర్ రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ రసూల్‌ఖాన్‌కు స్టేట్ గెస్ట్‌హౌస్‌లో కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉర్దూ స్కూళ్లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు నమాజ్ చేసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేయాలి
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్: ఉర్దూ భాషాభివృద్ధికి మరింతగా కృషి చేయకపోతే అది నిరాదరణకు గురయ్యే అవకాశం ఉందని రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ అబిద్ రసూల్ ఖాన్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ యూనివర్సిటీ ఉర్దూ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ఉర్దూ భాషోత్సవం నిర్వహిస్తున్నారు. సోమవారం మొదటిరోజు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అబిద్ రసూల్‌ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 2,753 ఉర్దూ మీడియం పాఠశాలల్లో సుమారు 2.24 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. ఇటీవలి కాలంలో తల్లిదండ్రులు పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించేందుకు ఆసక్తి చూపుతున్నారని, దీంతో ఉర్దూ భాషపై మక్కువ తగ్గుతోందని పేర్కొన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో పదేళ్లలో ఉర్దూ భాష గుర్తింపును కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో చిన్నచూపు ఇతర రాష్ట్రాలలో, దేశాలలో స్థానిక భాషలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని రసూల్ ఖాన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని 15 జిల్లాలలో రెండో అధికార భాషగా ఉన్న ఉర్దూను చిన్నచూపు చూస్తుండడం బాధాకరమన్నారు. ఉర్దూ భాష ఏ ఒక్క వర్గానికో సంబంధించింది కాదని, దేశ భాషలలో ప్రముఖమైందని పేర్కొన్నారు. ఈ భాషపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఉర్దూ మీడియం విద్యా సంస్థలలో సౌకర్యాలు కల్పించాలని, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. రాష్ట్రంలోని 12 రెసిడెన్షియల్ పాఠశాలల్లో, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యాసంస్థల్లోనూ సగం వరకు సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి సంబంధిత ఫారాలు ఉర్దూలో ఉండటం లేదన్నారు. ఉర్దూ భాషాభివృద్ధికి రూ. 200 కోట్లు అందిస్తామని అధికార భాషా సంఘం హామీ ఇచ్చిందని తెలిపారు. ఉర్దూలో వచ్చే ఫిర్యాదులకూ స్పందించాలని అధికారులను కోరారు. యూనివర్సిటీ రివైజ్డ్ సిలబస్‌లో టెక్నాలజీతో కూడిన పాఠ్యాంశాలను పొందుపర్చామని, మల్టీమీడియా ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నామని వర్సిటీ వైస్చాన్ ్సలర్ అక్బర్ అలీఖాన్ తెలిపారు. తెలంగాణలో ఆదరణ తెలంగాణ జిల్లాల్లో ఉర్దూకు మంచి ఆదరణ ఉందని, ముస్లింలే కాకుండా ఇతరులూ ఈ భాషను ఆదరిస్తున్నారని ఉర్దూ అకాడమీ సంచాలకుడు ఎస్ఏ షుకూర్ పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో మైనార్టి ఎడ్యుకేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతకు ముందు డాక్టర్ సయ్యద్ తాకీ అబేది రచించిన ‘ఫైజ్-ఎ- షెనాసీ’ పుస్తకాన్ని అబిద్ రసూల్‌ఖాన్, అక్బర్ అలీఖాన్‌లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ లింబాద్రి, ప్రిన్సిపాల్ ధర్మరాజు, ఉర్దూ విభాగం హెచ్‌వోడీ అత్తర్ సుల్తానా, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ జావేద్ అక్రమ్, డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ అధ్యాపకులు, ఉర్దూ భాషాభిమానులు తదితరులు పాల్గొన్నారు.