తెయూ(డిచ్‌పల్లి), న్యూస్‌లైన్: ఉర్దూ భాషాభివృద్ధికి మరింతగా కృషి చేయకపోతే అది నిరాదరణకు గురయ్యే అవకాశం ఉందని రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ అబిద్ రసూల్ ఖాన్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ యూనివర్సిటీ ఉర్దూ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ఉర్దూ భాషోత్సవం నిర్వహిస్తున్నారు. సోమవారం మొదటిరోజు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అబిద్ రసూల్‌ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 2,753 ఉర్దూ మీడియం పాఠశాలల్లో సుమారు 2.24 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. ఇటీవలి కాలంలో తల్లిదండ్రులు పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించేందుకు ఆసక్తి చూపుతున్నారని, దీంతో ఉర్దూ భాషపై మక్కువ తగ్గుతోందని పేర్కొన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో పదేళ్లలో ఉర్దూ భాష గుర్తింపును కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
మన రాష్ట్రంలో చిన్నచూపు
ఇతర రాష్ట్రాలలో, దేశాలలో స్థానిక భాషలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని రసూల్ ఖాన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని 15 జిల్లాలలో రెండో అధికార భాషగా ఉన్న ఉర్దూను చిన్నచూపు చూస్తుండడం బాధాకరమన్నారు. ఉర్దూ భాష ఏ ఒక్క వర్గానికో సంబంధించింది కాదని, దేశ భాషలలో ప్రముఖమైందని పేర్కొన్నారు. ఈ భాషపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఉర్దూ మీడియం విద్యా సంస్థలలో సౌకర్యాలు కల్పించాలని, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. రాష్ట్రంలోని 12 రెసిడెన్షియల్ పాఠశాలల్లో, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యాసంస్థల్లోనూ సగం వరకు సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి సంబంధిత ఫారాలు ఉర్దూలో ఉండటం లేదన్నారు. ఉర్దూ భాషాభివృద్ధికి రూ. 200 కోట్లు అందిస్తామని అధికార భాషా సంఘం హామీ ఇచ్చిందని తెలిపారు. ఉర్దూలో వచ్చే ఫిర్యాదులకూ స్పందించాలని అధికారులను కోరారు. యూనివర్సిటీ రివైజ్డ్ సిలబస్‌లో టెక్నాలజీతో కూడిన పాఠ్యాంశాలను పొందుపర్చామని, మల్టీమీడియా ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నామని వర్సిటీ వైస్‌చాన్ ్సలర్ అక్బర్ అలీఖాన్ తెలిపారు.
తెలంగాణలో ఆదరణ
తెలంగాణ జిల్లాల్లో ఉర్దూకు మంచి ఆదరణ ఉందని, ముస్లింలే కాకుండా ఇతరులూ ఈ భాషను ఆదరిస్తున్నారని ఉర్దూ అకాడమీ సంచాలకుడు ఎస్‌ఏ షుకూర్ పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో మైనార్టి ఎడ్యుకేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతకు ముందు డాక్టర్ సయ్యద్ తాకీ అబేది రచించిన ‘ఫైజ్-ఎ- షెనాసీ’ పుస్తకాన్ని అబిద్ రసూల్‌ఖాన్, అక్బర్ అలీఖాన్‌లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ లింబాద్రి, ప్రిన్సిపాల్ ధర్మరాజు, ఉర్దూ విభాగం హెచ్‌వోడీ అత్తర్ సుల్తానా, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ జావేద్ అక్రమ్, డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ అధ్యాపకులు, ఉర్దూ భాషాభిమానులు తదితరులు పాల్గొన్నారు.
ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేయాలి
Published Tue, Dec 24 2013 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 1:53 AM
Advertisement
Advertisement