ache din
-
మోదీపై తగ్గుతున్న నమ్మకం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. కేంద్రంలో తాను అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి రోజులు (అచ్చేదిన్) వస్తాయని గత ఎన్నికల్లో మోదీ హామీయిచ్చారు. అయితే ఈ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో ఆయన విఫలమయ్యారని 63 శాతం మంది అభిప్రాయపడ్డారు. మోదీ పాలనతో తమకు మంచి రోజులు వచ్చాయని కేవలం 33 శాతం మంది మాత్రమే పేర్కొన్నారు. ఆర్థిక నిర్వహణలో కాంగ్రెస్ పాలనతో పోల్చుకుంటే మోదీ ప్రభుత్వమే నయమని ఇండియా టుడే– కార్వీ సంస్థలు సంయుక్తంగా మూడ్ ఆఫ్ ది నేషన్ (ఎంవోటీఎన్) పేరుతో నిర్వహించిన సర్వేలో దాదాపు సగం శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. మోదీ ప్రారంభించిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన (ఉచిత గ్యాస్ కనెక్షన్), స్వచ్ఛ భారత్ అభియాన్(మరుగుదొడ్ల నిర్మాణం) పథకాలు ప్రజల్లో బలమైన ముద్ర వేశాయని సర్వేలో వెల్లడైంది. అయితే నోట్ల రద్దు నిర్ణయంపై మొదట్లో సానుకూలత వ్యక్తమైనా తర్వాత వ్యతిరేకత పెరిగింది. చిన్న పరిశ్రమలు దెబ్బతినడంతో ఉపాధి తగ్గిపోవడం, రైతులు భారీగా నష్టపోవడంతో గత రెండేళ్లలో మోదీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగినట్టు సర్వేలో తేలింది. మోదీ హామీయిచ్చినట్టుగా తమకు మంచి రోజులు వస్తాయని 2017లో 45 శాతం మంది విశ్వాసం వ్యక్తం చేయగా, ఇప్పుడు 33 శాతానికి పడిపోవడం గమనార్హం. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమి 99 సీట్లు కోల్పోనుందని సర్వే అంచానా వేసింది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని తేల్చింది. (రానున్నది ‘హంగ్’!) -
అచ్ఛే దిన్ రానే రావంటూ ఆకట్టుకుంటున్న ‘మోదీ’
బచేలీ (దంతేవాడ): ఈయన పేరు అభినందన్ పాఠక్. అచ్చం ప్రధానమంత్రి నరేంద్ర మోదీలాగానే కనిపిస్తూ.. ఆయనను అనుకరిస్తూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఛత్తీస్‌గడ్‌లోని నక్సల్ ప్రభావిత బస్తర్ సహా జగదల్పూర్, దంతేవాడ, కొండగాన్ ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రచారకర్తగా దూసుకుపోతున్నారు. హావభావాల్లోనూ, ఆహార్యంలోనూ.. మోదీని తలపిస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. ఆయన ఎన్నికల ప్రసంగం కూడా అచ్చం మోదీ తరహాలోనే ‘మిత్రోం’ అని సంబోధిస్తూ మొదలవుతుంది. ప్రధాని వాయిస్‌ను మిమిక్రీ చేస్తూ ఆకట్టుకుంటున్న అభినవ మోదీ అభినందన్‌తో సెల్ఫీలు దిగేందుకు స్థానికులు పోటీపడుతుండటం విశేషం. మరో విశేషం ఏమిటంటే పాఠక్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పార్టీ రిపబ్లికన్ పార్టీ (అధవాల్) ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఇక అచ్ఛే దిన్ రానే రావంటూ నటుడు, కాంగ్రెస్ నేత రాజ్ బబ్బర్ సమక్షంలో గత నెలలోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొన్నటిదాకా బీజేపీలో ఉండి, ప్రధానికి జైకొట్టిన అభినందన్ పాఠక్ ఇప్పుడు హస్తం గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నారు. 2014 లోక్‌సభ్‌ఎన్నికలకు ముందు మోదీ చేసిన వాగ్దానం 'అచ్ఛే దిన్' (మంచి రోజులు) ఎప్పటికీ రావని, ఇది తప్పుడు వాగ్దానమని తేలిపోయిందని మండిపడుతున్నారు. అందుకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు వెల్లడించారు. అంతేకాదు విదేశాలలో నల్లధనం వెనక్కి తీసుకున్న తరువాత ప్రతి భారతీయుడికి 15 లక్షల రూపాయలను బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేస్తానని ప్రధాని మాట తప్పారని విమర్శిస్తున్నారు. అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా బస్తర్ ప్రాంతంలోని 12 శాసనసభ స్థానాలకు నవంబర్ 12న ఓటింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే. -
'2019కాదుకదా 2090లోనూ మీకు పవర్ రాదు'
న్యూఢిల్లీ: దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. అధికారం విషయం మర్చిపోయి రాహుల్ గాంధీ అచ్చేదిన్ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలంతా మంచి రోజులు (అచ్చేదిన్) ఏవి? ఎక్కడికెళ్లాయ్? అని అడుగుతున్నారని, 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, అప్పుడే మంచి రోజులు వస్తాయని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. 'కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు(రాహుల్ గాంధీ) 2019లో మంచి రోజులు వస్తాయని అంటున్నారు. ఇది వింటుంటే నాకు ఆశ్చర్యం వేస్తోంది. 2019లో ఆ పార్టీ అధికారంలోకి రాదనే విషయం మర్చిపోయారు. 2019 కాదుగదా 2090 అయినా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రధాని నరేంద్రమోదీని విమర్శించడం షాకింగ్ అనిపించింది. వారి మాటలు చూస్తుంటే వారి దిగజారుడు తనం అర్థమవుతుంది' అని వెంకయ్య అన్నారు.