బచేలీ (దంతేవాడ): ఈయన పేరు అభినందన్ పాఠక్. అచ్చం ప్రధానమంత్రి నరేంద్ర మోదీలాగానే కనిపిస్తూ.. ఆయనను అనుకరిస్తూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఛత్తీస్‌గడ్‌లోని నక్సల్ ప్రభావిత బస్తర్ సహా జగదల్‌పూర్, దంతేవాడ, కొండగాన్ ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రచారకర్తగా దూసుకుపోతున్నారు. హావభావాల్లోనూ, ఆహార‍్యంలోనూ.. మోదీని తలపిస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. ఆయన ఎన్నికల ప్రసంగం కూడా అచ్చం మోదీ తరహాలోనే ‘మిత్రోం’ అని సంబోధిస్తూ మొదలవుతుంది. ప్రధాని వాయిస్‌ను మిమిక్రీ చేస్తూ ఆకట్టుకుంటున్న అభినవ మోదీ అభినందన్‌తో సెల్ఫీలు దిగేందుకు స్థానికులు పోటీపడుతుండటం విశేషం.
మరో విశేషం ఏమిటంటే పాఠక్ బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ పార్టీ రిపబ్లికన్ పార్టీ (అధవాల్) ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఇక అచ్ఛే దిన్ రానే రావంటూ నటుడు, కాంగ్రెస్ నేత రాజ్ బబ్బర్ సమక్షంలో గత నెలలోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొన్నటిదాకా బీజేపీలో ఉండి, ప్రధానికి జైకొట్టిన అభినందన్ పాఠక్ ఇప్పుడు హస్తం గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నారు.
2014 లోక్‌సభ్‌ఎన్నికలకు ముందు మోదీ చేసిన వాగ్దానం 'అచ్ఛే దిన్' (మంచి రోజులు) ఎప్పటికీ రావని, ఇది తప్పుడు వాగ్దానమని తేలిపోయిందని మండిపడుతున్నారు. అందుకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు వెల్లడించారు. అంతేకాదు విదేశాలలో నల్లధనం వెనక్కి తీసుకున్న తరువాత ప్రతి భారతీయుడికి 15 లక్షల రూపాయలను బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేస్తానని ప్రధాని మాట తప్పారని విమర్శిస్తున్నారు. అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా బస్తర్ ప్రాంతంలోని 12 శాసనసభ స్థానాలకు నవంబర్ 12న ఓటింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment