ఆయన రూటే సెప‘రేటు’
పక్కదారిపడుతున్న అకౌంట్స్ లెక్క
అయ్యగారి నిర్వాకంపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
కాసులివ్వకుంటే కొర్రే
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ అకౌంట్స్ విభాగం లెక్క పక్కదారి పడుతోంది. లంచాల కోసం ఓ అధికారి జలగలా పీడుస్తున్నారని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సదరు అధికారి పైసలివ్వనిదే ఫైల్‌పై సంతకం చేయడం లేదని ఉన్నతాధికారి చెవిన పడటంతో వారంరోజుల క్రితం పిలిచి క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. అయినప్పటికీ ఆ అధికారిలో మార్పులేదు. దీంతో ఉన్నతాధికారి.. అయ్యగారి మామూళ్ల వ్యవహారంపై స్టేట్ ఆడిట్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
పేరుకుపోయిన ఫైళ్లు : రవిబాబు కమిషనర్‌గా పనిచేసిన సమయంలోనూ ఈ అధికారి వ్యవహారశైలిపై స్టేట్ ఆడిట్ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఇక్కడ నుంచి బదిలీ చేశారు. రెండేళ్ల క్రితమే తిరిగి ఇక్కడ పోస్ట్ దక్కించుకున్నారు. ఇటీవల మామూళ్ల ఆశ ఎక్కువవడంతో ఫైళ్లపై అడ్డగోలుగా కొర్రీలు రాస్తున్నారని ఆ సెక్షన్ ఉద్యోగులే అరోపిస్తున్నారు. పద్ధతి మార్చుకోమని చెప్పినందుకు ఉన్నతాధికారిపైనే ఎదురుదాడికి దిగినట్లు సమాచారం. ఆ సెక్షన్లో పేరుకుపోయిన ఫైళ్లపై విచారణ చేస్తే అయ్యగారి అవినీతి బాగోతం బయటపడే అవకాశం ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
బకాయిలపై ఫిర్యాదు : నగరపాలక సంస్థలో అకౌంట్స్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న దేవి మంగకు తొమ్మిది నెలలుగా జీతం చెల్లించడం లేదు. ఈ విషయమై ఫిర్యాదు చేద్దామంటే కమిషనర్ అపాయింట్మెంట్ దొరక్కుండా ఓ అధికారి అడ్డుపడుతున్నారని ఆమె కన్నీటి పర్యం తమయ్యారు. ఇటీవలే మేయర్‌ను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. గతేడాది మే 6తో తన అగ్రిమెంట్ పూర్తయిందని, రెన్యువల్ చేస్తామని చెప్పిన అధికారులు తనతో పనిచేయించుకుంటున్నారని పేర్కొన్నారు. రూ.3 లక్షల జీతం తనకు రావాల్సి ఉందని ఆమె చెబుతున్నారు. జీతం అడిగితే అసలు తాను పనే చేయడం లేదని వింతవాదన వినిపిస్తున్నారని మేయర్ వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. దీనిపై సానుకూలంగా స్పందించిన మేయర్... సమస్యను పరిష్కరించాల్సిందిగా కమిషనర్ జి.వీరపాండ్యన్‌కు సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.
ఆడిట్ అధాకిరుల అసంతృప్తి : అకౌంట్స్ విభాగ అధికారుల పనితీరుపై స్టేట్ ఆడిట్ అధికారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు అధికారులు అక్రమ ఆదాయమే పరమావధిగా పనిచేస్తున్నారని వారికి ఫిర్యాదులు అందినట్లు సమాచారం.