న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. కేంద్రంలో తాను అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి రోజులు (అచ్చేదిన్) వస్తాయని గత ఎన్నికల్లో మోదీ హామీయిచ్చారు. అయితే ఈ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో ఆయన విఫలమయ్యారని 63 శాతం మంది అభిప్రాయపడ్డారు. మోదీ పాలనతో తమకు మంచి రోజులు వచ్చాయని కేవలం 33 శాతం మంది మాత్రమే పేర్కొన్నారు. ఆర్థిక నిర్వహణలో కాంగ్రెస్ పాలనతో పోల్చుకుంటే మోదీ ప్రభుత్వమే నయమని ఇండియా టుడే– కార్వీ సంస్థలు సంయుక్తంగా మూడ్ ఆఫ్ ది నేషన్ (ఎంవోటీఎన్) పేరుతో నిర్వహించిన సర్వేలో దాదాపు సగం శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.
మోదీ ప్రారంభించిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన (ఉచిత గ్యాస్ కనెక్షన్), స్వచ్ఛ భారత్ అభియాన్(మరుగుదొడ్ల నిర్మాణం) పథకాలు ప్రజల్లో బలమైన ముద్ర వేశాయని సర్వేలో వెల్లడైంది. అయితే నోట్ల రద్దు నిర్ణయంపై మొదట్లో సానుకూలత వ్యక్తమైనా తర్వాత వ్యతిరేకత పెరిగింది. చిన్న పరిశ్రమలు దెబ్బతినడంతో ఉపాధి తగ్గిపోవడం, రైతులు భారీగా నష్టపోవడంతో గత రెండేళ్లలో మోదీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగినట్టు సర్వేలో తేలింది. మోదీ హామీయిచ్చినట్టుగా తమకు మంచి రోజులు వస్తాయని 2017లో 45 శాతం మంది విశ్వాసం వ్యక్తం చేయగా, ఇప్పుడు 33 శాతానికి పడిపోవడం గమనార్హం. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమి 99 సీట్లు కోల్పోనుందని సర్వే అంచానా వేసింది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని తేల్చింది. (రానున్నది ‘హంగ్’!)
Comments
Please login to add a commentAdd a comment