న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా దేశంలో ఏర్పడిన అసాధారణ ఆర్థిక సంక్షోభాన్ని ప్రధాని మోదీ ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కొందని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారని ‘ఇండియా టుడే – కార్వీ’ సంయుక్తంగా నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే తేల్చింది. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రకటించిన లాక్‌డౌన్ కారణంగా గత 4 దశాబ్దాల్లో తొలిసారి భారత్ ఆర్థికమాంద్యం బారిన పడింది. పారిశ్రామిక రంగం, సేవల రంగం వృద్ధి నిలిచిపోయింది. నిరుద్యోగం ప్రబలింది.
ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆర్థిక రంగాన్ని ప్రభుత్వం సమర్దవంతంగా నిర్వహించిందని ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ వెల్లడించింది. ఆర్థిక రంగంలో మోదీ ప్రభు త్వ తీరు అద్భుతంగా ఉందని సర్వేలో పాల్గొన్న వారిలో 20%, బావుందని 46%, సాధారణంగా ఉందని 21% అభిప్రాయ పడ్డారు. కరోనా, లాక్‌డౌన్‌ల కారణంగా తమ ఆర్థిక పరిస్థితి దిగజారిందని 12% ప్రజలు పేర్కొన్నారు. 2020 జనవరిలో జరిగిన మూడ్ ఆఫ్ ది నేషన్‌లో కరోనా, లాక్‌డౌన్‌ల వల్ల ఆర్థిక పరిస్థితి దిగజారిందని 27% ప్రజలు వెల్లడించడం గమనార్హం.
మన్మోహన్ కన్నా బెటర్..
ఆర్థిక రంగ నిర్వహణలో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కన్నా మోదీ సర్కారు మెరుగ్గా వ్యవహరించిందని 47% ప్రజలు తెలిపారు. 36% మాత్రం యూపీఏ ప్రభుత్వంతో సమానంగా ఎన్‌డీఏ ప్రభుత్వ పనితీరు ఉందన్నారు. ఆర్థిక రంగ నిర్వహణలో యూపీఏతో పోలిస్తే ఎన్‌డీఏ పనితీరు అత్యంత దారుణంగా ఉందని 13% ప్రజలు పేర్కొన్నారు. కేంద్రం ప్రకటించిన ఆర్థిక రంగ ఉద్దీపన పథకాలతో తమ ఆర్థిక పరిస్థితిలో మార్పేంలేదని 43%, పరిస్థితి దిగజారిందని 20%, సానుకూల మార్పు వచ్చిందని 35% ప్రజలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment